768 కిలోమీటర్ల పొడవైన మెరుపు.. సరికొత్త ప్రపంచ రికార్డు

నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ తీసిన భారీ మెరుపు, పిడుగుపాటు చిత్రం
ఫొటో క్యాప్షన్, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ తీసిన భారీ మెరుపు, పిడుగుపాటు చిత్రం

అమెరికాలో దాదాపు 500 మైళ్ల పొడవైన పిడుగు.. మూడు రాష్ట్రాల్లో ఆకాశంలో వెలుగులీనింది. అత్యంత పొడవైన పిడుగుగా ఇది సరికొత్త రికార్డును నెలకొల్పిందని శాస్త్రవేత్తలు నిర్ధరించారు.

2020లో వచ్చిన ఈ పిడుగు.. 768 కిలోమీటర్ల (477.2 మైళ్ల) పొడవు సాగింది. మిసిసిపి, లూసియానా, టెక్సస్ రాష్ట్రాల మీదుగా వ్యాపించింది.

అంతకుముందు అత్యంత పొడవైన పిడుగు రికార్డు 2018లో నమోదైంది. బ్రెజిల్‌లో వచ్చిన ఆ మెరుపు 709 కిలోమీటర్లు (440.6 మైళ్లు) వ్యాపించింది.

మెరుపులు, పిడుగులు 10 మైళ్లకు మించి వ్యాపించటం చాలా అరుదు. సాధారణంగా ఒక సెకను లోపు మాత్రమే కనిపిస్తాయి.

2020లో ఉరుగ్వే, అర్జెంటీనాల్లో నమోదైన ఒక పిడుగు 17.1 సెకన్ల పాటు కనిపించి.. అత్యంత ఎక్కువ సేపు కొనసాగిన మెరుపుగా కొత్త రికార్డు సృష్టించింది. దానికిముందు ఎక్కువసేపు కనిపించిన మెరుపు రికార్డు 16.7 సెకన్లుగా ఉంది.

వీడియో క్యాప్షన్, వీడియో: అంతరిక్షం నుంచి మేఘాలలో మెరుపులు ఎలా కనిపిస్తాయో చూడండి.

‘‘మెరుపులు, పిడుగుల్లో ఇవి అసాధారణ రికార్డులు’’ అని వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) ప్రతినిధి ప్రొఫెసర్ రాండాల్ సెర్వెనీ పేర్కొన్నారు.

ఈ రెండు రికార్డులూ.. మెగా మెరుపులు, పిడుగులను పుట్టించే తీవ్ర తుపానులకు ఆలవాలమైన ప్రాంతాల్లో నమోదయ్యాయని డబ్ల్యూఎంఓ చెప్పింది.

వాతావరణంలో ఇంతకుమించిన అసాధారణ మెరుపులు, పిడుగుల సంఘటనలు ఉండవచ్చునని.. అంతరిక్షం నుంచి మెరుపులను పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటం వల్ల.. వాటిని నమోదు చేసే అవకాశం కూడా ఉందని ప్రొఫెసర్ సెర్వెనీ వివరించారు.

మెరుపులు, పిడుగులు ప్రమాదకరమని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. ప్రపంచంలో ఇవి ఎక్కువగా, తీవ్రంగా సంభవించే ప్రాంతాల్లో తుపానుల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వీడియో క్యాప్షన్, ఈ దేశాన్ని సముద్రం మింగేస్తోంది.. ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోని ప్రజలు

‘‘అసాధారణరీతిలో పొడవైన, ఎక్కువ సేపు కొనసాగే మెరుపులు, పిడుగులు విడిగా వచ్చినవి కావు. గాలివానల సమయంలో వచ్చినవివి. ఎప్పుడైనా సరే ఉరుములు వినిపించినపుడు.. పిడుగుల నుంచి రక్షణ కల్పించే ప్రాంతాలను చేరుకోవాలి’’ అని డబ్ల్యూఎంఓ మెరుపుల నిపుణుడు రాన్ హాల్ ఒక ప్రకటనలో సూచించారు.

అతి తీవ్రమైన పిడుగులుగా డబ్ల్యూఎంఓ ఆమోదించిన ఉదంతాల్లో.. 1975లో 21 మందిని బలితీసుకున్న ఒక పిడుగు కూడా ఉంది. జింబాబ్వేలో సంభవించిన ఆ ఘోరదుర్ఘటన సమయంలో.. ఒక టెంట్‌లో గుమిగూడిన జనం మీద ఆ భారీ పిడుగు పడింది.

1994లో ఈజిప్టులోని డ్రోంకా పట్టణంలో పిడుగుపాటు వల్ల చమురు మండుతూ పట్టణాన్ని ముంచెత్తటంతో 469 మంది చనిపోయారు.

పిడుగుల నుంచి రక్షణ లభించే ఏకైక ప్రాంతాలు.. వైరింగ్, ప్లంబింగ్ చేసివున్న గట్టి భవనాలు మాత్రమేనని.. బస్‌స్టాపులు, బీచ్‌లలో కనిపించే చిన్నపాటి కట్టడాలు కాదని.. డబ్ల్యూఎంఓ తెలిపింది.

పూర్తిగా మూసివేసివున్న, లోహపు పైకప్పు ఉన్న వాహనాలను కూడా సురక్షితమైన ప్రాంతాలుగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)