న్యూ కెలడోనియా రిఫరెండం: ‘మాకు స్వాతంత్ర్యం వద్దు.. మేం ఫ్రాన్స్‌తో కలిసే ఉంటాం’

ఫొటో సోర్స్, AFP
ఫ్రాన్స్ నుంచి వేరుపడాలని తాము కోరుకోవడంలేదని, ఆ దేశంతోనే కలిసుంటామని దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ఫ్రాన్స్ భూభాగం న్యూ కెలడోనియా ప్రజలు రిఫరెండంలో తేల్చి చెప్పారు.
ఫ్రాన్స్ నుంచి విడిపోవాలా వద్దా అనే అంశంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఫ్రెంచ్ పాలనలో ఉండేందుకు 53.26శాతంమంది న్యూ కెలడోనియన్‌లు మొగ్గు చూపారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. ఈ రిఫరెండంలో 85.6శాతంమంది తమ అభిప్రాయాన్ని తెలిపారు.
రెండేళ్ల కిందట జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 56.7శాతంమంది ఫ్రాన్స్‌తో కలిసి ఉంటామని వెల్లడించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ఈ ఫలితాలపట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశ పాలనపై అక్కడి ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూ కెలడోనియాలో 40శాతంమంది కెనాక్ వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఫ్రెంచ్ ప్రజలతోపాటు యూరప్ నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ దాదాపు మూడింట ఒకవంతుమంది ఉన్నారు. మిగిలిన వారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కెలడోనియా సంస్కృతిలో కలిసి పోయారు.

ఫొటో సోర్స్, AFP
రిఫరెండం ఎందుకు?
ఈ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. 1980లలో స్థానిక కెనాక్ తెగకు చెందిన ప్రజలకు, యూరప్ నుంచి వచ్చిన వలస ప్రజలకు మధ్య ఘర్షణలు జరిగాయి.
ఆ తర్వాత ‘నౌమీ ఎకార్డ్’ (నౌమీ ఒప్పందం) పేరుతో 1998లో అనేక అంశాలపై ఒక ఒప్పందం కుదిరింది.
నౌమీ ఒప్పందం ప్రకారం న్యూ కెలడోనియాలో మూడుసార్లు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంది. ఇందులో మొదటిది 2018లో జరగగా, తాజాగా రెండో రిఫరెండం నిర్వహించారు. మూడోది 2022లో జరగనుంది.
న్యూ కెలడోనియా నికెల్ గనులకు ప్రసిద్ధి. ఎలక్ట్రానికి పరికరాల తయారీకి ఉపయోగపడే ఈ నికెల్ గనులు తమ దేశ ఆర్ధిక వ్యవస్థకు తరగని సంపదని ఫ్రాన్స్ భావిస్తోంది.
న్యూ కెలడోనియాకు చాలా వరకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నా, రక్షణ, విద్యారంగాలలో ఎక్కువగా ఫ్రాన్స్ మీదే ఆధారపడుతోంది. ఆ దేశం నుంచి పెద్ద ఎత్తున రాయితీలను కూడా పొందుతోంది.

ఫొటో సోర్స్, AFP
‘కెనాక్’ తెగ ప్రజల్లో ఫ్రాన్స్ పట్ల వ్యతిరేకత
ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ కావాలంటూ కెనాక్ ప్రజలు డిమాండ్‌లు వినిపిస్తూ వస్తున్నారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణలో కెనాక్‌లు కాని వారంతా ఏకమవుతుండటంతో, అతి పెద్ద వర్గంగా ఉన్నప్పటికీ ఆ తెగ వాదన విజయం సాధించలేకపోతోందని ‘లోవీ ఇనిస్టిట్యూట్’ అనే థింక్‌ట్యాంక్ సంస్థ అభిప్రాయపడింది.
న్యూ కెలడోనియా నుంచి చైనాకు భారీ ఎత్తున నికెల్ నిల్వలు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం అవసరం లేదంటున్న వారి సంఖ్య గత రిఫరెండంతో పోలిస్తే ఈసారి తగ్గడం ఇక్కడ పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి సంకేతమని నిపుణులు భావిస్తున్నారు.
సుమారు 270,000మంది ప్రజలున్న ఈ ప్రాంతం తమదని 1853లో ఫ్రాన్స్ ప్రకటించుకుంది. 170 ఏళ్లుగా న్యూ కెలడోనియా ఫ్రెంచ్ భూభాగంగా ఉంటూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన స్వయంపాలన లేని ప్రాంతాలలో న్యూ కెలడోనియా కూడా ఒకటి.
ఇవి కూడా చదవండి:
- హాథ్రస్ కేసు: బాధితురాలి ఇంట్లో పొయ్యి వెలిగించలేదు.. నిందితులకు మద్దతు తెలుపుతున్న అగ్రవర్ణ సంస్థలు
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- ‘హాథ్రస్’ కేసును సీబీఐకి అప్పగించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి...
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- నైజీరియా: ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








