భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష

ఫొటో సోర్స్, iStock
ఓ శ్రీలంక మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వాళ్లు ఎవరో కాదు, తన భర్త స్నేహితులే. అంతేకాదు, అది జరిగింది కూడా తన భర్త అంగీకారంతోనే.
"నా భార్య మరో మహిళతో ప్రేమలో ఉంది. నాపట్ల ప్రేమ చూపట్లేదు. నాతో సన్నిహితంగా ఉండట్లేదు" ఇది ఆ బాధితురాలు ఏంజల్(పేరు మార్చాం) భర్త ఏడుస్తూ చెప్పిన విషయం.
"పడక మీద భార్యతో ఎలా వ్యవహరించాలో నీకు తెలియదు. అందుకే, ఆమె ఓ మహిళకు దగ్గరైంది. ఇక నీ భార్యను మాకు వదిలేయ్. ఆమెతో ఎలా వ్యవహరించాలో మేం చూసుకుంటాం" ఇవి అతడి స్నేహితులు చెప్పిన మాటలు.
ఆమె తన భర్తతో పడకను పంచుకునేందుకు ఇష్టపడట్లేదు. దాంతో ఆమె భర్త తీవ్ర కోపంతో ఉన్నారు.
ఓ రోజు రాత్రి అతని ఐదుగురు స్నేహితులు ఆమెపై అత్యాచారం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాది కింద ఏంజల్‌కి ఇష్టంలేని పెళ్లి చేశారు. పురుషుడిని వివాహం చేసుకోవాలని ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్). ఆ విషయం భర్తకు తెలియదు.
ఏడాది పాటు బలవంతంగా వైవాహిక జీవితాన్ని నెట్టుకొచ్చిన ఏంజల్, తర్వాత తన అత్తగారింటిని వదిలి వెళ్లిపోయారు.
ఎందుకు తనను వదిలేసి వెళ్లావని భర్త అడిగితే, తాను స్వలింగ సంపర్కురాలినని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత తీవ్రంగా కుమిలిపోయిన అతడు, తన స్నేహితులకు వివరించారు.
అతని కళ్ల ముందే, అతని అంగీకారంతోనే అతని ఐదుగురు స్నేహితులు ఏంజల్‌ని రేప్ చేశారు.
దాంతో ఆమె గర్భం దాల్చారు. ఇప్పటి వరకు తన బిడ్డకు ఆ ఐదుగురిలో తండ్రి ఎవరవుతారో ఆమెకు తెలియదు.
ప్రస్తుతం ఆమె నువారా ఇలియాలోని ఓ సంరక్షణ గృహంలో ఉంటున్నారు.
లెస్బియన్ అన్న విషయాన్ని వెల్లడించడం వల్లనే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకలో ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్)ల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఏంజల్ కథ ఒక్క ఉదాహరణ మాత్రమే.
వాళ్లుకు భరోసా ఇచ్చే చట్టాలు ఆ దేశంలో లేవు.
వాళ్ల హక్కుల కోసం శ్రీలంకలో పోరాడుతున్న 'ఈక్వల్ గ్రౌండ్' అనే స్వచ్చంద సంస్థ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది.
ఎల్‌జీబీటీల హక్కుల కోసం గళమెత్తేవారి మీద శ్రీలంకలో పాశ్చాత్య సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ముద్ర వేస్తున్నారని ఆ సంస్థ నిర్వాహకులు అన్నారు.
ప్రస్తుతం శ్రీలంక పీనల్ కోడ్‌లోని సెక్షన్ 365-ఏ కింద స్వలింగ సంపర్కం అనేది నేరం కింద పరిగణిస్తారు.
కానీ, ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులు కూడా జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు.

"సెక్షన్ 365-ఏ కింద చేసిన చాలా అరెస్టులు చట్టబద్ధంగా జరగలేదు. ఎల్‌జీబీటీల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాం" అని శ్రీలంక మానవహక్కుల సంఘం ప్రతినిధి మనేక అన్నారు.
"చాలా మంది ఎల్‌జీబీటీలకు వారి కుటుంబం నుంచే వేధింపులు ఎదురవుతున్నాయి. దాంతో ఆ బాధను తట్టుకోలేక చాలామంది తమను తామే శిక్షించుకుంటూ.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తమ గుర్తింపును కోల్పోతున్నారు. ఈ సమస్యలపై దృష్టిపెట్టాల్సిన బాధ్యత మీడియాపై ఉంది" అని మనేకా అభిప్రాయపడ్డారు.
"ఎల్‌జీబీటీల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు సంబంధించి ప్రకటనను ప్రచురించేందుకు కూడా మీడియా ఇష్టపడట్లేదు. ఎందుకంటే, అలాంటి ప్రకటనల పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని మీడియా సంస్థల భయం" అని న్యాయవాది రాధికా చెప్పారు.
ఎల్‌జీబీటీలలో స్థైర్యం పెంచేందుకు అందరూ కృషి చేయాలని, వారికీ సమాజంలో గౌరవంగా బతికే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక వేత్తలు కోరారు.
ఇవి కూడా చదవండి:
- రామాయణంలో సీత టెస్ట్‌ట్యూబ్ బేబీనే.. మహాభారత కాలంలోనే లైవ్ టెలికాస్ట్..
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- అక్కడ లీటరు పెట్రోలు 67 పైసలే
- ఈ తెలుగు చాయ్‌వాలాకు నరేంద్ర మోదీ ‘సెల్యూట్’ చేశారు.. ఇంతకూ ఎవరాయన?
- గాంధీ మహాత్ముడిగా మారేందుకు పురికొల్పిన ఆ అవమానానికి 125 ఏళ్లు
- తాగునీరు అందని గ్రామాలు.. ఆంధ్రాలో మూడోవంతు, తెలంగాణలో సగం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








