ఇవి ప్రపంచంలోనే అత్యంత హానికారకమైన నత్తలు: ‘వీటిని తాకొద్దు, తినొద్దు’ - అధికారుల హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
"భూమిపై సంచరించే భారీ ఆఫ్రికా నత్తలు నెమ్మదిగా కదులుతూ, హాని తలపెట్టని జీవుల్లా కనిపించవచ్చు. కొంత మందికి పాకే జీవుల్లా అనిపించొచ్చు. కానీ, నిజానికి ఇవి ప్రపంచంలోనే అత్యంత హానికారకమైన నత్తలు. వీటి వల్ల మనుషుల ఆరోగ్యానికి చాలా ముప్పు పొంచి ఉంది" అని అమెరికన్ అధికారులు చెబుతున్నారు.
అధికారులు ఈ నత్తలను వేటాడే ప్రయత్నాల్లో ఉన్నారు.
"ఈ నత్తలు లంగ్ వార్మ్స్ (మెనిన్ జైటిస్) అనే పరాన్న జీవులను తమతో పాటు తీసుకుని వస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం" అని ఈ నెల మొదట్లో ఫ్లోరిడాలోని పాసో కౌంటీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఫ్లోరిడా వ్యవసాయ కమీషనర్ నిక్కీ ఫ్రైడ్ చెప్పారు.
"ఈ నత్తలు కనీసం 500 రకాల మొక్కలను తినేస్తాయి. దీంతో ఇవి సహజ, వ్యవసాయ ప్రాంతాలకు తీవ్రమైన ముప్పుగా పొంచి ఉన్నాయి" అని చెప్పారు.
వీటిని నిర్మూలించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన స్నిఫర్ డాగ్స్, 30 మంది సిబ్బంది దట్టమైన తోటల్లో వెతుకుతున్నారు.
ఈ ఏడాది జూన్‌లో వీటి జాడ కనిపించినప్పటి నుంచి అధికారులు 1400కు పైగా బ్రతికిన, మరణించిన నత్తలను వేటాడినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఈ భారీ ఆఫ్రికన్ నత్తలు 8 అంగుళాల పొడవు వరకు పెరగొచ్చు. వీటి పునరుత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతుంది.
"ఒక భారీ ఆఫ్రికన్ నత్త ఏడాదికి 2000 గుడ్లను పెట్టగలదు" అని ఫ్లోరిడా వ్యవసాయ శాఖకు చెందిన బైయాలజిస్ట్ జ్యాసన్ స్టాన్లీ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మనుషులకు ముప్పు
వీటి వల్ల మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుందా? ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ నత్తలు చాలా సార్లు ర్యాట్ లంగ్ వార్మ్స్‌కి ఆవాసాలుగా ఉంటాయి. వీటిని మనుషులు తాకినప్పుడు అవి మెదడులోని నాళాల్లోకి చేరి మెనిన్‌జైటిస్‌కు దారి తీస్తుంది.
"సాధారణంగా ఇవి మనుషుల పై పెద్దగా ప్రభావం చూపవు. కానీ, ప్రమాదవశాత్తు మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే ఈ అపరిపక్వ పురుగులు కనుగుడ్లు, మెదడు లాంటి ప్రదేశాల్లోకి చేరి తీవ్రమైన హాని కలిగించొచ్చు" అని ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంటోమాలజీ, నెమాటాలజీ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విలియం కెర్న్ చెప్పారు.
న్యూపోర్ట్ రిచీలో ఒక క్వారంటైన్ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఈ నత్తలు మరింత విస్తరించకుండా చూసేందుకు ఈ ప్రాంతంలో మొక్కలను, హరిత ప్రాంతాన్ని నిర్మూలించడం లేదు.
ఇన్ఫెక్షన్‌ను నిరోధించేందుకు ఈ నత్తలను నోటితో పట్టుకుని వేటాడేందుకు కుక్కలకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో ఇలా జరిగిందా?
గతంలో కూడా ఇలా జరిగింది. 1960లో మొదటి సారి నత్తలు ఆక్రమించాయి. వీటిని నిర్మూలించడానికి 7ఏళ్ళు, కొన్ని లక్షల డాలర్లు ఖర్చయ్యాయి.
2010లో రెండవ సారి జరిగింది.
ఈ సారి వాటిని నిర్మూలించేందుకు 10ఏళ్ళు పట్టింది. 23 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి.
ఈ నత్తలు కనీసం రెండేళ్లు పూర్తిగా కనిపించకుండా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో నత్తలు పూర్తిగా మాయమైనట్లు అధికారులు ప్రకటించగలరు.
యూరప్‌లో కొంత మంది ఈ నత్తలను పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారు. కానీ, అమెరికాలో వీటిని లైసెన్స్ లేకుండా పెంచుకోవడం చట్ట వ్యతిరేకం. ప్రస్తుతం చోటు చేసుకున్న నత్తల దాడికి పెంపుడు జంతువుల వ్యాపారులు కారణం అయి ఉంటారని అధికారులు, నిపుణులు భావిస్తున్నారు.
"వీటిని పెంచుకునేందుకు ఎవరైనా కొనుక్కుని తెచ్చి ఉండవచ్చు. సాధారణంగా బూడిద రంగు చర్మంలో కనిపించే ఇవి పాస్కో కౌంటీలో మాత్రం తెలుపు రంగులో కనిపిస్తున్నాయి" అని డాక్టర్ కెర్న్ బీబీసీ కి చెప్పారు.
తూర్పు కెన్యా, తూర్పు టాంజానియాకు చెందిన ఇవి ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దక్షిణ, తూర్పు దక్షిణ ఆసియాలో కూడా కనిపిస్తున్నాయి.
"ఈ జీవులు ప్రస్తుతం కరీబియన్ ఐలాండ్స్, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో, కోస్టా రికాలో కూడా కనిపిస్తున్నట్లు నిర్ధరణ అయింది" అని యూఎస్ వ్యవసాయ శాఖ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆహారానికి పనికిరావు
ఈ నత్తలు కనిపించిన వెంటనే అధికారులకు తెలియచేయమని ఫ్లోరిడాలోని అధికారులు కోరుతున్నారు.
"ఇలాంటి నత్తలను చూస్తే వాటిని తాకవద్దు. మమ్మల్ని పిలవండి. వాటితో పాటు మెనిన్‌జైటిస్ లాంటి రోగాలను తీసుకొస్తాయి" అని నిక్కీ ఫ్రైడ్ చెప్పారు.
తోటలో కంటే భోజనంలో బాగుంటాయి అని అనుకోవద్దని హెచ్చరించారు.
"ముఖ్యంగా ఇవి తినేందుకు పనికి రావు. ఇది వెన్న, నూనె, వెల్లుల్లి వేసుకుని తినే నత్త కాదు" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- గోదావరి వరదలు: ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు
- శ్రీలంక: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















