కొల్హాపూర్ - ప్రాడా: ఇండియా చెప్పులను ఇటలీ సంస్థ కాపీ కొట్టిందా?

మహారాష్ట్ర, కొల్హాపూర్ చెప్పులు, ప్రాడా
    • రచయిత, దేవినా గుప్తా
    • హోదా, బీబీసీ న్యూస్

లగ్జరీ ఫ్యాషన్ సంస్థ 'ప్రాడా' తమకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా, తమ చెప్పుల డిజైన్లను వాడుకోవడంపై సంప్రదాయంగా ఆ తోలు చెప్పులను తయారుచేస్తున్న వేలాదిమంది చేతివృత్తి కళాకారుల ఆందోళనతో మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

మసకమసకగా ఉన్న దుకాణంలో, 58 ఏళ్ల సదాశివ్ సనాకే చేతిలో నుంచి లయబద్దంగా పడుతున్న సుత్తి దెబ్బ.. కొల్హాపురి తోలు చెప్పుల తయారీ వెనకున్న కఠిన శ్రమను సూచిస్తుంది.

''చిన్నప్పుడే ఈ పని నేర్చుకున్నా'' అని ఆయన బీబీసీతో చెప్పారు. ఒక రోజులో 8 నుంచి 10 జతలు చేయొచ్చని, అందుకు సుమారు 700 రూపాయల నుంచి 900 రూపాయల వరకూ గిట్టుబాటు అవుతుందని ఆయన అన్నారు.

దుర్భరమైన పని వాతావరణం మధ్య, అతి తక్కువ జీతాలతో ఎలాగోలా నెట్టుకొస్తూ, ఈ యాంత్రిక ప్రపంచంతో పోటీపడేందుకు ప్రయత్నిస్తున్న కొల్హాపూర్‌లోని ఈ కుటీర పరిశ్రమలో.. ప్రస్తుతం సుమారు 5000 మంది మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు.

ఇటీవల, ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ అయిన ప్రాడా సంస్థ కొల్హాపురీ చెప్పుల స్టైల్‌లో ఉన్న చెప్పులను విడుదల చేసింది. అయితే, ఆ డిజైన్ల మూలాలను సంస్థ పేర్కొనకపోవడంపై స్థానిక కళాకారుల నుంచి ఆందోళన వ్యక్తమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మహారాష్ట్ర, కొల్హాపూర్ చెప్పులు, ప్రాడా

ఫొటో సోర్స్, Reuters

ప్రాడా చెప్పులకు వ్యతిరేకంగా, తక్కువ సమయంలోనే అనూహ్య స్పందన వచ్చింది. సాంస్కృతిక మూలాల గురించి సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీంతో చెప్పుల డిజైన్ల మూలాలను అంగీకరిస్తూ ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

దీంతో ఈ కళను, తమ సాంస్కృతిక వారసత్వ గుర్తింపును కోరుకుంటున్న కళాకారులకు ఇప్పుడు స్థానిక రాజకీయ నాయకులు, పారిశ్రామిక సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి.

బీబీసీ వీడియో చూపించే వరకు ప్రాడా విడుదల చేసిన చెప్పుల గురించి సనాకేకి తెలియదు. ఖరీదైన మార్కెట్లలో ఈ చెప్పులను వందల పౌండ్లకు (వేల రూపాయలు) అమ్ముతున్నట్లు చెప్పినప్పుడు, ఆయన నవ్వారు. ''బంగారంతో చేశారా ఏంటి?'' అని ఆయన అన్నారు.

ప్రాడా వీటి ధరను వెల్లడించలేదు కానీ, ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఇతర చెప్పుల ధర యూకేలో 600 పౌండ్లు (సుమారు రూ.70 వేలు) నుంచి 1000 పౌండ్లు (లక్షా 16 వేలు) వరకు ఉన్నాయి.

మహారాష్ట్ర, కొల్హాపూర్ చెప్పులు, ప్రాడా

కొల్హాపూర్ చెప్పుల చరిత్ర 12వ శతాబ్దం నాటిది.

''మొదట్లో ఈ చెప్పులను అణగారిన వర్గాలైన చర్మకార్ (కోబ్లర్) వర్గానికి చెందిన వారు తయారుచేసేవాళ్లు, వీరిని చమార్లు అని కూడా పిలుస్తారు'' అని కొల్హాపూర్‌లోని న్యూ కాలేజీకి చెందిన చరిత్ర ప్రొఫెసర్ కవితా గగ్రానీ తెలిపారు.

''అయితే, 20వ శతాబ్దంలో, అప్పటి కొల్హాపూర్ పాలకుడు ఛత్రపతి షాహు మహరాజ్ వీరికి ప్రోత్సాహాన్ని అందించారు, ఆ తర్వాత ఈ చేతివృత్తులు వృద్ధి చెందాయి'' అని ఆమె చెప్పారు.

ప్రస్తుతం, దేశవ్యాప్తంగా సుమారు 100000 మంది , దాదాపు 1700 కోట్ల రూపాయల విలువైనఈ పరిశ్రమలో నిమగ్నమై ఉన్నారని మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్(ఎంసీసీఐఏ) తెలిపింది.

అయితే, వారిలో చాలా మంది ఇప్పటికీ అసంఘటిత రంగంలో, దుర్భర పరిస్థితుల మధ్య తమ వృత్తిని కొనసాగిస్తున్నారు.

''నేను చదువుకోలేదు. నాకు తెలిసిందిదే. ఆర్డర్లు వచ్చే దాన్ని బట్టి రోజుకి రూ.350 నుంచి రూ.450 వరకూ వస్తుంది'' అని 60 ఏళ్ల సునీతా సత్పుటే అన్నారు.

సునీత వంటి మహిళలది కూడా కీలకపాత్ర, మరీముఖ్యంగా చేతితో చక్కటి నమూనాలు చెక్కడంలో. కానీ, తమ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కదని ఆమె అంటున్నారు.

అందుకే సునీత పిల్లలు ఈ చేతివృత్తిని కొనసాగించేందుకు ఇష్టపడడంలేదు.

ఈమె వర్క్‌షాప్‌కు కొద్దిదూరంలోనే కొల్హాపూర్‌లో ప్రసిద్ధి చెందిన చెప్పుల దుకాణాల వీధి ఉంది, ఇక్కడి దుకాణాల్లో చాలావరకూ అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి.

''తోలు రేటు పెరిగిపోయింది, దీంతో ఖర్చులు పెరిగిపోయాయి'' అని అక్కడి దుకాణదారుల్లో ఒకరైన అనిల్ అన్నారు.

సంప్రదాయకంగా, ఈ చెప్పుల తయారీకి ఆవు, గేదెల చర్మంపై ఆధారపడేవారు. అయితే, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం గోవధ, గొడ్డుమాంసం విక్రయాలపై నిషేధం విధించింది. దీంతో చేతివృత్తుల వారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గేదె చర్మంపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో వారి ఉత్పత్తి వ్యయం పెరిగింది.

అలాగే, మార్కెట్‌ను ముంచెత్తుతున్న కొల్హాపురీ స్టైల్ సింథటిక్ చెప్పులతోనూ పోటీ ఉంది.

మహారాష్ట్ర, కొల్హాపూర్ చెప్పులు, ప్రాడా

అయితే, ఇప్పుడు తలెత్తిన వివాదం కళాకారుల హక్కులను రక్షించేందుకు మెరుగైన వ్యవస్థ రూపకల్పన అవసరాన్ని ఎత్తిచూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2019లో భారత ప్రభుత్వం కొల్హాపురీ చెప్పులకు జియోగ్రఫికల్ ఇండికేషన్(జీఐ) గుర్తింపు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇతరులెవరూ వీటి పేరును కానీ, ఈ డిజైన్లను కానీ అనధికారికంగా వినియోగించడాన్ని ఇది నిషేధిస్తుంది.

అయితే, ఇతర దేశాలకు చెందిన బ్రాండ్‌లను కాపీ కొట్టడాన్ని నిరోధించేందుకు అంతర్జాతీయంగా పెద్దగా అడ్డంకులు లేవు.

ముంబయికి చెందిన న్యాయవాది ఐశ్యర్య సందీప్ మాట్లాడుతూ, ట్రేడ్ రిలేటెడ్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (TRIPS) ఒప్పందం ప్రకారం.. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎదుట భారత్ ఈ సమస్యను లేవనెత్తవచ్చని అన్నారు. ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసి ఉంది.

అయితే, ఈ వ్యవస్థలో నెలకొన్న సంక్లిష్టతల కారణంగా భారత్‌లోనూ, ఇతర దేశాల్లోనూ ఇది పెద్దగా అమలు కావడం లేదని ఆమె అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన చట్టపరమైన వ్యవస్థ కోసం, కొల్హాపురి చెప్పుల డిజైన్‌కు పేటెంట్ హక్కులు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎంసీసీఐఏ అధ్యక్షులు లలిత్ గాంధీ తెలిపారు.

అయితే, మన వారసత్వ సంప్రదాయాన్ని మరోకోణంలో చూడడం ప్రారంభించినప్పుడే దేశంలో నిజమైన మార్పు వస్తుందని కొందరు అంటున్నారు.

''కో బ్రాండింగ్, రాయల్టీ షేరింగ్ కోసం భారత్ ఒత్తిడి చేయాలి. మన సంస్కృతి సంప్రదాయాలను మనమెంత గొప్పగా చూస్తే, అంతే తక్కువ దోపిడీకి గురవుతాం'' అని ప్రముఖ డిజైనర్ రీతూ బేరి అన్నారు.

మహారాష్ట్ర, కొల్హాపూర్ చెప్పులు, ప్రాడా

అయితే, కొల్హాపురి చెప్పులను ప్రాడా అనుకరించడం కళాకారులకు కూడా ప్రయోజనకరమేనని గాంధీ అంటున్నారు.

''వారి బ్రాండ్ కింద, కొల్హాపురి చెప్పుల విలువ అనేక రెట్లు పెరుగుతుంది'' అని ఆయన అన్నారు. అయితే, ''వారికొచ్చే లాభంలో కొంతవాటాను కళాకారుల అభివృద్ధి కోసం అందించాలని కోరుకుంటున్నాం.''

కొల్హాపూర్‌లోని చెప్పుల వ్యాపారి రోహిత్ బాలకృష్ణ గవాలి కూడా దీనిని అంగీకరిస్తున్నారు. ఇప్పటికే ఆ తేడా కనిపిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.

''ప్రాడా విడుదల చేసిన డిజైన్ అంత పాపులర్ మోడల్ ఏమీ కాదు, అయితే ఇప్పుడు జనం అలాంటి వాటినే అడుగుతున్నారు. దుబయ్, అమెరికా, ఖతార్ నుంచి కూడా కస్టమర్లు ఆర్డర్లు ఇస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

కొన్నిసార్లు వివాదం కూడా సాయపడుతుందని, అది ఈ కళను సజీవంగా ఉంచుతున్న వారికి గౌరవంతో పాటు మెరుగైన ధరలను అందించగలిగితే ఇంకా సంతోషమని ఆయన అన్నారు.

అయితే, ఈ సమస్య ఇప్పట్లో సమసిపోయేలా లేదు.

కళాకారులకు ప్రాడా సంస్థ నష్టపరిహారం చెల్లించాలని, అలాగే కళాకారుల సంఘాలకు.. ప్రాడా మధ్య కోర్టు పర్యవేక్షణలో అవగాహన కుదిరేలా చూడాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

ఈ విషయంలో ఎంసీసీఐఏతో చర్చలు జరుపుతున్నట్లు ప్రాడా సంస్థ బీబీసీకి ఒక ప్రకటనలో తెలిపింది.

వచ్చేవారం ఇరుపక్షాల మధ్య సమావేశం జరగనున్నట్లు ఎంసీసీఐఏ అధ్యక్షులు గాంధీ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)