పాశర్లపూడి బ్లోఅవుట్: 100 అడుగుల ఎత్తుతో, 65 రోజులు ఆరని మంటలు, 30 ఏళ్ల కిందట అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, M Babulu
- రచయిత, అల్లు సూరిబాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోనసీమ ప్రజలను బెంబేలెత్తించి, దేశమంతా చర్చనీయాంశమైన 'పాశర్లపూడి బ్లో అవుట్' ఘటన జరిగి జనవరి 8 తేదీకి 30 ఏళ్లు పూర్తవుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసుత్తం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా)లోని అల్లవరం మండలంలోని దేవరలంక సమీపంలో ఓఎన్‌జీసీకి చెందిన పాశర్లపూడి సహజవాయు క్షేత్రం 1995 జనవరి 8వ తేదీన భగ్గుమంది.
భూగర్భంలో అధిక పీడనంతో దాదాపు 2500 మీటర్ల లోతున ఉన్న సహజవాయువును వెలికితీసేందుకు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో విపరీతమైన ఒత్తిడి కారణంగా ఆకస్మికంగా రేగిన స్పార్క్ బ్లోఅవుట్‌కు కారణమైంది.
ప్రశాంతమైన గోదావరి డెల్టాలో జరిగిన ఈ హఠాత్పరిణామానికి పాశర్లపూడి, దాని పరిసర గ్రామాలు భీతిల్లిపోయాయి.
తాజాగా జనవరి 5వ తేదీన కోనసీమలోనే మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ సమీపంలోని ఓఎన్‌జీసీ సహజవాయువు బావిలో బ్లోఅవుట్ సంభవించింది. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల క్రితం జరిగిన పాశర్లపూడి బ్లోఅవుట్ గురించి ఆనాటి ఘటనను చిత్రించిన ఫోటోగ్రాఫర్, రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న నిపుణులు, ఆనాటి ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు నాటి పరిణామాలను, ప్రమాదపు తీవ్రతను బీబీసీకి వివరించారు.


ఫొటో సోర్స్, M Babulu
సుమారు వంద అడుగుల ఎత్తులో ఎగిసిపడిన మంటల కొన అక్కడికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావులపాలెం వంతెనపై నుంచి చూస్తే కూడా కనిపించేదని రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, ఓఎన్‌జీసీకి ప్యానెల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన ఎం.బాబులు (వెంకటేశ్వరరావు) బీబీసీకి చెప్పారు.
సుమారు 65 రోజుల పాటు కోనసీమ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాచేసిన ఆ బ్లోఅవుట్‌కు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్‌లో చేపట్టిన ప్రతికీలక ఘట్టాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి కెమెరాతో చిత్రీకరించామని ఆయన అన్నారు.
బ్లోఅవుట్ మంటలకు కోనసీమ కొబ్బరితోటలన్నీ తగులబడిపోతున్నాయన్న ఊహాగానాలతో ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ, హెలికాప్టర్‌లో వెళ్లి తాను తీసిన ఏరియల్ వ్యూ ఫోటో కోనసీమ ప్రజలకు వాస్తవమేంటో తెలియజేసిందని బాబులు గుర్తుచేసుకున్నారు.
పాశర్లపూడి బ్లోఅవుట్‌ను అదుపు చేసేందుకు తమ ఓఎన్‌జీసీ రెస్క్యూ మేనేజ్‌మెంట్ టీమ్ (ఆర్‌సీఎంటీ) ఎంతో కృషి చేసిందని, చివరకు విజయవంతంగా పాశర్లపూడి క్షేత్రంలో బ్లోఅవుట్ జరిగిన సహజవాయువు బావి ముఖద్వారం (వెల్ హెడ్)కి మూతవేశామని ఆ బృందంలో పని చేసిన ఉద్యోగి రాజా శంకర్‌బాబు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, M Babulu
ఏడు గ్రామాలు ఖాళీ...
గతంలో ఎప్పుడూ చూడనివిధంగా, 1995 జనవరి 8వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో బ్లో అవుట్ సంభవించిందని, పెద్ద ఎత్తు మంటలే గాకుండా బావి నుంచి హోరున శబ్దాలు రావడంతో ప్రజలు భీతిల్లిపోయారని అమలాపురానికి చెందిన జర్నలిస్టు సతీశ్ బాబు నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
తక్షణమే ఆ రిగ్‌కు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోనున్న ఏడు గ్రామాల నుంచి ప్రజలను వేరే గ్రామాలకు అధికారులు తరలించారని, వారం రోజుల వరకూ ఏం జరుగుతుందోనన్న ఆందోళన కనిపించేందని ఆయన బీబీసీకి చెప్పారు. ఆ తర్వాత, ఓఎన్‌జీసీ అధికారులు తగిన నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారన్న వార్తలు చూసి, కాస్త ధైర్యంతో ఒక్కొక్కరూ ఇళ్లకు తిరిగొచ్చారని తెలిపారు.
వాస్తవానికి, పాశర్లపూడి గ్రామానికి బ్లోఅవుట్ సంభవించిన బావి ఉన్న ప్రదేశానికీ సంబంధమే లేదని, అది అల్లవరం మండలంలోని దేవరలంక గ్రామ పరిధిలో ఉందని సతీశ్ అన్నారు.
ఆ గ్యాస్ బావికి ఓఎన్‌జీసీ అధికారులు 'పాశర్లపూడి నేచురల్ గ్యాస్ వెల్' అని పేరు పెట్టడం వల్లే, 'పాశర్లపూడి బ్లో అవుట్' గా ప్రచారమైందని చెప్పారు.

ఫొటో సోర్స్, M Babulu
'బహుశా దేశంలో అదే మొదటి బ్లో అవుట్'...
గోదావరి డెల్టాలోని వైనతేయ (గోదావరి నదికి ఒక పాయ) నదీతీరానికి సమీపంలోనున్న పాశర్లపూడి సహజవాయు క్షేత్రంలో డ్రిల్లింగ్ జరుగుతుండగా, 1995 జనవరి 8న బ్లో అవుట్ సంభవించింది.
ఈ సంఘటన గురించి రెస్క్కూ టీమ్ సభ్యుడైన శంకర్ బాబు ఇలా వివరించారు:
''ఆ ముందు రోజు వరకూ నేను పాశర్లపూడి క్షేత్రంలోనే ఉన్నాను. వేరేచోటకు వెళ్లినప్పుడు రేడియో ఆపరేటర్ ద్వారా బ్లోఅవుట్ గురించి తెలిసింది. ఆర్‌సీఎంటీ అంతా అలర్ట్ అయ్యాం. తక్షణ కర్తవ్యంపై ఓఎన్‌జీసీ ఉన్నతాధికారుల సూచనలతో మా టీమ్ అంతా సమాలోచనలు చేశాం. బహుశా భారతదేశ చమురు, సహజవాయువు అన్వేషణ ప్రక్రియలో సంభవించిన మొదటి బ్లోఅవుట్ అదే. యాక్షన్ ప్లాన్ అమలుచేయాలంటే ముందు బావి ముఖద్వారాన్ని (వెల్ హెడ్) పరిశీలించాలి. కానీ దాని పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల డిగ్రీల వేడి ఉంది. దాన్ని నుంచి రక్షణ కోసం 'వాటర్ అంబ్రెల్లా' (నీటి గొడుగు) విధానాన్ని ఉపయోగించాం.''
''పైకి ఎగసిపడుతున్న మంటలపైకి భూమి నుంచి కొంత ఎత్తు వరకూ అన్నివైపుల నుంచి వాటర్ గన్‌లతో నీటిని బలంగా వెదజల్లుతారు. అప్పుడది ఒక రక్షణ ఛత్రంలా మారుతుంది. దీంతో మంటల వేడి తగలదు. అదే అదనుగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది''
''వాటర్ అంబ్రెల్లా కింద వెళ్లి పరిశీలిస్తే, డ్రిల్లింగ్ రిగ్ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన సిబ్బంది అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడంతో ప్రాణనష్టమేమీ జరగలేదు. ఇక రెస్క్యూ చర్యల్లో భాగంగా తొలుత బావి ముఖద్వారం చుట్టూ పడిఉన్న డెబ్రిస్ (శిథిలాల) తొలగింపు చేపట్టాం. లోపలివరకూ నీటి సరఫరా ఉండేలా పైపులు వేసే పనులు మరోవైపు త్వరితగతిన పూర్తిచేశారు'' అని శంకర్ బాబు చెప్పారు.

ఫొటో సోర్స్, M Babulu
విదేశీ సంస్థల సహకారం...
పాశర్లపూడి క్షేత్రంలో బ్లో అవుట్ మంటలను నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ఓఎన్‌జీసీ ఒప్పందంలో భాగంగా తొలుత అమెరికాకు చెందిన నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటర్స్ (ఎన్ఏఎఫ్) సంస్థ సిబ్బందిని రప్పించారు.
''నీల్ ఆడమ్స్ వ్యూహాలేవీ త్వరితగతిన సానుకూల ఫలితాలను చూపించకపోవడంతో ఓఎన్‌జీసీ అదే అమెరికాకు చెందిన పాల్ నీల్ 'రెడ్ అడైర్' అనే ఆయిల్ వెల్ ఫైర్‌ఫైటర్ సంస్థ సహకారం తీసుకుంది. మొత్తంమీద అమెరికా సంస్థతో కలిసి ఓఎన్‌జీసీ రెస్క్యూ మేనేజ్‌మెంట్ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చివరకు 65వ రోజు నాటికి అదుపులోకి తీసుకురాగలిగాం'' అని శంకర్ బాబు వెల్లడించారు.

ఫొటో సోర్స్, M Babulu
'గ్యాస్ ఒక్కటే గాల్లోకి వెళ్లినా ప్రమాదమే...'
బావి నుంచి అత్యధిక పీడనంతో గ్యాస్ వెలుపలికి వెలువడుతుంది. దాన్ని అదుపులోకి తీసుకురావడానికి యంత్రాలతో పాటు 'మడ్' (ఒక రకమైన బురద) వంటివి వాడుతుంటారు.
'గ్యాస్ ప్రెజర్‌కు, దాన్ని నిరోధించడానికి వాడే మడ్ వంటివి ఒక నిష్పత్తి ప్రకారం ఉంటాయి. అదేమాత్రం తేడా వచ్చినా గ్యాస్ ప్రెజర్ పెరిగి, బావి నుంచి ఎగదన్నుకు వచ్చేస్తుంది. డ్రిల్లింగ్‌లో ఇలాంటివి సహజం. వాటిని వెనువెంటనే కంట్రోల్ చేయడానికి క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటుంది'' అని శంకర్ బాబు చెప్పారు.
పాశర్లపూడి వెల్ దగ్గర డ్రిల్లింగ్ చేసేటప్పుడే, భూమిలో ఉన్న గ్యాస్ పీడనం ఒక్కసారిగా పెరిగిపోయిందని, దాన్ని నియంత్రించలేని పరిస్థితిలోనే రాపిడి జరిగి బ్లోఅవుట్ అయ్యిందని అభిప్రాయపడ్డారు.
''అలా ఎక్కడైనా ప్రమాదవశాత్తూ గ్యాస్ వెలుపలికి వస్తే మండిపోవడమే కొంత శ్రేయస్కరం. ఎందుకంటే గ్యాస్ ఒక్కటే గాల్లోకి వెళ్తే చిన్న మేఘంలా ఏర్పడుతుంది. అది అత్యంత ప్రమాదకరం. అదేమాత్రం రాజుకున్నా ఒక బాంబు విస్ఫోటనంలా ఉంటుంది. దాని ప్రభావం ఉన్నంతవరకూ ప్రజలు, ఇళ్లు అగ్నికి ఆహుతి అయిపోతాయి'' అని ఆయన వివరించారు.
అందుకే పాశర్లపూడి వెల్ వద్ద కొత్త 'బీవోపీ' (బ్లో అవుట్ ప్రివెంటర్) ఏర్పాటుచేయడానికి వీలుగా పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు జరిగిన తర్వాత మాత్రమే మంటలు ఆర్పేందుకు 'రసాయనాల బాంబు' పేల్చినట్లు శంకర్ బాబు చెప్పారు.
ఈ రసాయన పదార్థాలను అలా వెదజల్లడం వల్ల ఆ ప్రాంతంలో ఆక్సిజన్ తగ్గిపోయి, మంటలు ఆరిపోయినా, గ్యాస్ మాత్రం బయటకు వస్తూనే ఉంటుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, M Babulu
'బీవోపీ కీలకం...'
సాధారణంగా చమురు లేదా సహజవాయువు కోసం డ్రిల్లింగ్ చేసేటప్పుడే బావి ముఖద్వారం వద్ద 'బ్లో అవుట్ ప్రివెంటర్' (బీవోపీ) అమర్చుతారు.
''పాశర్లపూడి బావి బ్లోఅవుట్ సమయంలో డ్రిల్లింగ్ రిగ్ పూర్తిగా కాలిపోయినా, బీవోపీ మాత్రం స్థిరంగా ఉంది. దాన్ని అత్యంత జాగ్రత్తగా తొలగించి, కొత్తది ఏర్పాటు చేయడమే అసలైన ఘట్టం'' అని శంకర్ బాబు నాటి రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరించారు.
''మంటలు ఆరిపోగానే, పాత బీవోపీని తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. సన్నని ఇసుకరేణువులతో ఇనుప పైపులను కోసేసే 'శాండ్ కటింగ్ ఆపరేషన్' చేశారు. దీంతో మళ్లీ మంటలు రేగడానికి అవకాశం లేకుండా అత్యంత సమర్థంగా తొలగింపు పూర్తి అయ్యింది. వెనువెంటనే కొత్త బీవోపీని వెల్ హెడ్‌కు బిగించే పనులు మొదలయ్యాయి''
''విశాఖపట్నం నుంచి రప్పించిన ఒక భారీ క్రేన్ సహాయంతో బీవోపీని నెమ్మదిగా వెల్ హెడ్ వద్దకు చేర్చారు. అది వెల్ హెడ్ మీదకు వచ్చినవెంటనే నట్‌లు, బోల్టులన్నీ బిగించేయడం, క్యాప్ వేయడం వెనువెంటనే పూర్తిచేశాం. దీంతో బ్లోఅవుట్‌కు తెరపడింది'' అని శంకర్ బాబు వివరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














