చైనా విషయంలో నెహ్రూ చేసిన తప్పునే నరేంద్ర మోదీ కూడా చేస్తున్నారా?

జవహర్‌లాల్ నెహ్రూ

ఫొటో సోర్స్, BETTMANN

    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1949లో మావో సేతుంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటుచేశారు. 1950 ఏప్రిల్ 1న దానిని గుర్తించిన భారత్ దౌత్య సంబంధాలు కూడా ఏర్పరుచుకుంది. అలా, చైనాకు ప్రాధాన్యం ఇచ్చిన మొదటి కమ్యూనిస్టేతర దేశంగా భారత్ నిలిచింది.

భారత్ 1954లో టిబెట్‌పై చైనా సౌర్వభౌమాధికారాన్నికూడా అంగీకరించింది. అంటే, టిబెట్ చైనాలో భాగం అని అంగీకరించింది. 'హిందీ-చీనీ భాయీ భాయీ' అనే నినాదం కూడా అందుకుంది.

జూన్ 1954 నుంచి జనవరి 1957 మధ్య వరకూ చైనా మొదటి ప్రధానమంత్రి చౌ ఎన్ లై నాలుగుసార్లు భారత పర్యటనకు వచ్చారు. 1954 అక్టోబర్‌లో నెహ్రూ కూడా చైనా వెళ్లారు.

నెహ్రూ చైనా పర్యటన గురించి అమెరికా వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్.. “పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన తర్వాత, ఒక కమ్యూనిస్టేతర దేశ ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇది మొదటిసారి. ఎయిర్ పోర్ట్ నుంచి నగరం వరకూ మధ్యలో దాదాపు 10 కిలోమీటర్ల వరకూ చైనీయులు నెహ్రూకు చప్పట్లతో స్వాగతం పలుకుతూ నిలబడ్డారు” అని రాసింది.

ఆ పర్యటనలో నెహ్రూ చైనా ప్రధానమంత్రినే కాదు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చీఫ్ మావోను కూడా కలిశారు. మరోవైపు టిబెట్‌ పరిస్థితి అంతకంతకూ ఘోరంగా మారుతుంటే, చైనా దూకుడు పెరుగుతూపోయింది.

1950లో టిబెట్ మీద దాడి చేసిన చైనా, దానిని తమ అధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్ మీద చైనా దాడి ఆ ప్రాంత భౌగోళిక రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. దాడికి ముందు టిబెట్‌కు చైనాతో పోలిస్తే భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తర్వాత చివరికి టిబెట్ ఒక స్వతంత్ర దేశంగా ఉండలేకపోయింది.

స్వీడిష్ విలేకరి బర్టిల్ లింట్నర్ తన ‘చైనా - ఇండియా వార్‌’ అనే పుస్తకంలో “అప్పుడు టిబెట్‌లో జరిగిన మార్పులకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకున్న కొందరు నేతల్లో నెహ్రూ ప్రభుత్వంలోని హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఒకరు. పటేల్ దాని గురించి నెహ్రూకు 1950లో తన మరణానికి ఒక నెల ముందు ఒక లేఖ కూడా రాశార”ని చెప్పారు.

మావో, నెహ్రూ

ఫొటో సోర్స్, KEYSTONE-FRANCE

ఆదర్శవాది నెహ్రూ

పటేల్ తన లేఖలో “టిబెట్‌ను చైనా తనలో కలిపేసుకున్న తర్వాత అది మన గుమ్మం వరకూ వచ్చింది. దీని ఫలితాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర అంతటా మనం ఈశాన్య సరిహద్దు గురించి మనం పెద్దగా ఆందోళన చెందలేదు. ఉత్తరాన హిమాలయాలు మనకు అన్ని ప్రమాదాలనూ అడ్డుకునే రక్షణ కవచంలా నిలిచాయి. టిబెట్ మన పొరుగు ప్రాంతం. దానితో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి” అన్నారు.

“ఆదర్శవాది నెహ్రూ చైనాలో కొత్త కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. రెండు దేశాల మధ్య స్నేహం ఉందని, భారత్, చైనా రెండూ వేధింపులపై విజయం సాధించి నిలబడ్డాయని ఆయన భావించేవారు. ఆసియా, ఆఫ్రికాలో స్వతంత్రం పొందిన కొత్త దేశాలతో కలిసి రెండు దేశాలూ పనిచేయాలని ఆయన అనుకునేవారు” అంటారు లింట్నర్.

1950 దశకం మధ్యలో చైనా భారత భూభాగంలో కూడా ఆక్రమణలు ప్రారంభించింది. 1957లో చైనా అక్సాయి చీన్ మార్గంలో పశ్చిమాన 179 కిలోమీటర్ల పొడవున్న రోడ్డు కూడా నిర్మించింది.

సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు 1959 ఆగస్టు 25న మొదటిసారి తలపడ్డారు. చైనా గస్తీ దళాలు నెఫా ఫ్రంటియర్‌పై లెంగాజూలో దాడి చేశాయి. అదే ఏడాది అక్టోబర్ 21న లద్దాఖ్ కోంగకాలో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 17 మంది భారత సైనికులు చనిపోయారు. అవి ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పులుగా చైనా చెప్పుకుంది.

అప్పుడు తమ సైనికులపై హఠాత్తుగా దాడి జరిగిందని భారత్ కూడా చెప్పింది.

మావో 1938 నవంబర్‌లో ఒక చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ (సీపీపీ) సమావేశంలో “తుపాకీ గొట్టం ద్వారానే అధికారం సిద్ధిస్తుంది” అన్నారు. ఆ తర్వాత చైనా కమ్యూనిస్ట్ విప్లవంలో ఈ నినాదం ఒక మంత్రంలా మారిపోయింది. ఈ నినాదం కార్ల్ మార్క్స్ “ప్రపంచ కార్మికులారా ఏకం కండి” అనే నినాదానికి పూర్తి విరుద్ధం.

దలైలామా, నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

చైనా ఉద్దేశం తెలుసుకోలేకపోయారు

1962లో హిమాలయాల్లోని ఒక ప్రాంతంపై నియంత్రణ కోసమో, సరిహద్దులు మార్చేయడానికో చైనా భారత్ మీద దాడి చేయలేదు. అది సంస్కృతుల యుద్ధం.

ఆగ్నేయాసియా అంశాల గురించి లోతుగా తెలిసిన ఇజ్రాయెల్ నిపుణుడు యాకోవ్ వర్డ్జ్ బర్జర్ తన ‘చైనా సౌత్ వెస్టర్న్ స్ట్రాటజీ’ పుస్తకంలో దీని గురించి చెప్పారు.

“చైనా, భారత సాంస్కృతిక, చారిత్రక వ్యత్యాసాలను అర్థం చేసుకోవడంలో నెహ్రూ విఫలమయ్యారు. ఫలితంగా చైనా ఉద్దేశం ఏంటో తెలుసుకోలేకపోయారు. భారత్, చైనా మధ్య సరిహద్దులను ప్రపంచమంతా చట్టబద్ధంగా అంగీకరించిందని నెహ్రూకు అనిపించేది. భారత్ ఒప్పందాలను ముందుకు తెస్తే, చైనా చివరికి వాటిని అంగీకరిస్తుందని, ఎందుకంటే భారత్ చట్టపరంగా సరిగానే వెళ్తోందని అనుకున్నారు. కానీ అంతర్జాతీయ చట్టాలను చైనా ఎప్పుడూ పట్టించుకోలేదు” అంటారాయన.

“భారత్, చైనా తమ స్వాతంత్ర్యాన్ని వేరు వేరు పద్ధతుల్లో సంపాదించాయనే వ్యత్యాసాన్ని కూడా నెహ్రూ తెలుసుకోలేదు. భారత్ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడినట్లు.. జపాన్ వలస పాలకులు, దేశీయ శక్తులతో చైనా పోరాడలేదు. భారత్ ఎక్కువగా శాసనోల్లంఘన ద్వారా స్వతంత్ర పోరాటంలో విజయం సాధించింది. హింసకు పాల్పడడం సరికాదని భావించింది” అని యాకోవ్ వర్ట్ బర్జర్ రాశారు.

మరోవైపు మావో కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. నెహ్రూ బ్రిటిష్ భౌగోళికవ్యూహం భావనను అంగీకరించారు. ఎందుకంటే నెహ్రూ వ్యూహంలో గతం, వర్తమానం మధ్య బంధం ఉంది. అటు మావో వ్యూహం గతం నుంచి పూర్తిగా విముక్తి పొందింది.

1949లో కమ్యూనిస్టుల విజయానికి ముందు జరిగిన అంతర్జాతీయ ఒప్పందాలు ఏకపక్షంగా ఉన్నాయని ఆరోపిస్తూ మావో వాటిని తోసిపుచ్చారు. చైనాతో ఉన్న సరిహద్దులను భారత్ చరిత్రక ఆధారాలు చూపించి సమర్థించుకోడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు, చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.

మెక్‌మోహన్ రేఖను వలసరాజ్యాలకు సంబంధించినదిగా చెప్పిన మావో, దానిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. చైనా కూడా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదించడం మొదలుపెట్టింది.

జిన్‌పింగ్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ పాఠం నేర్చుకోలేదు

“చైనా కమ్యూనిస్టులు నెహ్రూను బూర్జువా జాతీయవాద నాయకుడుగా భావించారు. నెహ్రూను వారు మధ్యస్థాయి సోషలిస్టు నేతగా కూడా అనుకోలేదు. 1949న ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ప్రకటనకు ముందు నుంచే నెహ్రూపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ మాటల దాడి ప్రారంభించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కల్చరల్ కమిటీ పత్రిక ‘షిజి జిషి’(విశ్వ జ్ఞానం) 1949 ఆగస్టు 19 సంచికలో నెహ్రూను సామ్రాజ్యవాదుల సహాయకడుగా వర్ణించారు’’ అని బర్టిల్ లింట్నర్ తన పుస్తకంలో రాశారు.

‘‘హిందీ చీనీ భాయీ భాయీ’ నినాదం వెనుక ఏం జరుగుతోందో నెహ్రూకు తెలీదు. సీఐఏ ఒక నివేదిక ప్రకారం మయన్మార్ మాజీ ప్రధానమంత్రి బా స్వే 1958లో నెహ్రూకు ఒక లేఖ రాశారు. చైనాతో సరిహద్దు వివాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయనను హెచ్చరించారు” అని కూడా లింటర్న్ పేర్కొన్నారు.

1962లో, అంతకు ముందు నెహ్రూ చేసిన తప్పుల నుంచి ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని రక్షణ నిపుణుడు రాహుల్ బేడీ వ్యాఖ్యానించారు.

“చైనా లద్దాఖ్‌లో చాలా చేస్తోందని, చాలా చేయబోతోందని మోదీ ప్రభుత్వానికి నిఘా సమాచారం అందింది. కానీ చేతులు ముడుచుకుని కూర్చున్నారు. చైనా సైనికులు మన ప్రాంతంలోకి ఎలా చొరబడ్డారు? అనే ప్రశ్న చాలా ముఖ్యం. మోదీ ప్రధానమంత్రి కాగానే చైనా మనకు ముఖ్యమైన, నమ్మకమైన స్నేహితుడు అనేలా ప్రవర్తించారు. మోదీ ప్రధాని అయ్యాక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో 18 సార్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశాలకు అర్థమేంటి?” అంటారు బేడీ.

“2017 జూన్ 2న రష్యా సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం ప్యానల్ డిస్కషన్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ‘చైనా, భారత్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో గత 40 ఏళ్లుగా ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు’ అన్నారు. చైనా ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలను స్వాగతించారు. కానీ మోదీ అది చెప్పి మూడేళ్లయ్యింది. ఇప్పుడు ఆయన ఆ మాటను మళ్లీ చెప్పగలిగే స్థితిలో లేరు” అన్నారు.

సిపెక్

ఆ తప్పు భారత్‌లో ప్రతి ప్రభుత్వం చేసింది

భారత నేతల్లో దూరదృష్టి లోపాన్ని ఇది బయటపెడుతోందని రాహుల్ బేడీ అంటున్నారు.

“భారత్‌లా ఐదేళ్లలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చైనా పనిచేయదు అనే విషయాన్ని ప్రధాని మోదీ తెలుసుకోవాలి. అది మరో 50 ఏళ్ల ప్రణాళికలు, వ్యూహాలను సిద్ధం చేస్తుంది. వాటిని సాధించే దిశగా వెళ్తుంది. మోదీ చైనా దళాలు భారత్‌ సరిహద్దుల్లోకే రాలేదంటారు. మరోవైపు సమావేశాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వం మొదట తన విరుద్ధ వాదనల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

“చైనాకు సీపీఈసీ చాలా ముఖ్యం. అది పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్ గుండా వెళ్తోంది. చైనా కన్ను సియాచిన్ గ్లేసియర్ మీద కూడా ఉంది. సీపీఈసీ మీద ఎవరి కన్నూ పడకూడదని చైనా అనుకుంటోంది. లద్దాఖ్ నుంచి అది వెనక్కు వెళ్తుందని నాకైతే అనిపించడం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఇది హఠాత్తుగా జరిగింది కాదు. పక్కా ప్లాన్ ప్రకారం చేసింది. పరిస్థితులు దిగజారితే, రెండు దేశాల మధ్య ఘర్షణ కూడా జరగవచ్చు. కానీ. భారత్‌కు ఈసారి కూడా అదంత సులభం కాదు” అంటారు బేడీ.

నెహ్రూ చేసిన తప్పులనే తర్వాత ఎన్నికైన ప్రతి ప్రభుత్వం చేసిందని రాహుల్ బేడీ అంటున్నారు.

“మనం సరిహద్దుల్లో చైనా నుంచి శాంతిని కోరుకుంటున్నాం. హక్కుల కోసం, పరిష్కారాల కోసం గొడవ పడడం లేదు. 1993లో పీవీ నరసింహారావు సమయంలో కూడా రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖను నిర్ధారించారు. కానీ ఎల్ఏసీ అంటే ఇసుకలో గీసిన గీతలాంటిది. చైనా సైనికులు కాస్త గాలి ఊదితే ఆ రేఖ చెరిగిపోతుంది. తర్వాత మనం ఆ గీతలు వెతుకుతూ కూచోవాలి. మనం ఆ గీతలను రాతిపై గీసుండాల్సింది. కానీ, ఆ పని ఏ ప్రభుత్వమూ చేయలేకపోయింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘సరిహద్దుల్లో శాశ్వత పరిష్కారం జరగాలని చైనా ఎప్పుడూ కోరుకోలేదు. అది భారత్‌తో అన్ని రకాల సంబంధాలను ప్రోత్సహిస్తుంది. కానీ సరిహద్దు వివాదంపై మాత్రం నోరుమెదపాలని అనుకోదు. 1962 యుద్ధం తర్వాత 58 ఏళ్లయ్యింది. చైనా మరో 50 ఏళ్ల ప్లాన్‌లో భారత్‌ ఎరగా మారితే, అప్పుడు మనం ఆశ్చర్యపోనక్కరలేదు” అని అభిప్రాయపడ్డారు.

చైనా సైనికులు

ఫొటో సోర్స్, Ani

జాతీయ భద్రతకు ముప్పు పెరుగుతోందా?

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ గురువారం రష్యాలో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మంత్రుల మధ్య కొన్ని అంశాలపై అంగీకారం కుదిరింది. కానీ భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రాంతం నుంచి చైనా సైన్యం వెనక్కు వెళ్తుందా, లేదా అనేది వాటిలో స్పష్టంగా చెప్పలేదు.

భారత్, చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నుంచీ ఉద్రిక్తతలు ఉన్నాయి. జూన్ 15న హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఆ తర్వాత కూడా చైనా సైన్యం లద్దాఖ్‌లో, మిగతా చాలా భారత భూభాగాల్లో స్థావరాలు వేసుకుని కూచుందని చెబుతున్నారు.

చైనా ఇప్పుడు సరిహద్దుల్లో ఏప్రిల్ ముందున్న స్థితి ఏర్పడేలా చేస్తుందా లేక మరోసారి సరిహద్దులను మార్చేస్తుందా అనేదే ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న. చైనా బాగానే మాట్లాడుతున్నా, అది భారత్‌కు బెదిరింపులను కూడా పంపుతోంది. మొత్తం అరుణాచల్ ప్రదేశ్ తమదేనని, దానిని భారత్‌లో భాగంగా తాము ఎప్పుడూ గుర్తించలేదని కూడా చైనా చెబుతోంది.

భారత్ జాతీయ భద్రతకు ముప్పు అంతకంతకూ పెరుగుతోందని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావ్ ‘ద వైర్ చైనా’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

‘‘పాకిస్తాన్‌లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్‌టోటా, జిబూతీ, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ రేవులను చైనా ఎప్పడైనా వ్యూహాత్మకంగా ఉపయోగించుకునేలా మార్చేవయచ్చు. చైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని తనకు కావల్సినట్టు వాడుకోగలదు. చైనా ఆ ప్రాంతాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. ఆ పెట్టుబడుల వల్ల భారత జాతీయ భద్రతకు ముప్పు వస్తుందని నాకు అనిపిస్తోంది” అని ఆమె పేర్కొన్నారు.

విదేశాంగ మంత్రుల సమావేశానికి ముందు చైనా రక్షణ మంత్రితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో సమావేశం అయ్యారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ కూడా చైనా రక్షణ మంత్రితో మాట్లాడారు. సైనిక స్థాయిలోనూ చర్చలు జరుగుతున్నాయి. కానీ తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఏప్రిల్ ముందు నాటి స్థితి ఉంటుందా, లేదా అనేది చెప్పడానికి చైనా ఇప్పటికీ సిద్ధంగా లేదు.

నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, @PMOIndia

చైనా పట్ల ప్రభుత్వ విధానం అంత నిర్ణయాత్మకంగా లేదు

ఎస్ జయశంకర్, వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల తర్వాత విడుదలైన సంయుక్త ప్రకటనలో ఏదీ స్పష్టంగా లేదని రక్షణ విశ్లేషకులు సుశాంత్ సరీన్ చెబుతున్నారు.

“ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సంయుక్త ప్రకటనలో ఏదీ స్పష్టంగా లేదు. అక్కడ ఉద్రిక్తతలు తగ్గనున్నాయని, చైనా వెనక్కు వెళ్తుందని నాకైతే అనిపించడం లేదు. ఇలాంటి చర్చలు ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి” అని సరీన్ పేర్కొన్నారు.

చైనాను దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక ప్రభుత్వం పనిచేసిందంటే, అది మోదీ ప్రభుత్వమేనని, మిగతా అందరూ చేతులు రుద్దుకుంటూనే ఉండిపోయారని సుశాంత్ సరీన్ చెబుతున్నారు.

“ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల గురించి ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది. పనులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. చైనా మన ప్రాంతంలోకి చొరబడితే, ఈ ప్రభుత్వం సైన్యాన్ని, యుద్ధ విమానాలను కూడా మోహరించింది. మోదీ ప్రభుత్వం నెహ్రూలా కూచుండిపోలేదు. సన్నాహాలలో నిమగ్నమై ఉంది’’ అని చెప్పారు.

భారత్‌లో ఇద్దరు రక్షణ మంత్రులు చైనా విషయంలో దేశానికి అత్యంత నష్టం తెచ్చిపెట్టారని తాను భావిస్తున్నట్లు సరీన్ పేర్కొన్నారు. ‘‘వారిలో ఒకరు నెహ్రూ రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్ అయితే, ఇంకొకరు మన్మోహన్ సింగ్ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ” అంటారాయన.

చైనా విషయంలో మొత్తం విపక్షాలన్నీ కలిసి మోదీ ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. కానీ, ఇంతకు ముందు కూడా దేశంలో ఏ ప్రభుత్వ విధానం కూడా చైనా పట్ల అంత నిర్ణయాత్మకంగా లేదు.

భారత్ ఒకే సమయంలో మూడు రకాలుగా కష్టాలు ఎదుర్కుంటోంది. కోవిడ్-19 కేసులు రోజుకు దాదాపు లక్ష వరకూ నమోదవుతున్నాయి. చైనా సరిహద్దుల్లో దూకుడుగా ఉంది. ఇక భారత ఆర్థిక వృద్ధి రేటు సున్నాకంటే దిగువకు మైనస్ 24కు పడిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)