సింగపూర్‌: కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?

పని మనిషి పర్టికి, యజమాని లీవ్‌ మున్‌కు మధ్య నాలుగేళ్ల కోర్టు యుద్ధం నడిచింది

ఫొటో సోర్స్, Parti Liyani/Getty

ఫొటో క్యాప్షన్, పని మనిషి పర్టికి, యజమాని లీవ్‌ మున్‌కు మధ్య నాలుగేళ్ల కోర్టు యుద్ధం నడిచింది
    • రచయిత, వైవెట్టే టాన్
    • హోదా, బీబీసీ న్యూస్‌, సింగపూర్‌

ఆమె ఇండోనేషియా నుంచి వచ్చిన సాదాసీదా వలస కూలి. ఇళ్లలో పని చేసి జీవిస్తారు. పేరు పర్టి లియానీ. ఒక కోటీశ్వరుడి ఇంట్లో పని మనిషిగా చేరారు. జీతం 600 సింగపూర్‌ డాలర్లు. (సుమారు రూ.32 వేలు)

ఆమె యజమాని సింగపూర్‌లో పేరు మోసిన వ్యాపారి. దేశంలోనే పలు బడా కంపెనీలకు ఛైర్మన్‌.

ఒకరోజు హఠాత్తుగా యజమాని కుటుంబం ఆమెపై దొంగతనం ఆరోపణలు మోపింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు సింగపూర్‌లో ఒక పెద్ద సంచలనంగా నిలిచింది.

ఆమె దొంగతనం చేసినట్లు ఆరోపిస్తున్న వస్తువులలో లగ్జరీ హ్యాండ్‌ బ్యాగులు, డీవీడీ ప్లేయర్‌, వాచ్‌లు, ఆడవాళ్ల డ్రెస్సులు ఉన్నాయి.

ఈ కేసు నాలుగేళ్లపాటు విచారణ జరిగింది. ఈ నెలలో వెలువడ్డ తుది తీర్పులో పర్టి నిర్దోషిగా తేలారు. "చాలా సంతోషంగా ఉంది. ఈ కేసులో నేను నాలుగేళ్లుగా న్యాయ పోరాటం చేశాను'' అని ఆమె అన్నారు.

న్యాయం విషయంలో సింగపూర్‌లో పేదలకు, ధనికులకు మధ్య అంతరాలను ఈ కేసు బైటపెట్టింది. అసలు ఆమెను దొంగ అన్నందుకు చాలామంది ఆశ్చర్యపోయారు.

లీవ్‌ మున్‌ లియాంగ్‌ అనే వ్యాపారవేత్త ఇంట్లో 2007 సంవత్సరంలో పని మనిషిగా చేరారు పర్టి. 2016లో లీవ్‌ మున్‌ లియాంగ్‌ కుమారుడు కార్ల్‌ లీవ్‌ తండ్రి నుంచి వేరయి, మరోచోట ఉంటున్నారు.

కోర్టులో దాఖలైన పత్రాల ఆధారంగా తేలిందేంటంటే, లీవ్‌ మున్‌ ఇంటితోపాటు, తరచూ అతని కుమారుడు కార్ల్‌ లీవ్‌ ఇంటికి కూడా వెళ్లి పర్టి ఇంటి పని చేయాల్సి వచ్చేది. అయితే ఇది స్థానిక కార్మిక చట్టాలకు విరుద్ధం. ఈ విషయంపై ఆమె అంతకు ముందు ఫిర్యాదు చేశారు.

డీవీడీ ప్లేయర్

ఫొటో సోర్స్, HOME

ఫొటో క్యాప్షన్, చెడిపోయిన డీవీడీ ప్లేయర్ ను పర్టి దొంగతనం చేశారని లీవ్ మున్ కుటుంబం ఆరోపించింది

ఈ ఫిర్యాదు ఇచ్చిన కొన్ని నెలల తర్వాత లీవ్‌ కుటుంబం ఆమెను పని నుంచి తొలగిస్తున్నట్లు పర్టికి తెలిపింది. ఆమె తమ ఇంట్లో కొన్ని వస్తువులను దొంగిలించిందని తర్వాత ఆరోపణలు మోపారు.

ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నప్పుడే ఆమె లీవ్‌ మున్‌ కుమారుడు కార్ల్‌ లీవ్‌తో "నేను మీ టాయిలెట్‌ను శుభ్రం చేయలేదు. అందుకే నన్ను తొలగిస్తున్నారు. నాకు తెలుసు'' అని అన్నారు.

ఆమెకు రెండు గంటల సమయం ఇచ్చి, తన సామాన్లను బాక్సుల్లో సర్ది వెళ్లిపోవాలని, వాటిని తాము ఇండోనేషియా పంపుతామని లీవ్ కుటుంబం పర్టికి చెప్పింది.

"నాతో టాయిలెట్లు కడిగించేందుకు ప్రయత్నించారని నేను సింగపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తా'' అని ఆమె సామాన్లు సర్దుకుంటున్న సమయంలోనే లీవ్‌ కుటుంబానికి తెలిపింది.

పర్టి ఇంటి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆమె సామాన్ల పెట్టెలను తనిఖీ చేసిన లీవ్‌ కుటుంబం అందులో తమ విలువైన వస్తువులు కొన్ని ఉన్నాయని, వాటిని ఆమె దొంగిలించిందని ఆరోపించారు.

లీవ్‌ మున్‌ లియాంగ్‌, ఆయన కుమారుడు కార్ల్‌ లీవ్‌ ఇద్దరూ 2016 అక్టోబర్‌ 30న పోలీసులకు పర్టి మీద ఫిర్యాదు చేశారు.

ఐదు వారాల తర్వాత మరో ఉద్యోగం కోసం ఇండోనేషియా నుంచి తిరిగి సింగపూర్‌ వచ్చిన పర్టిని పోలీసులు అరెస్టు చేసే వరకు వారి ఫిర్యాదు గురించి ఆమెకు తెలియదు.

పోలీస్‌ కేస్‌ కారణంగా ఎక్కడా పని దొరక్కపోవడంతో సింగపూర్‌లోని వలస కూలీలకు ఆశ్రయమిచ్చే ఒక శిబిరంలో ఉండిపోయారు పర్టి.

మగవాడి రూములో ఆడవాళ్ల డ్రెస్సులు

లీవ్‌ మున్‌ కొడుకు కార్ల్‌ లూయిస్‌ ఇంట్లోని దాదాపు 115 వస్తువులు దొంగతనానికి గురయ్యాయని, ఇందులో ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, డీవీడీ ప్లేయర్‌, గెరాల్డ్‌ జెంటా బ్రాండ్‌ వాచ్‌ తదితరాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీటి ఖరీదు సుమారు 34,000 సింగపూర్‌ డాలర్లని లీవ్‌ కుటుంబం తన ఫిర్యాదులో పేర్కొంది.

దొంగతనం చేసినట్లు లీవ్‌ కుటుంబం చెబుతున్న వస్తువులలో కొన్ని వస్తువులు తనవేనని, మరికొన్ని పడేసిన పాత వస్తువులని, ఇంకొన్నింటి గురించి తనకు తెలియదని విచారణ సందర్భంగా పర్టి కోర్టుకు తెలిపారు.

2019లో ఆమెకు రెండు సంవత్సరాల రెండు నెలల జైలు శిక్ష పడింది. అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని పర్టి నిర్ణయించుకున్నారు. అలా ఈ కేసు 2020 సెప్టెంబర్‌ వరకు సాగి చివరకు ఆమె నిర్దోషిగా తేలారు.

పర్టిని దొంగగా ముద్ర వేయడానికి లీవ్‌ మున్‌ కుటుంబం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిందని న్యాయమూర్తి చాన్‌ సెంగ్‌ ఓన్‌ తీర్పు సమయంలో చెప్పారు. పోలీసులు ఈ కేసును విచారణ జరిపిన తీరును కూడా ఆయన తప్పుబట్టారు.

తన కేసును వాదించిన న్యాయవాది అనిల్ బాల్ చందానీతో పర్టి

ఫొటో సోర్స్, Home/Grace Baey

ఫొటో క్యాప్షన్, తన కేసును వాదించిన న్యాయవాది అనిల్ బాల్ చందానీతో పర్టి

తనను టాయిలెట్‌ శుభ్రం చేయమన్నారని ఆమె చేసిన ఫిర్యాదుకు ప్రతీకారంగానే లీవ్‌ కుటుంబం ఈ కేసు పెట్టిందని కూడా జడ్జి అభిప్రాయపడ్డారు.

పర్టి దొంగతనం చేసిందని చెబుతున్న చాలా వస్తువులు అప్పటికే పాడైపోయాయని, అలాంటి వస్తువులను దొంగతనం చేశారంటే నమ్మడానికి కూడా వీలుకాకుండా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. లీవ్‌ మున్‌ కుటుంబం పనికి రావని పారేసిన వస్తువులలో డీవీడీ ప్లేయర్‌లాంటి వాటిని తాను తీసుకున్నానని పర్టి చెప్పారు.

డీవీడీ ప్లేయర్‌ పని చేయడం లేదు కదా అని కోర్టు ప్రశ్నించగా, ఆమె దగ్గర చాలా తెలివి తేటలున్నాయని, వాటిని ఎలాగైనా పని చేయిస్తారని లీవ్‌ కుటుంబం కోర్టుకు తెలిపింది. అయితే లీవ్‌ మున్‌ కుమారుడు కార్ల్‌ లీవ్‌ను ఈ కేసులో సాక్షిగా పేర్కొనడాన్ని కోర్టు తప్పుబట్టింది.

తన పింక్‌ నైఫ్‌ను పర్టి దొంగిలించారని కార్ల్‌ లీవ్‌ ఆరోపించారు. తాను ఈ కత్తిని 2002లో బ్రిటన్‌లో కొన్నానని చెప్పిన కార్ల్‌, తర్వాత అది 2002కన్నా ముందు తయారు చేసింది కాదని ఒప్పుకున్నారు.

పర్టి సామాన్ల పెట్టెల్లో మహిళలు ధరించే కొన్ని దుస్తులు కూడా ఉన్నాయని, అవి తనవేనని కార్ల్‌ కోర్టుకు తెలిపారు. కానీ తర్వాత వాటిలో కొన్ని తనవో కావో గుర్తులేదని అన్నారు. అసలు మహిళల దుస్తులు మీవెలా అవుతాయని న్యాయస్థానం ప్రశ్నించగా, తనకు ఆడవాళ్ల దుస్తులు ధరించే అలవాటుందని కార్ల్‌ కోర్టుకు చెప్పారు. ఈ మాటలు విన్న జడ్జి తాను ఈ మాటలను నమ్మలేకపోతున్నానని అన్నారు.

పోలీసులు సంఘటనా స్థలాన్ని ఫిర్యాదు అందిన ఐదు వారాల దాకా ఎందుకు సందర్శించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇండోనేషియన్‌ భాష తప్ప మరో భాష తెలియని పర్టికి ఒక దుబాసీ (ఇంటర్‌ప్రిటేటర్‌)ని కూడా పోలీసులు ఏర్పాటు చేయలేదని, ఆమెకు అర్ధంకానీ మాలే భాషకు చెందిన దుబాసీని ఏర్పాటు చేశారని జడ్జి అన్నారు.

"పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉంది. అంతకు ముందు కేసు విచారించిన న్యాయమూర్తి పోలీసులు వైఫల్యాలను గుర్తించ లేదు'' అని సింగపూర్‌ యూనివర్సిటీ లా డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌ యూజీన్‌ టాన్‌ బీబీసీతో అన్నారు.

డేవిడ్‌ అండ్‌ గోలియత్ యుద్ధం

ఈ కేసుతో లీవ్‌ మున్‌ కుటుంబంపై సింగపూర్‌వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. పేదలను ధనికులు ఎలా ఇబ్బంది పెట్టగలరో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణని కొందరు వ్యాఖ్యానించారు. చివరకు బాధితురాలికి న్యాయం జరగడం మంచి పరిణామంగా పేర్కొన్నారు.

"ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి కేసును చూడలేదు'' అన్నారు ప్రొఫెసర్ టాన్‌.

ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో పలు కంపెనీలకు చైర్మన్‌గా ఉన్న లీవ్‌ మున్‌ తన పదవులకు రాజీనామా చేశారు. "ఆమె తప్పు చేసిందని నాకు అనిపించింది. అందుకే ఆమెపై ఫిర్యాదు చేశాను. అది నా హక్కు. సింగపూర్‌ హైకోర్ట్‌ ఇచ్చిన తీర్పును నేను గౌరవిస్తున్నాను'' అని లీవ్‌ మున్‌ వ్యాఖ్యానించారు. కార్ల్‌ మున్‌ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఈ కేసు విచారణ జరిగిన తీరు చూస్తే పోలీసు వ్యవస్థలో ఎక్కడో లోపం ఉన్నట్లు అనిపిస్తోందని సింగపూర్‌ న్యాయశాఖ మంత్రి షణ్ముగం అన్నారు. "ఇది డేవిడ్ అండ్‌ గోలియత్‌లాంటి కథ. చివరకు ఇందులో కూడా డేవిడే గెలిచాడు'' అని ప్రొఫెసర్‌ టాన్‌ అన్నారు.

పర్టి కేసును వాదించిన న్యాయవాది అనిల్‌ బాల్‌చందాని ఆమె నుంచి ఫీజు తీసుకోలేదు. సాధారణంగా ఇలాంటి కేసులను వాదించినందుకు ఆయన లక్షా యాభైవేల సింగపూర్ డాలర్లను ఫీజుగా తీసుకుంటారు.

"నా సమస్యలన్నీ తీరిపోయాయి. నేను నా దేశం ఇండోనేషియా వెళ్లిపోతా'' అన్నారు పర్టి లియాని. "నాకు పని ఇచ్చిన లీవ్‌ మున్‌ కుటుంబాన్ని నేను క్షమిస్తున్నాను. కానీ వారు మరొకరితో మళ్లీ ఇలా ప్రవర్తించవద్దని కోరుకుంటున్నాను'' అన్నారు పర్టి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)