పనసపండు ధర, లండన్ మార్కెట్లో రూ.16 వేలు ఎందుకు పలుకుతోంది?

ఫొటో సోర్స్, RICARDO SENRA/TWITTER
పైన చూపించిన పనసపండు (జాక్‌ఫ్రూట్) ఫొటోను బీబీసీ రిపోర్టర్ రికార్డో సెన్రా తీశారు. ఈ ఫొటో బ్రెజిల్‌లో వైరల్‌గా మారింది.
ఈ చిత్రాన్ని లక్షమంది షేర్ చేశారు. లండన్‌లోని అత్యంత పెద్దదైన, పురాతనమైన 'బోరో మార్కెట్'లో ఒక్కో పనసపండును రూ. 16వేల (160 పౌండ్లు)కు అమ్ముతున్నారు.
దీని ధరను చూసి ట్విటర్‌లో ప్రజలు ఆశ్చర్యపోయారు. మరికొందరేమో ''బ్రిటన్ వెళ్లి పనసకాయలు అమ్మి కోటీశ్వరులం అయిపోతాం'' అంటూ జోకులు పేలుస్తున్నారు.
బ్రెజిల్‌లోని అనేక ప్రాంతాల్లో తాజా పనసపండు 82 రూపాయలకే దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల రోడ్లపై కుళ్లిన స్థితిలో పనసపండ్లు కనిపిస్తుంటాయి. అనేక దేశాల్లో ఇది తక్కువ ధరకే లభ్యమవుతుంది. కొన్ని చోట్ల చెట్ల నుంచి దీన్ని ఉచితంగానే పొందుతారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విస్తారంగా దొరికే ఈ పనసపండు ధర ఎందుకు ఈ స్థాయిలో పెరిగింది? ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఎందుకు పెరిగింది?
ఇక్కడ ఒక సాధారణ సూత్రాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వస్తువుకు డిమాండ్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది. ప్రతీ ఉత్పత్తికి ఈ సూత్రం వర్తిస్తుంది.
''బ్రెజిల్‌లో కూడా పనసపండ్ల ధరలు హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు చెట్ల నుంచి కోసుకుంటారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇవి అధిక ధర పలుకుతాయి'' అని బీబీసీతో 'సో పాలో' అనే రాష్ట్రంలో 3000 రకాల పండ్ల మొక్కలతో కూడిన తోటలను సాగు చేస్తోన్న ఒక కంపెనీకి చెందిన సీఈవో సబ్రీనా సార్టోరీ చెప్పారు.
బ్రిటన్ లాంటి శీతల దేశాల్లో పనసపండ్లను వాణిజ్యపరంగా పండించలేరు.
పనసపండ్లతో అంతర్జాతీయ వ్యాపారం చేయడం చాలా క్లిష్టమైనది అని నిపుణులు చెబుతుంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. పనసపండ్ల ఆకారం భారీగా ఉండటంతో పాటు నిల్వ చేసినప్పుడు అవి పాడైపోయే ప్రమాదం ఉంటుంది.
ఒక్కో పనసపండు 40 కేజీల వరకు బరువు ఉంటుంది. ఆసియా వాతావరణ పరిస్థితుల్లో ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. వీటిని రవాణా చేయడంతో పాటు ప్యాకింగ్ చేయడం కూడా కష్టమే.
''పనసకాయ బరువుగా ఉండటమే కాదు, చాలా త్వరగా పండిపోతుంది. దీనికి ఒక రకమైన వాసన ఉంటుంది. ఈ వాసన అందరికీ నచ్చదు'' అని సార్టోరీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పసనపండ్లు విరివిగా లభించే దేశాల్లో వీటికి అంతగా ప్రాముఖ్యత లేదు. కానీ అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన శాఖాహారులు మాంసానికి ప్రత్యామ్నాయంగా పనసపండును భావించడంతో దీని డిమాండ్ పెరుగుతోంది.
వండిన తర్వాత ఇది బీఫ్ లేదా పోర్క్ మాంసంలా కనిపిస్తుంది. టోఫు, క్వార్న్ వంటి మాంస పదార్థాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని పరిగణిస్తున్నారు. కేవలం బ్రిటన్‌లోనే దాదాపు 35 లక్షల మంది శాఖాహారులు ఉన్నారు. వీరి సంఖ్య పెరుగుతోంది.
పనసకాయ బాగా పండిన తర్వాత తియ్యటి రుచిని కలిగి ఉంటుంది. ఆ తర్వాత దీన్ని తీపి పదార్థాల్లోనే ఉపయోగించవచ్చు. కాబట్టి ప్యాకెట్ల రూపంలో పనసతొనలను కొనుగోలు చేయడమే వినియోగదారులకు ఆర్థికంగా ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
బ్రిటిష్ సూపర్‌మార్కెట్‌లలో డబ్బాల్లో వీటిని అమ్ముతుంటారు. వీటి విలువ సగటున రూ. 300 వరకు ఉంటుంది. కానీ అసలు రుచికి డబ్బాల్లో లభించే పనసపండు రుచికి పొంతనే ఉండదని చాలామంది అంటున్నారు.

ఫొటో సోర్స్, NATHAN MAHENDRA
భారీ పరిమాణంలో ఉండటం వల్ల దీన్ని ప్యాకింగ్ చేయడం చాలా కష్టం. మిగతా పండ్ల తరహాలో వీటిని ఒకే పరిమాణం ఉన్న బాక్సుల్లో సర్దలేం. పనసపండును కేవలం బయట నుంచి చూసి లోపల బాగుందో లేదో చెప్పడానికి శాస్త్రీయ పద్ధతులు కూడా లేవు.
అంతేకాకుండా దీన్ని సాగు, ఎగుమతి చేసే ప్రధాన దేశాల్లో పంపిణీ వ్యవస్థ పటిష్టంగా లేదు. పండ్లను చెట్ల నుంచి వేరుచేసిన తర్వాత నిల్వ చేసేందుకు మౌలిక వసతుల కొరత ఉంది. ఫలితంగా మొత్తం ఉత్పత్తిలో 70 శాతం నష్టపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పసనపండ్లను ఎక్కువగా దక్షిణ, ఆగ్నేయాసియాలో పండిస్తారు. ఇది శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు జాతీయ ఫలం కూడా.
భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదప్రజలు కూడా దీన్ని ఆహార పదార్థంగానే భావిస్తారు. కానీ దీని గురించి ప్రజలకు సరైన అవగాహన లేదని నిపుణులు అంటున్నారు. చాలామంది ప్రజలకు ఇప్పటికీ దీని రుచి ఎలా ఉంటుందో తెలియదు. ఇటీవలి కాలంలో ప్రాముఖ్యత లభిస్తున్నప్పటికీ దీన్ని ఎలా వండాలో కూడా ప్రజలకు సరిగ్గా తెలియదు.
నెదర్లాండ్స్‌కు చెందిన విదేశీ పండ్ల దిగుమతిదారు టోర్రెస్ ట్రోఫికల్ బీవీ యజమాని ఫాబ్రిసియో టోర్రెస్ మాట్లాడుతూ... ''పండ్లు, కూరగాయలు ఖరీదైనవిగా మారడానికి ఒక కారణం ఏంటంటే, కోవిడ్-19 మహమ్మారి తర్వాత వాయు రవాణా ధరలు భారీగా పెరగడం'' అని అన్నారు.
''ఆసియా, దక్షిణ అమెరికాల నుంచి వాయుమార్గంలోనే పండ్లను యూరప్‌కు పంపిస్తారు. కార్గో సర్వీసుల కోసం అత్యధిక ధర చెల్లించే ఉత్పత్తుల కోసం విమానయాన సంస్థలు చూస్తున్నాయి. పనసపండ్లు త్వరగా మగ్గుతాయి. వీటికి డిమాండ్ కూడా తక్కువ. కాబట్టి వీటిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవడం సరైనది కాదని భావిస్తారు. వీటన్నింటిపై ఆధారపడి మార్కెట్‌లో పనసపండు ధరను నిర్ణయిస్తారు'' అని ఆయన వివరించారు.
పెరుగుతోన్న వ్యాపారం
అడ్డంకులు ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా పనసపండ్ల వ్యాపారం విస్తృతం అవుతున్నట్లు ఇటీవలి అధ్యయనాలు అంచనా వేశాయి.
కన్సల్టెన్సీ ఇండస్ట్రీ ఏఆర్‌సీ అంచనాల ప్రకారం, 2026 నాటికి ఈ వ్యాపారం 359.1 మిలియన్ డాలర్ల (రూ. 2,681 కోట్లు)కు చేరుకుంటుంది. 2021-2026 మధ్య ఏడాదికి 3.3 శాతంతో వృద్ధి నమోదు అవుతుంది.
2020లో జాక్‌ఫ్రూట్ మార్కెట్‌లో ఆసియా-పసిఫిక్ ప్రాంతం (37 శాతం) అధిక శాతం వాటాను కలిగి ఉంది. దీని తర్వాత యూరప్ (23 శాతం), ఉత్తర అమెరికా (20 శాతం), దక్షిణ అమెరికా (8శాతం), మిగతా ప్రపంచమంతా 12 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:
- రాజా సింగ్: బుల్డోజర్ వ్యాఖ్యలపై కేసు నమోదుచేసిన హైదరాబాద్ పోలీసులు
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే...
- సింగపూర్: అడవిలో ఈయన ఒంటరిగా 30 ఏళ్లు ఉన్నారు
- పోర్షె, ఆడి, లాంబోర్గిని, బెంట్లీ.. మొత్తం 4000 లగ్జరీ కార్లు అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో కాలిపోయాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













