అమెరికా ఎన్నికలు 2020: రష్యా, చైనా, ఇరాన్‌లు ఎవరిని ఓడించాలనుకుంటున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా గొప్పతనాన్ని కాపాడడానికి రష్యా ప్రయత్నిస్తుందా?
బైడెన్‌ను గెలిపించేందుకు చైనా కృషి చేస్తోందా?
నవంబరులో అధ్యక్షలు ఎన్నికలు జరగాల్సిన అమెరికా నిఘా వర్గాల బుర్రల్లో మెదులుతున్న ప్రశ్నలివి.
అమెరికా ఓటర్లను తమకు అనుకూలంగా తిప్పుకోవడానికి కొన్ని విదేశీ శక్తులు రహస్యంగా, బహిరంగంగా కూడా ప్రభావితం చేయొచ్చని ఆ దేశానికి చెందిన ఓ ఉన్నతాధికారి హెచ్చరించారు. రష్యా, చైనా, ఇరాన్‌లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మూడింటిని కలిపి చూడలేం.. అయితే, వీటిలో ప్రతి దేశానికి అమెరికా ఎన్నికలకు సంబంధించి సొంత లక్ష్యం, ప్రభావితం చేయడానికి సొంత సామర్థ్యాలు ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
నవంబరు 3న జరగాల్సిన ఎన్నికల్లో రష్యా ప్రమేయానికి, దాన్నుంచి ఎదురయ్యే ముప్పు తీవ్రతను తగ్గించి చూపాలంటూ తనపై ఒత్తిళ్లు వచ్చాయని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ ఉద్యోగి ఒకరు గత నెలలో చెప్పారు. రష్యా ప్రభావాన్ని తక్కువ చేసి చెప్పకపోతే అది అధ్యక్షుడు ట్రంప్ సామర్థ్యాలను తక్కువ చేసినట్లవుతుందన్న ఉద్దేశంతో తనపై ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు.
మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో అమెరికా ఓటర్లు తెలుసుకోవాల్సిన విషయాలేమిటి?

ఫొటో సోర్స్, Reuters
రష్యా
అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏం చెబుతోంది?
2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఆ తరువాత పరిణామాల్లో రష్యా పేరు దాని పాత్రకు మించి వినిపించింది.
అమెరికన్ ఓటర్లను డోనల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా తిప్పడానికి రష్యా ప్రయత్నించిందని యూఎస్ ఇంటెలిజెన్స్ భావించింది. రష్యా అధికారులతో ట్రంప్ భేటీలు.. హిల్లరీ క్లింటన్, డెమొక్రాట్ల అధ్యక్ష ఎన్నికల ప్రచారంపై సైబర్ అటాక్, రాష్ట్రాల్లో ఓటర్ల వివరాల సేకరణ యత్నాలు వంటివన్నీ రష్యా ప్రమేయంపై ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉన్న అనుమానాలకూ ఊతమిచ్చాయి.
ట్రంప్ గెలవాలని రష్యా కోరుకుంటుందనడానికి బలం చేకూర్చేలా గత వారం రిపబ్లికన్ల సెనేట్ ప్యానల్ ఒకటి వ్యాఖ్యానించింది. ట్రంప్ ప్రచారం విదేశీ ప్రభావానికి సులభమైన లక్ష్యమని చెప్పిన ఆ ప్యానల్ అందులో నేరపూరిత కుట్ర ఉందని మాత్రం చెప్పలేదు.
2020 ఎన్నికల విషయానికొస్తే రిపబ్లికన్ల అభ్యర్థిగా ట్రంపే ఉన్నప్పటికీ డెమొక్రాట్ల అభ్యర్థి మారిపోయారు హిల్లరీ క్లింటన్ స్థానంలో జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో తలపడుతున్నారు.
అమెరికా కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్(ఎన్‌సీఎస్‌సీ) చీఫ్ విలియం ఇవానినా అంచనా ప్రకారం జో బైడెన్ ప్రతిష్ట తగ్గించడానికి రష్యా చాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావించే 2018 నాటి కాంగ్రెసనల్ ఎలక్షన్లలోనూ రష్యా జోక్యం ఉంది.
అయితే, ఇతర దేశాల ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలను ఆ దేశం ఖండిస్తోంది.
''అవన్నీ వాస్తవాలతో సంబంధం లేకుండా మతిభ్రమించి చేస్తున్న ఆరోపణలు'' అని రష్యా అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.
ట్రంప్ మళ్లీ గెలవాలని రష్యా కోరుకుంటుందా లేదా అన్నది పక్కనపెడితే గందరగోళం సృష్టించి ప్రత్యర్థి దేశాలను అస్థిరపరచడం రష్యా లక్ష్యమని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు.
ఉదాహరణకు.. కరోనావైరస్ గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడానికి రష్యా ప్రయత్నించిందని యూరోపియన్ యూనియన్ డాక్యుమెంట్ ఒకటి ఆరోపించింది. అయితే.. అదంతా నిరాధారణమని రష్యా కొట్టిపారేసింది.
మరి.. అభ్యర్థులేమంటున్నారు?
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం కొనసాగితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ఇటీవల హెచ్చరించారు. అంతేకాదు.. రష్యా అమెరికాకు ప్రత్యర్థి అని కూడా ఆయన అన్నారు.
రష్యా జోక్యంపై వచ్చే ఆరోపణలకు ట్రంప్ ఎప్పుడూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సొంత ఇంటెలిజెన్స్ నిపుణులు ఇచ్చే నివేదికలతోనూ ఆయన విభేదిస్తుంటారు.
2018లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు.. ఆ తరువాత అమెరికా ఇంటెలిజెన్స్‌ను మీరు నమ్ముతారా? లేదంటే పుతిన్‌ను నమ్ముతారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ట్రంప్.. ''అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని రష్యా చెబుతోంది.. రష్యా జోక్యం చేసుకోవడానికి కారణం ఉందని నేను కూడా అనుకోవడం లేదు'' అన్నారు. అయితే.. తాను పొరపాటున అలా అన్నానని ట్రంప్ ఆ తరువాత అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
చైనా
అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏం చెబుతోంది?
ఈసారి ఎన్నికల్లో రష్యా నుంచి కంటే చైనా నుంచి సమస్యలు ఉంటాయని ట్రంప్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు.
''ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే నేనీ మాట చెబుతున్నాను'' అన్నారు అటార్నీ జనరల్ విలియం బార్. అయితే, విలియం బార్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ప్రతినిధుల సభ నిఘా కమిటీ అధ్యక్షుడు, డెమొక్రాట్ల నేత ఆడమ్ చిఫ్ అంటున్నారు.
ట్రంప్ మళ్లీ గెలవాలని చైనా ఏమాత్రం కోరుకోవడం లేదని అమెరికా కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్(ఎన్‌సీఎస్‌సీ) చీఫ్ విలియం ఇవానినా అంచనా వేస్తున్నారు.
''అమెరికాలో విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేలా చైనా తన ప్రయత్నాలను పెంచుతోంది. చైనా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నారనుకున్న రాజకీయ నాయకులపై ఒత్తిడి పెంచే పనులు చేస్తుంది'' అన్నారాయన.
''ప్రభావం'' అనే పదం ఉపయోగించిన విషయం గుర్తించాలి. అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి చైనాకు ఇప్పటికే అధునాతన పద్ధతులున్నా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు... సోషల్ కామెంట్లు చేయడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను ఉపయోగించుకుంటోంది. సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా అల్గారిథమ్‌ను ప్రభావితం చేస్తూ తమకు సంబంధించిన కంటెంట్ ప్రచారంలోకి వచ్చేలా వ్యవస్థలను ఏర్పాటుచేసుకుంటోంది. అయితే.. చైనా ఎంత దూరం వెళ్లడానికి సిద్ధపడిందన్నది ఇంకా అస్పష్టమే'' అంటున్నారు ఇవనీనా.
దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రయోజనాలు వంటి అంశాలకు సంబంధించి చైనాకు మద్దతుగా వ్యవహరించే ఆ దేశంతో సంబంధం ఉన్న కొన్ని అకౌంట్లను ఫేస్ బుక్ ఇటీవల క్లోజ్ చేసింది.
ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామన్న ఆరోపణలను చైనా ఖండిస్తూ తమకు అలాంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేదని చెప్పింది.
అభ్యర్థులు ఏమంటున్నారు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి జోబైడెన్‌కు చైనా అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందంటూ మీడియాలో వచ్చిన ఒక ఆర్టికల్‌ను డోనల్డ్ ట్రంప్ ఇటీవల రీట్వీట్ చేశారు.
''చైనా నుంచి వందల కోట్ల డాలర్లు అమెరికా ఖజానాకు, రైతులకు వచ్చేలా చేశాను.. జో బైడెన్ ఆయన కుమారుడు హంటర్ బైడెన్ రాజ్యం కనుక వస్తే చైనా అమెరికాను సొంతం చేసుకుంటుంది. అందుకే వాళ్లు బైడెన్ గెలవాలని కోరుకుంటున్నారు'' అని ట్రంప్ ట్వీట్ చేశారు.
కరోనావైరస్, హాంకాంగ్‌లో వివాదాస్పద భద్రతాచట్టం అమలు వంటి అనేక అంశాల నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
అయితే ట్రంప్‌తో పోల్చితే బైడెన్ చైనా విషయంలో సాఫ్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్
అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏం చెబుతోంది?
ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు కావడం ఇరాన్‌కు ఇష్టం లేదని విలియం ఇవానినా అంటున్నారు.
ట్రంప్ కనుక మళ్లీ గెలిస్తే ఇరాన్‌లో అధికార మార్పిడికి అన్ని ప్రయత్నాలు చేస్తారని ఆ దేశ ప్రస్తుత నాయకత్వం భావిస్తోందని ఆయన అంటున్నారు.
అందుకే ట్రంప్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారంలోకి తేవడం వంటి ప్రయత్నాలు చేయొచ్చని అమెరికా నిఘా సంస్థలు భావిస్తున్నాయి.
ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఇటీవల టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పలు ఆరోపణలు చేసింది. రష్యా, చైనా, ఇరాన్‌లతో సంబంధాలున్న హ్యాకర్లు అమెరికా ఎన్నికలతో సంబంధమున్న వ్యక్తులపై నిఘా పెట్టారని ఆరోపించింది.
వైట్‌హౌస్ అధికారులు, ట్రంప్ ప్రచార కార్యక్రమం చూసే సిబ్బంది సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసేందుకు ఫాస్పరస్ అనే గ్రూప్ విఫలయత్నం చేసిందని.. ఆ గ్రూపు ఇరాన్‌కు సంబంధించిందని మైక్రోసాఫ్ట్ చెప్పింది. అయితే ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఈ ఆరోపణలు హాస్యాస్పదమంటూ కొట్టిపారేసింది.
అభ్యర్థులు ఏమంటున్నారు?
అమెరికా ఎన్నికలలో రష్యా, చైనాల ప్రభావంతో పోల్చితే ఇరాన్ ప్రభావం తక్కువే.
ట్రంప్ తన పదవీ కాలంలో ఇరాన్ విషయంలో దూకుడుగా వ్యవహరించారు. అణు ఒప్పందం నుంచి బయటకొచ్చేశారు. ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన మిలటరీ జనరల్ ఖాసి సులేమానీ హత్యకూ ఆదేశించారు.
జోబైడెన్ సీఎన్ఎన్‌కు రాసిన ఓ వ్యాసంలో ట్రంప్ విధానాలను తప్పు పట్టారు. ఇరాన్‌ను అస్థిరపరిచే చర్యలకు బదులు దౌత్యపరమైన మార్గాల కోసం ప్రయత్నిస్తానని ఆయన ఆ వ్యాసంలో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘మాకు స్వాతంత్ర్యం వద్దు.. మేం ఫ్రాన్స్‌తో కలిసే ఉంటాం’ - న్యూ కెలడోనియా రిఫరెండం
- అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
- మానసిక ఒత్తిడి వల్ల తొందరగా చనిపోతారా....
- బీటిల్స్ మ్యూజిక్ బ్యాండ్ భారత్‌లో ఓ గుండె పగిలిన ప్రేమికుడికి ఎదురుపడినప్పుడు...
- శుక్ర గ్రహంపై జీవం ఉందా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








