ఛాంగుర్ బాబా ఎవరు? ఒకప్పుడు భిక్షాటన చేసి, రంగురాళ్లు విక్రయించిన వ్యక్తిపై ఈడీ ఎందుకు కేసు పెట్టింది? మత మార్పిళ్లపై ఆయన మీదున్న అనుమానాలేంటి?

ఛాంగుర్ బాబా

ఫొటో సోర్స్, Uttar Pradesh Police

ఫొటో క్యాప్షన్, ఛాంగుర్ బాబా
    • రచయిత, సయ్యద్ మోజిజ్ ఇమామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఛాంగుర్ బాబా ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

జమాలుద్దీన్ అలియాస్ ఛాంగుర్ బాబా మతమార్పిళ్లకు పాల్పడుతున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఈ కేసులో ఇటీవల ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం, నేపాల్ సరిహద్దుల్లోని బలరాంపూర్ జిల్లాలో ఉన్న ఆయన ఇంటిని ప్రభుత్వం బుల్డోజర్‌తో కూల్చివేసింది.

తన అనుచరుల పేరుమీద ఉన్న ఆ ఇంట్లో ఛాంగుర్ బాబా కుటుంబం నివసించేది.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ విషయంపై పలుమార్లు ప్రకటనలు చేశారు.

సీఎం మాట్లాడుతూ.. ''మన ఆడబిడ్డల(కూతుళ్లు, సోదరీమణులు) గౌరవానికి, భద్రతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిందితులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు మాత్రమే కాదు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది'' అని అన్నారు.

అయితే, ఛాంగుర్ బాబాపై వచ్చిన ఆరోపణల గురించి బాబాతో పాటు ఆయన అనుచరుడి తరఫున వాదిస్తున్న న్యాయవాది మొహమ్మద్ ఆమిర్ మాట్లాడుతూ, ''ఈ విషయం ఇప్పుడు కోర్టులో ఉంది, అందువల్ల ఏం చెప్పదలుచుకున్నా కోర్టులో చెబుతాం. చట్టాలకు లోబడి, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను మేం కాపాడుకుంటాం. ఆరోపణల విషయానికొస్తే.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది'' అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఛాంగుర్ బాబాపై ఆరోపణలు, చర్యలు

ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) గతవారం ఛాంగుర్ బాబాను అరెస్టు చేసింది.

ఛాంగుర్ బాబా మతమార్పిడి రాకెట్ నడుపుతున్నట్లు ఏటీఎస్ ప్రధానంగా ఆరోపించింది. ఇంకా దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.

ఛాంగుర్ బాబా అనుచరుడి ఇంటి కూల్చివేతపై బలరాంపూర్ జిల్లా కలెక్టర్ పవన్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ''ఈ భవనం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినట్లు తేలింది. అందువల్ల చర్యలు చేపట్టాం. మరిన్ని దస్తావేజులు పరిశీలిస్తున్నాం'' అని అన్నారు.

బలరాంపూర్‌లోని ఉతరౌలాలో కూల్చివేతకు గురైన ఈ భవనం ముంబయిలో నివసించే నీతూ రోహ్రా పేరుమీద ఉంది. జులై 5న నీతూ రోహ్రాను పోలీసులు అరెస్టు చేశారు.

ఛాంగుర్ బాబాకు నీతూ రోహ్రా సన్నిహితురాలని చెబుతున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నీతూ రోహ్రా అలియాస్ నస్రీన్ ఛాంగుర్ బాబాకు శిష్యురాలిగా మారిన తర్వాత ఇస్లాంలోకి మారారు.

ఉత్తరప్రదేశ్, మతం, హిందూ, ఇస్లాం, యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, wajid hussain

ఎవరీ ఛాంగుర్ బాబా

బలరాంపూర్ జిల్లా ఉతరౌలా తాలూకాలోని రెహ్రా మాఫీ గ్రామంలో పుట్టారు, అక్కడే నివసిస్తున్నారు.

బాబాకు మరో ముగ్గురు సోదరులు ఉన్నారు, వారు కూడా అదే గ్రామంలో ఉంటున్నారు.

అన్నదమ్ముల్లో పెద్దవాడైన ఛాంగుర్ బాబా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది.

ప్రస్తుత గ్రామ సర్పంచ్ మన్షారామ్ యాదవ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఛాంగుర్ బాబా చాలా ఏళ్లపాటు భిక్షాటన చేశారు. ఆయన సోదరుల్లో ఒకరు ఇప్పటికీ భిక్షాటన చేస్తున్నారు.

ఆ తరువాత ఛాంగుర్ బాబా సైకిల్‌పై తిరుగుతూ రంగురాళ్లు, ఉంగరాలు అమ్మేవారని గ్రామస్థులు చెబుతున్నారు.

ఎన్నో ఏళ్లు అదే పనిచేసిన బాబా ఆ తర్వాత ముంబయి వెళ్లొచ్చాక తనను తాను మతగురువుగా ప్రకటించుకున్నారు.

అలాగే ఛాంగుర్ బాబా 2005-2010, 2015-2020 మధ్య రెండుసార్లు గ్రామ సర్పంచ్‌ కూడా పనిచేశారు.

పట్టణంలోని చాంద్ ఔలియా దర్గా సమీపంలో ఒక ప్రార్థనా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన శిష్యులు తరచూ అక్కడికి వచ్చి వెళ్తుండేవారు.

2020 తర్వాత బాబా కారు కొన్నారని సర్పంచ్ మన్షారామ్ యాదవ్ చెబుతున్నారు.

ప్రస్తుతం కూల్చివేతకు గురైన ఇంటి నిర్మాణ సమయంలో ఛాంగుర్ బాబాకు వసీయుద్దీన్ అలియాస్ బబ్బుకి మధ్య వివాదం తలెత్తింది.

ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం ముదిరి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

స్థానికుడు అమన్ రిజ్వి చెప్పిన వివరాల ప్రకారం, ''ఛాంగుర్ బాబా అనుచరుల్లో ఒకరైన బబ్బు చౌదరి ఏడాది కిందట ఆయనపై అక్రమ మతమార్పిళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత, ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ చాలా సంస్థలు డిమాండ్ చేశాయి''

ఛాంగుర్ బాబా స్థానిక పోలీస్ స్టేషన్‌లో బబ్బుపై ఫిర్యాదు చేశారు. బబ్బు కూడా బాబాపై ఫిర్యాదు చేశారు. ఈ కేసు గురించి బబ్బుని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, అందుబాటులోకి రాలేదు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఛాంగుర్ బాబాపై కేసు నమోదు చేసింది. ఛాంగుర్ బాబాకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఈడీ ఆరా తీస్తోంది.

ఉత్తరప్రదేశ్, మతం, హిందూ, ఇస్లాం, యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, uppolice.gov.in

ఫొటో క్యాప్షన్, యూపీ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) అమితాబ్ యష్

ఏటీఎస్ ఏమంటోంది?

ఛాంగుర్ బాబాపై ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది.

యూపీ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) అమితాబ్ యష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ''ఇదో పెద్ద మతమార్పిడి రాకెట్(కన్వర్షన్ రాకెట్). ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది'' అన్నారు.

ఛాంగుర్ బాబా ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేస్తున్నప్పుడు, ఆయన కోడలు సబీరా మెహబూబ్ మాత్రమే అక్కడ ఉన్నారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ, ''నెల రోజులుగాఇంటిచుట్టూ పోలీసులను మోహరించారు. చిన్నపిల్లలు భయపడుతున్నారు. ఇంట్లో సీసీ కెమెరాలను కూడా పోలీసులు పగలగొట్టారు'' అని అన్నారు.

ఇప్పటికే సబీరా భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు గ్రామస్థులు పెద్దగా ముందుకురావడం లేదు.

ఉతరౌలాకు చెందిన జర్నలిస్ట్ వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ''ఛాంగుర్ బాబాకి ప్రముఖులతో పరిచయాలున్నాయి. రెహ్రా మాఫీ గ్రామానికి రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఉతరౌలా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసేవారు, అందువల్ల ఆయనకు చాలా మందితో పరిచయాలున్నాయి'' అన్నారు.

ఉత్తరప్రదేశ్, మతం, హిందూ, ఇస్లాం, యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, ANI

ఛాంగుర్ బాబాపై మతమార్పిళ్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయని ఏటీఎస్ తెలిపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆజంగఢ్‌లోని దేవ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లోనూ ఛాంగుర్ బాబా అనుచరులు, బంధువులపై అక్రమ మతమార్పిడి కేసు నమోదైంది.

రెహ్రా మాఫీ గ్రామానికి చెందిన పూల్ చంద్ర పాండే విలేఖరులతో మాట్లాడుతూ, ''కొన్నేళ్ల కిందట.. ఆయన ఉంగరాలు, రంగురాళ్లు అమ్మేవారు. తర్వాత గ్రామానికి సర్పంచ్ అయ్యారు. అంత డబ్బు ఎలా వచ్చిందో తెలీదు. అది ఆయనే చెప్పాలి. కానీ, గ్రామంలో అనుమానాస్పదంగా ఎలాంటి కార్యకలాపాలు చూడలేదు'' అని అన్నారు.

''ఈ ముఠా సభ్యులు వారి పేర్లు, వివిధ సంస్థల పేర్లతో 40కి పైగా బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. ఆ అకౌంట్ల ద్వారా దాదాపు రూ.100 కోట్ల లావాదేవీలు జరిగాయి'' అని ఏడీజీ అమితాబ్ చెప్పారు.

అయితే, పూల్ చంద్ర పాండే మాట్లాడుతూ ''తరచూ కలుస్తూనే ఉండేవాళ్లం. ఎక్కడా మతమార్పిడికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనిపించలేదు. మరి బయట ఎక్కడైనా చేసేవారేమో తెలీదు'' అన్నారు.

రంగురాళ్లు, ఉంగరాల వ్యాపారం కోసం ఛాంగుర్ బాబా తరచూ ముంబయి వెళ్లొస్తుండేవారని గ్రామస్థులు అంటున్నారు.

ముంబయిలో ఛాంగుర్ బాబాకి నవీన్ రోహ్రా అలియాస్ జమాలుద్దీన్, ఆయన భార్య నీతూ రోహ్రా అలియాస్ నస్రీన్‌తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.

నవీన్ తన కుటుంబం సహా ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత, ఆయన కుటుంబం ఉతరౌలాకు మారింది. అక్కడ ఆస్పత్రి నిర్మిస్తోంది.

జులై 5న, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఛాంగుర్ బాబాతో పాటు సహనిందితురాలు నీతూ రోహ్రా అలియాస్ నస్రీన్‌ను అరెస్టు చేశారు.

విదేశాల నుంచి వచ్చిన నిధుల ద్వారా నిందితులు కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది.

దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ''శాంతిభద్రతల విషయంలో యూపీ ప్రభుత్వం రాజీపడదు. నిందితుల ఆస్తులతో పాటు వారి ముఠాతో సంబంధమున్న నేరస్తుల ఆస్తులను కూడా జప్తు చేస్తుంది. చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి'' అని అన్నారు.

ఏప్రిల్ 8న బాబా కుమారుడు మెహబూబ్, ఆయన అనుచరుడు నవీన్ రోహ్రాను పోలీసులు అరెస్టు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)