ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు

ఫొటో సోర్స్, this_mother_life
- రచయిత, ఫ్రాన్సెస్కా గిలెట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటన్‌లోని డెర్బీషైర్‌కు చెందిన మెగ్ వార్డ్, జాష్... కొన్ని నెలల క్రితం తమ ఇల్లు, ఫర్నీచర్ అంతా అమ్మేసి, ఓ వ్యానులోకి మకాం మార్చారు. ఇప్పుడు వ్యానే వారి ఇల్లు. తమ నాలుగేళ్ల కూతురు మార్లోతో కలిసి ఇప్పుడు వాళ్లు అందులోనే బతుకుతున్నారు. యూరప్ అంతా చుట్టేస్తున్నారు.
''మేం ఇప్పుడు బాత్రూమ్ అంత స్థలంలో ఉంటున్నాం. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నిజంగానే భయపడ్డాం. కానీ, ఇదో గొప్ప అనుభవం. ఒక రకమైన స్వేచ్ఛ దొరికినట్లు అనిపిస్తోంది'' అని మెగ్ చెబుతున్నారు.
మెగ్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్ ఫ్రీలాన్సర్‌గా ఇలా ప్రయాణిస్తూనే పని చేస్తుంటారు. కొబ్బరి చిప్పలతో పాత్రలు తయారుచేసే సంస్థను కూడా ఆమె నడిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, this_mother_life
మెగ్ కుటుంబమే కాదు, ఇలా వ్యానుల్లో జీవిస్తున్న వాళ్లు చాలా మంది ఉంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్య బ్రిటన్‌లోనూ ఎక్కువైంది. కరోనావైరస్ సంక్షోభం కూడా ఇందుకు ఓ కారణమై ఉండొచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాన్‌లైఫ్ అన్న హ్యాష్ ట్యాగ్‌తో 80 లక్షల పోస్టులు కనిపిస్తున్నాయంటే, ఈ ట్రెండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వ్యాన్‌లైఫ్ కన్వర్షన్స్ పేరుతో బ్రిటన్‌లోని ఎసెక్స్‌లో ఎమిలీ కాట్‌గ్రోవ్, ఆమె భాగస్వామి ఓలీ ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. వ్యానులను వినియోగదారుల అభిరుచికి తగ్గట్లు నివసించేందుకు అనుకూలంగా వీళ్లు తీర్చిదిద్ది ఇస్తారు. ఈ సేవల ప్రారంభ ధర 27 లక్షల రూపాయలు.
''మా దగ్గరికి వచ్చే వినియోగదారుల్లో ప్రధానంగా రెండు రకాల వాళ్లు ఉంటున్నారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండేవారు ఓ రకం. వీళ్లు పనిచేస్తూ, తిరుగుతూ ఉండాలని అనుకుంటున్నారు. ఇంకో రకం వయసు మీద పడినవాళ్లు. వీళ్లు గతంలో ఇలాంటి వ్యాన్లను వినియోగించి, మళ్లీ ఆ అనుభవం కావాలని కోరుకుంటున్నారు'' అని ఎమిలీ చెప్పారు.

ఫొటో సోర్స్, Vanlife Conversions
వ్యానులను తీర్చిదిద్దడానికి తమకు 12 నుంచి 14 వారాల సమయం పడుతుందని ఆమె అంటున్నారు.
''డిమాండ్ విపరీతంగా ఉంది. కోవిడ్‌కు ముందు మా సేవల కోసం వచ్చినవారు తమ వంతు కోసం ఆరు నుంచి ఎనిమిది నెలలు వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అది 18 నెలలకు పెరిగింది. మేం తీర్చిదిద్దే వ్యాను దాదాపుగా ఓ అపార్ట్‌మెంట్ ఉన్నట్లే ఉంటుంది. రాజీపడాల్సిన పరిస్థితి ఏమీ ఉండదు'' అని ఎమిలీ అన్నారు.

ఫొటో సోర్స్, Vanlife Conversions
వ్యానును తీర్చిదిద్దేందుకు లక్షలు వెచ్చించడం చాలా మందికి తలకు మించిన భారమే. అందుకే కొందరు సొంతంగా తామే వ్యాన్లకు మార్పులు చేసుకుంటున్నారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో 25 ఏళ్ల క్లో నాష్ అదే పనిచేశారు. తన కారును అమ్మేసి ఆమె సెకండ్ హ్యాండ్‌లో కిట్రోన్ బెర్లింగో వ్యానును కొన్నారు.
''చాలా ఏళ్లుగా అనుకున్నా, కానీ కొనడం వీలుపడలేదు. లాక్‌డౌన్ సమయంలో డబ్బు ఆదా చేయగలిగా. కోవిడ్ వల్ల జరిగిన లాభం ఏదైనా ఉంటే, అది ఇదే'' అని క్లో అన్నారు.

ఫొటో సోర్స్, Chloe Nash

వ్యానుకు సొంతంగా మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్న క్లో... ఇందుకోసం నాలుగు వారాల పాటు పనిచేశారు.
ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా వ్యానులో ఇన్సులేషన్ ఏర్పాట్లు చేసుకున్నారు. అడుగు బాగాన కార్పెట్ వేశారు.
పడక ఏర్పాటు చేసుకునేందుకు సుమారు 55వేల రూపాయలు ఆమె ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆమె పెట్టిన ఖర్చులో అత్యధిక వాటా దీనికే పోయింది.
షవర్, స్టవ్ లాంటి ఏర్పాట్లన్నీ ఈ వ్యానులో ఉన్నాయి. మొత్తంగా దీన్ని తీర్చిదిద్దేందుకు తనకు లక్ష రూపాయల కన్నా తక్కువే ఖర్చైందని క్లో చెప్పారు.

ఫొటో సోర్స్, Chloe Nash

''ఈ నిర్ణయం తీసుకున్నాక ఎలా అనిపించిందని చాలా మంది అడిగారు. నేను జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదే. ఈ వ్యానును కొనడం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నా'' అని ఆమె అన్నారు.
మెగ్, జాష్ మాత్రం అప్పటికే అన్ని సదుపాయాలు ఉన్న వ్యానును దాదాపు 38 లక్షల రూపాయలు వెచ్చించి, కొనుగోలు చేశారు.
''ఇదివరకు కూడా మా జీవితం బాగానే ఉండేది. ఆ జీవితం అంటే చికాకు పుట్టి, మేం ఈ పనేమీ చేయలేదు. కానీ, వ్యానులో జీవితం కూడా బాగుంది. మా పాప రోజూ ప్రకృతిలో ఆడుకుంటుంది. వివిధ భాషల చిన్నారులతో మాట్లాడుతుంది. నాకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చాలా మంది సందేశాలు పెడుతుంటారు. 'మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తోంది. మీలా మేం ధైర్యం చేయలేకపోతున్నాం' అని అంటుంటారు. ఈ పని ఎవరైనా చేయొచ్చు. అయితే, మాలాగే అన్నీ అమ్మేసి, వ్యానులో జీవించాల్సిన అవసరం లేదు'' అని మెగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Barny Erdman
నార్విచ్‌కు చెందిన బార్నీ ఎర్డ్‌మన్ 2014 నుంచి వ్యానులోనే జీవిస్తున్నారు.
''నేను ఓ రకంగా తప్పని పరిస్థితిలో ఈ జీవనశైలికి మారా. బ్రేకప్ అయిన తర్వాత ఈ వ్యానులో ఉండటం మొదలుపెట్టా. కొద్దిగా డబ్బు పొదుపు చేసేవరకూ ఇందులో ఉందామనుకున్నా. రానూరానూ ఇది నాకు బాగా అలవాటైపోయింది. ఇదే ఇల్లులా అనిపించింది'' అని ఆయన చెప్పారు.
వ్యాన్లలో జీవించాలనుకునేవారికి బార్నీ కొన్ని సూచనలు కూడా చేశారు.
''వ్యాన్లలో జీవించడానికి మొగ్గుచూపుతున్నవారు ఎక్కువవుతున్నారు. ఇలా వస్తున్నవారు నిబంధనలు సరిగ్గా పాటిస్తూ, మిగతావారిని గౌరవిస్తూ ఉంటే ఏ సమస్యా ఉండదు. కొందరు చెత్త ఎక్కడ పడితే, అక్కడ పడేస్తుంటారు. నివాసాల మధ్య తమ టాయిలెట్లలో ఉన్న వ్యర్థాలను వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల అందరికీ ఇబ్బందే'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు: ‘జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...
- ‘మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- ‘సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








