ఆహారం: అత్యంత ప్రమాదకరమైన 5 ఆహార పదార్థాలు... వీటిని తినడం ప్రాణాంతకం

కాజు మార్జు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్ కాజు మార్జు

కొన్ని పదార్థాలను తింటే ఎలాంటి హానీ ఉండదని అనిపించవచ్చు. కానీ, కొన్నింటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది.

వంట కోసం పదార్థాలను సరిగా ఎంపిక చేసుకోకున్నా, సరిగా ఉడికించకున్నా, ఆహార పదార్థాలను నిల్వ చేసే పరిస్థితులు సరిగా లేకున్నా... వాటిని తింటే వాంతులు, విరేచనాలతో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడమే కాదు, కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది.

ముఖ్యంగా అయిదు పదార్థాలను తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకవేళ ఇంత రిస్క్ చేసి తినడం ఎందుకులే అని మీరు అనుకుంటే, వాటిని పూర్తిగా పక్కన పెట్టేయడం మంచిది.

రెడ్ బీన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెడ్ బీన్స్

1. రెడ్ బీన్స్, సోయా బీన్స్ (రాజ్మా)

బీన్స్, చిక్కుడు ఆరోగ్యానికి మంచివని సాధారణంగా చెబుతుంటారు. అయితే, అందులో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిని సరిగ్గా వండకుండా తింటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.

ఎరుపు బీన్స్, సోయాబీన్స్ ఈ కోవలోకి వస్తాయి. ఉత్తర భారతంలో దీన్ని అత్యధికంగా ఉపయోగిస్తారు.

సానుకూల విషయం ఏంటంటే, వీటిలో ప్రోటీన్లు, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి.

మరోవైపు ప్రతికూల విషయానికొస్తే, పచ్చి బీన్స్‌లో 'ఫైటోహెమగ్లుటినిన్' అనే కొవ్వు పదార్థం ఉంటుంది. ఆ కొవ్వును జీర్ణించుకోవడం చాలా కష్టం.

దీనిని సరిగా ఉడికించకుండా తింటే కడుపులో నొప్పి, వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది.

రెడ్ బీన్స్ మాదిరిగానే, సోయాబీన్స్‌లో కూడా ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని చెబుతారు.

కానీ, దురదృష్టవశాత్తు వాటిలో సహజమైన టాక్సిన్ (ట్రిప్సిన్ అనే ఎంజైమ్‌) కూడా ఉంటుంది. అది ఆహారం సరిగా జీర్ణం కాకుండా నిరోధిస్తుంది.

ఈ రెండు బీన్స్‌ను కనీసం 12 గంటలు నీటిలో నానబెట్టి, కడగాలి. ఆ తర్వాత ఉడకబెట్టి, ఆరబెట్టాలి. అప్పుడు వండుకుని తింటే సమస్యలు ఉండవు.

జాజికాయ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాజికాయలను ఎక్కువగా వాడితే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది

2. జాజికాయ

ఈ మసాలా దినుసు ఇండోనేషియాలో ఎక్కువగా దొరుకుతుంది. కొన్ని రకాల వంటకాలలో అదనపు రుచి కోసం వీటిని వినియోగిస్తారు.

బంగాళాదుంపలు, మాంసం, సాస్‌లు, కూరగాయలు వంటకాలతో పాటు, కొన్ని పానీయాల తయారీలోనూ జాజికాయను వాడుతారు.

అయితే, దీనిని అధిక పరిమాణంలో తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వికారం, నొప్పి, శ్వాస సమస్యలు, మూర్ఛతో పాటు మానసిక సమస్యలకు కూడా ఇది కారణం అయ్యే అవకాశం ఉంది.

జాజికాయ వల్ల ఆహారం విషతుల్యమై దానిని తిన్నవారు చనిపోయిన ఘటనలు చాలా అరుదుగానే ఉన్నాయి. అయినా, దీని వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కాసు మార్జు చీజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ చీజ్ లోపల పురుగులను వేస్తారు

3. కాజు మార్జు చీజ్

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్‌గా దీనికి పేరుంది. దీనికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ... దీని లోపల పురుగులు ఉండటం.

ఆ పురుగులను చూస్తే తినాలన్న ఆసక్తి కొందరికి కలగపోవచ్చు, కానీ ఇటలీలోని సర్డీనియాలో బాగా ప్రాచుర్యం ఉన్న ఈ చీజ్‌ను ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు.

పెకోరినో రొమానో అనే ఇటాలియన్ చీజ్‌కు లార్వాలను కలిపి కాజు మార్జును తయారు చేస్తారు.

లోపల ఉండే ఆ చిన్న పురుగులు చీజ్‌ను మెత్తగా, జిగురులా చేస్తాయి. దాంతో, దానిని తినేటప్పుడు చీజ్ లోపలి మధ్య భాగం దాదాపు ద్రవ పదార్థంలా ఉంటుంది. ఆ పురుగుల కారణంగా దీని రుచి భిన్నంగా ఉంటుంది.

దీనిని తినాలంటే, ముందుగా కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఈ చీజ్ దొరకడం చాలా అరుదు. ఎందుకంటే, యూరోపియన్ యూనియన్ అనుమతి పొందిన ఆహార పదార్థాల జాబితాలో కాజు మార్జును చేర్చలేదు. కాబట్టి, దీనిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి లేదు.

దీనిని "ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్"గా అభివర్ణిస్తారు. ఇది తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి.

ఒకవేళ లోపల ఉన్న పురుగులు చనిపోతే ఆ చీజ్ చెడిపోయిందని అర్థం. ఆరోగ్యం సరిగా లేనప్పుడు దీనిని తింటే కడుపులో అసౌకర్యంగా అనిపించడం, వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Rhubarb stems

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రుబర్బ్ కాడలు

4. రుబర్బ్ (రేవల్చిన్ని)

బ్రిటిష్ వంటకాలలో రుబర్బ్ కాడలకు బాగానే ప్రాధాన్యం ఉంది. చాలా బ్రిటిష్ ఫలహారాలు, పానీయాలలో వీటిని వినియోగిస్తారు.

కానీ, రుబర్బ్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, రుచికరమైన కాడలతో పాటు వచ్చే పచ్చని ఆకుల్లో విషం ఉంటుంది.

మరీ ముఖ్యంగా ఆ ఆకుల్లో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. అది కడుపులోకి వెళ్తే వికారం కలిగిస్తుంది. ఖనిజ లవణాలను జీర్ణం చేసుకునే శక్తిని తగ్గిస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు కూడా ఆ పదార్థం కారణమయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆక్సాలిక్ ఆమ్లం కలిగి ఉండే రుబర్బ్ ఆకులు నిజంగా ఎంత ప్రమాదకరమైనవి అనే దానిపై ఇంకా చాలా చర్చలు జరుగుతున్నాయి.

నిజానికి కాడలలోనూ ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది, కానీ ఆకులతో పోలిస్తే కాడలలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది.

ఎక్కువ మొత్తంలో ఆకులను తింటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి, అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పూర్తిగా అలాంటి వంటకాలకు దూరంగా ఉండటం మంచిది.

పఫ్ఫర్ ఫిష్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అత్యంత ప్రమాదకరమైన పఫ్ఫర్ ఫిష్ వంటకానికి జపాన్‌లో చాలా డిమాండ్ ఉంది

5. పఫ్ఫర్ ఫిష్

పఫ్ఫర్ ఫిష్... అత్యంత విషపూరితమైన చేప ఇది.

దీని శరీరంలో విషపూరిత టెట్రోడోటాక్సిన్ ఉంటుంది. అది సైనైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరమని చెబుతారు.

అయితే, అంత ప్రమాదకరమైనా, దీనితో చేసే వంటకాలకు కొన్ని దేశాల్లో భారీ డిమాండ్ ఉంది.

పఫ్ఫర్ ఫిష్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విషపూరితమైన అవయవాలను తొలగించిన తర్వాతే పఫ్ఫర్ చేపను వండాలి. అందుకోసం చెఫ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

జపాన్‌లో పఫ్ఫర్ ఫిష్‌తో చేసే 'ఫుగు' అనే వంటకానికి మంచి ఆదరణ ఉంది. ఈ వంటకం తయారు చేసే చెఫ్‌లు కొన్నేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ వంటకంలో చేప మెదడు, చర్మం, కళ్ళు, బీజకోశాలు, కాలేయం, పేగులు లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)