సింగపూర్: అడవిలో ఈయన ఒంటరిగా 30 ఏళ్లు ఉన్నారు

ప్రపంచంలో పట్టణ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సింగపూర్ ఒకటి. అక్కడ ఎటుచూసినా లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఆకాశహర్మ్యాలు కనిపిస్తుంటాయి. అయితే, ఒక వ్యక్తి మాత్రం వాటితో సంబంధం లేకుండా అటవీ ప్రాంతాన్ని తన నివాసంగా చేసుకున్నారు.
ఓ గో సెంగ్‌ను కలిసినప్పుడు ఆయన కళ్లలో అప్యాయత కనిపిస్తుంది.
సన్నగా ఉండే ఆయన వయసు 79ఏళ్లు. ఆయన వయసులో సగం కంటే తక్కువ వయసుండే చాలా మంది కంటే ఆయన ఆరోగ్యంగా కనిపిస్తున్నారు.
సింగపూర్‌లో ఓ అటవీ ప్రాంతంలో ఆయన ఒంటరిగా నివసిస్తున్నట్లు చెబుతున్న ఓ వీడియో ఇటీవల వైరల్ అయింది. ఈ విషయం విని చాలా మంది షాక్‌కు గురయ్యారు.
ఆయనకు ఎందుకు సాయం అందడంలేదని కొందరు ప్రశ్నిస్తుంటే.. 30ఏళ్లుగా ఆయన అలా ఎలా జీవిస్తున్నారని మరికొందరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

క్రిస్మస్‌నాటి సమస్య
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారని క్రిస్మస్‌నాడు కొందరు అధికారులు పట్టుకోవడంతో సెంగ్ కథ వెలుగులోకి వచ్చింది.
ఆ రోజు తాను పండించిన కొన్ని ఆకుకూరలు, మిరపకాయలు ఆయన విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో పువ్వులు విక్రయించే ఉద్యోగాన్ని కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆయన పోగొట్టుకున్నారు.
విక్రయాలకు సంబంధించి ఒక సింగపూర్ డాలర్ (రూ.55)పై వివాదం జరగడంతో ఓ కస్టమర్ సెంగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సెంగ్ కూరగాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అటుగా వెళ్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు గుర్తించారు.
సెంగ్ పరిస్థితిని చూసిన వెంటనే చాలా కోపం వచ్చిందని వివియన్ పాన్ చెప్పారు.
‘‘ఆ రోజు ఆయన ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లకూడదని నేను అనుకున్నాను.’’
‘‘కానీ, అలా లైసెన్సు లేకుండా వస్తువులను అమ్మడం కూడా నేరమే. ఆ విషయం కూడా నేను అర్థం చేసుకోగలను’’అని ఆమె వివరించారు.
అక్కడ జరిగిన తతంగాన్ని ఆమె వీడియోగా చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. స్థానిక పార్లమెంటు సభ్యుడు కూడా ఈ విషయంపై స్పందించారు.
ఈ విషయంపై ఆరా తీయడంతో సెంగ్ గురించి ఎంపీ లియాంగ్ ఎంగ్ హువాకు మరిన్ని విషయాలు తెలిశాయి.
దాదాపు 30ఏళ్లుగా సెంగ్ అలా ఒంటరిగా జీవిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

అటవీ జీవితం..
స్థానిక సుంగేయి తెంగా గ్రామంలో తన కుటుంబ సభ్యుల మధ్యే సెంగ్ పెరిగారు.
అయితే, 1980ల్లో ఆకాశహర్మ్యాలను నిర్మించేందుకు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.
ఇక్కడ జీవించే చాలా మందికి ప్రభుత్వం కొత్త ఇళ్లు ఇచ్చింది. కానీ సెంగ్‌కు మాత్రం ఉండటానికి చోటు దొరకలేదు.
అయితే, ఆయన సోదరుడికి మాత్రం ప్రభుత్వ ఇల్లు దొరికింది. అక్కడ ఉండేందుకు సెంగ్‌ను ఆయన ఆహ్వానించారు. అయితే, కుటుంబానికి భారంగా మారకూడదని కొన్ని రోజుల తర్వాత ఆయన వెనక్కి వచ్చేశారు.
అలా ఆయన తన పాత ఇంటికి సమీపంలోని ఓ అటవీ ప్రాంతానికి వచ్చేశారు. చెక్కలు, వెదురుకర్రలు, టార్పాలిన్‌లతో వేసిన గుడారాల్లో ఆయన ఉండేవారు.
ఆయన గుడారం దగ్గరకు వెళ్తే.. లోపలకు వెళ్లే ప్రాంతానికి ముందువైపు బూడిద కనిపిస్తుంది. అక్కడే సెంగ్ వంట చేసుకుంటారు. గుడారం మధ్యలో ఆయన వస్తువులు ఉంటాయి. చివరిభాగంలో ఆయన నిద్రపోతారు.
ఆయన టెంట్‌కు సమీపంలో చిన్న తోట కనిపిస్తుంది. అక్కడే ఆయన తనకు కావాల్సినవన్నీ పండించుకుంటారు. చెట్ల మధ్య తాడుకట్టి ఆయన బట్టలను ఆరేస్తున్నారు. బయటనుంచి ఎవరూ వచ్చి కూరగాయలు తీసుకుపోకుండా కంచె కూడా వేశారు.
ఆయన గుడారం ఓ పనస చెట్టు కింద ఉంటుంది. తనకు కావాల్సినంత నీడ ఈ చెట్టు కింద దొరుకుతుందని ఆయన చెప్పారు. ఉష్ణమండల శీతోష్ణ వాతావరణంలో ఉండేటప్పటికీ తనకు అసౌకర్యంగా అనిపించదని వివరించారు.
ఒంటరితనం కూడా తనకు ఎప్పుడూ సమస్యగా అనిపించలేదని ఆయన అన్నారు. తోట పనులతో తను ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటానని చెప్పారు.
అడవిలో అన్నింటి కంటే కష్టం ఏదైనా ఉందంటే అది ఎలుకల వల్లేనని ఆయన అన్నారు. తన గుడారంలోకి దూరే ఎలుకలు తన బట్టలను కొరికేస్తుంటాయని చెప్పారు.
ఏదైనా చిన్నచిన్న పనులు దొరికితే అప్పుడప్పుడు చేస్తుంటానని ఆయన వివరించారు.
డబ్బులు సమకూరినప్పుడు పడవలో పొరుగునున్న ఇండోనేసియాకు చెందిన బటమ్ దీవికి వెళ్తుంటానని ఆయన చెప్పారు. అక్కడే ఆయన మడమ్ తచీను కలుసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది.
వారాంతంలో పనిపూర్తయ్యాక ఆయన అక్కడకు వెళ్తుంటారు. వారిని కలిసిన తర్వాత మళ్లీ వెనక్కి వచ్చేస్తుంటారు.
ఆయన సింగపూర్‌లో ఎలా జీవిస్తున్నారో తమకు తెలియదని ఆయన భార్య, 17ఏళ్ల కుమార్తె చెప్పారు.
ఎక్కడ ఉంటున్నావు? అని ఎవరైనా అడిగితే.. ‘‘తోటలో ఉంటున్నా’’అని ఆయన సమాధానం చెప్పేవారని ఆయన బంధువు ఒకరు వివరించారు.
కరోనావైరస్ వ్యాప్తి నడుమ తన భార్య, కుమార్తెను కూడా కలవడానికి వెళ్లడం ఆయన మానేశారు. క్వారంటైన్, కోవిడ్ పరీక్షలకు డబ్బులు వెచ్చించగలిగే వారిని మాత్రమే విదేశాలకు ప్రయణించేలా సింగపూర్ ఆంక్షలు తీసుకొచ్చింది.
తను అడవిలో జీవిస్తున్నప్పటికీ ప్రతి నెలా తన కుటుంబానికి 500 డాలర్ల (రూ. 37,342) నుంచి 600 డాలర్ల (44,810.64) వరకు ఆయన పంపిస్తుంటారు.
సింగపూర్‌లో ఇల్లులేకుండా రోడ్లపై జీవించేవారు చాలా అరుదు. సుసంపన్న దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి.
ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం.. తలసరి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 60,000 డాలర్లు (రూ.44,81,064).
ఇక్కడ పటిష్ఠమైన ప్రభుత్వ గృహ కల్పన కార్యక్రమం కూడా అమలవుతోంది. దాదాపు 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వ సబ్సిడీ ఇళ్లలో జీవిస్తుంటారు.
‘‘తొలిసారి టీవీ చూశాను..’’
సింగపూర్ కొత్త సంవత్సరంనాడు స్థానిక ఎంపీ సాయంతో సెంగ్‌కు జీవించడానికి కొత్త ఇల్లు దొరికింది.
సెంగ్‌కు అవసరమైనవి తాను సమకూరుస్తానని ఎంపీ లియాంగ్ చెప్పారు.
‘‘ఇండోనేసియాలోని తన కుమార్తె, భార్యతో కలిసి ఉండేందుకు ఆయనకు అవసరమైన సాయం చేస్తాం’’అని ఆయన అన్నారు.
ప్రస్తుతం సెంగ్ మరొకరితో కలిసి సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఇది కాస్త చిన్నది. దీనిలో ఉన్న సదుపాయాలు కాస్త తక్కువ.
ఫ్రిడ్జ్, టీవీ, హీటర్ లాంటి కొన్ని పరికరాలను ఆయనకు కొందరు బహుమతిగా ఇచ్చారు.
వాటర్ హీటర్ తనకెంతో నచ్చిందని సెంగ్ చెప్పారు. తను తన గుడారానికి పక్కనుండే చెరువులోని నీటిని ఉపయోగించేవాడినని, ఆ నీరు చాలా చల్లగా ఉండేవని వివరించారు.
ప్రస్తుతం సెంగ్ డ్రైవర్‌గా విదేశీ ఉద్యోగులను ఒక చోట నుంచి మరోచోటకు తీసుకెళ్తున్నారు. అప్పుడప్పుడు తోటమాలిగా కూడా పనిచేస్తున్నారు.
తను కుటుంబంతో కలిసి సింగపూర్ కొత్త సంవత్సరం జరుపుకొని ఈ ఏడాదితో మూడు దశాబ్దాలు పూర్తవుతున్నాయని సెంగ్ చెప్పారు.
‘‘నేను చాలా తిన్నాను. అక్కడ చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని నేను తిని చాలా ఏళ్లు అవుతోంది’’అని ఆయన అన్నారు.
‘‘చాలా బావుంది. 30 ఏళ్లలో తొలిసారి టీవీ చూశాను. ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నాను’’ అని ఆయన చెప్పారు.
అడవిలోని స్వేచ్ఛా జీవితాన్ని ఆయన మిస్ అవుతున్నారు. అయితే, ఇప్పుడు ఆయన ఫ్లాట్‌లో ఉండేందుకే ఇష్టపడుతున్నారు.
‘‘అక్కడ నేను చాలా ఏళ్లు గడిపాను. కాబట్టి కచ్చితంగా ఆ చోటును మిస్ అవుతున్నాను’’
‘‘రోజూ ఉదయం 3 గంటలకు నిద్రలేచిన వెంటనే నా తోటను చూసుకునేందుకు అడవికి వెళ్తున్నాను. ఆ తర్వాతే మిగతా రోజువారీ పనులు మొదలుపెడతాను’’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:
- అటల్ బిహారీ వాజ్‌పేయీ: ప్రేమించిన అమ్మాయిని వాజ్‌పేయీ ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
- ఫ్రెంచ్ సైన్యం మాలిని వదిలిపెట్టి ఎందుకు వెళుతోంది?
- అమెరికాతో ఒప్పందంపై నేపాల్ ప్రభుత్వం ఎందుకు వివాదంలో చిక్కుకుంది? దీనికి భారత్ ఆమోదం ఎందుకు?
- టీ స్టార్టప్‌లు: అల్లం టీ, యాలకుల టీ, తులసి టీ, గ్రీన్ టీ మాత్రమే కాదు.. సరికొత్త రుచుల్లో భారతీయ తేనీరు
- ఫాల్స్ ఫ్లాగ్ అటాక్: ఏమిటీ వార్ ప్లాన్? యుక్రెయిన్‌పై దాడికి రష్యా వ్యూహం ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















