హాథ్‌రస్ అత్యాచారం: బాధితురాలు.. ఓ దళిత మహిళ అని చెప్పడం తప్పా? - అభిప్రాయం

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
- రచయిత, మనీశ్ పాండే
- హోదా, బీబీసీ కోసం
కుల వ్యవస్థ అంతరించిపోయిందని కంగనా రనౌత్‌లా మీరూ భావిస్తున్నారా? మహిళల హక్కుల కోసం పోరాడే నా స్నేహితురాలు ఫేస్‌బుక్‌పై ఇలా రాసుకొచ్చారా? ''హాథ్‌రస్ అత్యాచార కేసును కులం కోణంలో చూడొద్దు. దీన్ని కేవలం ఒక మహిళపై జరిగిన అత్యాచారంలానే చూడాలి''. ఆమె కూడా కంగనాలా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది.
దేశంలో కుల వ్యవస్థే లేదని కంగన చెప్పుకొచ్చారు. మరోవైపు తను క్షత్రియ మహిళనని కూడా ఆమె గర్వంగా చెప్పుకొంటారు. పైన చెప్పిన నా స్నేహితురాలిది బ్రాహ్మణ కులం. అమ్మాయిలు చదువుకొని జీవితంలో పైకి వస్తే ఆమె సంతోషపడతారు. అయితే, ముంబయిలో ముగ్గురు ఉన్నత కులాల డాక్టర్లు వేధించడంతో దళిత మహిళా డాక్టరు పాయల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను రిజర్వేషన్ అభ్యర్థని ముగ్గురు డాక్టర్లు అవహేళన చేశారు. వారికి నా స్నేహితురాలు మద్దతు పలికింది.
పెద్దపెద్ద పదవుల్లో కూర్చొనే ప్రతి 100 మందిలో 98 మంది పురుషులేనని నేనంటే.. మహిళలు బాధపడతారు. కచ్చితంగా వారు బాధపడాలి కూడా. దాని తర్వాత ఆ 98 మందిలో 90 మంది వరకూ ఉన్నత కులాలకు చెందిన వారంటే.. అప్పుడు అందరికీ ప్రతిభ, సామర్థ్యం లాంటి మాటలు గుర్తుకు వస్తాయి.
సామాజిక న్యాయం, అన్యాయం మధ్య బేధం ఏమిటంటే.. పురుషులు, మహిళలకు ఉన్న తేడానే. కానీ, ఉన్నత కులాలు, దళితులకు ఉన్న తేడా కాదు.. ఎందుకంటే ఇక్కడ ప్రతిభ, సామర్థ్యం లాంటి మాటలు గుర్తుకు వస్తాయి.
అయితే, నిజమేంటి? మనకు వారెందుకు కనిపించరు? లేదా మన ప్రయోజనాలకు భంగం వాటిల్లనంతవరకు మాత్రమే ఎందుకు కనిపిస్తారు?

ఫొటో సోర్స్, Hindustan Times Via Getty Images
మనకు ప్రయోజనాలు చేకూర్చేవైతేనే..
దళిత మహిళపై అత్యాచారం, దళిత మహిళ సజీవ దహనం, దళిత మహిళపై దాడి, దళిత మహిళపై హత్యాచారం.. లాంటి వార్తలు పత్రికల్లో తరచూ కనిపిస్తుంటాయి. అయినా వారు కనపడరు. కొందరు ముంబయిలోనో లేదా బోస్టన్‌లోనో కూర్చుకుంటారు. వారి భూములు ఇక్కడి దళిత రైతులు సాగుచేస్తుంటారు. వారి కష్టం నుంచి వచ్చే ప్రతిఫలాన్ని, వారు పండించే అన్నాన్ని తీసుకుంటారు. కానీ వారి కంచాన్ని ఇప్పటికీ విడిగా ఉంచుతారు.
హాథ్‌రస్ అత్యాచారం బాధితురాలిని.. దళిత మహిళగా పేర్కొంటే వీరికి చాలా బాధనిపిస్తుంది. మరోవైపు తమ కుమార్తెల కోసం వారి కులాల్లోనే అబ్బాయిల్ని వెతుకుతారు. బ్రాహ్మణ్ ఏక్తా మంచ్ లేదా క్షత్రియ శక్తి సంఘటన్ లాంటి నాలుగైదు ఫేస్‌బుక్ పేజీలను వారు లైక్ కూడా చేస్తుంటారు. సమాజంలో ఒక వర్గం వారు శతాబ్దాల తరబడి పేదరికంలో కూరుకుపోయి అణచివేతకు గురయ్యారని వారు అంగీకరించరు.
వారిని చదువు, ఉద్యోగాల నుంచి దూరం చేశారు. తరతరాలుగా వారు బానిసత్వంలో బతుకుతున్నారు. ఇప్పుడు వారు కొంచెం తల పైకెత్తి బతుకుతుంటే.. తిరిగి సమాధానం ఇస్తే.. చదువుకోవడానికి వెళ్తే.. ఉద్యోగానికి వెళ్తే.. మోటార్ సైకిల్ నడిపితే.. పక్కా ఇల్లు కట్టుకుంటే.. బయటకు చెప్పకపోయినా.. లోపల బాధపడుతుంటారు.
దాని ఫలితమే.. హాథ్‌రస్, బదాయూ, ఉన్నావ్, ఖైర్లాజీ, బలరామ్‌పుర్, ఉనా తదితర అత్యాచారాలు.
హాథ్‌రస్ అత్యాచారం జరిగిన రోజే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2019 గణాంకాలు విడుదల చేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 2019లో మహిళలపై నేరాలు 7.3 శాతం పెరిగినట్లు పేర్కొంది. ముఖ్యంగా దళితులపై ఎక్కువ నేరాలు జరగుతున్నట్లు వివరించింది. ఈ రెండింటిలోనూ ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Hindustan Times Via Getty Images
దళిత మహిళలైతే శిక్ష ఎక్కువా?
మన ఇళ్లలోని మహిళలపైనా దాడులు జరుగుతాయి. కానీ దళిత మహిళలపై మరింత ఎక్కువ దాడులు జరుగుతాయి. ఆమెను భర్తతోపాటు ఇతర పురుషులూ కొడతారు. ఆమె చాలా బలహీనంగా ఉంటుంది. పేదరికంలో ఉండే దళిత మహిళలైతే మరింత బలహీనంగా ఉంటారు. పురుషుల విషయంలో కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహిళలైతే కులంతోపాటు జెండర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
దళితులు రోజూ వేధింపులు ఎదుర్కొంటుంటారు. వారి పాత్రలు విడిగా పెడతారు. వారిని బావులు, మంచి నీటి కుళాయిల దగ్గర నుంచి నీళ్లు పట్టుకోనివ్వరు. మన మహిళలు కూడా వారి మహిళలను ప్రేమతో చూడరు.
నానిహాల్ గ్రామంలో ఓ దళిత మహిళ రోజూ కుళాయి నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి వచ్చేది. ఒక రోజు ఆమె తన కోడలితో కలిసి వచ్చింది. ఆమెకు కేవలం రెండు రోజుల క్రితమే పెళ్లి అయ్యింది.
నేను ఆ కుటుంబంలో అత్తగారితో మాట్లాడాను. ''ఆమె కొంగు కప్పుకోకుండా వచ్చారు. ఇలా కొంగు కప్పుకోకుండా మా ఇంట్లోవారు బయటకు రావడం నేనెప్పుడూ చూడలేదు'' అని అన్నాను. దీంతో ఆమె స్పందిస్తూ.. ''ఇక్కడ కోడళ్లను అంత గౌరవించరు. కానీ మేం గౌరవిస్తాం'' అని చెప్పారు. అయితే నాలుగు రోజుల తర్వాత బియ్యంలో నీళ్లు పడ్డాయని ఆ కోడలిని అందరి ముందే చెప్పుతో కొట్టారు.
పండితులను గౌరవించేలా ఆమెనూ గౌరవించాలి. కానీ అవహేళనలు మాత్రం ఎప్పుడూ వెంటే ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
చేయాల్సింది ఏమిటి?
1995లో కరణ్‌థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు శేఖర్ కపూర్ ఇలా చెప్పారు. ''మా సినిమా బండిట్ క్వీన్‌పై మధ్య తరగతి ప్రజలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఎందుకంటే వారు నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. మూసుకుపోయిన వారి కళ్లను తెరవాల్సి వచ్చింది. దానికి వారు ఎప్పటికీ అంగీకరించరు.''
గాయాన్ని కప్పేస్తున్నారు. అంతా సరిగ్గా ఉందనే భ్రమలో బతుకుతున్నారు. అది సరికాదు.. గాయం ఉందని నమ్మితే.. దానికి వైద్యం తీసుకోవాలి. అప్పుడే గాయం తగ్గుతుంది.
సమాజంలో, ఇంటిలో, కుటుంబంలో కులం ఆధారిత వివక్ష ఉందని మీరు అంగీకరిస్తే.. దాన్ని మార్చడానికి మీరు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అందుకే అంగీకరిచకుండా ప్రశాంతంగా కూర్చుకుంటారు. నిజాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడరు.
మీరు నమ్మినా, నమ్మకపోయినా నిజం మాత్రం మారదు. కప్పి ఉంచిన గాయం ఇంకా పెద్దదవుతుంది. అప్పుడే ఏకంగా అవయవాన్నే కోసేయాల్సి ఉంటుంది. మీరు నిజం ఒప్పుకోవడానికి భయపడేవరకూ.. హాథ్‌రస్, బదాయూ, ఉన్నావో, భతేరీ లాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. ఒకవేళ మీరు నిజాన్ని అంగీకరిస్తే.. రెండు అడుగులు ముందుకు వేయాలి.
మహిళలు, దళితులు అణచివేతకు గురవుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ విషయం వినీ ఎవరూ ఆశ్చర్యపోరు. ఇప్పటికీ చాలా మంది మహిళలు, దళితులు తమకు ఎదురవుతున్న అమానవీయ ప్రవర్తనలపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే, సమాజం, పరిపాలన విభాగాలు.. ఈ అకృత్యాలకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
పోలీసులు, పరిపాలనా విభాగం అధికారులు మన సమాజం నుంచి వచ్చినవారే. అందులో చాలా మంది అగ్రకులాలకు చెందినవారు నిజాన్ని ఒప్పకోవడానికి, సమాజంలో మార్పులను అంగీకరించరు. అందుకే శతాబ్దాల నుంచి న్యాయం జరగడం కష్టమవుతోంది.

ఫొటో సోర్స్, PRAKASH SINGH Via Getty Images
గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ అవతలి వ్యక్తి కులం గురించి తెలుస్తుంది. ఇక్కడ దళిత మహిళలపై దాడులు జరిగే అవకాశం మరింత ఎక్కువ. వారు చేసే ఫిర్యాదులను సామాజిక భూతం కోణంలోనే చూస్తారు. మరోవైపు ఫిర్యాదు చేసేవారినే వేధిస్తారు.
దళితుల విషయంలో ఎలా వ్యవహరించాలో పోలీసు, పరిపాలనా విభాగం అధికారులకు ప్రత్యేకంగా నేర్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వారిపై కేసుల పెడతారనే ఆందోళన వారిలో ఉంటుంది. అణచివేత కేసుల్లో పోలీసులు.. దళితుల్ని వేరుగా మాట్లాడతారు. దళితుల బస్తీలు, వారు దళితులు అని విడదీసి మాట్లాడతారు.
మహిళలు - పురుషుల మధ్య భేదానికి, ఉన్నత కులాలు - దళితుల మధ్య వ్యత్యాసం కలిస్తే.. అక్కడ అణచివేత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కేసుల్లో దళితుల కోణం గురించి మాట్లాడకపోతే తప్పే అవుతుంది.
దళితులపై ఏదో ఒక రూపంలో జరిగే అకృత్యాలను చాలా మంది చూసే ఉంటారు. అయితే వాటిని అందరూ మరచిపోతుంటారు.
''కులం అంతరించి పోయింది''అని కంగన చెసే వ్యాఖ్యలకు కొందరు మద్దతు పలుకుతున్నారు. వారే మహానగరాల్లో కూర్చొని వర్ణ వ్యవస్థ ఒక సామాజిక వ్యవస్థని చెబుతూ.. ఇది సమాజానికి చాలా ముఖ్యమని వివరిస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








