అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’

లార్డ్ మేయో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లార్డ్ మేయో
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లార్డ్ మేయోను భారత్‌లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించిన వైస్రాయ్‌గా చెబుతారు. భారత్‌కు నాలుగో వైస్రాయ్‌ అయిన మేయో తన మూడేళ్ల పదవీకాలంలో దేశంలో సుమారు 20 వేల మైళ్ల దూరం ప్రయాణించారు. ఎక్కువగా ఆయన గుర్రం మీదే ప్రయాణించేవారు.

లార్డ్ మేయో గుర్రం మీద ఒకే రోజు 80 మైళ్లు ప్రయాణించడాన్ని ఆయన గొప్పతనంగా చెప్పేవారు. భారత్‌లో తన నియామకం తర్వాత ఆ కాలంలో ఆంగ్లేయులకు అందుబాటులో ఉన్న అన్ని రవాణా సౌకర్యాలనూ ఆయన ఉపయోగించారు. అంటే స్టీమర్, రైళ్లలో, ఏనుగులు, జడలబర్రెలు, ఒంటె మీద కూడా ప్రయాణించారు.

ఆయన గురించి జేహెచ్ రివెట్ కర్నాక్ తన ‘మెనీ మెమరీస్’ అనే పుస్తకంలో వివరంగా రాశారు.

“ఒకసారి దేశం మధ్యలో ఉన్న ఒక ప్రాంతానికి ఎడ్లబండిపై మాత్రమే వెళ్లవచ్చని లార్డ్ మేయోకు తెలిసింది. దాంతో ఆయన తన పైజామాపై ఒక కోటు వేసుకుని ఎద్దులబండిలో పరిచిన గడ్డి మీద పడుకున్నారు. సిగార్ వెలిగించిన ఆయన, ‘ఆహా ఇంతకంటే హాయిగా ఏదీ ఉండదేమో’ అన్నారు. ఉదయం తన గమ్యానికి చేరుకోగానే, ఎడ్లబండిలో చాలా బాగా నిద్రపట్టిందని చెప్పారు. కిందకు దిగిన తర్వాత తన యూనిఫాం వేసుకుని, కోటు మీద ఉన్న గడ్డి పరకలను విదిలించారు” అని రివెట్ చెప్పారు.

రాస్ ఐలాండ్

ఫొటో సోర్స్, DEA / BIBLIOTECA AMBROSIANA/Getty Images

ఫొటో క్యాప్షన్, రాస్ ఐలాండ్

మౌంట్ హారియట్ కోరిక ప్రాణం తీసింది

లార్డ్ మేయో 1872లో బర్మా, అండమాన్ ద్వీపాల్లో పర్యటించాలని అనుకున్నారు. అండమాన్‌లో అప్పట్లో ప్రమాదకరమైన ఖైదీలను ఉంచేవారు. అంతకు ముందు బ్రిటిష్ వైస్రాయ్, గవర్నర్ జనరళ్లలో ఎవరూ అండమాన్‌కు వెళ్లాలని అనుకోలేదు.

1789లో లెఫ్టినెంట్ బ్లేయర్ మనసులో మొదటిసారి అండమాన్‌లో ఒక కాలనీ ఏర్పాటుచేయాలనే ఆలోచన వచ్చింది. కానీ 1796లో మలేరియా వ్యాపించడం, స్థానిక తెగల నుంచి వ్యతిరేకత రావడంతో బ్రిటిష్ వారు ఆ ద్వీపాలను వదిలిపెట్టారు.

కానీ, 1858 నుంచి ఆంగ్లేయులు ప్రమాదకరమైన ఖైదీలను అక్కడికి పంపించడం ప్రారంభించారు. మొదటిసారి 1858 జనవరిలో 200 మంది ఖైదీలను అక్కడికి తీసుకుని వచ్చారు. అప్పుడు కూడా లార్డ్ మేయో అండమాన్ వెళ్లారు. అక్కడ మొత్తం 8 వేలకు పైగా జనాభా ఉండేది. వారిలో 7 వేల మంది ఖైదీలుకాగా, 900 మంది మహిళలు, 200 మంది పోలీసులు ఉండేవారు.

అండమాన్‌లో మేయో పర్యటన 1872 ఫిబ్రవరి 8న ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు ఆయన గ్లాస్గో నౌక పోర్ట్ బ్లెయిర్ జెట్టీలో లంగరు వేసింది. అక్కడ దిగగానే ఆయనకు 21 ఫిరంగులతో సెల్యూట్ చేశారు. అదే రోజు ఆయన రాస్ ఐలాండ్‌లో యూరోపియన్ బ్యారక్స్, ఖైదీల క్యాంపును పరిశీలించారు. చాథమ్ ద్వీపంలో పర్యటించారు. ఆ దీవిలో అన్ని కార్యక్రమాలూ సమయానికి ముందే ముగిశాయి. సూర్యాస్తమయానికి ఇంకా గంట సమయం ఉంది. దాంతో ఆయన ఆ లోపు మౌంట్ హారియెట్‌ పైకి ఎక్కితే బాగుంటుందని అనుకున్నారు.

లార్డ్ మేయో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లార్డ్ మేయో

చీకట్లో చిరుతలా వెనుక నుంచి దాడి

ఆ పర్యటనలో మేయోతో ఉన్న సర్ విలియమ్ విల్సన్ ఆరోజు జరిగిన ఘటన గురించి తన స్వీయ చరిత్ర ‘లైఫ్ ఆఫ్ అర్ల్ ఆఫ్ మేయో’ అనే పుస్తకంలో రాశారు

“మౌంట్ హారియెట్ దాదాపు 1116 అడుగుల ఎత్తుంటుంది. దానిని నిట్టనిలువుగా ఎక్కాలి, చాలా కష్టం. మంచి ఎండలో ఎక్కడంతో మేయో దళంలోని చాలా మంది అలిసిపోయారు. కానీ ఆయన మాత్రం అప్పటికీ హుషారుగానే ఉన్నారు. తనతోపాటూ తీసుకొస్తున్న గుర్రం కూడా ఎక్కకుండా నడుస్తున్నారు. కావాలంటే ఆ గుర్రంపై వేరే ఎవరైనా రావచ్చని చెప్పారు. శిఖరం పైకి చేరుకున్న తర్వాత పది నిమిషాలు సూర్యాస్తమయం చూస్తూ ఉండిపోయారు. ఈ దృశ్యం ఎంత అందంగా ఉందో అన్నారు.

మేయో, ఆయన అనుచరులు ఆ కొండ దిగేసరికి చీకట్లు అలుముకున్నాయి. హోప్‌టౌన్ జెట్టీ దగ్గర ఒక పడవ వైస్రాయ్‌ను నౌక దగ్గరకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.

కాగడాలు పట్టుకున్న కొంతమంది మేయో ముందు నడుస్తున్నారు. మేయో కుడివైపు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మేజర్ ఓవెన్ బర్న్, ఎడమ వైపు అండమాన్ చీఫ్ కమిషనర్ డొనాల్డ్ స్టీవర్ట్ ఉన్నారు. మేయో ఇక పడవలోకి ఎక్కబోతున్న సమయంలో, స్టీవర్ట్ గార్డ్స్ కు ఆదేశాలు ఇవ్వడానికి ముందుకెళ్లారు. అప్పుడే చెట్ల వెనుక దాగిన ఒక పొడవాటి పఠాన్ మేయో వీపులో బాకుతో పొడిచాడు.

ఆ ఘటన గురించి హంటర్ రాశారు.

“కాగడాల వెలుగులో ఒక మనిషి చేతిలోని బాకు పైకి లేవడం చూశాను. అతడు దానితో మేయో భుజాల మధ్య రెండు సార్లు పొడిచాడు. ఒక వ్యక్తి చిరుతపులిలా మేయో వెనుక దాడిచేయడం మేయో కార్యదర్శి మేజర్ బర్న్ చూశాడు. క్షణాల్లోనే దుండగుడిని పట్టుకున్నారు. మోకాళ్లపై కుప్పకూలిన మేయో, బలం కూడదీసుకుని లేచి నిలబడ్డాడు. తన కార్యదర్శితో ‘బర్న్, దే హావ్ ఇన్ ఇట్’ అన్నారు. తర్వాత గట్టిగా, ‘నాకది పెద్ద గాయంగా అనిపించడం లేదులే’ అని మళ్లీ పడిపోయారు. ఆయన బూడిద రంగు కోట్ రక్తంతో తడిచిపోయింది. అక్కడున్న వాళ్లు ఆయన కోట్ చించేశారు. రుమాళ్లు, తమ చేతులతో రక్తం పోకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సైనికులు ఆయన కాళ్లు, చేతులు రుద్దుతున్నారు”.

లార్డ్ మేయోను షేర్ అలీ హత్య చేశారు

ఫొటో సోర్స్, CASSELL'S ILLUSTRATED HISTORY OF INDIA

ఫొటో క్యాప్షన్, లార్డ్ మేయోను షేర్ అలీ హత్య చేశారు

లార్డ్ మేయో ప్రాణాలు పోయాయి

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లైబ్రరీలో మేయో వ్యక్తిగత కార్యదర్శి మేజర్ బర్న్ లేఖలు ఉన్నాయి. వాటిలో ఆయన ఆ నాటి ఘటనను వివరించారు.

‘‘వైస్రాయ్ చాలా కష్టంగా నన్ను పడవ వరకూ తీసుకెళ్లండి అన్నారు. మేం నావికుల సాయంతో ఆయన్ను వెంటనే పడవ దగ్గరకు వెళ్లాం. ఆయన చివరగా ‘నా తలను పైకెత్తిండి’ అన్నారు. మేయోను వెంటనే ఆ పడవ దగ్గరే వేచిచూస్తున్న నౌక దగ్గరకు తీసుకెళ్లారు” అన్నారు..

హంటర్ తన పుస్తకంలో ఆ తర్వాత జరిగింది చెప్పారు.

“నౌకలో ఉన్న వాళ్లు రాత్రి వంట ఏర్పాట్లలో ఉన్నారు. మేయోను పైకి తీసుకుని వెళ్లగానే, ఆయనకు ఏం జరిగిందో ఎవరికీ తెలీకుండా, లోపలున్న దీపాలు ఆర్పేశారు. మేయోను తీసుకుని ఆయన క్యాబిన్‌లోకి తీసుకెళ్లి, మంచంపై పడుకోబెట్టాం. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఉదయం నౌకపై ఎగురుతున్న బ్రిటిష్ జెండాను సగానికి అవనతం చేశారు”.

షేర్ అలీ

ఫొటో సోర్స్, British Library

ఫొటో క్యాప్షన్, షేర్ అలీ

ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ

మేయోను బాకుతో పొడిచిన ఆ పఠాన్ పేరు షేర్ అలీ. వైస్రాయ్ హత్య తర్వాత షేర్ అలీని కూడా అదే నౌక పైకి తీసుకొచ్చారు. మేయో శవాన్ని ఉంచిన చోటే నిలబెట్టారు. ఇలా ఎందుకు చేశావని ఆంగ్లేయ అధికారులు షేర్ అలీని అడిగారు. అప్పుడు అతడు “దేవుడు ఆదేశించాడు” అని సమాధానం ఇచ్చాడు.

“ఇలా చేయడానికి నీకు ఎవరైనా సాయం చేశారా” అని అధికారులు అతడిని అడిగారు. కానీ అతడు ‘‘ఇందులో, మనుషులెవరూ లేరు, ఆ దేవుడే ఉన్నాడు” అన్నాడు.

షేర్ అలీ నైరుతి సరిహద్దు ప్రాంతంలోని తీరా లోయలో ఉండేవాడు. పంజాబ్ పోలీసుల అశ్వికదళంలో పనిచేసేవాడు. పెషావర్‌లో తన దాయాది హైదర్‌ను చంపిన ఆరోపణలపై అతడికి మరణశిక్ష విధించారు. శిక్ష విధించే ముందు అతడు తన వాంగ్మూలంలో తన దృష్టిలో కుటుంబవైరంలో శత్రువును చంపితే నేరం కాదన్నాడు. 1869లో అతడికి ఉరి శిక్ష విధించిన తర్వాత, ఉన్నత స్థాయి ఆంగ్లేయ అధికారిని చంపి, ప్రతీకారం తీర్చుకుంటానని షేర్ అలీ ప్రతిజ్ఞ చేశాడు. ఉరి శిక్షపై అపీల్ చేసుకోవడంతో అతడి శిక్షను అండమాన్‌లో జీవిత ఖైదుగా మార్చారు.

లార్డ్ మేయో హత్యకు గురైన అండమాన్‌లోని ప్రదేశం ఇదే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లార్డ్ మేయో హత్యకు గురైన అండమాన్‌లోని ప్రదేశం ఇదే

మేయో హత్యకు షేర్ అలీకి ఉరిశిక్ష

అండమాన్‌లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అతడు మూడు సార్లు అధికారులను చంపాలని ఎదురుచూశాడు.

1872 ఫిబ్రవరి 8న అతడికి లార్డ్ మేయో అండమాన్ వస్తున్నారనే వార్త తెలిసింది.

దాంతో అతడు ఉదయం నుంచే తన బాకుకు పదును పెట్టాడు. షేర్ అలీ పర్వతాలపై నివసించే ఒక బలిష్టమైన వ్యక్తి. ఎత్తు 5 అడుగులా 10 అంగుళాలు. చీకటి గదిలో చేతులు, కాళ్లకు గొలుసులు ఉన్నప్పటికీ అతడు తన బలంతో ఒక ఆంగ్లేయ సెంట్రీ నుంచి బాయ్‌నెట్ లాక్కున్నాడు.

అండమాన్‌లో శిక్ష అనుభవిస్తున్న మౌల్వీ థానేసరీ, మిగతా ముజాహిదీన్లు మేయోను హత్య చేయడానికి షేర్ అలీని ఉపయోగించవచ్చని ఆంగ్లేయులకు సందేహం వచ్చింది. కానీ లోతుగా దర్యాప్తులో అది తేలలేదు.

ఈ ఘటనపై ఆస్ట్రేలియా నేషనల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హెలెన్ జేమ్స్ ‘ద అసాసినేషన్ ఆఫ్ లార్డ్ మేయో-ద ఫస్ట్ జిహాద్’ అనే పరిశోధనా పత్రం రాశారు.

అందులో “షేర్ అలీ మిత్రులను విచారించిన తర్వాత అతడు ముందే ఈ హత్యకు పథకం రూపొందించినట్టు తెలిసింది. మేయో పర్యటనకు ముందే అతడు తన మిత్రులందరికీ వీడ్కోలు చెప్పాడు. వారందరి కోసం తన డబ్బంతా ఖర్చు పెట్టి తినడానికి కొన్ని వంటలు చేశాడు. కానీ, షేర్ అలీ ఇంత పని చేయబోతున్నాడనే విషయం ఎవరూ ఊహించలేదు.

షేర్ అలీ గతంలో పెషావర్‌లో ఒక అశ్విక దళ సైనికుడుగా మేజర్ హ్యూజ్ జేమ్స్, రెనెల్ టేలర్ దగ్గర పనిచేశాడు. అతడి సేవలకు బాగా ప్రభావితుడైన టేలర్ షేర్ అలీకి బహుమతిగా ఒక గుర్రం, పిస్టల్, సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.

నిబంధనల ప్రకారం షేర్ అలీ మరణశిక్ష ఆదేశాలను రివ్యూ చేయడానికి కలకత్తా హైకోర్టుకు పంపించారు. 1872 ఫిబ్రవరి 20న ట్రైబ్యునల్ అతడి మరణ శిక్షను ధృవీకరించింది. 1872 మార్చి 11న షేర్ అలీని వైపర్ ద్వీపంలో ఉరి తీశారు.

లార్డ్ మేయో అంతిమయాత్ర

ఫొటో సోర్స్, Universal History Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, లార్డ్ మేయో అంతిమయాత్ర
లార్డ్ మేయో అంతిమయాత్ర

ఫొటో సోర్స్, Universal History Archive/Getty Images

ఐర్లాండ్‌కు లార్డ్ మేయో మృతదేహం

ఈ హత్య బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసింది. చాలా రోజుల వరకూ దీనిపై చర్చించడానికి కూడా భయపడ్డారు. ప్రొఫెసర్ హెలెన్ జేమ్స్ తన పరిశోధనా పత్రంలో అప్పటి పరిస్థితి రాశారు.

“ఇది పూర్తిగా ఊహించని ఘటన. కానీ 1857లో తిరుగుబాటులో వహాబియాల పాత్ర ఉందని తెలిశాక, 1871 సెప్టెంబర్ 20న కలకత్తా ఎగ్జిక్యూటివ్ చీఫ్ జస్టిస్ జాన్ నార్మన్‌ను అబ్దుల్లా అనే ఒక వహాబీ మద్దతుదారుడు బాకుతో పొడిచి చంపిన తర్వాత కూడా బ్రిటిష్ ప్రభుత్వం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తం కావాల్సింది. అంతకు ముందు కూడా 1853 సెప్టెంబర్ 10న పెషావర్‌లో అక్కడి కమిషనర్ కల్నల్ ఫ్రెడ్రిక్ మాక్సన్‌ను ఒక పఠాన్, అతడి బంగళాలోనే వరండాలో కత్తితో పొడిచి హత్య చేశాడు” అని తెలిపారు.

లార్డ్ మేయో మృతదేహాన్ని ఆయన పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లిన గ్లాస్గో నౌకలోనే కలకత్తా తీసుకొచ్చారు. 1872 ఫిబ్రవరి 17న ప్రిన్సెప్ ఘాట్‌ నుంచి గవర్నమెంట్ హౌస్ తీసుకొచ్చారు. అప్పుడు ఆ శవయాత్రలో కలకత్తాలో ఉన్న దాదాపు ప్రతి ఆంగ్లేయుడూ పాల్గొన్నాడు.

రెండు రోజులు గవర్నమెంట్ హౌస్‌లో ఉంచిన తర్వాత మేయో శవాన్ని మొదట బొంబాయి, తర్వాత ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ తీసుకెళ్లారు. అక్కడ 1872 ఏప్రిల్ 25న అధికార లాంచనాలతో ఒక చర్చిలో మృతదేహాన్ని ఖననం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)