ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...

పాత టీవీ

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్‌లో ఓ డొక్కు టీవీ వల్ల ఊరి మొత్తానికి ఇంటర్నెట్ రాకుండా పోయింది. ఒక్కసారి కాదు... రోజూ ఉదయం గంట కొట్టినట్లుగా ఇలాగే జరుతుండేది.

అయితే, ఆ టీవీ వల్లే ఇంటర్నెట్ ఆగిపోతోందన్న విషయం పాపం ఎవరికీ తెలియదు. ఆఖరికి ఆ టీవీ ఓనర్‌కు కూడా.

సమస్య ఏంటో అర్థం కాక ఆ ఊరివాళ్లు, అక్కడ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న ఓపెన్‌రీచ్ అనే సంస్థకు చెందిన ఇంజనీర్లు తలలుపట్టుకునేవారు.

పొవిస్ అనే ప్రాంతంలోని అబెర్హోసన్ అనే ఊర్లో ఈ వింత ఘటన జరిగింది.

అది చాలా పాత టీవీ. ఆ ఓనర్ దాన్ని సెకండ్ హ్యాండ్‌లో కొన్నారు.

రోజూ ఉదయం ఏడు గంటలకు టీవీ చూడటం ఆ వ్యక్తికి అలవాటు.

పాత టీవీ కావడంతో దాని నుంచి ఓరకమైన ఎలక్ట్రిక్ తరంగాలు వెలువడేవి. బ్రాడ్‌బాండ్ సిగ్నల్‌ మీద వాటి ప్రభావం పడేది. ఊరి వాళ్లకు ఇంటర్నెట్ నిలిచిపోయేది.

ఇలా రోజూ జరుగుతుండేది. దీంతో ఓపెన్‌రీచ్ సంస్థకు రోజూ ఫిర్యాదులు వస్తుండేవి.

వాళ్లు సమస్య ఏంటో తెలుసుకునేందుకు చాలా కష్టపడ్డారు. ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూశారు. ఫలితం లేకపోయింది.

ఆఖరికి మొత్తం బ్రాడ్‌బాండ్ వైర్లన్నీ మార్చిచూశారు కూడా. అయినా, పరిస్థితి మారలేదు.

బ్రిటన్ ఊరు

ఫొటో సోర్స్, Google

దాదాపు ఏడాదిన్నర పాటు విశ్వప్రయత్నాలు చేసి, చివరికి ఎలక్ట్రికల్ తరంగాల అంతరాయం ఏదైనా ఉంటే గుర్తించే స్పెక్ట్రమ్ అనలైజర్ అనే పరికరాన్ని రంగంలోకి దింపారు. దాన్ని పట్టుకుని, మొత్తం ఊరంతా తిరిగారు.

‘‘ఎప్పటిలాగే గంట కొట్టినట్లు ఏడు గంటలకు ఇంటర్నెట్ పోయింది. ఓ చోట పెద్ద స్థాయిలో ఎలక్ట్రికల్ ఇంటర్‌ఫియరెన్స్ వస్తున్నట్లు మా పరికరం గుర్తించింది. ఓ టీవీ వల్లే ఇదంతా జరుగుతోందని తేలింది’’ అని ఓపెన్‌రీచ్ ఇంజినీర్ మైకెల్ జోన్స్ చెప్పారు.

మొత్తానికి ఆ డొక్కు టీవీ నుంచి ‘సింగిల్ హైలెవెల్ ఇంపల్స్ నాయిస్’ అనే తరంగాలు విడుదల అవుతున్నాయని, అవే ఊరు మొత్తం బ్రాడ్‌బాండ్‌ సేవలకు అంతరాయం కలిగిస్తున్నాయని ఇంజనీర్లు పసిగట్టారు.

ఈ విషయం తెలుసుకుని ఆ టీవీ యజమాని కూడా అవాక్కయ్యారు.

పాపం, ఇక జీవితంలో ఆ టీవీ పెట్టబోనని ఊరివాళ్లకు మాట ఇచ్చారు.

ఊరివాళ్లందరిని తెగ ఇబ్బందిపెట్టానని ఆ వ్యక్తి ఫీలయ్యారేమో గానీ, తన పేరును గోప్యంగా ఉంచాలని కోరారు.

లోడింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇక ఆ టీవీ కట్టేసినప్పటి నుంచి ఊరివాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం, పగలు, రాత్రి తేడా లేకుండా ఇప్పుడు వాళ్లు ఎంచక్కా ఇంటర్నెట్ సేవలను ఆస్వాదిస్తున్నారు.

ఇలా కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలు బ్రాడ్‌బ్యాండ్ సేవలపై ప్రభావం చూపడం సహజమేనని ఓపెన్‌రీచ్ వేల్స్ చీఫ్ ఇంజనీర్స్ లీడ్ సుజానే రూథర్‌ఫర్డ్ అన్నారు.

మైక్రోవేవ్‌లు, బయట ఉపయోగించే లైట్ల లాంటి పరికరాలు కూడా ఇలాంటి తరంగాలను పుట్టించగలవని ఆమె చెప్పారు.

తాతల కాలం నాటి పరికరాలను అటకెక్కించి, ప్రస్తుత ప్రమాణాలకు తగిన ఎలక్ట్రిక్ పరికరాలనే వాడాలని సుజానే జనాలకు సలహా కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)