మెక్సికో: అజ్జెక్ ఆదిమ జాతి కట్టిన భారీ పుర్రెల బురుజు చెప్తున్న రహస్యాలేమిటి?

పుర్రెల బురుజు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మెక్సికో నగరం కింద ఉన్న ఈ పుర్రెల బురుజును ఐదేళ్ల కిందట గుర్తించారు

మెక్సికో నగరం నడిబొడ్డున పురావస్తు శాఖ తవ్వకాల్లో ఒక కపాలాల గుట్ట బయటపడింది. అయితే ఇవి కుప్పగా పోసి ఉన్న పుర్రెలు కావు.. పొందికగా ఒక దాని పక్కన ఒకటి, ఒక దాని మీద ఒకటిగా పేర్చిన పుర్రెలు.

2015లో మెక్సికో రాజధానిలో ఒక భవానాన్ని పునరుద్ధరిస్తున్నప్పుడు అజ్టెక్ కాలానికి చెందిన పుర్రెల గుట్ట బయటపడింది.

ఇప్పుడు తాజా తవ్వకాల్లో మరో 119 కపాలాలు బయటపడ్డాయని మెక్సికోలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రొపాలజీ అండ్ హిస్టరీ (ఐఎన్ఏహెచ్) తెలిపింది.

వరుసగా పేర్చినట్టు ఉన్న ఈ పుర్రెల గుట్టను అజ్టెక్ దేవుడైన సూర్యదేవుని ఆలయానికి సంబంధించిన పుర్రెల అల్మారాగా భావిస్తున్నారు.

అజ్టెక్ అంటే 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం ప్రారంభం వరకూ వరకూ మెక్సికో ప్రాంతంలో నివసించిన ఆదిమ జాతి. వీరు నావటల్ భాష మాట్లాడేవారు.

అజ్టెక్ సామ్రాజ్యంపై 16వ శతాబ్దంలో స్పెయిన్ రాజులు దండెత్తి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో మెసో-అమెరికా నాగరికతకు చెందిన అజ్టెక్ సామ్రాజ్యం పతనమైపోయింది.

మెసో-అమెరికన్ నాగరికతలో భాగమైన హ్యూయీ జోంపాంట్లీ.. అంటే యుద్ధాల్లో బందీలుగా పట్టుకున్నవారి పుర్రెలు లేదా బలి ఇచ్చే వారి తలల్లోంచి బయటకు తీసిన పుర్రెలను ఒక ఇనుప కడ్డీకి వరుసగా గుచ్చుతారు.

ఇలా పుర్రెలు గుచ్చిన ఇనుపకడ్డీలను ఒక దానిపై ఒకటి పేర్చి.. పుర్రెల వరుసలు తయారుచేస్తారు. ఈ పుర్రెల ర్యాక్‌ను ప్రదర్శనకు ఉంచుతారు.

పుర్రెల బురుజు

ఫొటో సోర్స్, Reuters

ప్రస్తుతం దొరికిన పుర్రెలు.. అజ్టెక్ సూర్యదేవుని ఆలయంలో ప్రదర్శనకు ఉంచిన జోంపాంట్లీ అయ్యుండొచ్చని భావిస్తున్నారు.

సూర్యదేవుడిని వారు ఉయిట్జిలోపోచ్ట్లీ అని వ్యవహరించేవారు. అజ్టెక్ రాజధాని టెనోచ్టిట్లాన్ అధిపతి అయిన ఉయిట్జిలోపోచ్ట్లీ ఆలయంలో ఒక మూల ప్రదర్శనకు ఉంచిన జోంపాంట్లీ ఈ తవ్వకాల్లో బయటపడిందని భావిస్తున్నారు.

హ్యూయీ జోంపాంట్లీ లాంటిదే టెంప్లో మేయర్ (అజ్టెక్ రాజధాని టెనోచ్టిట్లాన్‌లోని ప్రధాన ఆలయం) దగ్గర ఉండేది.

దీని ఆకారం చూసి అప్పట్లో దండెత్తి వచ్చిన స్పానిష్ రాజు సైన్యం హడలిపోయిందని చరిత్రకారులు చెబుతారు.

టెంప్లో మేయర్ ప్రదేశమే ప్రస్తుత కాలంలో మనం చూస్తున్న మెక్సికో నగరం. ఇక్కడ ప్రస్తుతం ఒక పెద్ద చర్చి ఉంది. దీని పక్కనే హ్యూయీ జోంపాంట్లీ ఉంది.

"టెంప్లో మేయర్ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా మా దేశంలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన వాటిల్లో హ్యూయీ జోంపాంట్లీ నిస్సందేహంగా ఒక అద్భుతం" అని మెక్సికన్ కల్చరల్ మినిస్టర్ అలెజాంద్రా ఫ్రస్ట్రో తెలిపారు.

పుర్రెల బురుజు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ మానవ కపాలాల బురుజును ఆదిమ జాతి సామ్రాజ్యమైన అజ్టెక్ జనం నిర్మించారు

ఈ హ్యూయీ జోంపాంట్లీ నిర్మాణం 1486 నుంచీ 1502 మధ్య కాలంలో మూడు దశల్లో జరిగినట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ పుర్రెల టవర్‌లో యుద్ధంలో మరణించిన పురుష సైనికుల కపాలాలు ఉంటాయని శాస్త్రవేత్తలు భావించారు. కానీ స్త్రీలు, పిల్లల పుర్రెలు కూడా దొరకడంతో ఇవి బలికి సంబంధించిన పుర్రెలు అయ్యుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

"వీరందరూ కూడా యుద్ధంలో పాల్గొన్న యోధులు కాకపోవచ్చు. కొందరు బందీలుగా దొరికినవారు అయ్యుండొచ్చు. ఇలా బందీలుగా పట్టుకున్నవారిని బలి ఇచ్చే వేడుకల్లో వధించి ఉండొచ్చు" అని పురావస్తు శాస్త్రవేత్త రాల్ బర్రెరా తెలిపారు.

"ఇవన్నీ పవిత్ర కార్యంలో భాగంగా.. దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇచ్చే బలులుగా భావించేవారన్నది మనకు తెలిసిన విషయమే" అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)