Super Food: 10 కోట్ల మంది ఆకలి తీర్చే ఆఫ్రికా అరటి చెట్టు.. దీని పండ్లు మాత్రం తినడానికి పనికిరావు

ఎన్సెట్, అరటి

ఫొటో సోర్స్, RBG KEW

ఫొటో క్యాప్షన్, అరటి పండ్లు.. పక్కనే ఎన్సెట్ కాయలు
    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ సైన్స్

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో అరటి తరహాలో ఉండే 'ఎన్సెట్' అనే పంట ఒక సూపర్ ఫుడ్ కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో, ఇది అనేక మందిని ఆకలి నుంచి రక్షించే పంటగా మారవచ్చని అంటున్నారు.

ఇది ప్రస్తుతం ఇథియోపియాలో మాత్రమే పండుతోంది.

ఈ పంట అరటి కాదు. కానీ, అరటిని పోలిన ఈ పంటకు 10కోట్ల మందికి పైగా ఆహారాన్ని సరఫరా చేయగలిగే సామర్ధ్యం ఉందని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ పంట గురించి ఇథియోపియా అవతల ఎవరికీ తెలియదు. ఏమిటా పంట?

ఇథియోపియాలో ఈ చెట్టు ఉత్పత్తులతో జావ, రొట్టెలు లాంటివి చేసుకుంటారు.

ఈ పంటను ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా పండించవచ్చని అధ్యయనం సూచిస్తోంది.

వీడియో క్యాప్షన్, అరటి పండు అంతరించిపోనుందా?

"ఆహార భద్రత, సుస్థిరమైన అభివృద్ధిని సాధించడంలో ఈ పంట చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది" అని ఇథియోపియాలోని హవాసా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ వెండావేక్ ఆబీబ్ చెప్పారు.

'ఎన్సెట్' లేదా 'ఫాల్స్ బనానా' అని పిలిచే ఈ పంట అరటి జాతికి దగ్గరగా ఉండే బంధువు. కానీ, దీనిని, ఇథియోపియాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తింటారు.

ఈ చెట్టుకు కాసే అరటి లాంటి పండు తినేందుకు మాత్రం పనికిరాదు. కానీ, ఈ చెట్టుకుండే పిండి పదార్ధం లాంటి కాండం, వేళ్ళను పులియబెట్టి జావ, రొట్టెలు చేసేందుకు వాడతారు.

ఇది ఇథియోపియాలో చాలా మంది ప్రధాన ఆహారంగా తింటారు. ఆహారం కోసం కనీసం 2కోట్ల మంది దీని మీద ఆధారపడతారు. కానీ, దీనిని ప్రపంచంలో మరెక్కడా పండించటం లేదు. దీనిని దక్షిణ ఆఫ్రికా అంతటా పండించవచ్చని భావిస్తున్నారు.

ఎన్సెట్ చెట్టు అరటిని పోలి ఉంటుంది

ఫొటో సోర్స్, RBG KEW

ఫొటో క్యాప్షన్, ఎన్సెట్ చెట్టు అరటిని పోలి ఉంటుంది

కొన్ని వ్యవసాయ సర్వేలు, మోడలింగ్ పనుల ఆధారంగా, ఈ పంట మరో నాలుగు దశాబ్దాల వరకు పండించగలిగే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ద్వారా వచ్చే పంట 10 కోట్ల మందికి పైగా ఆహారాన్ని అందించి ఇథియోపియాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాలైన కెన్యా, ఉగాండా, రువాండా లాంటి దేశాల్లో కూడా ఆహార భద్రతను పెంచగలదని అన్నారు.

"ఆహార కొరత ఏర్పడే సమయంలో ఎన్సెట్ ను ఒక అదనపు పంటగా పెంచడం ద్వారా ఆహార భద్రతను పెంచవచ్చు" అని ఈ అధ్యయన కర్త డాక్టర్ జేమ్స్ బోరెల్ చెప్పారు.

"దీనికున్న వినూత్న లక్షణాల వల్ల ఇది విభిన్నమైన పంటగా నిలుస్తుంది" అని ఆయన చెప్పారు.

"దీనిని ఎప్పుడైనా పండించవచ్చు. అన్ని కాలాల్లో పంట చేతికొచ్చి శాశ్వతంగా ఉంటుంది. అందుకే దీనిని ఆకలి తీర్చే చెట్టు అని అంటారు".

ఎన్సెట్ చెట్టు అరటిని పోలి ఉంటుంది

ఫొటో సోర్స్, RBG KEW

ఫొటో క్యాప్షన్, ఎన్సెట్ చెట్టు అరటిని పోలి ఉంటుంది

ఆఫ్రికాలో పంటల పెంపకానికి ఇథియోపియా ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ కాఫీ లాంటి ఇతర పంటలను కూడా పండిస్తారు.

అయితే, ఆఫ్రికాలో మాత్రమే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఆహార పంటల సరఫరా, ఉత్పత్తి పై వాతావరణ మార్పులు తీవ్రమైన ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రపంచ జనాభా ఆకలి తీర్చేందుకు కొత్త పంటలను కనుగొనేందుకు ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఆహారం కోసం కొన్ని పంటల పై మాత్రమే ఆధారపడుతున్నాం. మనం తినే ఆహారంలో సగం కేలరీలు ప్రధానంగా బియ్యం, గోధుమ, జొన్న నుంచి వస్తున్నాయి.

"ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక వృక్ష జాతులను వైవిధ్యభరితం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఆహారం చాలా తక్కువగా ఉంది" అని డాక్టర్ బోరెల్ చెప్పారు.

ఈ అధ్యయనం ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురితమయింది.

వీడియో క్యాప్షన్, కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ ‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)