అర్జెంటీనాలో 12,000 మంది నాజీల జాబితా.. వారు స్విస్ బ్యాంక్‌లో దాచిన లూటీ సంపద వెలుగు చూస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
అర్జెంటీనాలో బయటపడ్డ కొన్ని ఫైళ్లలో.. 1930లలో అక్కడ నివసించిన 12,000 మంది నాజీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారిలో చాలా మందికి స్విస్ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు.
నాజీలను వెతికి పట్టుకోవటంలో ప్రసిద్ధి చెందిన సైమన్ వీసెంథల్ సెంటర్... వినియోగంలో లేని బ్యాంకు ఖాతాలను గుర్తించాలని క్రెడిట్ సుసీని కోరింది.
''యూదు బాధితుల నుంచి లూటీ చేసిన సొమ్ములు దీర్ఘకాలంగా వినియోగంలో లేని ఈ ఖాతాల్లో ఉంటాయని మేం నమ్ముతున్నాం'' అని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సైమన్ వీసెంథల్ సెంటర్ చెప్తోంది.
బ్యూనోస్ ఎయిర్స్‌లోని ఒక మాజీ నాజీ ప్రధాన కార్యాలయం స్టోర్ రూంలో ఈ పత్రాలు బయటపడ్డాయి.
నాజీ జర్మనీ 1935లో జాతివివక్ష చట్టాలు చేసిన తర్వాత యుదుల ఆస్తులను స్వాధీనం చేసుకోవటం మొదలుపెట్టింది. 1940లలో యూదుల ఊచకోత (హోలోకాస్ట్) సందర్భంగా విపరీతంగా దోపిడీ సాగింది. ఆ సంపదలో చాలా మొత్తాన్ని రహస్య స్విస్ బ్యాంక్ ఖాతాలకు తరలించారు.
క్రెడిట్ సుసీ ఉపాధ్యక్షుడైన క్రిస్టియన్ కుంగ్‌కు రాసిన ఒక లేఖలో, ''ఈ జాబితాలోని నాజీల వారసులమని వాదిస్తున్న వారి వివరాలు మీ దగ్గర ఇప్పటికే ఉన్నాయని మాకు తెలుసు'' అని సైమన్ వీసెంథల్ పేర్కొంది.

ఫొటో సోర్స్, WIESENTHAL.COM
''అర్జెంటీనాలో దొరికిన ఫైళ్లలోని జాబితాలో ఉన్న చాలా మంది నాజీలు స్వీజెరిస్చ్ క్రెడిటాన్‌స్టాల్ట్‌లోని ఒకటి లేదా ఎక్కువ బ్యాంకు అకౌంట్లలో జమ చేశారు.. ఆ బ్యాంక్ ఆ తర్వాత క్రెడిట్ సుసీ బ్యాంక్‌గా మారింది'' అని ఆ సెంటర్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
అర్జెంటీనాలో 1930 నుంచి 1938 వరకూ నాజీ అనుకూల సైనిక ప్రభుత్వం ఉంది. 'వాన్ పోప్' అనే నిక్‌నేమ్ ఉన్న అధ్యక్షుడు జోస్ ఫెలిక్స్ ఉరిబురు, ఆయన వారసుడు అగస్టిన్ పెడ్రో జస్టోల సారథ్యంలో ఆ ప్రభుత్వాలు నడిచాయి.
1938లో నాజీ వ్యతిరేక అధ్యక్షుడు రాబర్టో ఓర్టిజ్ హయాంలో నియమించిన ఒక ప్రత్యేక కమిషన్... నాజీ యూనియన్ అలెమానా డి జ్రెమియోస్ (జర్మన్ యూనియన్ ఆఫ్ సిండికేట్స్) మీద దాడులు చేసి ఈ జాబితాలను స్వాధీనం చేసుకుంది.
1943లో మరో సైనిక కుట్రతో అర్జెంటీనాలో నాజీ అనుకూల ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ కమిషన్ గుర్తించిన నివేదికలను దహనం చేశారు. కానీ, ఇటీవల అర్జెంటీనాకు చెందిన పరిశోధకుడు పెడ్రో ఫిలిపుజీ... 12,000 మంది నాజీల పేర్లు గల ఒరిజనల్ పత్రిని కనుగొన్నారు.
క్రెడిట్ సుసీ బ్యాంక్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ, నాజీ అణచివేత బాధితులకు చెందిన స్విస్ బ్యాంక్ ఖాతాల ఆచూకీ తెలుసుకోవటానికి 1997-1999లో వోల్కర్ విచారణకు తాము సహకరించామని పేర్కొంది.
''అయినప్పటికీ ఈ వ్యవహారాన్ని మేం మళ్లీ పరిశీలిస్తాం'' అని చెప్పింది.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ, ఆ తర్వాతా అర్జెంటీనా సహా దక్షిణ అమెరికా దేశాలు ఫాసిస్టు సైనిక నియంతల పాలనలో ఉండటంతో నాజీలకు సురక్షిత ఆశ్రయ కేంద్రాలుగా ఉపయోగపడ్డాయి.
మోస్ట్-వాంటెడ్ నాజీ యుద్ధ నేరస్తులు కొందరు దక్షిణ అమెరికాకు తప్పించుకుపోయారు. వారిలో హోలోకాస్ట్ నిర్వాహకుల్లో కీలక పాత్ర పోషించిన అడాల్ఫ్ ఈచ్మన్ కూడా ఉన్నారు. 1960లో అర్జెంటీనాలో ఆయనను ఇజ్రాయెల్ ఏజెంట్లు అపహరించారు. జెరూసలేంలో చరిత్రాత్మక విచారణ అనంతరం 1962లో యుద్ధ నేరస్తుడిగా ఉరితీశారు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- కర్నాటక బీజేపీ మంత్రి కుమార్తె పెళ్లి... ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఖరీదైన వేడుక
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు
- ‘ఇండోనేసియా దేశ రాజధానిని మారుస్తున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









