వైఎస్ జగన్: ‘చిన్నప్పుడు క్రికెట్ కెప్టెన్.. ఇప్పుడు రాష్ట్రానికి కెప్టెన్’

- రచయిత, డి.ఎల్.నరసింహ
- హోదా, బీబీసీ కోసం
''వాళ్ల నాన్న ఎమ్మెల్యే ఐనా మంత్రైనా ఎలాంటి గర్వం లేకుండా మా అందరితో కలిసిపోయేవారు. చిన్నతనం నుంచే ఆయనకు సహాయం చేసే గుణం ఉంది. మా అందరితో ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవారు. ఆ పట్టుదల, ఆ ప్రేమ, ఆప్యాయతలే ఇప్పుడు ఆయన్ను గొప్ప నాయకుణ్ని చేశాయి"
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిన్ననాటి స్నేహితులు చెప్పిన మాటలివి.
''మా చిన్నతనం నుంచి జగన్మోహన్‌రెడ్డితో అనుబంధం ఉంది. మేమూ.. ఇంకా కొందరు స్నేహితులం కలిసి రెండు జట్లుగా విడిపోయి క్రికెట్ ఆడేవాళ్లం. మా జట్టుకు జగన్మోహన్‌రెడ్డే కెప్టెన్. గెలవాలనే పట్టుదల ఆయనలో ఎక్కువగా ఉండేది. జట్టులో మిగిలిన అందరినీ ప్రోత్సహిస్తూ గెలిపించేవారు'' అని వారు చెప్పారు.
ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో ఆయన చిన్ననాటి స్నేహితులు సంబరాలు చేసుకుంటున్నారు. జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

ఎంత బిజీగా ఉన్నా మమ్మల్ని మరచిపోయేవాడు కాదు: పెద్దపల్లి సురేంద్ర
కడప జిల్లా పులివెందులకు చెందిన నలభై ఆరేండ్ల పెద్దపల్లి సురేంద్ర ప్రసాద్.. వైఎస్ జగన్‌తో తనకున్న అనుబంధాన్ని బీబీసీతో పంచుకున్నారు.
"నాకు నాస్నేహితుని ద్వారా జగన్మోహన్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన హైదరాబాదులో చదివేవారు. సెలవులకు పులివెందుల వచ్చిన ప్రతిసారి మాతో కలిసి క్రికెట్ ఆడేవారు.
నా డిగ్రీ పూర్తయ్యాక రెండుసార్లు హైదరాబాదులోని వాళ్లింటికి కూడా వెళ్లాను. అక్కడ కూడా చాలా ప్రేమగా చూసుకున్నాడు. స్నేహితులందరితో సరదాగా ఉండేవారు. ఒకసారి ఆయనతో కలిసి తలకోనకు వెళ్లి రెండు రోజులు అక్కడే గడిపాం. అప్పుడు మాకందరికి అక్కడే జ్వరం వచ్చింది.

ఇంటికి తిరిగి వచ్చాకా అందరికీ తగ్గినా నాకు మాత్రం తగ్గలేదు. అప్పుడు జగన్ స్వయంగా మా ఇంటికొచ్చి నన్ను వాళ్ల మామ డాక్టర్ గంగిరెడ్డి దగ్గరకు పంపి వైద్యం చేయించారు. 2008లో యాక్సిడెంట్ జరిగి నా చెయ్యి విరిగింది. విషయం తెలుసుకున్న ఆయన మొదట హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు. తరువాత పులివెందులకు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరీ మా ఇంటికొచ్చి పరామర్శించారు.
2017 నంద్యాల బై-ఎలక్షన్ టైంలో నా చెల్లెలు అనారోగ్యం కారణంగా చనిపోయింది. అప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. పీఏ రవి ద్వారా విషయం తెలుసుకున్న ఆయన అంత బిజీలోనూ వెంటనే నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అలా ఎలా జరిగిందని బాధపడ్డారు.
ఆ మధ్య పాదయాత్రలోనూ.. ఇటీవల ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు పులివెందులలోనూ జగన్‌రెడ్డిని కలిశాను. చిన్నప్పటి నుంచి అదే ప్రేమ. అదే ఆప్యాయత. ఎన్ని పదవులొచ్చినా. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయనలో ఏమాత్రం మార్పులేదు" అని చెప్పారు సురేంద్ర.

ఆయన కారులో క్రికెట్ కిట్ వేసుకుని గ్రౌండ్‌కు వెళ్లిపోయేవాళ్లం: ధన
పులివెందులకే చెందిన 36 యేండ్ల ధన అనే యువకుడు మాట్లాడుతూ "చిన్నప్పుడు జగనన్నకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ నుంచి రాగానే అందరం కలిసి ఆయన కారులో క్రికెట్ కిట్ వేసుకొని గ్రౌండుకు వెళ్లిపోయేవాళ్లం. మా బ్యాచ్‌లో నేనే అందరికంటే చిన్నవాన్ని. అన్నకు బాల్ అందిస్తుండేవాడిని.

తనకు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ వా అంటే ఇష్టమని అప్పట్లో జగనన్న చెప్పేవారు. నాకంటే పదేండ్లు పెద్దవాడైనా నన్ను ధన అని ఆప్యాయంగా పేరుతోనే పిలిచేవాడు. ఇప్పటికీ అన్నదగ్గరికి వెళ్లి కనిపిస్తే.. గుర్తుపట్టి పేరుతో పిలుస్తారు.
అప్పుడు మాలో ఒకడిగా ముందుండి మా టీంను నడిపించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించబోతున్నారు. నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది" అన్నారు.

తన చుట్టూ ఉండేవారినీ సంతోషంగా ఉంచేవారు: నిసార్ భాష
జగన్ మరో చిన్ననాటి స్నేహితుడు నిసార్ భాష తన జ్ఞాపకాలను తెలియజేశారు. జగన్ తాను సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉండేవారిని కూడా సంతోషంగా ఉంచేవారని తెలిపారు. చిన్నవయసు నుంచే స్నేహితులతో పాటు తమ ఇంటికి సహాయం కోరివచ్చే అందరికీ సహకరించేవారని చెప్పారు.
ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో కూడా తన కొడుకు చేతిని జగన్ తన భుజంపై వేయించుకొని ఫోటో దిగటం తనకు చాలా ఆనందం కలిగించిందని నిసార్ సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కడపజిల్లా పులివెందులలో జన్మించినప్పటికి ఆయన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే జరిగింది.
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 1978లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యాక తన నివాసాన్ని పులివెందుల నుంచి హైదరాబాదుకు మార్చారు. అప్పటికి జగన్ వయసు ఆరేళ్లు. జగన్ పులివెందులలో ఎల్‌కేజీ, యూకేజీ చదివారు.
హైదరాబాద్ వెళ్లిన తరువాత జగన్ అక్కడి హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో 1 నుండి 12 వరకూ చదివారు. అనంతరం హైదరాబాద్ నగరం హనుమాన్ టేక్‌డిలోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాలలో 1991 నుంచి 1994 వరకు బీకాం డిగ్రీ చదివారు.
సెలవు రోజుల్లో మాత్రం తప్పక హైదరాబాద్ నుంచి పులివెందులకు వచ్చి అక్కడే గడిపేవారు. అక్కడి తన స్నేహితులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. జగన్‌కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం. స్నేహితులతో కలిసి మైదానంలో క్రికెట్ ఆడేవారు.

కాలేజీలో క్రమశిక్షణతో మెలిగేవాడు: ప్రిన్సిపల్
ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వై.కృష్ణమోహన్ నాయుడు బీబీసీతో మాట్లాడుతూ.. "నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీకాం చదివే రోజుల్లోనే కొత్తగా ఈ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాను. అప్పుడు ప్రొఫెసర్ వేదాచలం ప్రిన్సిపల్‌గా ఉండేవారు.
జగన్ ఎక్కువగా లైబ్రరీలో కనిపిస్తుండేవాడు. తన పని తాను చేసుకుంటూ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. మా కళాశాల విద్యార్థి క్రమశిక్షణతో మెలిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదగటం మాకు గర్వకారణం" అన్నారు.

"జగన్మోహన్‌రెడ్డి కామ్ గోయింగ్ స్టూడెంట్. బాధ్యత గల విద్యార్థిగా ఉండేవారు. ఎంతో పట్టుదల కలిగిన విద్యార్థి. ఆయన కూడా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అప్పట్లోనే కొందరు అధ్యాపకులు మాట్లాడుకునే వారు. వాళ్ల అంచనాలు నేడు నిజమయ్యాయి" అన్నారు కళాశాల కార్యదర్శి జిగ్నేష్ దోషి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









