మెక్సికో: సమాధుల మధ్య 59 మంది టీనేజర్ల మృతదేహాలు.. పదికి పైగా అమ్మాయిల శవాలే.. వారంతా ఎవరు

మృతదేహాలు లభ్యమైన చోటు

ఫొటో సోర్స్, EPA

మెక్సికోలోని గువానజువాటో రాష్ట్రంలో 59 మృతదేహాలు ఒకే చోట గుర్తించారు. వీటిలో చాలా మృతదేహాలు యుక్త వయసులో ఉన్నవారివే.

మృతదేహాలు లభించిన సాల్వటియెర్ర మున్సిపాలిటీ ప్రాంతాన్ని మెక్సికోలో అత్యంత హింసాత్మక ప్రాంతాల్లో ఒకటిగా పరిగణిస్తారు.

ఇక్కడ ఉండే మాదకద్రవ్యాల వ్యాపారులు డ్రగ్స్ అక్రమ రవాణా రూట్ల కోసం వివాదాలలోకి దిగుతూ ఉంటారు.

ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే ఈ రాష్ట్రంలో 2,200 హత్యలు నమోదయ్యాయి.

తప్పిపోయిన కొందరు వ్యక్తుల గురించి వారి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో గాలించగా ఇలా ఒకే చోట 59 మృతదేహాలు కనిపించాయని మెక్సికో నేషనల్ సెర్చ్ కమీషన్ అధికారి కార్ల కింటానా చెప్పారు.

మృతుల్లో 10 మందికి పైగా అమ్మాయిలు కూడా ఉన్నారు.

వీటిని కనిపెట్టడానికి కనీసం 80 మంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అయితే, అక్కడ మృత దేహాలు ఉండి ఉండవచ్చనే సమాచారాన్ని ఎవరు అందించారనే విషయాన్ని అధికారులు చెప్పలేదు.

వీటిని గుర్తించడానికి ముందు కనీసం 52 చోట్ల తవ్వకాలు జరిపినట్లు సెర్చ్ కమిషనర్ హెక్టర్ డియాజ్ చెప్పారు.

గువానజువాటోను నేరస్థులకు అడ్డాగా చెబుతారు.

జులైలో ఇరపువాటోలో ఉండే ఒక మాదకద్రవ్యాల రీహాబిలిటేషన్ కేంద్రంలోకి ఆయుధాలు ధరించిన వ్యక్తులు చొరబడి 24 మందిని హతమర్చిన ఘటన చోటు చేసుకుంది. ఇదే ప్రాంతంలో అంతకు ఒక నెల క్రితం కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

2018లో మెక్సికో అధ్యక్షునిగా అధికారంలోకి వచ్చిన మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ ఈ గ్యాంగు హింసను నిర్మూలిస్తానని ప్రమాణం చేశారు. కానీ, దేశంలోనే అత్యధిక స్థాయిలో హత్యలు 2019లో నమోదు అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)