భూకంపాల రాకను అంచనా వేయలేరా, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
బ్రెంట్ డిమిత్రక్ తనను తానొక భూకంప జ్యోతిష్యుడిగా చెప్పుకుంటారు. త్వరలోనే కాలిఫోర్నియాలో భూకంపం వస్తుందని నిరుటి అక్టోబరులో తన సోషల్ మీడియా ఫాలోవర్లకు చెప్పారు.
రెండు నెలల తర్వాత ఉత్తర కాలిఫోర్నియాలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. లక్షల మంది నివసించే ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు. దీని తర్వాత ఆయన ఫాలోవర్ల సంఖ్య పెరిగింది.
''ఇది యాదృచ్ఛికంగా జరిగిందని మీరెలా అంటారు? భూకంపాలు ఎక్కడ వస్తాయో ముందే గుర్తించడానికి అద్భుతమైన నైపుణ్యం ఉండాలి'' అని తనతో విభేదించే వారిని ఉద్దేశించి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చెప్పారు.
కానీ ఇక్కడో సమస్య ఉంది. భూకంపాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు మాత్రం తాము భూకంపాల రాకను ముందే అంచనా వేయలేమని చెబుతున్నారు.

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్)లో 30 ఏళ్లకు పైగా పనిచేసిన భూకంప శాస్త్రవేత్త లూసీ జోన్స్, 'ది బిగ్ వన్స్' అనే పుస్తకాన్ని రాశారు. భూకంపాలు, వాటిని తట్టుకొని నిలవగల సామర్థ్యాలను మెరుగుపరచడంపై ఆమె అధ్యయనంలో తేలిన అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
''ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలిపే ఒక నమూనాను కనుక్కోవడం ఒక బలమైన మానవ అవసరం. అలా తెలుసుకోవాలనుకోవడం మానవ సహజం కూడా. కానీ, వీటిని ఏ శక్తీ అంచనా వేయలేదు'' అని ఆమె పేర్కొన్నారు.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు లక్ష భూకంపాలు సంభవిస్తాయి. కాబట్టి మనుషులు భూకంప హెచ్చరికలను కోరుకోవడం అర్థవంతమైనదే అని ఆమె పుస్తకంలో రాశారు.
గత డిసెంబరులో భూకంపం సంభవించిన శాన్ ఫ్రాన్సిస్కోకు ఉత్తరాన 434 కిలోమీటర్లు ( 270 మైళ్ళు) దూరంలో సముద్రతీరానికి ఆనుకుని విస్తరించిన యురేకా ప్రాంతంలో గత ఏడాది 700 భూకంపాలు సంభవించాయి వీటిలో డజనుకు పైగా గత వారంలో సంభవించాయని డేటా చూపుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

భూకంపం సంభవిస్తుందని డిమిత్రక్ సరిగ్గా అంచనా వేసిన ప్రాంతం యూఎస్‌జీఎస్ ప్రకారం అమెరికాలో అత్యంత క్రియాశీలంగా ఉన్న భూకంప జోన్లలో ఒకటి. ఈ ప్రాంతం అస్థిరంగా ఉండటాని కారణం అక్కడ మూడు టెక్టానిక్ ఫలకాలు కలిసే 'మెండొసినో ట్రిపుల్ జంక్షన్' అనే ప్రాంతం ఉండడం.
ఈ మూడు పొరలు ఒకదానికొకటి సాపేక్షంగా పైకి, కిందికి లేదా పక్కకు కదులుతున్నప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి విడుదలైనప్పుడు భూకంపం వస్తుంది.
కాబట్టి, ఈ ప్రాంతంలో భూకంపాలను అంచనా వేయడం సులభమే అని జోన్స్ చెప్పారు. కానీ, ఇక్కడ 7 తీవ్రతతో భూకంపాలు రావడం చాలా అరుదు. డిమిత్రక్ అంచనా సరైనదే అయినప్పటికీ, భూకంపాల రాకను, వాటి కచ్చితత్వాన్ని అంచనా వేయడం అసాధ్యమని జోన్స్ బీబీసీతో అన్నారు.
యూఎస్‌జీఎస్ ఇక్కడ 1900 నుంచి సంభవించిన భూకంపాలలో కేవలం 11 భూకంపాలను మాత్రమే చెప్పుకోదగినిగా పేర్కొంది. వీటిల్లో ఐదు భూకంపాలు ఒకే ప్రాంతంలో సంభవించాయి. అందులో డిమిత్రక్ సోషల్ మీడియాలో పేర్కొన్న భూకంపం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

అనేక సంక్లిష్టమైన, అనేక భౌగోళిక అంశాలు భూకంపాలకు కారణమవుతాయని జోన్స్ చెప్పారు. భూకంపం వచ్చినప్పుడు మాత్రమే దాని తీవ్రత నిర్ణయమవుతుందని చెప్పారు.
భూకంపాలు ఎలా సంభవిస్తాయో శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ, అవి ఎప్పుడు వస్తాయో అంచనా వేయడం అసాధ్యమని యూఎస్‌జీఎస్ చెబుతోంది.
''ఒక నిర్దిష్ట ప్రాంతంలో, ఉదాహరణకు రాబోయే 20 ఏళ్లలో భూకంపం వచ్చే అవకాశం 60 శాతం ఉందని మాత్రమే చెప్పగలం. అంతేకానీ, సరిగ్గా ఏ సమయంలో వస్తుందని చెప్పలేం'' అని యూఎస్‌జీఎస్ ఉదహరించింది.
పెద్ద భూకంపాలు వస్తాయని అంచనా వేస్తూ, తమను అప్రమత్తం చేయడానికి వేల మంది తన కార్యాలయానికి ఫ్యాక్స్‌లు పంపించేవారని జోన్స్ గుర్తు చేసుకున్నారు.
''ప్రతీ వారం ఇలాంటి అంచనాలు మాకు అందేవి. అందులో ఎవరో ఒకరి అంచనాలు అదృష్టవశాత్తు సరైనవిగా తేలేవి. అది దృష్టిలో పెట్టుకొని వారు మరో 10 అంచనాలు వేసేవారు. అందులో ఏ ఒక్కటీ సరైనవిగా ఉండకపోయేది'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

శాస్త్రీయ ఆధారాల్లేని డిమిత్రక్ అంచనాల విషయంలో కూడా ఇలాంటిదే జరిగి ఉంటుందని ఆమె అన్నారు. నైరుతి అలస్కా, జపాన్ లేదా న్యూజిలాండ్ తీరంలోని దీవుల్లో ఒక పెద్ద భూకంపం సంభవిస్తుందని, ఇది ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని డిమిత్రక్ ఎప్పుడో అంచనా వేశారు.
భూకంప అంచనాల్లో అది సంభవించే తేదీ, సమయం, దాని తీవ్రత వంటి అంశాలను ప్రస్తావిస్తేనే వాటిని ప్రభావవంతమైన అంచనాలుగా పరిగణించాలని యూఎస్‌జీఎస్ పేర్కొంది.
కానీ, డిమిత్రక్ అంచనాల కాలక్రమం మారుతూనే ఉంది.
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు లేదా తర్వాత భూకంపం సంభవిస్తుందని డిమిత్రక్ అంచనా వేశారు.
ఆ తర్వాత, 2030కి ముందే ఈ భూకంపం సంభవించడం అనివార్యమని మళ్లీ చెప్పారు.
''ఇది యాదృచ్ఛికమో లేదా అదృష్టవశాత్తు జరిగే సంఘటన కాదు'' అని బీబీసీతో డిమిత్రక్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP

భూకంపం ఎప్పుడు వస్తుందో ఊహించలేనంత మాత్రాన, దానికి సిద్ధంగా ఉండకూడదని కాదని, ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
ప్రతీ ఏటా అక్టోబర్ మూడో గురువారం రోజున అమెరికాలో జరిగే 'ది గ్రేట్ షేక్ అవుట్' అని పిలిచే ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప భద్రతా డ్రిల్‌లో లక్షలాది మంది పాల్గొంటారు.
డాక్టర్ జోన్స్ సభ్యురాలిగా ఉన్న బృందమే ఈ డ్రిల్‌ను అభివృద్ధి చేసింది.
ఒకవేళ భూకంపం సమయంలో మీరు బయట ఉన్నట్లయితే చెట్లు, భవనాలు, విద్యుత్ లైన్లు లేని బహిరంగ ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు.
సునామీ వచ్చే అవకాశం ఉన్నందున, తీరానికి సమీపంలోని ప్రజలు ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత వీలైనంత త్వరగా, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.
వెస్ట్ కోస్ట్ నివాసితులు ఈ కసరత్తులతో పాటు, యూఎస్‌జీఎస్ పంపే 'షేక్ అలర్ట్' అనే హెచ్చరిక వ్యవస్థను అనుసరిస్తారు.
భూకంపాలకు కారణమయ్యే కంపనాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. భవిష్యత్తులో భూకంపం ఎప్పుడు వస్తుందో ఇది అంచనా వేయలేకపోయినా, ప్రాణాలను కాపాడుకునేలా కొన్ని సెకన్ల ముందే ఇది ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఇప్పటివరకు కనుక్కున్న 'ప్రిడిక్టర్'కి ఈ వ్యవస్థ దగ్గరగా ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














