ఎన్టీఆర్ వర్ధంతి: రామారావు గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

ఫొటో సోర్స్, facebook/TDP.Official
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 1923 మే 28న నిమ్మకూరులో జన్మించారు.
ఆయన 1996 జనవరి 18న కన్నుమూశారు.
ఎన్టీఆర్ గురించి ఒక పది విషయాలు..
1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డుగా ఆయన అభివర్ణిస్తారు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo ఏర్పడిన తర్వాత సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ చేతిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
1940ల్లో కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
ఆలయాల్లో పూజారి వృత్తిని చేపట్టే అవకాశాన్ని పరీక్ష ద్వారా బ్రాహ్మణేతరులకు కూడా కల్పించింది ఎన్టీ రామారావే.

ఫొటో సోర్స్, facebook/jrntr
ఎన్టీఆర్ ఒకసారి న్యూయార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ అఫ్ లిబర్టీని చూసి మైమరచిపోయారoట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కూడా ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
'శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' సినిమాలోని ఒక సీన్ ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే… ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి 3 ఏళ్ళ తరువాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
1987 హర్యానా ఎన్నికల్లో దేవీ లాల్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణను తోడుగా తీసుకొని హైదరాబాద్ నుంచి రోడ్ మార్గంలో వెళ్లారు. అనూహ్యంగా దేవి లాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
తెలుగు సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లి చెంబుతో స్వయంగా నీళ్లిచ్చి కాళ్లు కడిగించి లోపలికి తీసుకొచ్చారు. ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు, ఎన్టీఆరే స్వయంగా అతిథులకు భోజనం వడ్డించేవారు.

ఫొటో సోర్స్, facebook/TDP.Official
ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు, అభయం ఇచ్చేవారు.
అలా ఎందుకని చాలా మందికి సందేహం ఉండేది, కొందరు ఆయన్నే డైరెక్టుగా అడిగారు కూడా.
దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. "మన హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను" అన్నారట..
అవతలివారు ఆశ్చర్యపోయాక అసలు గుట్టు విప్పేవారట ఎన్టీఆర్. సినిమాల్లో తీసే అడ్వెంచర్స్, ఫైటింగుల వల్ల, ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఎన్టీఆర్ కుడిచెయ్యి నాలుగు సార్లు విరిగింది. వరుస ప్రమాదాలతో కుడిచేయి పట్టు తప్పడంతో ఎడమచేత్తోనే దీవెనలు ఇవ్వడం ప్రారంభించారట ఎన్టీఆర్.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ ఫైనల్-లో గుజరాత్.. శుభ్-మన్ గిల్ భారీ సెంచరీపై రోహిత్ శర్మ ఏమన్నాడు-
- ఎన్టీఆర్ శతజయంతి- తెలుగు వారి మనసుల్లో ఆయన ఎలా గుర్తుండిపోయారు?
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్పై ఎలా గెలిచానంటే'
- ఎన్టీఆర్ పోషించిన తొలి పాత్ర ఏమిటో తెలుసా?
- ఎన్టీఆర్: ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ నుంచి ‘జన్మభూమి నా దేశం నమోః నమామి’ వరకు
- ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్ పార్టీయే: నరేంద్ర మోదీ
- NTR కథానాయకుడు రివ్యూ: సృజనాత్మకత లోపించినా... క్రిష్ కష్టం కనిపించింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








