పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా ఉంటున్న అందరినీ తరిమేస్తా: హోం మంత్రి అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ బెంగాల్‌లోనూ జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. బెంగాల్‌లో అక్రమంగా ఉంటున్న ప్రతి వ్యక్తినీ 'బయటకు గెంటేస్తాం' అని అన్నారు.
అమిత్ షా ప్రకటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమయ్యే అవకాశం ఉంది.
"ఈ రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్) ఎన్‌ఆర్‌సీనీ అమలు చేయనివ్వబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. నేను హామీ ఇస్తున్నాను, అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటున్న ప్రతి వ్యక్తినీ బయటకు పంపుతాం" అని కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా అన్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్‌ఆర్‌సీని బెంగాల్‌లో అమలు చేయవద్దంటున్నారు. గతంలో భారీ నిరసన ర్యాలీలు కూడా నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్‌ఆర్‌సీ జాబితా అంటే ఏంటి?
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోకముందు (అంటే 1971 మార్చి 24కి ముందు) నుంచి తాము భారత్‌లో స్థిరపడినట్లు నిరూపించుకునే వారి జాబితాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) అంటున్నారు.
అస్సాంలో ఎన్‌ఆర్‌సీ తుది జాబితాను ఆగస్టు 31న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అస్సాంలో ఉంటున్న దాదాపు 19 లక్షల మంది భారతీయులు కాదని ఆ జాబితా ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు వారికి మరో 120 రోజుల అవకాశం కల్పించింది.
అస్సాం తర్వాత, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలంటూ అధికార బీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అస్సాంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పింది. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ కూడా బంగ్లాదేశ్‌తో 2,000 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
అస్సాంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. కొన్ని కుటుంబాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తమ భవితవ్యం పట్ల ఆందోళనతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. "విదేశీయులు" అనే అనుమానంతో చాలా మందిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచారు.
పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌సీ జాబితా రూపొందించలేదు. అయినా, ఆ రాష్ట్రంలో కొన్ని విషాదకర ఘటనలు జరిగాయి.
అస్సాంలో లక్షల మందిలాగే, తమ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళనతో 38 ఏళ్ల ఆనంద రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. తాము భారతీయులమేనని "నిరూపించుకునేందుకు" తగిన పత్రాలు లేవన్న భయంతో ప్రాణాలు తీసుకున్నవారిలో ఆనంద ఒకరు.
ఆనంద వయసు 11 నెలలు ఉన్నప్పుడు, బంగ్లాదేశ్‌లో వివక్ష కారణంగా ఆయన తల్లిదండ్రులు భారత్‌కు వలస వచ్చారు.
"అస్సాంలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించడం ప్రారంభించినప్పటి నుంచి మా కుటుంబం భయంతో బతుకుతోంది. భారత్‌లో మాకు ఓటు హక్కు ఉంది. కానీ, భూమి లేదు. మేము ఇక్కడి వాళ్లమేనని నిరూపించుకునేందుకు పత్రాలు లేవు. ఆనంద దీని గురించి ఎప్పుడూ ఆందోళన చెందేవారు. మనల్ని కూడా బంగ్లాదేశ్‌కు పంపిస్తారేమో అని భయపడుతూ ఉండేవారు" అని ఆయన సోదరుడు దక్షదా రాయ్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
1947, 1971లలో బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు హిందువులు, ముస్లింలు భారీ సంఖ్యలో వలసవచ్చారు. ఈ జిల్లాకు చెందిన ఇటుక బట్టీ కార్మికుడు 36 ఏళ్ల కమల్ హుస్సేన్ మొండల్ కూడా ఎన్‌ఆర్‌సీ భయంతో ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
"అక్రమ వలసదారుడు అంటూ కేంద్ర ప్రభుత్వం తమను నిర్బంధ కేంద్రంలో వేస్తుందేమో అన్న భయంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు" అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
పేద ముస్లింలకు భారత పౌరసత్వం లేకుండా చేయాలన్న కుట్రతో ప్రభుత్వం ఈ పనిచేస్తోందని ఎన్‌ఆర్‌సీ గురించి చాలా మంది విమర్శకులు అంటున్నారు.
ఆ విమర్శలను ప్రభుత్వం ఖండించింది. అయినా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చే ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పిస్తామన్న హామీ ఇచ్చే పౌరసత్వ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విమర్శకులు ఎత్తి చూపుతున్నారు.
"ఈ రోజు హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, క్రైస్తవ శరణార్థులకు హామీ ఇస్తున్నాను. మీరు భారత దేశాన్ని విడిచి వెళ్లాలని ఎవరూ బలవంతం చేయరు. వదంతులను నమ్మవద్దు. ఎన్ఆర్సీకి ముందు మేము పౌరసత్వ సవరణ బిల్లును తీసుకువస్తాం. మీ అందరికీ భారత పౌరసత్వం లభించేలా ఆ బిల్లు ఉంటుంది" అని మంగళవారం నాటి ప్రసంగంలో అమిత్ షా నొక్కి చెప్పారు.

9 కోట్లకు పైగా జనాభాతో, పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నాలుగో రాష్ట్రం. ఈ రాష్ట్ర పౌరుల్లో మూడింట ఒకవంతు ముస్లింలు ఉన్నారు.
ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన గళాన్ని వినిపిస్తూ వచ్చారు.
ఈ ఏడాది ఆగస్టులో, కొన్ని ముస్లిం సంస్థలు రాష్ట్రంలో కరపత్రాలను పంచాయి. సెమినార్లు నిర్వహించాయి. "అకస్మాత్తుగా రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తే" తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేలా గుర్తింపు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ప్రజలకు ఆ సంస్థలు సూచించాయి.
"అక్రమ వలసదారుల కోసం అస్సాంలో భారీ నిర్బంధ శిబిరాన్ని నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది తీవ్ర అయోమయంలో బతుకుతున్నారు. మేము అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది" అని మహ్మద్ నసీరుల్లా బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అస్సాం: 40 లక్షల మంది ప్రజలు భారతీయులు కాదు
- క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?
- చైనాలో ఇస్లాం వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- ప్రభుత్వ వ్యతిరేకత దరిచేరనివ్వని నేత.. ఐదోసారి సీఎంగా ప్రమాణం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








