చైనా-ఇరాన్ స్నేహం ఎందుకు బలపడుతోంది? ఇది అమెరికాకు ప్రమాదమా?

ఫొటో సోర్స్, Noel Celis - Pool/Getty Images
- రచయిత, ప్రవీణ్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను అంతం చేయడానికి కొత్త ఫోరం ఏర్పాటుపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్-యీ మాట్లాడారు. ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్‌తో భేటీ తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. అదే సమయంలో ఇరాన్‌కు చైనా మద్దతు ఎప్పుడూ ఉంటుందని వాంగ్ యీ పునరుద్ఘాటించారు.
చైనాలోని టెంగ్‌చాంగ్‌లో శనివారం వాంగ్ యీ , జవాద్ జరీఫ్ మధ్య జరిగిన సమావేశం ఇరాన్‌తో ప్రపంచ శక్తులు కుదుర్చుకున్న 2015నాటి అణు ఒప్పందంపై తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంపై ఈ సమావేశంలో విమర్శలు వినిపించాయి.
గత కొద్ది సంవత్సరాలుగా ఇరాన్ చైనాల మధ్య స్నేహం బలపడుతోంది.
చైనా-ఇరాన్ దోస్తీ
సౌదీ అరేబియాతో యెమెన్‌లో పోరాటం, మధ్యప్రాచ్యంలో ప్రధాన శక్తిగా ఎదగాలని కోరుకోవడం, ఇరాక్‌తో ఆధిపత్య యుద్ధం, అమెరికా విధించిన ఆంక్షలకు సౌదీ మద్దతుపై ఆగ్రహంలాంటి అంశాలలో ఇరాన్ తరచూ వార్తల్లో నిలుస్తోంది.
అమెరికాతో ఆ దేశపు సంబంధాలు క్షీణిస్తుండగా, చైనాతో క్రమంగా బలపడుతున్నాయి.
ఈ రెండు దేశాలు ఇప్పుడు ప్రతిష్టాత్మక ఒప్పందం కుదుర్చుకునే దశలో ఉన్నాయి. ఇరాన్-చైనాల మధ్య స్నేహం ఒక రకంగా అమెరికాకు ప్రమాద ఘంటికే.
ఈ ఒప్పందం కుదిరితే ఇరాన్-చైనాల మధ్య బంధం మరింత బలపడుతుందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇటు మధ్య ప్రాచ్యంలో అమెరికాకు బద్ధశత్రువుగా మారింది ఇరాన్. రెండు దేశాల మధ్య చాలాకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
అమెరికా విధానాలపై ప్రభావం
ప్రపంచపటంలో ఇరాన్‌ను ఏకాకిని చేయాలని అమెరికా ప్రయత్నిస్తుండగా, చైనా ఇరాన్‌కు దగ్గరవుతోంది. రెండు దేశాల మధ్య స్నేహం మధ్యప్రాచ్యంలో అమెరికా విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాలలో రష్యా సరసన ఈ రెండు దేశాలు నిలుస్తున్నాయి.
ఈ పరిస్థితులలో ఇరాన్ చైనాలు ఏకమైతే సహజంగానే అమెరికాలో ఆందోళన పెరుగుతుంది. "చైనాతో అమెరికా సంబంధాలు ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో చైనా పాత్ర పెరుగుతోంది. చమురు, మౌలిక సదుపాయాల రంగాలలో చైనా అడుగుపెట్టడంతో ఈ ప్రాంతంలో ఆందోళన తలెత్తుతోంది. అమెరికా, చైనాలు రెండూ ఈ ప్రాంతంలో ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు సహించలేవు’’ అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో చైర్‌పర్సన్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ గుల్షన్ సచ్‌దేవా అన్నారు.
18 పేజీల ఒప్పదం
చైనా, ఇరాన్‌లు తమ మధ్య జరగబోతున్న ఓ కీలక ఒప్పదం గురించి ఈ ఏడాది జులైలో సమాచారం బైటపడింది. పర్షియన్ భాషలో రాసిన 18 పేజీల ఒప్పందపు ముసాయిదా లీక్ అయింది. దానిని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.
దీని ప్రకారం "వాణిజ్య, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, భద్రతా రంగాలలో ఇరు దేశాలు ఒకరినొకరు వ్యూహాత్మక భాగస్వాములుగా మారతాయి''
చైనా, అమెరికాలు తమ తమ దేశాలలో హైకమిషనరేట్‌లను మూసేస్తున్న సమయంలోనే ఈ ముసాయిదా లీకైంది.
మరోవైపు జనవరిలో జరిగిన అమెరికా డ్రోన్ దాడిలో కుర్దు ఫోర్సెస్ కమాండర్ ఖాసిం సులేమాని మరణించారు. ఆయన హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా ఖోమైనీ ప్రతిజ్ఞ చేశారు.
జూలై 27న ఇరాన్ అమెరికాపై తన దాడి విషయంలో ఇరాన్ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపే ఒక ఉపగ్రహ చిత్రం బైటపడింది. ఒక డమ్మీ అమెరికన్ నేవీ ఓడను ఇరాన్ తన మిసైళ్లతో సముద్రంలో పేల్చేసింది.
మధ్యప్రాచ్యంలో ఆధిపత్య పోరు
చైనా-ఇరాన్‌లు జట్టుకట్టడంపై అమెరికా అధికారవర్గంలో కలవరం మొదలైంది. ఇరు దేశాలు కలిస్తే మధ్య ప్రాచ్యంలో అమెరికాను ఇబ్బంది పెట్టే అనేక అంశాలు తయారవుతాయి.
ఈ పోరాటమంతా మధ్యప్రాచ్యం మీద పట్టుకోసమేనని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వృషాల్ గోబెల్ చెప్పారు. "ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో కమ్యూనిస్ట్ భావజాలం, పెట్టుబడిదారీ సిద్ధాంతాలతో అమెరికా, రష్యాలు పోరాటం సాగించాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే వాతావరణం కనిపిస్తోంది. కాకపోతే ఇది సిద్ధాంతాల మధ్య యుద్ధం కాదు" అని గోబెల్ అన్నారు.
చైనా ఇప్పుడు చాలా భిన్నంగా వ్యవహరిస్తోందని, ఆ దేశానికి వ్యాపారం తప్ప మానవ హక్కులవంటి వాటితో పనిలేదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చైనా-ఇరాన్‌ల ఒప్పందంలో ఏముంది?
జూలై 5న ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్ ఇరాన్-చైనాలు పాతికేళ్లు అమలులో ఉండే ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు ధృవీకరించారు. లీక్ అయిన ఆ ఒప్పందం పత్రం ప్రకారం ఇంధనం, రవాణా, బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీవంటి రంగాలలో ఇరాన్‌లో చైనా కొన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టబోతోంది.
ఈ ముసాయిదాలో ఆయుధాల అభివృద్ధి, గూఢచారంలో భాగస్వామ్యంతోపాటు ఇరుదేశాల సంయుక్త సైనిక విన్యాసాల గురించి కూడా ప్రస్తావన ఉంది.
ఈ ఒప్పందం ద్వారా చైనా నుంచి ఇరాన్ సుమారు 400 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇరాన్ ఇప్పటికే చైనా నిర్మిత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ)లో పాలు పంచుకుంటోంది. ఇది చైనా రుణదౌత్యంలో ఒక భాగమని అంటున్నారు.
ఇరాన్‌లో నిరసనలు
అయితే చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఇరాన్‌లో కూడా వ్యతిరేకత ఉంది. మాజీ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ సహా పలువురు రాజకీయ నాయకులు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు.
2016లో ఇరాన్‌తో అణు ఒప్పందం తరువాత చైనా ఆ దేశంతో చర్చలు ప్రారంభించింది. అదే సమయంలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ చరిత్రాత్మక ఇరాన్ పర్యటన జరిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీతో సమావేశం అయ్యారు.
అయితే చైనాతో జరిగిన ఒప్పందాన్ని ఇరాన్ పార్లమెంట్ ఇంకా ఆమోదించ లేదు. ప్రభుత్వం కూడా ఈ ఒప్పంద వివరాలను బైటపెట్టలేదు. పర్షియన్ భాషలో ఉన్న ఈ ఒప్పందాన్ని ఇంత వరకు ఎవరూ ధృవీకరించలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చైనా-ఇరాన్ ఒప్పందంపై అమెరికా ఏమంటోంది?
ఇరాన్‌తో వ్యాపారం చేయడం ద్వారా "స్థిరత్వం, శాంతిని" ప్రోత్సహించాలనే తన లక్ష్యాన్ని చైనా స్వయంగా పక్కనబెడుతోందని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వీరిద్దరి స్నేహం మధ్యప్రాచ్యంలో అస్థిరతకు కారణమవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో వ్యాఖ్యానించారు.
చైనా- ఇరాన్ మధ్య జరగబోయే ఈ ఒప్పందం విషయంలో ఇరాన్‌పై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అమెరికా సౌదీ అరేబియాకు చేరువైంది కాబట్టి, చైనా ఇరాన్‌వైపు చూస్తోందని, వాస్తవానికి చైనాకు ఏ దేశంతోనూ శత్రుత్వం లేదని ప్రొఫెసర్ గోబెల్ అన్నారు. “చైనా దృష్టంతా వ్యాపారంపైనే” అన్నారాయన.
మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యాన్ని చైనా సవాలు చేస్తోందా?
ఈ ఆధిపత్య పోరాటం కోసం అమెరికా 2001 నుండి బిలియన్ల డాలర్ల డబ్బును, 8 మిలియన్లకు పైగా ప్రజల ప్రాణాలను బలిపెట్టింది. "అసలు సమస్య ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గుతోంది. అన్నిచోట్లా దాని పాత్ర తగ్గిపోతోంది. మరోవైపు చైనా అమెరికా స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఇరు దేశాల మధ్య ఘర్షణ’’ అంటున్నారు ప్రొఫెసర్ సచ్‌దేవా.
ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు నుంచి ఈ ప్రాంతంలో సైనిక ఉనికిని తగ్గించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా దాని విధానం మారే అవకాశం కనిపించడం లేదు. "అమెరికా ఆందోళన దాని ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే కాదు, ఈ ప్రాంతంపై దాని ఆధిపత్యాన్ని కూడా కొనసాగించాలి. ఈ మొత్తం ప్రాంతంలో అమెరికాకు మిలియన్ల డాలర్ల పెట్టుబడి ఉంది" అని గోబెల్ చెప్పారు.
కానీ చైనా ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలని, ఇన్నాళ్లూ అమెరికా పోషించిన పాత్రను తాను పోషించాలని చైనా కోరుకుంటోంది. "ప్రస్తుతానికి చైనా తన దళాలను ఎక్కడికీ పంపించే ఉద్దేశంలో ఉన్నట్లు లేదు. దానికి బదులుగా ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో చైనా ఆర్థిక,మౌలిక సదుపాయాల కల్పనలో భాగం పంచుకుంటోంది. మధ్యప్రాచ్యంలో కూడా చైనా తన ఆర్ధిక ప్రయోజనాలకే పరిమితమవుతుంది. అమెరికా తన సైన్యాన్ని తగ్గించినా, చైనా ఇక్కడ సైన్యాన్ని దింపే అవకాశం చాలా తక్కువ” అన్నారు ప్రొఫెసర్ సచ్‌దేవా.
అయితే చైనా సిరియాకు ప్రత్యేక బెటాలియన్‌ను పంపినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఇక్కడ విస్తరించాలని కోరుకున్నా, అది పరిమిత స్థాయిలోనే ఉండవచ్చు” అంటున్నారు ప్రొఫెసర్ సచ్‌దేవా.

ఫొటో సోర్స్, EPA
అమెరికా మధ్యప్రాచ్యం నుంచి వెళ్లిపోతుందా?
ప్రొఫెసర్ సచ్‌దేవా అభిప్రాయం ప్రకారం "ఇప్పటి వరకు చమురును తన కంట్రోల్‌లో పెట్టుకోవడానికే అమెరికా పరిమితమైంది. కానీ షెల్ గ్యాస్‌లాంటి కొత్త ఆవిష్కరణల తరువాత అమెరికా చమురు ఎగుమతిదారుగా మారింది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఈ ప్రాంతంపై ఆసక్తిని తగ్గించుకుంటోంది. మరోవైపు చైనాకు ప్రధాన చమురు వనరు మధ్యప్రాచ్యమే"
అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణల్లో ఇరాన్‌ను పక్కకు తప్పించాలన్న అమెరికా ప్రయత్నాలను చైనా పడనివ్వక పోవచ్చు. ఇప్పటికే అమెరికా విధించిన ఆంక్షలను చైనా ఉల్లంఘించడం మొదలు పెట్టింది. చమురుతోపాటు అనేక వస్తువులను చైనా దిగుమతి చేసుకుంటోంది.
ట్రంప్ నుంచి ఇరాన్‌ను రక్షించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాబోయే నెలల్లో ఇరాన్- చైనాల మధ్య ఒప్పంద కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ఇరాన్‌కు లైఫ్‌లైన్‌గా మారుతుంది. రెండోసారి కూడా ట్రంప్ వస్తే, ఈ ఒప్పందం కచ్చితంగా ఇరాన్‌కు ఊరటనిస్తుంది. మొత్తం మీద చైనా ఆడుతున్న చదరంగంలో ఇరాన్ ఒక పావుగా మారిందన్నది మాత్రం వాస్తవం.
ఇవి కూడా చదవండి:
- పొలంలో తిరుగుతూ మొక్కల్ని పరిశీలించే రోబోలను తయారు చేసిన గూగుల్
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- దళిత సర్పంచ్‌కు అవమానం: ''సమావేశాల్లో నేలపై కూర్చోమన్నారు.. జెండానూ ఎగురవేయనివ్వరు''
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- అంటువ్యాధులు, మహమ్మారి రోగాలు ఎలా అంతమవుతాయి?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- హాంకాంగ్‌పై చట్టం చేసిన అమెరికా, చైనా కన్నెర్ర
- విప్లవ వధూవరుల విషాద ప్రేమ గాథ @ సిరియా జైలు
- ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ అంతమైనట్లేనా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి
- సిరియాలో కుర్దు సేనలకు అమెరికా వెన్నుపోటు పొడిచిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









