క్లైమేట్ వీసా: దేశం మునిగిపోతోందని ప్రజలు వీసా కోసం పోటీ పడుతున్నారు..

తువాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నారితో తువాలు మహిళ ( ఫైల్ ఫోటో)
    • రచయిత, తాబీ విల్సన్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలోనే మొట్టమొదటి క్లైమేట్ వీసా కోసం తువాలు దేశపు జనాభాలో మూడో వంతు ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నారు.

ఈ వీసా ఆస్ట్రేలియాకు శాశ్వతంగా వలసపోవడానికి అవకాశం కల్పిస్తుంది.

జూన్ 16న ప్రారంభమైన మొదటిదశకే పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, ఈ కార్యక్రమానికి భారీ డిమాండ్ ఉన్నట్టు సూచిస్తోంది.

అయితే తువాలు పౌరులకు ఏటా 280 వీసాలు మాత్రమే లాటరీ ద్వారా ఇస్తారు.

వాతావరణ మార్పుల కారణంగా నిరాశ్రయులయ్యేవారికి సాయపడేందుకు తీసుకువచ్చిన ఈ వీసా ప్రోగ్రామ్‌ను ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ ఒక మైలురాయిగా అభివర్ణించింది.

సముద్ర మట్టానికి కేవలం ఐదు మీటర్ల (16 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ చిన్న పసిఫిక్ ద్వీప సమూహం, వాతావరణ మార్పు ముప్పును ప్రపంచంలోనే అత్యధికంగా ఎదుర్కొంటున్న ప్రాంతంగా నిలిచింది.

జూన్ 27నాటికి క్లైమేట్ వీసా కోసం 1124 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుదారుల కుటుంబసభ్యులందరినీ కలుపుకుంటే మొత్తం 4052 మంది పౌరులని అంచనా.

2022 నాటికి ఈ ద్వీపంలో మొత్తం జనాభా 10,643 మంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తువాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా పౌరుల్లానే..

పసిఫిక్ ఎంగేజ్‌మెంట్ వీసా పొందినవారికి ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం (పర్మినెంట్ రెసిడెన్సీ) మంజూరు చేస్తారు.

ఈ వీసా ద్వారా ఆస్ట్రేలియాలో ప్రవేశించిన వెంటనే వారికి అక్కడ మెడికేర్ ఆరోగ్య సేవలు, పిల్లల సంరక్షణ రాయితీలు, అలాగే స్కూళ్లు, యూనివర్సిటీలలో, వృత్తిపరమైన శిక్షణా సంస్థలలో ఆస్ట్రేలియా పౌరులతొ సమానంగా రాయితీలతో కూడిన విద్యావకాశాలు లభిస్తాయి.

2025 వీసా బ్యాలెట్‌లో పేరు నమోదు చేసుకోవడానికి 25 అమెరికా డాలర్లు ( సుమారు రూ. 1400) చెల్లించాలి. ఈ ప్రక్రియ జూలై 18న ముగుస్తుంది.

ఈ కొత్త వీసా క్లాస్ ( పసిఫిక్ ఎంగేజ్‌మెంట్ వీసా)ని ఆస్ట్రేలియా–తువాలు మధ్య "ఫలెపిలి యూనియన్" అనే ఒప్పందంలో భాగంగా 2024 ఆగస్టులో ప్రకటించారు.

ఈ ఒప్పందం ప్రకారం తువాలు ద్వీపానికి ప్రకృతి విపత్తులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, లేదా సైనిక ముప్పులు ఎదురైతే, దాని భద్రత బాధ్యతను ఆస్ట్రేలియా తీసుకుంటుంది.

"వాతావరణ మార్పుల ప్రభావంతో సముద్ర మట్టం పెరిగినా, తువాలు భవిష్యత్తులో ఒక సార్వభౌమ దేశంగా కొనసాగుతుందని చట్టపరంగా అంగీకరించిన తొలి దేశం ఆస్ట్రేలియానే'' అని తువాలు ప్రధానమంత్రి ఫెలెటీ తియో గత ఏడాది ఒక ప్రకటనలో చెప్పారు.

2050 నాటికి తువాలు దేశంలో మెజారిటీ భూమి, ముఖ్యమైన నిర్మాణాలు సముద్రపు అలలకంటే దిగువగా ఉండిపోయే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)