జొమాటో వ్యవస్థాపకుడు ధరించిన ఆ పరికరం ఏమిటి, అదేం చేస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

టెంపుల్, దీపేంద్ర గోయల్, గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్

ఫొటో సోర్స్, @deepigoyal/X and YT/rajshamami

ఫొటో క్యాప్షన్, 'టెంపుల్' అనే చిన్న పరికరం మెదడుకు చేరే రక్త ప్రవాహాన్ని కొలుస్తుందని దీపేంద్ర గోయల్ అన్నారు.
    • రచయిత, చరణ్‌జిత్ కౌర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపేంద్ర గోయల్ తన ఎడమ కన్నుకు పక్కగా ఒక చిన్న పరికరాన్ని ధరించి ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో కనిపించారు.

దీంతో ఈ పరికరం ఏమిటి, అదెలా పనిచేస్తుందనే దానిపై చాలామందిలో ఉత్సుకతను రేకెత్తించింది. దీని గురించి సోషల్ మీడియాలో చర్చ కూడా నడిచింది.

ఇంతకీ, ఈ పరికరం గురించి గోయల్ ఏం చెప్పారు, వైద్యులు ఏమంటున్నారు?.

జనవరి 3న విడుదలైన ఒక పాడ్‌కాస్ట్‌లో దీపేంద్ర గోయల్ మాట్లాడుతూ, ఈ పరికరం స్టిక్కర్ లాంటిదని, ఇది మెదడుకు చేరుతున్న రక్త ప్రవాహాన్ని పర్యవేక్షిస్తుందని చెప్పారు.

"గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్’’ భావన నుంచి ఈ పరికరం ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు.

"నా కోసం ఒక ఫిట్‌నెస్ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నా. నా మెదడు రక్త ప్రవాహాన్ని పర్యవేక్షించాలనుకుంటున్నట్లు వారికి చెప్పాను. ఒక పరికరాన్ని అభివృద్ది చేయించాం, ఇది థర్డ్ పార్టీ వారి వద్ద ధ్రువీకరణ దశలో ఉంది. ఇంతకుముందు మేం పెద్ద పరికరాన్ని డెవలప్ చేశాం, దాన్నే చిన్నదిగా మార్చాం. పరికరాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాం. దాని విలువను అర్థం చేసుకునే వారి కోసం మేం అలాంటివాటిని తయారుచేయాలనుకుంటున్నాం" అన్నారు దీపేంద్ర గోయల్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వైద్యం, గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ పరికరం?

స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌ల మాదిరిగా కాకుండా దీపేంద్ర గోయల్ ఈ పరికరాన్ని ఎడమ కన్నుకు పక్కగా ధరించారు. రక్త ప్రవాహంలో మార్పులను నిరంతరం ట్రాక్ చేయడం ద్వారా, ఈ పరికరం కాలక్రమేణా మెదడు పనితీరు గురించి సమాచారాన్ని అందిస్తుందని ఆయన అంటున్నారు.

'కంటిన్యూ అనేది ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్, గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్ ఒక వర్కింగ్ మోడల్' అని 2025 నవంబర్ 20న తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీపేంద్ర గోయల్ రాశారు. ఈ ప్రయాణంలో తెలియకుండానే మెదడు ప్రవాహ పర్యవేక్షణ పరికరం(బ్రెయిన్ ఫ్లో మానిటర్) తయారుచేశామని చెప్పారాయన.

"సుమారు ఏడాది పాటు సాగిన ప్రయోగంలో ఈ పరికరం మెదడు రక్త ప్రవాహాన్ని నిరంతరం పరిశీలించింది. దీనిని మేం మాపై, ఒక చిన్న బృందంపై ప్రయోగించాం. వందలాది ఎంఆర్ఐ, డాప్లర్ స్కాన్‌ ఫలితాలతో పోల్చి చూశాం" అని తెలిపారు.

‘‘ఈ పరికరానికి టెంపుల్ అని పేరు పెట్టాం" అన్నారు దీపేంద్ర గోయల్.

ఎంఆర్ఐ వంటి ఇతర రక్త ప్రవాహాన్ని కొలిచే పరికరాలు చాలా పెద్దవి కాబట్టి, ఒక చిన్న పరికరాన్ని అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. "రక్త ప్రవాహాన్ని పెంచే పనులు చేస్తే, మీరు మంచి అనుభూతి చెందుతారు. దీనిద్వారా, ఏ ప్రవర్తనా విధానాలు మీకు మంచిగా అనిపిస్తాయో, ఏవి చెడుగా అనిపిస్తాయో నేర్చుకోవచ్చు’’ అన్నారు.

టెంపుల్ డివైజ్, గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్

ఫొటో సోర్స్, deepigoyal/instagram

ఫొటో క్యాప్షన్, దీపేంద్ర గోయల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన 'టెంపుల్' పరికరం ఫోటో

నిపుణులు ఏమంటున్నారు?

"దీపేంద్ర గోయల్ టెంపుల్ పరికరం ఒక ఫ్లో సెన్సార్, అలాంటి పరికరాలు కొత్తేమి కావు. గతంలో శారీరక శ్రమను కొలవడానికి యాక్టిగ్రఫీ (నిద్రలో ఒక వ్యక్తి శారీరక శ్రమను పర్యవేక్షించడానికి వాడే సెన్సార్) వంటి పరికరాలు ఉపయోగించారు'' అని సీఎంసీ లూధియానాలోని న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జయరాజ్ డి. పాండియన్ అన్నారు.

"కానీ, ఇలా ధరించే పరికరం నేరుగా మెదడు రక్త ప్రవాహాన్ని కొలవదు" అన్నారాయన.

మెదడు రక్త ప్రవాహాన్ని కొలవడానికి వైద్య రంగంలో ఎంఆర్ యాంజియోగ్రఫీ, ఎంఆర్ఐ, పీఈటీ స్కాన్, అనేక ఇతర పద్ధతులున్నాయని డాక్టర్ పాండియన్ వివరించారు. కొన్ని మెదడు వ్యాధులను నిర్ధరించడానికి ట్రాన్స్‌క్రానియల్ డాప్లర్ అల్ట్రాసౌండ్ కూడా నిర్వహిస్తారని చెప్పారు.

మెదడు పనితీరును అర్థం చేసుకోవడానికి కొంతమంది ఇటువంటి పద్ధతులను పరిశోధిస్తున్నారని, కానీ ఈ పద్ధతులు ఇంకా పూర్తిగా నిరూపితమవలేదు లేదా ధృవీకరణ కాలేదని డాక్టర్ పాండియన్ తెలిపారు. మెదడులోని ఏదైనా వ్యాధి వల్ల మెదడు రక్త ప్రవాహం ప్రభావితమవుతుందని అంటున్నారాయన.

మెదడులోని రక్త నాళాలలో అడ్డంకులు ఏర్పడితే ప్రవాహం తగ్గుతుందని, రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడితే, మెదడు పనితీరు ప్రభావితమవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, కార్యకలాపాల్లో మందగమనం, ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గడం మొదలైనవి జరుగుతాయని డాక్టర్ పాండియన్ వివరించారు.

టెంపుల్ డివైజ్, గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్

ఫొటో సోర్స్, @deepigoyal

ఏమిటీ గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్?

ఈ పరికరం వెనుకున్న ప్రధాన ఆలోచనను "గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్"గా అభివర్ణించారు దీపేంద్ర గోయల్. ఇంతకీ ఏమిటీ గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్?.

తన శాస్త్రవేత్తల బృందం గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్ సిద్ధాంతం గురించిన సమాచారాన్ని సేకరించినట్లు దీపేంద్ర గతంలో చెప్పారని అపోలో హాస్పిటల్‌లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అన్నారు.

"ఒక వ్యక్తి నిలబడినపుడు లేదా కూర్చున్నప్పుడు, మెదడుకు రక్తాన్ని పంపేందుకు గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుందని ఈ సిద్ధాంతం చెబుతోంది. దీని వల్ల కాలక్రమేణా మెదడుకు చేరే రక్తం తగ్గుతుంటుంది. ఇది అకాల వృద్ధాప్యానికి కారణం కావచ్చు" అన్నారు.

ఈ సిద్ధాంతానికి ఇంకా బలమైన ఆధారాలు లేవని డాక్టర్ సుధీర్ కుమార్ అంటున్నారు. గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్ ఒక కొత్త పరికల్పన అని డాక్టర్ పాండియన్ కూడా నమ్ముతున్నారు.

దీని గురించి డాక్టర్ సుధీర్ కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టులో "మనం నిలబడి ఉన్నా, కూర్చున్నా, పరిగెడుతున్నా మెదడుకు రక్త సరఫరాను నిర్ధరించే యంత్రాంగాలు మన గుండెలో ఉన్నాయి. అందువల్ల, ఆరోగ్యకరమైన వ్యక్తిలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు సరైన మొత్తంలో రక్తం మెదడుకు చేరుతూనే ఉంటుంది" అని రాశారు.

"ఎవరికైనా గుండె జబ్బు, బీపీ సమస్యలున్నా గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేదు. ఇలాంటి సమయంలో రోగికి తలతిరగడం, బలహీనంగా అనిపించడం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో వైద్య సలహాతో కారణాన్ని కనుగొనవచ్చు" అని తెలిపారు సుధీర్ కుమార్.

వైద్యం, హైపాథసెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

రక్త ప్రవాహాన్ని కొలవడం మంచిదేనా?

మెదడు రక్త ప్రవాహాన్ని ఎల్లప్పుడూ వైద్య సలహా ప్రకారం కొలవాలని డాక్టర్ జయరాజ్ డి. పాండియన్ సూచిస్తున్నారు. టెంపుల్ పరికరానికి ఆమోదం దక్కితే, దాన్ని ఎవరు ఉపయోగిస్తారని డాక్టర్ సుధీర్ కుమార్ ప్రశ్నిస్తున్నారు.

"నిరంతర పర్యవేక్షణ అవసరమయ్యే వ్యక్తులు చాలా తక్కువ. పైగా నిరంతర పర్యవేక్షణ కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. డేటాలో మార్పులు చాలా సందర్భాలలో ఒత్తిడి, ఆందోళనకు కూడా కారణమవుతాయి" అని డాక్టర్ సుధీర్ కుమార్ అంటున్నారు.

మెదడు రక్త ప్రవాహాన్ని కొలిచే అనేక పద్ధతులు ఇప్పటికే ఉన్నాయని గుర్తుచేశారు సుధీర్ కుమార్. ఆరోగ్యకరమైన వ్యక్తిలో మెదడు రక్త ప్రవాహాన్ని కొలవవలసిన అవసరం లేదని, రోగి లక్షణాలను అనుభవించినప్పుడు మాత్రమే ఇది అవసరమన్నారు.

ఎవరైనా అలాంటి వైద్య పరికరాలను మార్కెట్‌కు తీసుకురావాలనుకుంటే, వారికి అనుమతులు అవసరం, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు డాక్టర్ పాండియన్,

దీపేంద్ర గోయల్ పోస్టు, టెంపుల్ డివైజ్

ఫొటో సోర్స్, deepigoyal/instagram

ఫొటో క్యాప్షన్, టెంపుల్ డివైజ్ గురించి సోషల్ మీడియాలో దీపేంద్ర గోయల్ పోస్ట్

విమర్శలపై దీపేంద్ర ఏమన్నారు?

"ఈ హైపాథసెస్ సరైనదా, కాదా అనే విషయం ఖచ్చితంగా కొత్త చర్చకు దారితీస్తుంది. ఈ చర్చలు మెదడు, వృద్ధాప్యం, అనేక ఇతర సమస్యలను మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి" అని దీపేంద్ర గోయల్ తెలిపారు.

తాను సైన్స్ నేపథ్యం నుంచి రానందున, ఈ అంశంపై ప్రపంచ పరిశోధనలను ప్రోత్సహించడానికి ఈ హైపాథసెస్ గురించి మాట్లాడుతున్నట్లు చెప్పారాయన.

తనపై వచ్చిన విమర్శలకు దీపేంద్ర గోయల్ సోషల్ మీడియాలో బదులిస్తూ "విమర్శకులకు తమ అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ ఉంది, కానీ ఇది సంఘటనల వాస్తవ క్రమం. ఇక్కడ దాచడానికి ఏమీ లేదు" అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)