Sri Lanka Crisis-Organic Farming: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మార్కో సిల్వా
- హోదా, క్లైమేట్ డిస్‌ఇన్ఫర్మేషన్ స్పెషలిస్ట్
శ్రీలంకలో తాజా ఆర్థిక సంక్షోభానికి హరిత విధానాలు (గ్రీన్ పాలసీలు), పర్యావరణ-కఠిన విధానాలు కారణమంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది.
కానీ, ఇందులో నిజం ఉందా?
ఆహారం, చమురు కొరతతో పాటు ధరల పెరుగుదల శ్రీలంక ప్రజలు జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అక్కడ కొన్ని నెలలుగా నిరసనలు జరుగుతున్నాయి.
ఈ వారం నిరసనకారులు, అధ్యక్ష భవనంలోని చొచ్చుకెళ్లారు. ఆ తర్వాత నుంచి వందలాది మంది సోషల్ మీడియా వేదికగా 'గ్రీన్ పాలసీల' గురించి విమర్శిస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER
మరికొందరు ఈ నిరసనలను, తెర వెనకున్న ప్రపంచవాద శక్తుల నేతృత్వంలోని 'పర్యావరణ-కఠిన విధానాలకు’ వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు అని అంటున్నారు.
కానీ, ఇదంతా వాస్తవాలను వక్రీకరించడమే అని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, TELEGRAM
ఈ ఆరోపణలు ఎక్కడ నుంచి వస్తున్నాయి?
రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపుమొక్కలను నివారించే మందుల దిగుమతులపై నిషేధం విధిస్తూ 2021 ఏప్రిల్‌లో శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియా యూజర్లు ప్రధానంగా ఎత్తి చూపారు.
ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని రక్షించేందుకు శ్రీలంకలో రసాయన ఎరువుల వాడకాన్ని అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష పూర్తిగా నిషేధించారు. శ్రీలంక తప్ప ఇప్పటివరకు ఏ దేశం కూడా రసాయన ఎరువులను పూర్తిగా నిషేధించలేదు.
''ఇది ఒక విచిత్రమైన విధానంగా అనిపించింది. పర్యావరణపరంగా ఆయన నిబద్ధతకు, దీనికి ఎలాంటి సంబంధం లేదు'' అని చాథమ్ హౌస్ ఆసియా-పసిఫిక్ ప్రోగ్రామ్ అసోసియేట్ ఫెలో చారు లత హోగ్ అన్నారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సౌత్ ఏషియన్ స్టడీస్ లెక్చరర్ డాక్టర్ తిరుని కలెగామా దీని గురించి మాట్లాడుతూ... ''ఆయన రాత్రికిరాత్రే ఈ నిషేధాన్ని విధించారు. సేంద్రియ విధానాల వైపు మళ్లేందుకు రైతులకు సమయం ఇవ్వలేదు. ఎలాంటి వనరులను కూడా కల్పించలేదు'' అని అన్నారు.
రసాయన ఎరువులపై నిషేధం తర్వాత పంట దిగుబడి తగ్గిపోయింది. ఆహారపదార్థాల ధరలు పెరిగాయి. కొద్ది కాలంలోనే కీలకమైన ఆహార వస్తువుల కొరత ఏర్పడింది.
దీంతో నిరసనలు తీవ్రంగా జరగడంతో ప్రభుత్వం, ఏడు నెలల్లోనే ఈ కొత్త విధానాన్ని ఉపసంహరించుకుంది.
కానీ, ఈ వారం నిరసనకారులు, అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో చాలామంది ఈ విధానాన్ని నిందిస్తున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK
దేశంలో అశాంతికి అసలు కారణం ఏంటి?
శ్రీలంక చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
రసాయన ఎరువుల వాడకంపై నిషేధం, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనడంలో సందేశం లేదు. కానీ, ఆర్థిక వ్యవస్థ క్షీణతకు ఇతర అంశాలు కూడా దోహదపడ్డాయని నిపుణులు అంటున్నారు.
''ఈ క్షీణతను కేవలం సేంద్రీయ వ్యవసాయానికే పరిమితం చేయడం వల్ల నిజానికి దేశమంతా ఎదుర్కొంటోన్న భారీ సమస్యలను తగ్గించినట్లు అవుతుంది. అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు దీర్ఘకాలంగా అమలు చేస్తోన్న చెడ్డ ఆర్థిక విధానాలను తగ్గించి చూపినట్లు అవుతుంది'' అని డాక్టర్ కలెగామా అన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోయిందని ప్రభుత్వమే చెబుతోంది.
దీనివల్ల విదేశీ కరెన్సీ వచ్చే ప్రధాన వనరుల్లో ఒకదాన్ని దేశం కోల్పోయింది. దిగుమతుల కోసం విదేశీ కరెన్సీ అవసరం.

ఫొటో సోర్స్, FOX NEWS
కానీ, ఈ సమస్య కొత్తదేమీ కాదు.
2009లో అంతర్యుద్ధం ముగిశాక శ్రీలంక, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి బదులుగా దేశీయ మార్కెట్‌పైనే దృష్టి సారించిందని నిపుణులు అంటున్నారు.
ఈ చర్య వల్ల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయి, దిగుమతుల బిల్లు పెరుగుతూ పోయిందని వారు చెబుతున్నారు.
విదేశీ నిల్వలు తగ్గిపోవడంతో చమురు, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది.
మరోవైపు పన్ను కోతలు, 51 బిలియన్ డాలర్ల (రూ. 4,06,575 కోట్లు) విదేశీ రుణం, మౌలిక వసతుల వ్యయం తదితర అంశాలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పెంచాయి.
ఇవి కూడా చదవండి:
- లఖ్‌నవూ లులు మాల్లో నమాజ్, వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
- లలిత్ మోదీ: ఈయన కొందరికి విలన్, మరి కొందరికి మాత్రం హీరో
- ‘‘ఇప్పుడు మేం, మా పిల్లలు మాత్రం బతికున్నాం. ఇంకేమీ మిగల్లేదు''
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- శ్రీలంక కు భారత్ చేయాల్సింది సైనిక సాయమా, ఆర్ధిక సాయమా, 1987 అనుభవాలు ఏం చెబుతున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















