శ్రీలంక కు భారత్ చేయాల్సింది సైనిక సాయమా, ఆర్ధిక సాయమా, 1987 అనుభవాలు ఏం చెబుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంక 1948లో స్వాతంత్య్రం సాధించింది. ప్రస్తుతం శ్రీలంకలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్ధిక సంక్షోభం మునుపెన్నడూ తలెత్తలేదు.
శ్రీలంకలో తలెత్తిన పరిస్థితికి భారత్ తక్షణమే స్పందించి ఆర్ధిక సహాయం అందచేసింది. ఇలాంటి చర్య తీసుకుని ఒక మంచి పొరుగుదేశంగా వ్యవహరించింది.
అయితే, భారత్ శ్రీలంకకు చేసిన ఆర్ధిక సాయం తగినంత లేదని కొంత మంది అంటున్నారు. ఇలా అంటున్న వారిలో బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యన్ స్వామి కూడా ఉన్నారు.
శ్రీలంకలో అప్రజాస్వామికంగా ఏర్పడే ప్రభుత్వ ఏర్పాటును ఆపేందుకు భారత్ ఎలా అయినా ప్రయత్నించాలని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @SWAMY39
ఆయన గురువారం న్యూస్ ఎక్స్ అనే ప్రైవేటు ఇంగ్లీష్ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
"రాజపక్ష సోదరులు ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి అధికారంలోకొచ్చారు. వారిది ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం. నేడు కొంత మంది వారిని అధికారం నుంచి తప్పించాలని చూస్తున్నారు. ఆయనను రాజీనామా చేసేందుకు ఒత్తిడి చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. శ్రీలంక భారత్ కు సరిహద్దు దేశం. అదొక ద్వీపం".
"భారతదేశానికి వ్యతిరేకంగా చాలా దేశాలున్నాయి. ఆ దేశాలు అవకాశం కోసం చూస్తున్నాయి. అలా ఉన్న వాటిలో చైనా ఒకటి. ఈ విషయంలో పాకిస్తాన్, మియన్మార్ కూడా చైనాకు తోడు కావచ్చు. భారత్ శ్రీలంకలో తలెత్తిన పరిస్థితిని అకస్మాత్తుగా తలెత్తిన పరిస్థితిలా చూస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక విధమైన భద్రతా ముప్పుగా పరిగణించి భారత్ అందుకు తగిన చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.
"ప్రస్తుతం రాజపక్షలు ఇద్దరూ దేశంలో లేరు. ఇలాంటి పరిస్థితిలో సైన్యాన్ని తమ దేశానికి పంపమని అడిగేందుకు అక్కడ భారత్ కు మిత్రులెవరూ లేరు. దేశంలో ప్రభుత్వం లేని ఇలాంటి పరిస్థితిలో భారత్ సైన్యాన్ని పంపించడం సరైంది కాదు. భారత్ ఎలాగైనా సైన్యం సహాయంతో శ్రీలంకలో అప్రజాస్వామికంగా ప్రభుత్వం ఏర్పడకుండా చూడాలి" అని ఆయన అన్నారు.
ప్రస్తుతం భారత్ అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికను కొనసాగిస్తూ అమెరికా సహాయంతో శ్రీలంకలో అడుగు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన అన్నారు.
క్వాడ్ దేశాల సహకారంతో శ్రీలంకలో శాంతిని పునరుద్ధరించేందుకు చూడాలని అన్నారు. భారత్ గతంలో ఇలాగే చేసిందని గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, SURENDER SANGWAN
శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాలు
భారతదేశం 1987లో శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాలను పంపించిన విషయం గురించి సుబ్రహ్మణ్యన్ స్వామి ప్రస్తావిస్తున్నారు.
ఉత్తర శ్రీలంకలో శాంతిని నెలకొల్పేందుకు 1987లో భారత శాంతి పరిరక్షక దళం (ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్) శ్రీలంక వెళ్ళింది. కానీ, ఎల్‌టీటీఈ తో జరిగిన పోరులో సుమారు 1200మంది భారత సైనికులు మరణించారు.
ఎల్‌టీటీఈ సేనల చేతిలో ఆయుధాలు లేకుండా చేసి శ్రీలంకలో శాంతిని నెలకొల్పడమే భారత శాంతి పరిరక్షక దళం లక్ష్యం.
కానీ, కొన్ని వారాల్లోనే ఐపీకేఎఫ్ కు ఎల్‌టీటీఈ కి మధ్య పోరు మొదలయింది.
భారత శాంతి పరిరక్షక దళం శ్రీలంక వెళ్ళేటప్పటికి శ్రీలంకలోని తమిళులు తమను రక్షించేందుకే ఐపీకేఎఫ్ వచ్చిందని భావించారు. వారికి సాదర స్వాగతం లభించింది.
శ్రీలంకలో అత్యధిక సంఖ్యలో ఉన్న సింహళీయులు తమ భాష, సంస్కృతిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మైనారిటీలో ఉన్న తమిళులు భావించారు. ఇరువర్గాల మధ్య సత్సంబంధాలు లేవు.
సింహళాన్ని జాతీయ భాషగా చేస్తూ శ్రీలంక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం తమ ఉపాధికి, ప్రభుత్వ రంగంలో తమ ఉద్యోగాలకు ప్రమాదకరంగా మారుతుందని తమిళులు ఆందోళన చెందారు. దీంతో, తమిళులు ప్రత్యేక రాజ్యం ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలయింది.
తమిళులకు వ్యతిరేకంగా అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 1983లో ఎల్‌టీటీఈ చేసిన దాడుల్లో 23 మంది లంక సైనికులు మరణించారు. దీంతో, దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనల్లో సుమారు 3000 మంది తమిళులు మరణించారని అంచనా వేశారు.
దీంతో, శ్రీలంక ప్రభుత్వం, ఎల్‌టీటీఈ మధ్య యుద్ధం మొదలయింది.
తమిళ ఈలం చేస్తున్న డిమాండ్ల పట్ల భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో ఉన్న తమిళులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎల్‌టీటీఈ చేస్తున్న డిమాండును సమర్ధించారు. శ్రీలంక అంతర్యుద్ధం తమిళులు ఎక్కువగా ఉండే భారతదేశానికి కూడా ఆందోళన కలిగించింది.
ఈ మేరకు భారత్ శ్రీలంక మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే భారత శాంతి పరిరక్షక దళాలు శ్రీలంకకు వెళ్లాయి.

ఫొటో సోర్స్, SURENDER SANGWAN
అయితే, తమ దేశ అంతర్గత విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం పట్ల శ్రీలంకలోని చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ ఇంత పెద్ద దేశం అయి ఉండి కూడా ఒక చిన్న పొరుగు దేశం అంతర్గత వ్యవహారాల్లో చోటు చేసుకుంటుందని భావించారు.
భారత శాంతి పరిరక్షక దళం(ఐపీకేఎఫ్) అక్కడికి చేరుకోగానే ఉత్తరాదిలో శ్రీలంక సైన్యం స్థానంలో శాంతిసేన దళాలను నియమించారు.
ఎల్‌టీటీఈ, ఐపీకేఎఫ్ మధ్య పోరు మొదలయింది. ఎల్‌టీటీఈ కంచు కోట జాఫ్నాను స్వాధీనం చేసుకునేందుకు ఐపీకేఎఫ్ అక్టోబరు 1987లో ఒక దాడిని చేసింది. భారత సేనలను 1990 మార్చిలో వెనక్కి పిలిపించారు.
శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాలను పంపడం ఒక చారిత్రక తప్పిదమని చరిత్రకారులు నేటికీ అంటారు. అశోక యూనివర్సిటీలో ఆర్ధిక శాస్త్ర నిపుణులు పూలాప్రి బాలకృష్ణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"1987లో భారత్ సేనలను శ్రీలంకకు పంపాలని తీసుకున్న నిర్ణయం తప్పు. మనం సైనిక జోక్యంతో కాకుండా చర్చల ద్వారా శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించి ఉండాల్సింది. సైన్యం దృష్టితో చూసినా కూడా ఇది తప్పిదమే. భారత్ నుంచి శ్రీలంక వెళ్లిన సైన్యానికి అటవీ ప్రాంతంలో పోరాడే అనుభవం లేదు. చారిత్రక కోణంలో చూస్తే, గెరిల్లా సైన్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం విజయవంతం కాలేదు’’ అని బాలకృష్ణ అన్నారు.
‘‘సాధారణ పౌరులపై కూడా కాల్పులు జరిపడం ద్వారా శ్రీలంక అక్కడ విజయం సాధించింది. ఇలా భారత ప్రభుత్వం చేయలేదు. దీంతో, ఆ యుద్ధంలో భారత్ విజయం సాధించకపోవడంతో పాటు అనేక మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి సరైన సలహాను ఇవ్వలేదు’’ అన్నారాయన.
"మనం వీటన్నిటి నుంచి పాఠం నేర్చుకున్నామని అనుకుంటున్నాను. ఈసారి శ్రీలంకకు ఎక్కువ సహకారం అందించటం లేదు. మనం శ్రీలంక ప్రజలకు మాత్రమే సహాయం చేస్తున్నాం. ఒక నెల రోజుల క్రితం మనం 3.5 బిలియన్ డాలర్ల ((రూ. 27,751 కోట్లు) సహాయాన్ని అందించాం. సైన్యం ఈ విషయంలో ఏ విధమైన సహాయం చేయాల్సిన అవసరం లేదు"అని బాలకృష్ణ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వం శ్రీలంకకు రాజకీయంగా సహాయం చేయగలదా?
మాజీ దౌత్యవేత్త అశోక్ కంఠ దీనిపై బీబీసీతో మాట్లాడారు.
"శ్రీలంకకు 1948లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితి ఊహించలేనిది. పరిస్థితి నెలకొన్న వెంటనే స్పందించిన దేశాల్లో భారత్ ఒకటి. భారత్ తనకు వీలైనంత సహాయాన్ని అందించేందుకు ప్రయత్నించింది. భారత్ 3.8 బిలియన్ డాలర్ల రుణాన్నిఇచ్చింది.
దీంతో పాటు, తమిళనాడులో ఉన్న కొన్ని సామాజిక సంస్థలు కూడా వారికి సహాయం చేశాయి. అత్యవసర సరుకులైన ఇంధనం, రేషన్, ఔషధాల లాంటివి కూడా పంపిస్తున్నాం. భారత్ "పొరుగువారికి ముందు" అనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తోంది" అని అన్నారు.
"శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ఇందులో భారత్ పోషించాల్సిన పాత్ర ఏమి లేదు. శ్రీలంకలో ప్రజలు మొదట్లో శాంతియుతంగానే ఉద్యమించారు. శ్రీలంక ఈ సమస్యకు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామిక విధానాలతో ఒక పరిష్కారాన్ని సాధించుకోవచ్చు" అని అశోక్ కంఠ అభిప్రాయపడ్డారు.
"సైన్యాన్ని పంపాలని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది. భారతదేశానికి అలాంటి విధానమేమి లేదు. భారత్ ఆ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు. శ్రీలంక ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. శ్రీ లంక భారత్ కు పొరుగు దేశం మాత్రమే కాకుండా మిత్రదేశం కూడా. ఆ దేశంలో అనిశ్చితి కోరుకోవడం లేదు’’ అన్నారాయన.
కానీ, శ్రీలంకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఆ దేశ ప్రజలే పరిష్కారం కనుక్కోవాలి.
"1987లో పరిస్థితులు వేరు. ఈసారి సంక్షోభం నేపధ్యం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారం. ఆర్ధిక సంక్షోభం విషయానికొస్తే వారికి ప్రపంచ దేశాల సహాయం అవసరముంది. ఆ మేరకు భారత్ చొరవ తీసుకుంది. ఆ దేశానికి భారత్ చాలా వరకు సహాయాన్ని అందించింది. ఈ సహాయం కొనసాగుతుంది.
కానీ, ఆర్ధిక సంక్షోభానికి, రాజకీయ సంక్షోభానికి మధ్యనున్న తేడాను కూడా భారత్ గమనిస్తోందని అశోక్ కంఠ అన్నారు.
"రాజకీయ సంక్షోభం విషయంలో భారత్ చాలా స్పష్టంగా ఉంది. మనం శ్రీలంక ప్రజలకు మద్దతిస్తాం. వారు ప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ మార్గాల ద్వారా మాత్రమే ఈ రాజకీయ సంక్షోభానికి పరిష్కారాన్ని సాధించుకోగలరు’’ అన్నారు అశోక్ కంఠ.
ఇవి కూడా చదవండి:
- కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్‌పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన కేంద్రం
- క్యాన్సర్ ఉన్నట్లు గోళ్ల మీద కనిపించే రంగులు, మచ్చలు కూడా చెప్పగలవా, నిపుణులు ఏమంటున్నారు?
- ఈ ఆర్థిక, రాజకీయ సుడిగుండం నుంచి శ్రీలంక ఇప్పటికిప్పుడు బయటపడగలదా, ఏం చేయాలి?
- అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













