1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..

ఫొటో సోర్స్, Bettmann
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత భూభాగంలోకి చైనా అడుగుపెట్టిందనే విషయం తెలియగానే ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి స్వతంత్ర పార్టీ, లోహియా సోషలిస్టులు, జనసంఘ్‌లోని అందరూ ఒక్కటై ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూపై విరుచుకుపడ్డారు. అలా అంతకు ముందెప్పుడూ జరగలేదు.
అప్పుడు, వారందరికీ నేతృత్వం వహించిన నాయకుడు మరెవరో కాదు. జనసంఘ్ యువనేత అటల్ బిహారీ వాజ్‌పేయి.
“చైనా ఒక నిర్ధారిత తేదీలోపు భారత భూభాగం వదిలి వెళ్లాలని, భారత్‌ను వదిలి వెళ్లేవరకూ ఆ దేశంతో చర్చలు జరిపేది లేదని స్పష్టంగా చెబుతూ, లోక్‌సభలో ఒక తీర్మానం ప్రవేశ పెట్టాలి’’ అని 1959 సెప్టెంబర్ 12న ఆయన కోరారు.
1960 జనవరిలో నాగపూర్‌లో జరిగిన పార్టీ జాతీయ సెషన్‌లో “టిబెట్ స్వాతంత్ర్యానికి భారత్ గుర్తింపు ఇవ్వాలని, ఐక్యరాజ్యసమితిలో చైనా ప్రవేశానికి మన మద్దతు ఉపసంహరించుకోవాలని, భారత్‌లో చైనా మద్దతుదారులపై నిఘా పెట్టాలని, ఇండియన్ ఆర్మీ సామర్థ్యాన్ని కూడా పెంచాలని” కోరారు.
1960 ఆగస్టులో హైదరాబాద్‌లో జరిగిన భారతీయ జనసంఘ్ జాతీయ పరిషత్‌లో పార్టీ అధ్యక్షుడు పీతాంబర్ దాస్ “చైనా జవాన్లను భారత భూభాగం నుంచి తరిమికొట్టడానికి సైనిక చర్య చేపట్టాలని” డిమాండ్ చేశారు.
1960 ఏప్రిల్లో చైనా ప్రధాని చౌ ఎన్‌లై భారత్ వచ్చినపుడు, భారత్ పట్ల చైనా ‘రోగ్ పాలసీ’కి వ్యతిరేకంగా జనసంఘ్.. ప్రభుత్వానికి మరో మెమరాండం సమర్పించింది.
క్రెగ్ వెబ్‌స్టర్ తన పుస్తకం ‘ది జనసంఘ్’లో “నెహ్రూ-చౌ ఎన్‌లై శిఖరాగ్ర చర్చలకు జనసంఘ్ పూర్తి వ్యతిరేకం. చైనాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదు అని అది మొదటి నుంచీ కోరుతోంది” అని రాశారు.
చౌ ఎన్‌లై భారత్ చేరుకోడానికి రెండు రోజుల ముందు కొన్ని వేల మంది జనసంఘ్ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నెహ్రూ నివాసం దగ్గరకు చేరుకున్నారు. ఆ ప్లకార్డులపై ‘చైనీయుల్లారా భారత భూమిని వదలండి’, ‘చైనా సామ్రాజ్యవాదం నశించాలి’ అని రాసుంది.

ఫొటో సోర్స్, THE ASAHI SHIMBUN
నెహ్రూపై ముప్పేట దాడి
ప్రజా సోషలిస్ట్ పార్టీ నాయకుడు నాథ్ పాయ్ లోక్‌సభలో మాట్లాడుతూ.. “మన భూమిలో చైనా గుడారాలు వేసుకోవడం వల్ల యుద్ధం ప్రారంభించలేకపోతే, వారి స్థావరాలు ధ్వంసం చేసిన తర్వాత యుద్ధం మొదలైందని మనమెందుకు ఆందోళన చెందాలి” అని ప్రధానమంత్రి నెహ్రూను ప్రశ్నించారు.
ప్రభుత్వం చైనాకు అల్టిమేటం ఇవ్వాలని జనసంఘ్ అధ్యక్షుడు దీనదయాళ్ ఉపాధ్యాయ్ 1962 సెప్టంబర్ 24 వరకూ డిమాండ్ చేస్తూనే వచ్చారు.
అప్పటి ప్రముఖ వ్యాఖ్యాత ఫ్రాంక్ మోరెస్ దీనిపై మాట్లాడుతూ “జనసంఘ్ అధ్యక్షుడు ఇలా డిమాండ్ చేయడం జాతీయ ప్రయోజనాలను పట్టించుకోకుండా చేసిన ఒక బాధ్యతారహిత చర్య. ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే చేశారు” అన్నారు.
విపక్షం తీవ్ర వ్యతిరేకత
భారత్‌లో స్వాతంత్ర్య సమయం నుంచీ టిబెట్, నేపాల్, భూటాన్‌లో చైనా విస్తరణను ఆర్ఎస్ఎస్ విమర్శిస్తూనే వచ్చింది.
1959లో కశ్మీర్, అక్సాయి చిన్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మిస్తోందనే వార్తలు బయటికి వచ్చినపుడు “చైనా దూకుడుకు, ప్రభుత్వం గత పదేళ్లుగా చైనాను ప్రసన్నం చేసుకోడానికి చూస్తుండడమే కారణం’’ అని ఆర్ఎస్ఎస్‌లో నిర్ణయాలు తీసుకునే అతిపెద్ద వేదిక అఖిల భారతీయ కార్యనిర్వాహక మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో లోక్‌సభలో విపక్షంలో మంచి వక్తలు ఉన్నారు. వారిలో ఆచార్య కృప్లానీ ఒకరు. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ప్రజా సోషలిస్టు పార్టీ నేత.
విపక్షం పక్క సీట్లోనే కూర్చునే కృప్లానీ.. కృష్ణ మీనన్‌ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, సభలో ఎంపీలు, వీక్షకుల గ్యాలరీలో కూర్చున్న జర్నలిస్టులు అందరి దృష్టీ ఆయనపైనే ఉండేది.
అప్పట్లో ప్రజా సోషలిస్ట్ పార్టీలోని మరో సభ్యుడు అశోక్ మెహతా, స్వతంత్ర పార్టీకి చెందిన ఎన్జీ రంగా, మీనూ మసానీ కూడా చైనా అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకునేవారు కాదు. వారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉన్నారనేది యాదృచ్చికం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చైనాతో సంబంధాలు తెంచుకోవాలని ఆర్ఎస్ఎస్ వాదన
1962 అక్టోబర్‌లో చైనా ఆక్రమణ తర్వాత ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యనిర్వాహక మండలి “మనం చైనా నుంచి మన భూభాగాన్ని విడిపించుకునేవరకూ, వారితో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపకూడదు” అని ఒక ప్రకటన జారీ చేసింది.
అదే ప్రకటనలో “భారత భూభాగాన్ని మళ్లీ పొందడంతోపాటు చైనా విస్తరణను అడ్డుకోవడానికి, భారత సరిహద్దుల్లో భద్రత కోసం, టిబెట్ స్వతంత్రం కూడా అవసరం” అని చెప్పింది.
తర్వాత ఏడాది ఆర్ఎస్ఎస్ మరో విభాగం అఖిల భారతీయ ప్రతినిధి సభ కొలంబో సమావేశంలో భారత్-చైనా మధ్య మధ్యవర్తిత్వం ప్రతిపాదను కొట్టివేసింది. “కమ్యూనిస్టు చైనాతో మన దౌత్య సంబంధాలు తెంచుకోవాలి. దలైలామాకు మద్దతు ఇచ్చి టిబెట్ స్వాతంత్ర్యోద్యమానికి సాయం చేయాలి” అని చెప్పింది.
ఆర్ఎస్ఎస్ చేసిన ఈ కఠోర ప్రతిపాదనలను నెహ్రూ అంగీకరించలేదు కానీ యుద్ధం తర్వాత ఏర్పడిన దేశభక్తి వాతావరణంతో ఆర్ఎస్ఎస్‌కు చాలా రాజకీయ ప్రయోజనం లభించింది. ఆ ప్రభావం నెహ్రూపై కూడా ఉంది. అప్పటివరకూ ప్రతి సందర్భంలో వారిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన చివరకు, 1963 గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో ఆర్ఎస్ఎస్ దళానికి అనుమతి కూడా ఇచ్చేలా చేసింది.
చైనా గురించి కాంగ్రెస్‌లో తిరుగుబాటు
చైనా పట్ల నెహ్రూ విధానం ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే నచ్చలేదు. ఒకసారి అక్సాయి చిన్ చైనా నియంత్రణలోకి వెళ్లడంపై వస్తున్న విమర్శల నుంచి బయటపడ్డానికి నెహ్రూ “అక్కడేముంది, గడ్డిపరక కూడా మొలవదుగా” అన్నారు. దాంతో కాంగ్రెస్ సీనియర్ సభ్యులు మహావీర్ త్యాగీ టోపీ తీసి తన బట్టతలను చూపిస్తూ “ఇక్కడ కూడా ఏదీ మొలవదు, దీన్ని కూడా ఎవరికైనా ఇచ్చేద్దామా?” అన్నారు.
భారత్-చైనా మధ్య యుద్ధం పెరిగేకొద్దీ, దానికి కృష్ణ మీనన్‌ను విలన్‌గా చూడ్డం మొదలైంది.
అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక జర్నలిస్ట్ కృష్ణ మీనన్‌తో “మీ దృష్టిలో ముందుకు వస్తున్న చైనాను ఎక్కడ అడ్డుకోగలం అనిపిస్తోంది” అన్నారు.
సమాదానంగా ఆయన “వాళ్లు ముందుకు రావడం చూస్తుంటే, వారు ఎక్కడివరకూ వెళ్తారో అనే హద్దులేవీ కనిపించడం లేదు’’ అన్నారు.
ఇక నెహ్రూ మాత్రం ప్రెస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ సమయంలో పార్లమెంటు సమావేశాలు కూడా జరగడం లేదు. అదే సమయంలో ఇద్దరు ఎంపీలు నాథ్ పాయ్, ఫ్రాంక్ ఆంథొనీ నెహ్రూను కలిశారు.
“దీనికోసం చైనాతో రాజకీయ సంబంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేదు” అనేంతగా చైనా దాడిని నెహ్రూ తక్కువ చేసి చూపించారని వారు తెలిపారు.
నెహ్రూ తీరు విపక్షాలకు నచ్చలేదు, కానీ వారు దానికి నేరుగా నెహ్రూను టార్గెట్ చేయకుండా, ఆయనకు అత్యంత సన్నిహితుడైన కృష్ణ మీనన్‌ను లక్ష్యంగా చేసుకునేవారు.

ఫొటో సోర్స్, Keystone-France
కృష్ణ మీనన్‌కు వ్యతిరేక వాతావరణం
30 మంది కాంగ్రెస్ ఎంపీలు 1962 అక్టోబర్ 23న సమావేశం అయ్యారు. పార్లమెంటును, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందనేది పక్కన పెట్టి, కృష్ణ మీనన్ నెహ్రూను, పార్లమెంటును, దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
“చైనా ముందుకు రాకుండా అడ్డుకోవడానికి, లద్దాఖ్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవని మీనన్ పదే పదే చెప్పారని” వారు ఆరోపించారు.
సైన్యం పరిస్థితి గురించి దేశమంతా తప్పుడు సమాచారం వ్యాపించింది. దానికి మీనన్ ఒక్కరే మాత్రమే బాధ్యులు.
వారు మీనన్ గురించి తమ ఫిర్యాదులు తీసుకుని నెహ్రూ దగ్గరికి వెళ్లారు. కానీ, “ఇది పోస్టుమార్టంకు సమయం కాదంటూ” వారి మాటలను తోసిపుచ్చే ప్రయత్నం చేశారు నెహ్రూ.
కాంగ్రెస్ సభ్యుల ఈ దాడికి ఆచార్య కృప్లానీ, విపక్షంలోని మిగతా నేతలు కూడా తోడయ్యారు. రక్షణ శాఖను నెహ్రూనే స్వయంగా చూసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీలు దిల్లీ చేరుకోవడం పెరుగడంతోపాటు మీనన్‌కు వ్యతిరేక వాతావరణం పెరిగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రులు కూడా(అందరూ కాంగ్రెస్ వారే) మీనన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఒకటి రెండు రోజుల తర్వాత రాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా మీనన్‌ను తొలగించాలని కోరేవారిలో కలిసిపోయారు.

ఫొటో సోర్స్, J. Wilds
మీనన్ రాజీనామా
అక్టోబర్ 31న రక్షణ మంత్రిత్వ శాఖను నెహ్రూ స్వయంగా చూసుకోబోతున్నారనే ప్రకటన వచ్చింది. కానీ, అప్పటికీ కృష్ణ మీనన్‌కు మంత్రిమండలి నుంచి ఉద్వాసన పలకలేదు.
ఆయన కోసం రక్షణ ఉత్పత్తి శాఖ మంత్రి అనే కొత్త పదవిని సృష్టించారు. మంత్రిమండలిలో కొనసాగించారు.
భారత-చైనా యుద్ధంపై ‘ఇండియాస్ చైనా వార్’ అనే పుస్తకం రాసిన నెవిల్ మాక్స్ వెల్ అందులో “మీనన్‌ను రక్షణ శాఖ నుంచి తొలగించాలని భావించినా, ఆయన్ను తన మంత్రిమండలిలో కొనసాగించిన నెహ్రూ, విమర్శకులకు కోపం తెప్పించారు. మీనన్‌ను తొలగించడం వల్ల ఆయనకు రాజకీయ ఉపశమనం లభించేది. కానీ ఆయన అది దూరం చేసుకున్నారు” అని చెప్పారు.
కొన్ని రోజుల తర్వాత “ఏమీ మారలేదు” అని కృష్ణ మీనన్ చేసిన వ్యాఖ్య, అతడిని మంత్రిమండలి నుంచి తొలగించడానికి నెహ్రూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదనే అనుమానాలకు బలం చేకూరింది.
ది హిందూ పత్రిక తన 1961 నవంబర్ 2 ఎడిషన్‌లో “రక్షణ మంత్రిత్వ శాఖ పనితీరులో ఎలాంటి మార్పులు జరిగినట్లు కనిపించడం లేదు” అని రాసింది.
నెహ్రూ ఆధిపత్యానికి తెర
నవంబర్ 7న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నెహ్రూ మరోసారి మీనన్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.
మీనన్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులుగా చూడాలని నెహ్రూ అన్నారు. “మీరు ఆయన రాజీనామానే కోరుకుంటుంటే, నన్ను కూడా రాజీనామా చేయమని అడగండి” అన్నారు.
ఈ సమావేశంలో కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వారు నెహ్రూతో “మీకు మీనన్ విధానాలపై అంత నమ్మకం ఉంటే, మీరు లేకుండా ఉండే విషయం గురించి మేం కూడా ఆలోచించాల్సి ఉంటుంది” అన్నారు.
ఆ తర్వాత రోజే మంత్రిమండలి నుంచి కృష్ణమీనన్ రాజీనామా చేసినట్లు ప్రకటన వచ్చింది. నెహ్రూ ఇష్టాలను ఎవరూ గౌరవించకపోవడం అనేది, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అప్పుడే మొట్టమొదట జరిగింది.
నెహ్రూ స్వయంగా తనను తాను కాపాడుకోడానికి మీనన్‌ను మంత్రి మండలి నుంచి తప్పించాల్సి వచ్చింది. దాంతో భారత రాజకీయాల్లో సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన నెహ్రూ ఆధిపత్యానికి అంతం కూడా మొదలైంది. తర్వాత నెహ్రూ ఆ షాక్ నుంచి ఎప్పటికీ కోలుకోలేకపోయారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా సరిహద్దు ఘర్షణ: భారతదేశం ఎల్ఏసీని ఎలా సంరక్షించుకుంటుంది?
- తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?
- చైనాతో పోరులో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందా లేక ముఖం చాటేస్తుందా?
- చైనా న్యూ సిల్క్ రోడ్: పాకిస్తాన్‌తో కలసి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టే ఇప్పుడు డ్రాగన్ మెడకు చుట్టుకుంది...
- కౌన్సిల్ హౌజ్‌లో బాంబులు వేసేందుకు ఆనాడు భగత్ సింగ్ అనుసరించిన వ్యూహం ఇదే...
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- రాహుల్ గాంధీకి 'కౌల్' గోత్రం ఎలా వచ్చింది
- బిజు పట్నాయక్ ఇండోనేసియా 'భూమి పుత్ర' ఎలా అయ్యారు?
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- ఇందిరను ఫిరోజ్ మోసం చేశారా? ఇందులో నిజమెంత?
- అంబేడ్కర్‌తో బీబీసీ అరుదైన ఇంటర్వ్యూ: 'సరైనవారు ఎన్నికైతేనే ఎన్నికలకు విలువ'
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ వినీ వినీ చెవులు పగిలిపోయాయి' - చైనాలో భారత యుద్ధ ఖైదీ
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









