భారతదేశంలో డైనోసార్లను మింగేసే పాములు, ఒంటికొమ్ము రాకాసి బల్లులు ఏమయ్యాయి?

రాజసారస్ ఊహాచిత్రం

ఫొటో సోర్స్, Alamy

    • రచయిత, కమలా త్యాగరాజన్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

భూగ్రహంలోనే అత్యద్భుత శిలాజ సంపదలు ఇండియాలో ఉన్నాయి. డైనోసార్ల గుడ్లు దగ్గర నుంచి సైన్స్ రంగానికే కొత్తగా పరిచయమైన చరిత్రపూర్వ జీవరాశులు అనేకం వెలుగులోకి రాకుండా ఉండిపోయాయి.

నాగ్‌పూర్ సెంట్రల్ మ్యూజియంకు, పురాతన జంతు శాస్త్ర నిపుణులు జెఫ్రీ ఏ విల్సన్, 2000వ సంవత్సరంలో వెళ్లారు. అక్కడ కనిపించిన కొన్ని పురాతన శిలాజాల నమూనాలు ఆయన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. వాటిని 1984లో గుజరాత్‌ పశ్చిమ తీర గ్రామం ఢోలీ డుంగ్రీలో జెఫ్రీ కొలీగ్ ఒకరు సేకరించారు.

వీడియో క్యాప్షన్, దీన్ని క్షేమంగా వెలికితీసేందుకు ఓ వారం సమయం పట్టొచ్చని పరిశోధకులు అంటున్నారు

ఆ నమూనాలో మొట్టమొదటిసారిగా, పిల్ల డైనోసార్ ఎముకలను, వాటి గుడ్లను గుర్తించామని, మిచిగాన్ యూనివర్శిటీలోని జియొలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ విల్సన్ చెప్పారు. అయితే ఆయన ఆశ్చర్యానికి మరొక కారణం - ఆయన పరిశీలిస్తున్న నమూనాలో చిన్న పరిమాణంలో ఉన్న రెండ కీళ్ల మధ్య కనెక్షన్ ప్రత్యేకంగా ఉందని, అది కేవలం పాముల్లోనే కనిపించే రకమని విల్సన్ చెబుతున్నారు.

వాటిని సరైన విధంగా అర్ధం చేసుకునేందుకు వెన్నుపూస భాగాన్ని పరిశీలించగా, అదేవిధమైన కీళ్ల ప్రక్రియ వెన్నుపూసలో కూడా గుర్తించారు. ఒక్కసారిగా బుర్రలో బల్బు పేలినట్లు అనిపించిందని, ఈ శిలాజ నమూనాలో చరిత్రపూర్వ కాలానికి చెందిన పాముల అవశేషాలు కూడా ఉన్నాయా అనిపించిందని తెలిపారు.

భారతదేశంలో శిలాజాలుగా మారిపోయిన వందలాది రాకాసి బల్లుల గుడ్లు లభించాయి

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో శిలాజాలుగా మారిపోయిన వందలాది రాకాసి బల్లుల గుడ్లు లభించాయి

అయితే శిలాజ అవశేషాలను సరైన విధంగా శుభ్రం చేసేందుకు అవసరమైన వసతులు ఇండియాలో లేవు. దాంతో ఈ నమూనాను అమెరికాకు తరలించేందుకు, జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కోసం నాలుగేళ్లు ఎదురు చూశారు విల్సన్. అత్యంత సున్నితంగా ఉన్న ఈ ఎముకల భాగాలను శుభ్రం చేసేందుకు దాదాపుగా ఏడాది పడుతుందని తెలిపారు.

కొన్నేళ్లుగా ఈ శిలాజ నమూనాపైన శాస్త్రవేత్తలు, పురాతన జంతు శాస్త్ర నిపుణులు పరిశోధనలు చేశారు.

భారతీయ పురాతన జంతు శాస్త్ర నిపుణులైన ధనంజయ్ మొహాబే, జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి మరికొందరు, విల్సన్‌ కలిసి ఒక పరిశోధనా పత్రాన్ని పబ్లిష్ చేశారు. అందులో చరిత్రపూర్వ కాలంలో పాముల మనుగడను గుర్తించడమే కాకుండా, ఆ కాలంలోని పాములు అప్పుడే పుట్టిన డైనోసార్ పిల్లను మింగేసేంత వెడల్పుగా నోటిని తెరిచేవని పరిశోధనలో తేల్చారు.

పురాతన చరిత్ర రహస్యాలు మరుగున పడకుండా వెలుగులోకి తీసుకొచ్చి, సైన్స్ రంగానికి కొత్త సమాచారాన్ని అందిస్తున్నాయి ఇటువంటి శిలాజ అవశేషాలు. అయితే ఇండియాలో దాగిఉన్న అద్భుత శిలాజ సంపదపైన శాస్త్రీయమైన అధ్యయనాలు కానీ, క్రమ పద్ధతిలో పరిశోధనలుగానీ జరగట్లేదు. వాటికి అవసరమైన వనరులు, డబ్బుకూడా సమకూరట్లేదని పురాతన జంతు శాస్త నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇండియాలో ఉన్న చారిత్రక శిలాజ సంపదను గుర్తించకపోవడమే కాకుండా వాటిని మరిచిపోయారని యేల్ యూనివర్శిటీ వర్టిబ్రే పేలియంటాలజిస్ట్ అద్వైత్ ఎమ్ జుకార్ అన్నారు. పెద్ద సంఖ్యలో అత్యంత పురాతన తిమింగలాలు భారత్‌లో ఉండేవని, భారీ ఖడ్గమృగాలు, ఎక్కడా మనుగడలో లేని ఏనుగులు, అధిక సంఖ్యలో డైనోసార్ గుడ్లు, అలానే డైనోసార్ల కాలానికి ముందు వింతైన కొమ్ములతో కనిపించే సరీసృపాలు - ఇవన్నీ ఇండియాలో ఉన్నాయని అద్వైత్ చెప్పుకొచ్చారు. అయితే వీటి విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అనేక అంశాలు ఇంకా తెల్సుకోవాల్సి ఉందని కూడా గుర్తు చేశారు.

వీటిపైన అధ్యయనాలు జరపకపోవడానికి ప్రధాన కారణం, ఇండియాలోని పురాతన జంతు శాస్త్ర నిపుణులు వీటి గురించి ఒక క్రమ పద్ధతిలో తెల్సుకోకపోవడమే అంటూ విమర్శలు కూడా ఉన్నాయి.

మరోవైపు ఇండియాలో వెలువడిన పురాతన జంతువుల ముఖ్యమైన సమాచారంతో, పురాతన థియరీల ద్వారా ఏర్పడిన అపోహలను తొలగిస్తూ - కాలక్రమంలో జీవం ఎలా అభివృద్ధి చెందుతూ మనుగడ సాగించిందో తెల్సుకునేందుకు కొత్త మార్గాలు తెరుచుకున్నాయి.

ఈ సరికొత్త అవిష్కరణల్లో కీలక పాత్ర పోషించారు ప్రముఖ పురాతన జంతు శాస్త్రవేత్త అశోక్ సాహ్ని. ఆయన తండ్రి, తాతలు కూడా ఇదే రంగంలో సేవలందించారు. ఆయన సేకరించిన సొంత శిలాజాల కలెక్షన్‌ను పంజాబ్ యూనివర్శిటీ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంచారు.

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ ప్రాంతంలో గుర్తించిన టిటానోసారస్ రాకాసిబల్లి ఊహాచిత్రం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్ జబల్‌పూర్ ప్రాంతంలో గుర్తించిన టిటానోసారస్ రాకాసిబల్లి ఊహాచిత్రం

ఇండియాలో 1982లో జబల్‌పూర్ నగరంలో మొట్టమొదటిసారిగా డైనోసార్ గుడ్ల అవశేషాలను సాహ్ని గుర్తించారు. ఇప్పుడు నలభైయ్యేళ్ల తర్వాత, డైనోసార్లు, గుడ్లను పొదిగిన ప్రాంతాలను ఇండియా మొత్తంగా గుర్తించారు.

ఇరవైయ్యేళ్లపాటు జరిపిన తవ్వకాల్లో దొరికిన ఎముకుల భాగాలను ఒకచోట పేర్చగా, ఇండియాలో కొత్త జాతి డైనోసార్‌ ఉనికిని గుర్తించారు. దీనిద్వారా సాహ్ని అంతర్జాతీయంగా పేరుపొందారు.

ప్రపంచవ్యాప్తంగా పేద ప్రాంతాల్లో శిలాజాల తవ్వకాలకు కొందరు నిధులు సమకూర్చి, అక్కడ దొరికిన శిలాజాలను తమ సొంత దేశాలకు తీసుకెళ్లిపోయారు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా పేద ప్రాంతాల్లో శిలాజాల తవ్వకాలకు కొందరు నిధులు సమకూర్చి, అక్కడ దొరికిన శిలాజాలను తమ సొంత దేశాలకు తీసుకెళ్లిపోయారు

మరికొన్ని ముఖ్యమైన ఘటనలు ఇండియాలో చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిమింగలాల ఉనికి, ప్రప్రథమంగా మొదలైంది ఇండియా - పాకిస్తాన్ సముద్ర పీఠంలోనేనని ఒక పరిశోధన చెబుతున్నట్లు అధ్వైత్ తెలిపారు.

ఈ పురాతన చరిత్రను అధ్యయనం చేస్తే కాలక్రమంలో పర్యావరణాన్ని మనం ఏ స్థాయిలో ధ్వంసం చేశామో తెల్సుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని సాహ్ని అభిప్రాయపడ్డారు. ఉదాహారణకు, ఐస్ ఏజ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉన్న మమ్మోత్‌లు అంతరించిపోయేలా చేయడంలో మానవజాతి పాత్ర కీలకంగా ఉందని ఆయన అంటున్నారు.

అలానే నవ శిలాజ అధ్యయనాల ద్వారా - మానవజాతి పరిణామక్రమానికి ముందున్న జీవజాతులు ఏయే ప్రాంతాల్లో నివసించాయో తెల్సుకోవడానికి వీలుంటుంది. అలానే వాతావరణ మార్పుల కారణంగా జీవజాతులు తమ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో స్థిరపడతాయని, కాబట్టి గతంలో జంతువులు, మొక్కలు ఎక్కడెక్కడ జీవించాయో తెల్సుకోవడం వలన, భవిష్యత్తు వాతావరణ మార్పులతో అవి ఎక్కడికి వలసలు వెళ్తాయో అంచనా వేసేందుకు వీలుంటుందని అద్వైత్ చెబుతున్నారు.

రాజసారస్ ఊహాచిత్రం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, రాజసారస్ ఆకస్మికంగా దాడి చేస్తుంది. దీనికి తలపై ఒక కొమ్ము ఉంటుంది. దీనిని సంభోగ ప్రదర్శనకు వాడుకునేది

అయితే ఇండియా శిలాజ సంపద వెలుగులోకి రాకపోవడానికి కొన్ని కారణాలను వివరిస్తున్నారు జర్మనీలోని హెడెల్‌బర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు, కంటెంపరరీ ఇండియా చరిత్రకారులు అమెలియా బోనియా.

వలసవాద కాలం తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు, శిలాజ చరిత్ర ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని, వైజ్ఞానిక రంగంలోని అధ్యయనాలు ప్రజల జీవితాల్లో చూపగల విశిష్టతను ప్రభుత్వాలు విస్మరించాయని, వాటి అద్యయనాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసాయని బోనియా విమర్శించారు.

గుజరాత్ రాష్ట్రంలోని బాలాసినోర్‌ను భారతీయ జురాసిక్ పార్క్‌గా అభివర్ణిస్తుంటారు. ఇలాంటి శిలాజ సంపద పుష్కలంగా ఉన్న ప్రాంతాలు భారతదేశంలో చాలా ఉన్నాయి

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, గుజరాత్ రాష్ట్రంలోని బాలాసినోర్‌ను భారతీయ జురాసిక్ పార్క్‌గా అభివర్ణిస్తుంటారు. ఇలాంటి శిలాజ సంపద పుష్కలంగా ఉన్న ప్రాంతాలు భారతదేశంలో చాలా ఉన్నాయి

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పురాతన జంతు శాస్త్ర అధ్యయనానికి ఇండియా పుట్టినల్లు. ఎందుకంటే ఎంతో విశిష్టతగల బీర్బల్ సాహ్ని ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్సస్, లక్నోలో 1946లో స్థాపించారని, ఈ సంస్థ చాలా ప్రత్యేకమైనదని బోనియా వివరించారు. ఆనాటికి ప్రపంచంలోనే ఉన్న రెండు రీసెర్చ్ సంస్థల్లో ఇదీ ఒకటి. మరొకటి పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో పేలినోలాజికల్ ల్యాబొరేటరీ.

మరోవైపు 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో, బ్రిటిష్ జియాలజిస్టులు ఇండియాలో నమూనాల సేకరణలో నిమగ్నమైనట్లు జెఫ్రీ విల్సన్ చెప్పారు. ఇండియాలో దొరికిన డైనోసార్ల శిలాజ సేకరణను పూర్తిగా చూడాలంటే లండన్ కానీ న్యూయార్క్ కానీ వెళ్లాలని విల్సన్ సూచించారు.

వీడియో క్యాప్షన్, నీటి గురించి మీకు తెలియని విషయాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)