హాథ్‌రస్ కేసు: బాధితురాలి ఇంట్లో శనివారం నుంచి పొయ్యి వెలిగించలేదు.. నిందితులకు మద్దతు తెలుపుతున్న అగ్రవర్ణ సంస్థలు

ఫొటో సోర్స్, Nurphoto
హాథ్‌రస్ కేసులో దేశం నలుమూలలా సుమారు 10,000 మంది నిరసనల్లో పాలుపంచుకున్నారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరససన ప్రదర్శనలు చేపడుతున్నారు.
అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, జపాన్, నెదర్లాండ్స్, స్వీడన్, స్లోవేనియా వంటి దేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్తలపై లాఠీచార్జ్
బాధితురాలి గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని అక్కడకు వెళ్లిన బీబీసీ ప్రతినిధి దిల్నవాజ్ పాషా తెలిపారు.
రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని.. అయినా వెరవకుండా ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరి బాధితురాలి కుటుంబసభ్యులను కలుసుకోగలిగారని తెలిపారు.
జయంత్ చౌదరి మాట్లాడుతూ... ''ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయంటున్నారు.. జరగనివ్వండి. మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతుంటే రాజకీయాలు జరగాల్సిందే. ఇలాంటి రాజకీయలు మంచివే'' అన్నారు.

ఫొటో సోర్స్, Inc/twitter
కలెక్టరును తొలగించాలని డిమాండ్ చేసిన ప్రియాంక గాంధీ
హాథ్‌రస్‌లో బాధితురాలి కుటుంబాన్ని కలిసిన తరువాత ఆ జిల్లా కలెక్టరును తొలగించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కలెక్టరు పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కలెక్టరు తమతో దారుణంగా ప్రవర్తించినట్లు బాధితురాలి కుటుంబం తనతో చెప్పిందన్న ప్రియాంక ఆ అధికారికి రక్షణ ఇస్తున్నది ఎవరని ప్రశ్నించారు.
శనివారం ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి బాధిత కుటుంబాన్ని కలిశారు.
ఇతర రాజకీయ పక్షాలూ..
హాథ్‌రస్‌లో జరిగిన దారుణాన్ని కప్పిపుచ్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీఎంకే నేత కనిమొళి ఆరోపించారు.
''బాధితురాలికి హుటాహుటిన అంతిమ సంస్కారాలు జరిపిన తీరును, మీడియాపై దాడిని తీవ్రంగా ఖండించాలి. బాధితులకు సహాయంగా అక్కడికి వెళ్తున్న రాజకీయ నాయకులపైనా దాడి చేస్తున్నారు" అని కనిమొళి ట్వీట్ చేశారు.

అప్పటి నుంచి ఆ ఇంట్లో పొయ్యి వెలగలేదు
శనివారం నుంచి బాధితురాలి ఇంట్లో పొయ్యి వెలిగించలేదని బీబీసీ ప్రతినిధి చింకీ సిన్హా తెలిపారు. బాధితురాలి ఇంటివద్ద భారీగా జనం గుమిగూడారు. దీంతో బాధిత కుటుంబానికి వంట చేసుకోవడానికి, తినడానికి కూడా సమయం లేదని ఆమె తెలిపారు.
ఆదివారం బాధితురాలి వదిన వంట చేద్దామనుకున్న సమయానికి ఆర్ఎల్‌డీ నేత జయంత్ చౌదరి అక్కడకు వచ్చారు. ఆ తరువాత మీడియావాళ్లు ఒకరు ఒకరు వస్తుండడంతో వారితో మాట్లాడడానికే ఆమెకు టైమంతా సరిపోయింది. వంట చేసుకోలేకపోవడంతో బిస్కట్లు మాత్రమే తిన్నారు. రాత్రి కాస్త ఆహారం తీసుకున్నారు.
సోమవారం ఉదయంనుంచీ మళ్లీ మీడియావాళ్లు రావడంతో ఏమీ తినకుండానే గడిపారు'' అన్నారు చింకీ సిన్హా.

నిందితులకు మద్దతు తెలుపుతున్న అగ్రవర్ణ సంస్థలు
ఒకవైపు బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే మరోవైపు నిందితులకు మద్దతు తెలుపుతూ కొన్ని అగ్రవర్ణ సంస్థలు ఆ గ్రామానికి చేరుకుంటున్నాయి.
హాథ్‌రస్‌లో ఉన్న బీబీసీ జర్నలిస్ట్ చింకీ సిన్హా మాట్లాడుతూ.. భీమ్ ఆర్మీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ బాధితురాలి గ్రామానికి వస్తున్నారన్న వార్త తెలియగానే కర్ణి సేన తమ బృందాన్ని ఆ గ్రామానికి పంపించింది.
"చంద్రశేఖర్ వస్తున్నారని తెలిసి నేనిక్కడికొచ్చానని" కర్ణి సేనకు చెందిన సుభాష్ సింగ్ తెలిపారు.
మరోవైపు, సవర్ణ సమాజ్‌కు చెందిన కొన్ని బృందాలు నిందితులకు అండగా గ్రామంలో బైఠాయించాయి. వారంతా, నిందితులపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమైనవని పేర్కొన్నారు.
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బాధితురాలి కుటుంబాన్ని కలిసి మాట్లాడిన తరువాత వారి కుటుంబానికి వై కేటగిరీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
''వారికి ఇక్కడ రక్షణ లేదు. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ సమక్షంలో విచారణ జరిపించాలి'' అని ఆజాద్ డిమాండ్ చేశారు.
ఈ అంశంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Twitter/amitmalaviya
బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్‌పై జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తు
బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ గత కొన్ని రోజులుగా హాథ్‌రస్ కేసుకు సంబంధించి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన ఒక ట్వీట్ ఆధారంగా ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కథనం ప్రకారం...హాథ్‌రస్ అత్యాచార బాధితురాలి స్టేట్మెంటుగా చెబుతూ బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ పోస్ట్ చేసిన ట్వీట్‌పై దర్యాప్తు చేస్తామని జాతీయ మహిళా కమిషన్ చెప్పింది.
అక్టోబర్ 2న అమిత్ పోస్ట్ చేసిన వీడియోలో హాథ్‌రస్ బాధితురాలు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం బయట ఒక రిపోర్టరుతో మాట్లాడుతూ 'నా గొంతు కోసే ప్రయత్నం చేశారని' చెబుతున్నారు.
సాధారణంగా లైంగిక హింస కేసుల్లో బాధితురాలి ముఖం, మిగతా వివరాలను గోప్యంగా ఉంచుతారు. కానీ ఈ వీడియోలో బాధితురాలి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది.
అమిత్ ఈ వీడియో ట్విట్టర్లో షేర్ చేయడం వివాదాస్పదమైంది.
జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. "అత్యాచార బాధితురాలి వీడియోను ఇలా షేర్ చెయ్యడం చట్టవిరుద్దం, దురదృష్టకరమ"ని చెప్పారు.
"ఈ వీడియో నేను చూడలేదు, కానీ, అందులో బాధితురాలి వివరాలు బహిర్గతం అవుతున్నట్లు ఉంటే అలాంటి వీడియో పోస్ట్ చెయ్యడం అభ్యంతరకరం. దానిపై అమిత్‌కు నోటీసులు పంపిస్తామ"ని ఉత్తరప్రదేశ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విమలా బాథం అన్నారు.
భారతీయ శిక్షాస్మృతి ప్రకారం లైంగిక హింస కేసుల్లో బాధితుల గుర్తింపును ఎవరైనా బహిరంగపరిస్తే వారికి రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
2018లో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 228 ఏ(2) ప్రకారం బాధితురాలి పేరుతోపాటు, ఆమెకు సంబంధించిన ఏ వివరాలనూ బహిర్గతం చెయ్యకూడదని, ఆమె మరణించినా, కుటుంబ సభ్యుల అనుమతించినా బాధితురాలి పేరు, వివరాలు, ఫొటోలు బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు
హాథ్‌రస్ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసింది.
ఆడవాళ్ళపై అత్యాచారలు ఎందుకు జరుగుతున్నాయని ఎమ్మెల్యేను మీడియా ప్రశ్నించగా "ఇలాంటి సంఘటనలను జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, ఆడపిల్లలకు సంస్కారం నేర్పించాలి. ప్రభుత్వ చర్యలవల్ల, శిక్షల వల్ల ఇలాంటి దారుణాలు ఆగవు. ఆడపిల్లలకు మంచి విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాలి" అని జవాబిచ్చారు.
బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హాథ్‌రస్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎస్ఐటీ (సిట్) సభ్యులు కూడా విచారణ కొనసాగిస్తారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఆదివారం ఉదయం బాధితురాలి కుటుంబ సభ్యుల వాగ్మూలం కోసం సిట్ అక్కడికి వెళ్లింది.
అనారోగ్యంతో బాధితురాలి తండ్రి
సిట్, బాధితురాలి ఇంటికి విచారణకోసం వెళ్లగా ఆమె తండ్రి అనారోగ్యంతో ఉన్నారని గుర్తించింది. వెంటనే వైద్య బృందానికి ఫోన్ చేసి ఆమె తండ్రికి తక్షణ వైద్య సహాయం అందించవలసినదిగా సిట్ కోరింది. సిట్ తమకి ఫోన్ చేసినట్టుగా హాథ్‌రస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
- మానసిక ఒత్తిడి వల్ల తొందరగా చనిపోతారా....
- బీటిల్స్ మ్యూజిక్ బ్యాండ్ భారత్‌లో ఓ గుండె పగిలిన ప్రేమికుడికి ఎదురుపడినప్పుడు...
- శుక్ర గ్రహంపై జీవం ఉందా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








