Myths: 'భూమి నిజానికి వేడెక్కడం లేదు, చల్లబడుతోంది' ఇలాంటి 4 ప్రధాన అపోహలు - వాటికి సమాధానాలు

ఫొటో సోర్స్, EPA
- రచయిత, మార్కో సిల్వా
- హోదా, బీబీసీ వెరిఫై
కార్బన్ డై ఆక్సైడ్ మొక్కల ఆహారమే కానీ, కాలుష్య కారకం కాదా?
వాతావరణ మార్పులపై ఇలా తప్పుదోవ పట్టించే కథనాలు, వాదనలు ఎన్నో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం చూస్తూనే ఉంటాం. వీటిలో ప్రధానంగా నాలుగు వాదనలను తీసుకుందాం.. అవెందుకు తప్పో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1.వాతావరణ మార్పులు మనుషుల వల్ల కాదు..
వాతావరణ మార్పులకు మనుషులు కారణం కాదనే నిరాధారమైన పోస్టులను ఇంగ్లిష్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్ వంటి ఎన్నో భాషల్లో వ్యాపిస్తున్నాయి.
భూమి తన చరిత్రలో అగ్నిపర్వతాలు బద్దలు కావడం, సౌర తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వేడిని, చలిని చూసింది. కానీ, ఈ మార్పులు సుదీర్ఘ కాలం పాటు జరిగాయి. చెప్పాలంటే.. వీటికి వేల, లక్షల సంవత్సరాలు పట్టింది.
అయితే, గత 150 ఏళ్లలోనే భూమి ఇప్పటికే 1.3C వరకు వేడెక్కిందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తెలిపింది.
ఇది వినడానికి పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ, వేల ఏళ్లలో కూడా ఈ స్థాయిలో భూమి వేడెక్కడం కనిపించలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రధానంగా బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం వంటి మానవ కార్యకలాపాల వల్లే భూమి ఈస్థాయిలో వేడెక్కిందని నిస్సందేహంగా చెప్పొచ్చని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) చెబుతోంది.

ఐపీసీసీ అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థ. వాతావరణ పరిశోధనలపై సమీక్ష జరిపేందుకు, భూమిపై ఏం జరుగుతుందో ఆధారాలతో కూడిన నివేదికలను అందించేందుకు శాస్త్రవేత్తలు అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే సంస్థ ఇది.
శిలాజ ఇంధనాలను మండించడం వల్ల గ్రీన్‌హౌస్ గ్యాస్‌లు విడుదల అవుతాయి. వాటిల్లో ముఖ్యంగా కార్బన్ డై ఆక్సైడ్ (సీఓ2) ఉంటుంది. ఇవి భూమి చుట్టూ ఒక దుప్పటి లాగా ఏర్పడి, వాతావరణంలోని అదనపు శక్తిని అడ్డుకుని, భూమి వేడెక్కేందుకు కారణమవుతాయి.
''వాతావరణ మార్పు అనేది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. ఆధారాలకు సంబంధించిన విషయం'' అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన క్లైమేట్ సైంటిస్ట్ జాయిస్ కిముతాయ్ అన్నారు.
మానవ కార్యకలాపాలకు చెందిన ప్రతి చర్య కూడా భూ వాతావరణ వ్యవస్థలో ప్రతి మూలనా స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2.ప్రపంచం వేడెక్కడం కాదు.. చల్లబడుతోంది..
గ్లోబల్ వార్మింగ్ విషయంలో శాస్త్రవేత్తలు అబద్ధాలు చెబుతున్నారనడానికి పోలాండ్, కెనడా వంటి ప్రాంతాల్లోని కొంతమంది సోషల్ మీడియా యూజర్లు తమ ప్రాంతాల్లో వాతావరణం సాధారణం కంటే చల్లగా ఉండడాన్ని ఆధారంగా భావిస్తారు.
భూమి చల్లబడుతోందన్న వాదనలు కూడా ఆన్‌లైన్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి.
కానీ, అది అబద్ధం.
భూవాతావరణంలో కొద్దికాలం పాటు ఉండే వాతావరణ పరిస్థితులను వెదర్ అని, దీర్ఘకాలం పాటు అంటే ఏళ్ల తరబడి ఉండే వాతావరణ పరిస్థితులను క్లైమేట్‌గా వ్యవహరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
''కొన్ని ప్రాంతాల్లో స్వల్పకాలంలో చల్లదనం ఉంటున్నప్పటికీ, మొత్తంగా భూ ఉపరితలం వేడెక్కుతోందని దీర్ఘకాలిక ప్రపంచ ఉష్ణోగ్రతల రికార్డులు స్పష్టంగా చూపిస్తున్నాయి'' అని ఫిలిప్పీన్స్ క్లైమేట్ సైంటిస్ట్ డాక్టర్ జోసెఫ్ బాస్కాన్‌సిల్లో చెప్పారు.
1980ల నుంచి ప్రతి దశాబ్దం కూడా అంతకుముందు దశాబ్దం కంటే వేడెక్కిందని డబ్ల్యూఎంఓ చెప్పింది. ఈ ధోరణి కొనసాగుతోందని చెబుతోంది.
2024వ సంవత్సరం ఇప్పటివరకు నమోదైన అత్యంత వేడి సంవత్సరం. ఆ ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1800ల చివరి దశల స్థాయిలతో పోలిస్తే సుమారు 1.55 సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదైంది.
3. కార్బన్ డయాక్సైడ్ కాలుష్య కారకం కాదు..
మానవ కారక వాతావరణ మార్పులను తిరస్కరించే సోషల్ మీడియా అకౌంట్లు, కార్బన్ డయాక్సైడ్ మొక్కల ఆహారమని, కాలుష్య కారకం కాదని తరచూ వాదిస్తున్నాయి.
పోర్చుగీస్, క్రోయేషియన్ భాషల్లో బీబీసీ చూసిన పోస్టులు.. వాతావరణంలో ఇది ఎంత ఎక్కువుంటే, ప్రకృతికి అంత మంచిదని సూచిస్తున్నాయి.
కాలుష్య కారకాలనేవి పర్యావరణంలోకి ప్రవేశించినప్పుడు పర్యావరణ వ్యవస్థలకు లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే పదార్థాలు.
వాతావరణంలో ఇవి సాధారణ స్థాయిల్లో ఉండాలి. సీవో2 అనేది భూమిపై జీవనానికి చాలా అవసరమని, సీవో2 లాంటి గ్రీన్‌హౌస్ గ్యాస్‌లు లేకపోతే, మన గ్రహం చాలా చల్లగా మారిపోతుందని నాసా చెబుతోంది.
మొక్కలు కూడా నీరు, సూర్యరశ్మితో కలిపి ఆక్సిజన్‌ను, సేంద్రియ పదార్థాన్ని ఉత్పత్తి చేసేందుకు సీవో2ను వాడతాయి. ఇదే మన గ్రహంపై చాలా ఆహార గొలుసులకు ఆధారం.
కానీ, సీవో2 వాతావరణంలో ఎక్కువైపోతే దానిని ''కాలుష్య కారకం''గా శాస్త్రవేత్తలు వర్గీకరిస్తారు. ఎందుకంటే, దీనివల్ల హాని కలగడం ప్రారంభమవుతుంది.

ఫొటో సోర్స్, DANIEL MUNOZ/AFP via Getty Images
2024లో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు రికార్డు స్థాయికి పెరిగాయి, డబ్ల్యూఎంఓ ప్రకారం.. 1750ల నుంచి ఇవి మిలియన్(పది లక్షలకు) 280 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) నుంచి 2024 నాటికి 423 పీపీఎంకు చేరుకున్నాయి.
వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ గాఢత మానవ కార్యకలాపాల ద్వారా పెరిగేందుకు, గ్లోబల్ వార్మింగ్‌కు మధ్య సంబంధం ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు. పర్యావరణ వ్యవస్థలపై విస్తృత పరిణామాలకు ఇది దారితీస్తుందని చెప్పారు.
''అడవులు అత్యధికంగా అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. కరువు లేదా వరదల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. పర్యావరణ వ్యవస్థలు సమతుల్యత కోల్పోతుండటంతో వన్యప్రాణులు వాటి ఆవాసాలను కోల్పోతున్నాయి'' అని కెనడాకు చెందిన కన్సల్టెంట్, కన్జర్వేషన్ సైంటిస్ట్, ఎకాలజిస్ట్ మిషెల్ కలాందీన్ చెప్పారు.
వాతావరణంలో సీవో2 పెరగడం మొక్కలు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడుతుందని ఐపీసీసీ తెలిపింది. కానీ, అత్యధిక వేడి, నీటి కొరత వంటి వాతావరణ మార్పులకు చెందిన ప్రతికూల ప్రభావాలను తట్టుకునేందుకు మాత్రం ఇవి సరిపోకపోవచ్చని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
4.కార్చిచ్చులు కూడా వాతావరణ మార్పుల వల్ల కాదు..
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా, దక్షిణ కొరియా, తుర్కియే దేశాల్లో జరిగినట్లుగా పెద్ద పెద్ద కార్చిచ్చులు ఏర్పడినప్పుడు కొంతమంది సోషల్ మీడియా యూజర్లు వీటిని ప్రమాదంగానే చూస్తున్నారు. వాతావరణ మార్పుల వంటి కారకాలను పక్కన పెట్టేస్తున్నారు.
కార్చిచ్చులకు ప్రత్యక్ష కారణమైన వ్యక్తుల అరెస్టుకు సంబంధించిన వైరల్ పోస్టులు తరచూ.. వాతావరణ మార్పు వంటి దీర్ఘకాలిక కారణాలపై దృష్టి పెట్టే నిపుణులను, నాయకులను ఎగతాళి చేస్తున్నాయి.
''చాలా కార్చిచ్చులను ప్రజలే ఉద్దేశపూర్వకంగా లేదా కావాలని చేయడం వాస్తవమైనప్పటికీ, వీటిని ఒక కారణానికే కుదించడం ప్రాథమికంగా తప్పుదోవ పట్టించడమే'' అని కొలంబియాలోని నేషనల్ యూనివర్సిటీలో అగ్నిప్రమాదాలపై పరిశోధన చేసే శాస్త్రవేత్త డాక్టర్ డోలార్స్ అర్మెంటెరాస్ చెప్పారు.
కొన్ని నిర్దిష్ట ప్రమాదాలను వాతావరణ మార్పులకే ముడిపెట్టడం క్లిష్టమే. ఎందుకంటే, అడవులను ఎలా నిర్వహిస్తున్నారు, వెదర్ ఎలా ఉంది, టోపోగ్రఫీ వంటి చాలా అంశాలు కార్చిచ్చులకు కారణమవుతాయి.
అయితే, వాతావరణ మార్పులు కార్చిచ్చులకు కారణమై, ఆ మంటలను వ్యాపింపజేసే నిర్దిష్ట పరిస్థితులను సృష్టిస్తాయని మనకు తెలుసు.
వెస్ట్రన్ నార్త్ అమెరికా, సదరన్ యూరప్ వంటి ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా ''ఫైర్ వెదర్'' అని పిలిచే పరిస్థితి పెరిగిందని ఐపీసీసీ తెలిపింది. ఇది దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు, అత్యధిక వేడి, తీవ్రమైన గాలులు కలయికతో కూడిన వాతావరణం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














