శ్రీలంకలో అసలు సమస్యేంటి?

ధరల పెరుగుదలపై లంక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధరల పెరుగుదలపై లంక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఇటీవలి కాలంలో శ్రీలంకలో ప్రజాందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జనం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్ష రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీలంకలో కనీవిని ఎరుగని ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉంది. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందాక ఇంతటి ఆర్ధిక, ఆహార సంక్షోభం ఏర్పడటం అక్కడ ఇదే మొదలు. ధరల పెరుగుదల, విద్యుత్ కోతలు, ఆర్ధిక సమస్యలు...ఇలా సమస్యలన్నింటికి కారణం ప్రభుత్వమేనని ప్రజలు విమర్శిస్తున్నారు.

గత 70 ఏళ్లలో కనీ వినీ ఎరుగని సంక్షోభం మూలంగా విదేశీ రుణాల చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్దోందని శ్రీలంక ప్రభుత్వ తాజాగా ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రబావం, యుక్రెయిన్ యుద్ధం రెండూ కలిసి అప్పులు తిరిగి చెల్లించడానికి వీల్లేని పరిస్థితులు కల్పించాయని అధికారులు చెబుతున్నారు.

శ్రీలంకలో అసలు సమస్యేంటి?

విదేశీ మారక నిల్వలు పూర్తిగా పడిపోవడంతో శ్రీలంకలో సమస్య మొదలైంది. దీని అర్ధం ఆ దేశం నిత్యావసర సరుకులు, ఇంధనం లాంటివి కొనుక్కో లేదు. కొరత ఏర్పడటంతో ఆటోమేటిగ్గా ధరలు పెరుగుతాయి.

అయితే, కోవిడ్ కారణంగా టూరిజం బిజినెస్ పడిపోయిందని, దీనివల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే మూడేళ్ల కిందట శ్రీలంక చర్చిల్లో జరిగిన వరస బాంబు పేలుళ్లు కూడా టూరిజం దెబ్బతినడానికి కారణమని ప్రభుత్వం చెబుతోంది. అయితే, నిపుణులు మాత్రం ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.

అయితే, ఇవన్నీ సమస్యలే అయినా, వీటన్నింటికన్నా ప్రధానమైన కారణం మరొకటి ఉంది. 2009 లో సివిల్ వార్ ముగిసిన తర్వాత అక్కడి ప్రభుత్వం విదేశీ మార్కెట్లకన్నా దేశీ మార్కెట్లపై ప్రధానంగా దృష్టిపెట్టింది. దీనివల్ల ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. దిగుమతుల ఖర్చు పెరిగి పోయింది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ఎమర్జెన్సీ విధించడానికి ముందు ఏం జరిగింది?

దీనికి తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల ఖర్చు దేశానికి పెనుభారంగా మారింది. వీటిలో కొన్నింటిని ప్రభుత్వం అనవసరంగా నిర్మిస్తోందని నిపుణులు వాదించారు.

2019 చివరినాటికి శ్రీలంక ప్రభుత్వం దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు 7.6 బిలియన్ డాలర్లు ( సుమారు రూ. 576574000000 కోట్లు) కాగా, 2020 మార్చి నాటికి అవి 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 174489500000 కోట్లు)కు పడిపోయాయి.

శ్రీలంకలో ఆహార ధరలు విపరీతంగా పెరిగాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంకలో ఆహార ధరలు విపరీతంగా పెరిగాయి

ప్రభుత్వ స్పందన ఎలా ఉంది?

2019 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులు తగ్గించాలని గొటాబయ రాజపక్ష నిర్ణయించారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకోవడం కోసం విదేశీ కరెన్సీ కొనడానికి ప్రభుత్వం దగ్గర నిల్వలు తగ్గిపోతాయి. 2021 ఆరంభంలోనే శ్రీలకంలో కరెన్సీ కొరత పెద్ద సమస్యగా మారింది. ఫారిన్ కరెన్సీ దేశం దాటి పోకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం రసాయనాలు, ఎరువు దిగుమతులను నిలిపేసింది.

వీటి బదులు ఆర్గానిక్ ఎరువులను వాడాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. ఈ కారణంగా పెద్ద ఎత్తున పంటల దిగుబడి తగ్గింది. పంటలు సరిగా లేకపోవడంతో విదేశాల నుంచి నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. విదేశీ మారక నిల్వలు మరింత దిగజారడానికి ఇది కారణమైంది.

ప్రభుత్వం నాన్-ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే కార్లు, కొన్ని రకాల ఆహార పదార్ధాలు, షూస్ లాంటి వాటిని దిగుమతిని నిలిపేసింది. తమ కరెన్సీ విలువ పెంచుకోవడానికి దేశాలు ఎగుమతులు పెంచుకునే ప్రయత్నాలు చేస్తాయి. కానీ, శ్రీలంక ప్రభుత్వ తమ రూపాయి విలువను విదేశీ కరెన్సీకన్నా తగ్గడానికి ఒప్పుకోలేదు.

చివరకు 2022లో తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో శ్రీలంక రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 30 శాతం తగ్గింది.

ప్రభుత్వ సూచన ప్రకారం ఆర్గానిక్ ఎరువులను వాడటంతో వ్యవసాయ దిగుబడులు తగ్గాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ సూచన ప్రకారం ఆర్గానిక్ ఎరువులను వాడటంతో వ్యవసాయ దిగుబడులు తగ్గాయి

శ్రీలంక కచ్చితంగా చెల్లించాల్సిన అప్పులెన్ని?

తన అప్పులు తీర్చుకోవడానికి శ్రీలంక ప్రభుత్వం 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,31,35,25,00,000) చెల్లించాల్సి ఉంది. రానున్న సంవత్సరాలలో ఇదే స్థాయిలో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ అప్పులు తీర్చడానికి శ్రీలంక ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సి ఉంది. కానీ, ఆ దేశపు క్రెడిట్ రేటింగ్ పడిపోవడంతో అప్పులు పుట్టడం కూడా సమస్యగా మారింది.

రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి?

రాజపక్ష రాజీనామా చేయాలంటూ ఏప్రిల్ ఆరంభం నుంచి శ్రీలంకలో ఆందోళనలు మొదలయ్యాయి. కానీ, ఆయన దాన్ని తిరస్కరిస్తూ వస్తున్నారు. రోజువారి ఖర్చులు పెరిగి పోవడంతో భరించలేని ప్రజలు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో ఆహారం మీద ఖర్చు పెట్టిన దానికన్నా 30% అధికంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ కారణంగా ప్రజలు ఆహారపు కొనుగోళ్లలోనూ, తినడంలోనూ కోత విధించుకున్నారు.

ఇంధనం కొరత వల్ల పెట్రోలు బంకులు దగ్గర జనం క్యూ కట్టాల్సి వచ్చింది. ఇంధన కొరత ప్రభుత్వ రవాణా విభాగం మీద ప్రభావం పడింది.

''ఇంతకు ముందు ప్రతి 15 నిమిషాల ఒకసారి బస్సు వచ్చేది. ఇప్పుడు నేను రెండు గంటలు ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు బస్సు ఆయిల్ లేక మధ్యలోనే ఆగిపోయేది'' అని ఓ శ్రీలంక మహిళ బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ఆర్థిక ప్రమాణాల్లో ముందున్న శ్రీలంక ఎందుకిలా కుదేలైంది?

ఆందోళనలు పెరిగి పోతుండటంతో అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మొదట కర్ఫ్యూ, ఆ తర్వాత ఎమర్జెన్సీ విధించారు. సోషల్ మీడియాను బ్యాన్ చేశారు. కానీ, ఇవేవీ ప్రజలను ఆందోళన నుంచి వెనక్కి తగ్గేలా చేయలేదు. తర్వాత ఆంక్షలను తగ్గించారు.

ఆ తర్వాత తన మంత్రి వర్గంలో ఒక్కొక్కరిని తొలగించడం మొదలు పెట్టారు గోటబయ రాజపక్ష. అందులో తన సోదరుడు, ప్రధానమంత్రి మహింద రాజపక్ష కూడా ఉన్నారు. ఆయన మరో సోదరుడు, ఆర్ధిక మంత్రి బాసిల్ రాజపక్షను కూడా తొలగించారు.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేయగా, ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన గవర్నర్ కూడా పదవి స్వీకరించిన ఒక రోజులోనే రాజీనామా చేశారు. ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వంలో చేరాలని గొటా బయ రాజపక్ష ఆహ్వానించగా, వారు తిరస్కరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న 40 మంది పార్లమెంటు సభ్యులు సంకీర్ణం నుంచి బైటికి వచ్చారు.

అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష

విదేశాల నుంచి శ్రీలంకకు వస్తున్న సాయం ఏంటి ?

బెయిలౌట్ ప్యాకేజ్ కావాలని మార్చిలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)ను శ్రీలంక కోరింది. కొత్త సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నందలాల్ వీరసింఘె ఇందుకోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతున్నారు. అయితే, కొత్త ఆర్ధిక మంత్రి వచ్చే వరకు ఈ చర్చలు ప్రస్తుతానికి పక్కనబెట్టారు.

ప్రస్తుతం భారత్ సహా మరికొన్ని పొరుగుదేశాలు శ్రీలంక కు సహాయం చేస్తున్నాయి. భారత్ శ్రీలంకకు 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.37914200000) విలువైన ఇంధనాన్ని అప్పుగా ఇచ్చింది.

చైనా కూడా ఆర్ధికంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. జపాన్, బంగ్లాదేశ్ ల నుంచి శ్రీలంక రుణం పొందింది.

వీడియో క్యాప్షన్, జీవితంలో ఇంకెప్పుడూ ఆయనకు ఓటు వెయ్యబోమని అక్కడి ప్రజలు ఎందుకంటున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)