నీళ్ల కోసం వెళ్తే మొసళ్ల దాడులు.. వీటిని ఇండోనేషియా ఎందుకు ఆపలేకపోతోంది?

ఫొటో సోర్స్, BBC / ANINDITA PRADANA
- రచయిత, రాజా లుంబన్రావు, అస్తుడెస్ట్రా అజెంగ్రాస్త్రి
- హోదా, బీబీసీ వరల్డ్ న్యూస్
ఇండోనేషియాలోని బంగ్కా ద్వీపంలో తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక నీటి గుంట నుంచి వాటర్ తెచ్చుకునేందుకు వెళ్లినప్పుడు, మూడు మీటర్ల పొడవున్న ఒక ఉప్పునీటి మొసలి అందులో ఉందని సరయాకు తెలియదు.
‘‘నీటిలో ఎలాంటి శబ్దం కానీ, అలికిడి కానీ వినిపించలేదు. మొసలి అందులో ఉందనే సంకేతమేదీ కూడా లేదు. నేను స్నానం చేయాలని కూడా అనుకున్నాను. కానీ, అకస్మాత్తుగా అదెక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నాపై దాడి చేసింది. నా ఎడమ చేతిని పట్టుకుని నీళ్లలోకి లాగేసింది’’ అని గత సెప్టెంబర్‌లో జరిగిన ఘటనను 54 ఏళ్ల సరయా గుర్తుకు చేసుకున్నారు.
ప్రపంచంలో ఉప్పునీటి మొసలి దాడులు అత్యధికంగా ఇండోనేషియాలో జరుగుతున్నాయి.
గత దశాబ్ద కాలంలో వెయ్యి వరకు ఇలాంటి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 450 మందికి పైగా మరణించారు.
బంగ్కా, దానికి పక్కనే ఉన్న బెలితుంగ్ ద్వీపంలో 90 వరకు ఈ దాడులు జరిగాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) తెలిపింది.
ప్రపంచంలో టిన్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో బంగ్కా ద్వీపం ఒకటి.
హవాయి పరిణామంలో ఉన్న ఈ ద్వీపంలో 10 లక్షల మంది నివసిస్తున్నారు.
వీరిలో 80 శాతం మంది మైనింగ్‌లో పాల్గొనేవారే.
ఈ ద్వీపంలో 60 శాతానికి పైగా ప్రాంతాన్ని, టిన్ మైన్లగా మార్చేశారని వన్యప్రాణి సంరక్షణ గ్రూప్ వాల్షి తెలిపింది.
ఈ మైన్లలో చాలా వరకు చట్టవిరుద్ధమైనవే.
దశాబ్దాలుగా సాగుతున్న టిన్ నిక్షేపాల దోపిడీ వల్ల ఈ ద్వీపంలోని అడవులు చాలా వరకు తరిగిపోయాయి.
చంద్ర బింబం ఆకారంలో ఉండే వేల గుంటలు ఈ దోపిడీ వల్ల ఏర్పడ్డాయి. భూ నిక్షేపాలు తగ్గడంతో, ఇప్పుడు మైనర్ల కన్ను సముద్రం పైన పడింది.
అంటే తాజా నీటిలో నివసించగలిగే ఉప్పు నీటి మొసళ్లు, వాటి సహజ ఆవాసాలకు దూరమై ప్రజల ఇళ్లకు దగ్గరగా ఉండే మైనింగ్ గుంటలలో నివసిస్తున్నాయి.
ఇలా, ఈ గుంటలలో నీటి కోసం వస్తున్న ప్రజలపై దాడులు చేస్తున్నాయి.
వాతావరణ మార్పులతో గత ఏడాది వేసవి కాలం ఎక్కువగా ఉండటంతో సరయా ఇంటి ముందున్న బావి ఎండిపోయింది.
మూడు నెలలుగా ఆమె చెల్లింపులు చేయకపోవడంతో వారి ఇంటికి నీటి సరఫరా కూడా ఆగిపోయింది.
దీంతో ఆమె నీటి కోసం ఆ గుంట వద్దకు వెళ్లాల్సి వచ్చింది.
ఆమె కుటుంబానికి, చాలా మంది ఇతరులకు ఈ నీటి గుంటలే ఏకైక నీటి వనరు.
సరయాపై దాడి జరిగిన ఐదు రోజుల తర్వాత, మరో నీటి గుంటలో టిన్ ఓర్‌ను శుభ్రం చేస్తున్న ఖనిజం తవ్వకందారు ఒకరిని మొసలి చంపినంత పని చేసింది.
మొసలి దాడిలో ఆయన తలకు, భుజానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఉప్పునీటి మొసళ్లు అతిపెద్ద సరీసృపాలు. మగ మొసళ్లు 7 మీటర్ల కంటే ఎక్కువ పొడవుగా కూడా పెరుగుతుంటాయి.
ప్రపంచవ్యాప్తంగా 20 వేల నుంచి 30 వేల ఉప్పునీటి మొసళ్లు ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇండోనేషియా కూడా ఒకటి.
అయితే ఇండోనేషియాలో ఎన్ని ఉప్పునీటి మొసళ్లు ఉంటాయన్న దానిపై అధికారిక అంచనాలు లేవు.
ఇండోనేషియాలో మొసళ్లను చంపడం చట్టవిరుద్ధం. వీటిని రక్షిత జీవులుగా పేర్కొంటున్నారు.
బంగ్కా ద్వీపంలో పరిస్థితి వేరు. దాడి తర్వాత, వాటిని స్థానిక పరిరక్షణ ఏజెన్సీకి అప్పగించకుండా ప్రజలు చంపేస్తున్నారు.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మొసలిని తరలించడం, ఆ గ్రామానికి అంత మంచిది కాదని చాలా మంది స్థానికుల నమ్మకం.

ఫొటో సోర్స్, BBC / ANINDITA PRADANA
స్థానికులు మొసళ్లను చంపకుండా కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఈ ద్వీపంలో ఉన్న ఒకే ఒక్క వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అలోబి నిర్వాహకులు ఎండి రియాడి చెప్పారు.
2014లో అలోబిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం మొసళ్లతో సహా ఎన్నో వన్యప్రాణులు జీవులున్నాయి.
వీటిలో స్మగ్లింగ్ కేసుల నుంచి అధికారులు జప్తు చేసిన జంతువులు, ప్రజల నుంచి రక్షించిన ప్రాణులు ఉన్నాయి.
అలోబి సంరక్షణ కేంద్రంలో ఆ వర్కర్లు కాపాడిన 34 మొసళ్లను, టెన్నిస్ కోర్టు సైజులో ఉన్న ఒక చెరువులో ఉంచారు.
ఇతర జీవులపై ఇవి దాడి చేయకుండా దీని చుట్టూ ఒక ఇనుప కంచెను నిర్మించారు.
రోజంతా కూడా ఈ మొసళ్లు ప్రశాంతంగా నీటిపై తేలియాడుతూ, పెద్ద రాళ్లలాగా కనిపిస్తుంటాయి.
కానీ, వాటికి ఆహారమిచ్చే సమయంలో మాత్రం, ఒక రేసు కనిపిస్తోంది. అలోబి స్టాఫ్ అందించే మాంసం ముక్కల కోసం అవి ఆ చెరువు అంచుకు పరిగెత్తుకు వస్తాయి.
తమ రెస్క్యూ సెంటర్‌లో ఇన్ని మొసళ్లను కాపాడటం ఖర్చుతో కూడుకున్న వ్యవహరమని రియాడి చెబుతున్నారు.
అలోబికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు అందడం లేదని, కేవలం విరాళాలపైనే ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు.
తక్కువ ఖర్చుతో వీటికి ఆహారం అందించడానికి తమ ప్రాంతంలో ఉన్న రైతుతో కలిసి పనిచేస్తున్నామన్నారు.
‘‘నెలకు ఒకసారి వాటికి ఆహారంగా రైతుల నుంచి ఒక పశువును పొందుతూ ఉంటాం. రైతుల వద్ద ఏదైనా జంతువు మరణిస్తే, దాన్ని కూడా వాటికి ఆహారంగా అందిస్తాం’’ అని రియాడి చెప్పారు.
కానీ, ఈ కేంద్రానికి మరిన్ని మొసళ్లను తీసుకు వచ్చి, వాటికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదు. ఇప్పటికే చాలా మొసళ్లు తమ కేంద్రంలో ఉన్నాయన్నారు.

ఫొటో సోర్స్, BBC / ANINDITA PRADANA
మొసళ్ల ఆవాసాలను రక్షించనంత వరకు మనుషులపై దాడులు ఆగవని నిపుణులుంటున్నారు.
దీనికి ప్రధాన సమస్య అక్రమ మైనింగేనని చెబుతున్నారు.
టిన్‌ను వెలికితీయడం కోసం సముద్రంలోకి వెళ్లడం ప్రజలు ప్రారంభిస్తే, మరిన్ని మొసళ్లు బలవంతంగా తమ సహజ ఆవాసాల నుంచి బయటికి వస్తాయని హెచ్చరించారు.
అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం, అసాధారణమైన విధానాన్ని ఎంపిక చేసుకుంది. దాన్ని చట్టబద్ధం చేసింది.
ఈ అక్రమ మైన్లలో మైనర్లు తమ పనిచేసుకునేందుకు లైసెన్స్ పొందేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది.
కానీ దీనికి ప్రతిగా, ఆవాసాల పునరుద్ధరణ బాధ్యతను అప్పగించిందని ఇంధన, ఖనిజ వనరుల బాధ్యతలను చూసుకునే స్థానిక అధికారి అమిర్ స్యాబానా చెప్పారు.
ఈ బాధ్యతల్లో వ్యర్థ నిర్వహణ నుంచి చెట్లను నాటే వరకు పలు ప్రతిపాదనలున్నాయి.
కానీ, పర్యావరణాన్ని కాపాడేందుకు నిజంగా మైనర్లు ఏదైనా చర్యలు చేపడతారా అన్నది ప్రశ్నార్థకం.
ద్వీపంలో బలహీనమైన చట్టాల అమలు, వారిని ఈ నిబంధనల నుంచి ఎలాగైనా తప్పించుకునేలా చేస్తోంది.
‘‘ప్రతి ఒక్కరూ ఇక్కడ టిన్ మైనర్. పర్యావరణం గురించి వారసలు పట్టించుకోరు’’ అని సరయా చెప్పారు.
ఆ దాడి తర్వాత సరయా మళ్లీ నీటి గుంటల వైపు వెళ్లట్లేరు.
ఆ దాడిలో బతికి బయటపడటం అదృష్టం. ఎడమ చేతిని లేదా వేళ్లను కదిపితే ఇప్పటికీ నొప్పి వస్తుందని ఆమె చెప్పారు.
‘‘నేను నిద్రపోతున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆ దాడి నా కళ్ల ముందు కనిపిస్తుంది’’ అని సరయా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














