ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్ పార్టీయే: నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, lok sabha
''స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ కోరుకున్నారు. నేనిప్పుడు ఆయన కోరిక నెరవేరుస్తున్నానంతే''
- ప్రధాని నరేంద్ర మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ లోక్‌సభలో ప్రసంగించారు. తమ పాలనలోని ఘనతలు చెబుతూనే కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేశారు.
55 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో 55 నెలల తమ పాలనను పోల్చి చూడాలని మోదీ కోరారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో అధికారం కోసం అర్రులుచాస్తే తాము 55 నెలలూ దేశం కోసమే పనిచేశామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ప్రసంగంలోని 7 ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
- * ఆధునిక భారతదేశం గురించి చెప్పాలంటే రెండు కాలాల గురించి మాట్లాడాలి. ఒకటి బీసీ.. అంటే 'బిఫోర్ కాంగ్రెస్'. అప్పుడు ఏమీ జరగలేదు. రెండోది ఏడీ.. 'ఆఫ్టర్ డినాస్టీ' అంటే కుటుంబ పాలన తరువాత. ఆ సమయంలో దేశానికి కావాల్సినవన్నీ జరుగుతున్నాయి.
- * కాంగ్రెస్ వాస్తవాలను అంగీకరించదు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో కేరళ, పశ్చిమ బెంగాల్‌లో హక్కులను కాలరాశారు. ఆర్టికల్ 352ను ఆ పార్టీ చాలాసార్లు ఉపయోగించింది. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్సే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్నీ, తమిళనాడులో ఎంజీఆర్ ప్రభుత్వాన్నీ కూల్చేసింది కాంగ్రెస్ పార్టీయే.
- * బాబాసాహెబ్ అంబేడ్కర్ కాంగ్రెస్ గురించి ఏమన్నారో తెలుసా? కాంగ్రెస్‌లో చేరడమంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే అన్నారాయన.
- * కాంగ్రెస్ పార్టీది, ధరల పెరుగుదలదీ ఒకటే జట్టు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ధరలు ఆకాశానికి ఎగబాకుతాయి. ఎన్డీఏ ప్రభుత్వం ధరలను అదుపులో ఉంచేలా చర్యలు చేపట్టింది.
- * మోదీని అసహ్యించుకుంటున్నాం అనుకుంటూ విపక్ష నేతలు ఏకంగా దేశాన్నే అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. వారి ఉద్దేశంలో నేను చేసిన తప్పేంటో తెలుసా? ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా వారి సామ్రాజ్యాన్ని సవాల్ చేయడమే ఆ తప్పు.
- * మన దేశ వైమానిక దళం బలపడడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. అందుకే రఫేల్ అంశంపై వివాదం చేస్తోంది.
- * పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉంటే ఏమేం చేయగలదో దేశ ప్రజలు చూశారు. ఎన్డీయే చేసిన పనులు ప్రజలు చూశారు. కోల్‌కతా వేదికగా కలిసిన పార్టీలది మహాకూటమి కాదు. అది మహాకల్తీ. ప్రజలు దాన్ని కోరుకోవడం లేదు.
ఎన్నికల ముంగింట్లో ఇలాగే మాట్లాడుతారు..: భండారు శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు
ప్రసంగాలు చేయడంలో, తన వాగ్దాటితో సభికులను ఆకట్టు కోవడంలో నరేంద్ర మోడీ దిట్ట. పార్లమెంటులో ఆయన ఈరోజు చేసిన ఉపన్యాసం కూడా అదే రీతిలో సాగిపోయింది. అయితే ఈ వాగ్ఝరిలో విషయం పక్కకు పోతుంది. కానీ వినే వారికి ఆ విషయం పట్టనంత పటుత్వంగా ప్రసంగం సాగుతుంది. అదే జరిగింది.
నిజానికి ఆయన కొత్తగా చెప్పిన సంగతులేవీ లేవు. ఇన్నాళ్ళు చెబుతూ వచ్చిన విషయాలనే మరోమారు వల్లె వేసినట్టుగా వుంది.
బీజేపీకి మరీ ముఖ్యంగా మోదీకి కాంగ్రెస్ పై ఉన్న వైమనస్య భావం అందరికీ తెలిసిందే. అదే మోదీ ప్రసంగంలో తొంగిచూసింది.
సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో వున్నప్పుడు ఇంతకు మినహా మరో విధంగా ప్రధాని ప్రసంగం సాగే వీలులేదు.
నాలుగున్నరేళ్ళ పైచిలుకు కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెడుతూ, స్వాతంత్రం వచ్చిన దాదిగా అనేక సంవత్సరాల కాగ్రెస్ పాలనతో పోల్చుకుంటే తాము కొద్ది కాలంలో సాధించింది ఎంతో ఎక్కువ అని చెప్పుకొచ్చారు.
యూపీఏ అధికారంలో వున్నప్పుడు ఆనాటి పాలక పక్షం నేతలు కూడా అచ్చు ఇదేమాదిరి ప్రసంగాలు చేసిన ఉదంతాలు టీవీల్లో చూసేవారికి మరోమారు జ్ఞాపకానికి వచ్చి వుంటాయి.
ఇవి కూడా చదవండి:
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- Fact Check: రాహుల్ గాంధీని 14 ఏళ్ల అమ్మాయి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిందా?
- బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా...
- సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








