బంగ్లాదేశ్: హిందువులపై దాడులు, మొహమ్మద్ ప్రవక్తపై సోషల్ మీడియా పోస్టులే కారణమా?

ఫొటో సోర్స్, SHARIER MIM
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పుర్ జిల్లాలో మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర పోస్టులు చేశారనే ఆరోపణలతో అనేక హిందూ కుటుంబాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులు చేశారు.
ఈ ఘటన జరిగిన తర్వాత చాలా మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లారు.
బాధితులకు భద్రత కల్పించామని, ఆ ప్రాంతంలోని 22 హిందూ కుటుంబాలలో 19 కుటుంబాలు ఇప్పటికీ తమ ఇళ్లలోనే ఉన్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
దాడిలో దెబ్బతిన్న ఇళ్లను మరమ్మతు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ సంఘటన శనివారం రాత్రి, ఆదివారం గంగాచడా ఉపజిల్లాలోని అల్దాద్‌పూర్ బలపడలో జరిగింది.
అభ్యంతరకర పోస్టుకు సంబంధించి పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని జైలుకు పంపారు.
నిందితుడిపై సైబర్ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు.
అయితే ఇప్పటివరకు ఇళ్లపై దాడులకు పాల్పడినవారిని గుర్తించడం కానీ, ఎఫ్ఐఆర్ నమోదు కానీ జరగలేదు.
జిల్లా పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ అలం మంగళవారం ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
షఫీకుల్ ఆలం జిల్లా చీఫ్ మహ్మద్ రబియుల్ ఫైసల్‌ను ఉటంకిస్తూ 22 హిందూ కుటుంబాలలో 19 కుటుంబాలు వారి ఇళ్లలోనే ఉన్నాయని, నిందితుడు, ఆయన మామ కుటుంబం సహా మూడు కుటుంబాలు వారి బంధువుల వద్ద ఆశ్రయం పొందాయన్నారు.
దెబ్బతిన్న ఇళ్లను ప్రభుత్వం మరమ్మతు చేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ప్రెస్ సెక్రటరీ తెలిపారు.


రంగ్‌పుర్ పోలీసు సూపరింటెండెంట్ ఏం చెప్పారు?
"ఈ దాడిలో మొత్తం 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 22 కుటుంబాలు నివాసం ఉండేవి. ప్రస్తుతం నిందితుడి కుటుంబం సహా మూడు కుటుంబాలు ఇక్కడ ఉండడం లేదు.మిగతా కుటుంబాలన్నీ తమ ఇళ్లలోనే నివసిస్తున్నాయి. ఇళ్ల మరమ్మతులు పూర్తయిన తర్వాత మిగిలిన కుటుంబాలు కూడా తిరిగి వస్తాయి" అని రంగ్‌పుర్ పోలీస్ సూపరింటెండెంట్ మహ్మద్ అబూ సయీమ్ మంగళవారం విలేకరులతో అన్నారు.
నిందితులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కానీ స్థానికులు ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు. అరెస్ట్ సంగతి పక్కన పెడితే, దాడికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని వారు అంటున్నారు.
గంగాచడా పోలీస్ స్టేషన్ అధికారి (ఓసీ) మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, "దాడి చేసిన వ్యక్తులు పొరుగున ఉన్న జిల్లా నుంచి వచ్చారు. వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు బాధిత కుటుంబాలతో సంప్రదిస్తున్నారు. వారి నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు అందితే, కేసు నమోదు చేస్తాం"అన్నారు.
దెబ్బతిన్న ఇళ్లను మరమ్మతు చేయడానికి బాధిత కుటుంబాలకు , వెదురు, కలపతో పాటు తాపీ మేస్త్రీలను ప్రభుత్వం పంపింది. అధికారులు ఘటనా స్థలంలో ఉండి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా దాడిని నిరసిస్తూ జహంగీర్‌నగర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

ఫొటో సోర్స్, SHARIER MIM
లౌడ్ స్పీకర్లలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన తర్వాత కొన్ని ఇళ్లపై దాడి జరిగిందని గంగాచడా సబ్‌డివిజన్ కార్యనిర్వాహక అధికారి మొహమూద్ హసన్ బీబీసీతో అన్నారు.
ఆ తరువాత సైన్యం, పోలీసు సిబ్బంది అక్కడ మోహరించారు.
సోమవారం నుంచి ఈ ప్రాంతంలో పరిస్థితి చాలా వరకు సాధారణ స్థితికి వచ్చిందని, అయితే ఇళ్లపై దాడి, విధ్వంసం, దోపిడీ సంఘటనల తర్వాత హిందూ సమాజంలో ఇప్పటికీ భయం ఉందని స్థానికులు చెబుతున్నారని గంగాచడా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మహ్మద్ అల్ ఇమ్రాన్ తెలిపారు.
నీల్ఫమారి జిల్లాకు చెందిన కిషోర్ సబ్‌డివిజన్ ఈ ప్రాంతానికి ఆనుకుని ఉంది. అక్కడి నుంచి కొంతమంది ఊరేగింపుగా చేరుకుని, లౌడ్ స్పీకర్లలో ప్రచారం చేసి, ఆపై దాడి చేశారని అధికారులు, స్థానికులు చెబుతున్నారు.
"మొదట్లో పోలీసులు దాడి చేసిన వారిని నియంత్రించలేకపోయారు" అని పంచాయతీకి చెందిన అమీర్ షా అలం అన్నారు.

ఫొటో సోర్స్, shairier mim
ఇప్పటిదాకా ఏం జరిగింది?
మొహమ్మద్ ప్రవక్తపై ఫేస్‌బుక్‌లో వ్యంగ్యపూరిత పోస్ట్ చేసినట్లు ఓ స్థానికుడిపై ఆరోపణలు వచ్చాయని, ఆ తర్వాత ఈ విషయం పోలీసులు, ప్రభుత్వ దృష్టికి వచ్చిందని గంగాచడా సబ్‌డివిజన్ అధికారి తెలిపారు.
"శనివారం, పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఈ విషయం గురించి నాకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదే రోజు అదుపులోకి తీసుకున్నాం. అయినప్పటికీ, ఆ రాత్రి ఒక గుంపు హల్‌చల్ చేస్తూనే ఉంది. ఆ రోజున మేం చర్చల ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాం. కానీ ఆదివారం, రెండు-మూడు వేల మంది ప్రజలు దాదాపు 15 ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు" అన్నారు.
అవమానకరమైన పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ ఐడీ ధృవీకరించిన పేజీ కాదని సంఘటనా స్థలానికి చేరుకున్న జర్నలిస్టులు చెప్పారు.
" అరెస్ట్ అయిన యువకుడే ఆ పోస్టు చేసిన వ్యక్తా కాదా అనేది ఇంకా నిర్ధరించలేదు. కానీ ప్రవక్తను అవమానించారని ఆరోపిస్తూ లౌడ్ స్పీకర్ల ద్వారా ఒక గుంపు గుమిగూడింది. గంగాచడా పక్కనే ఉన్న ఉప జిల్లాకు చెందిన ఒక గుంపే ఈ పని చేసింది" అని ఒక జర్నలిస్ట్ అన్నారు.
"ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు తాను ఎలాంటి పోస్టు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు. కానీ ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకుని, మేం ఆయన్ని పోలీసులకు అప్పగించాం. అయినప్పటికీ, కొంతమంది ఊరేగింపుగా వచ్చి 15-16 ఇళ్లపై దాడి చేసి, ధ్వంసం చేసి, దోచుకున్నారు" అని ఆ ప్రాంత నివాసి దిలీప్ రాయ్ బీబీసీతో అన్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి మహ్మద్ అల్ ఇమ్రాన్ మాట్లాడుతూ "ఆ యువకుడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాతే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆ ప్రాంతంలో సైన్యాన్ని మోహరించిన తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సైన్యం, పోలీసు సిబ్బంది ఇప్పటికీ సంఘటన స్థలంలో మోహరించారు"
"ఆ దాడి చేసిన వారిని ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. హింస పెరగకూడదని మేం కోరుకోవడంతో ప్రతిదాడులు చేయలేదు. కానీ పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదు. మేం భయంతో జీవిస్తున్నాం" అని ఆ ప్రాంత నివాసి దిలీప్ రాయ్ అన్నారు.
ఈ సంఘటన జరిగిన ప్రాంతం పంచాయతీలోని ఒక వార్డు అని స్థానికులు చెబుతున్నారు. గత ఓటర్ల జాబితా ప్రకారం అక్కడ 2500 కంటే ఎక్కువ మంది హిందూ ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని హిందూ మెజారిటీగా పరిగణిస్తారు.
"ఈ ప్రాంతంలో సైన్యం, పోలీసులు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది హిందువులు కూడా మాకు మద్దతుగా ఇక్కడికి వచ్చారు. దాడి చేసిన వారు ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా సమీపంలోని చెరకు తోటలను కూడా దెబ్బతీశారు" అని స్థానికుడు అరవింద్ రాయ్ అన్నారు.
స్థానిక ప్రజలు, ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం, శనివారం రాత్రి ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్ట్ చేసినందుకు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ, అదే రాత్రి ఒక గుంపు ఆ యువకుడి ఇంటి దగ్గర నినాదాలు చేయడం ప్రారంభించింది. తరువాత ఆయన ఇంటిపై దాడి చేసింది.
సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆదివారం మధ్యాహ్నం, ఆ గుంపు అక్కడికి చేరుకుని మళ్లీ దాడి చేసిందని, ఆ తర్వాత దోపిడీ కూడా మొదలైందని అధికారులు చెబుతున్నారు.
ఈ సమయంలో పోలీసులకు, దాడి చేసిన వారికి మధ్య ఘర్షణ జరిగిందని, ఇందులో చాలా మంది పోలీసులు గాయపడ్డారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. దీని తరువాత, సైన్యం సంఘటనా స్థలానికి చేరుకునేలోపు జనం అక్కడినుంచి వెళ్లిపోయారని ఆయన చెప్పారు.
"గత రెండు,మూడు రోజులుగా ఈ ప్రాంతంలో భయాందోళనలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్లు సామాన్య ప్రజలు. మేం వారిని ఒప్పించడానికి ప్రయత్నించాం. కానీ అకస్మాత్తుగా వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. చాలా ఇళ్లపై దాడి జరిగింది, కానీ ఇప్పుడు పరిస్థితి సాధారణంగా ఉంది. ఇకపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఆశిస్తున్నా" అని పంచాయతీకి చెందిన అమీర్ షా ఆలం అన్నారు.
పంచాయతీ అధ్యక్షుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడు మహ్మద్ షాహిదుల్ ఇస్లాం ఇలా అన్నారు.
"మతాన్ని అవమానించాడని ఆరోపించిన యువకుడిని వెంటనే అరెస్ట్ చేశారు. అయినప్పటికీ, కొంతమంది హిందూ ప్రాంతంలోకి ప్రవేశించి ఇళ్లపై దాడి చేశారు. ఆదివారం ఆర్మీ సిబ్బంది వెళ్లిపోయినప్పుడు, కొంతమంది మళ్లీ దాడి చేశారు. ఇప్పుడు పోలీసులు, సైన్యం మళ్లీ మోహరించారు. ఇక పరిస్థితి అదుపులో ఉంటుందని ఆశిస్తున్నాం."

ఫొటో సోర్స్, SHARIER MIM
ఈ విషయంపై రాజధాని ఢాకాలో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులతో బీబీసీ మాట్లాడింది.
ఎన్‌టీవీలో పనిచేస్తున్న తపు మజుందార్ ఫోన్‌లో మాట్లాడుతూ "ఇది కొత్త సంఘటన కాదు. గతంలో బంగ్లాదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగేవి, కానీ గత సంవత్సరం అవి పెరిగాయి. దాడి చేయాలనుకునే వారికి ఒక సాకు కావాలి" అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ఆర్. అహ్మద్ (పేరు మార్చాం) మాట్లాడుతూ "మసీదులోని లౌడ్ స్పీకర్ ద్వారా ప్రజలను దాడికి ప్రేరేపించారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలోని హిందూ కుటుంబాలలో భయాందోళనలు నెలకొన్నాయి. చాలా మంది ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోయారు. జిల్లా యంత్రాంగం కచ్చితంగా ప్రజలకు సహాయం చేస్తోంది. కానీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు" అని అన్నారు.
హిందువుల భూమిని ఆక్రమించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు సాధారణంగా జరుగుతాయని ఆయన అంటున్నారు. ఈ కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టి వారి భూమిని, ఇళ్లను ఆక్రమించడమే వారి లక్ష్యమని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














