చైనా - నేపాల్: తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?

ఫొటో సోర్స్, ETIENNE OLIVEAU/GETTY IMAGES
- రచయిత, సురేంద్ర ఫుయాల్
- హోదా, బీబీసీ నేపాల్ ప్రతినిధి
1816 సుగాలీ ఒప్పందం ప్రకారం లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమెదించిన వారం రోజుల తర్వాత కొత్త జాతీయ చిహ్నాన్ని కూడా అధికారికంగా ఆమోదించారు.
ఇదే సమయంలో సరిహద్దుల్లోని కొన్ని నేపాలీ గ్రామాలు చైనా, టిబెట్ ప్రాంతాల్లోకి కలిసిపోతున్నాయంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
ఉత్తర గోరఖా ప్రాంతంలోని రుయి గ్రామం, అలాగే ఉత్తర శంఖువాసవ ప్రాంతంలోని ఛయంగ, లుంగ్డెక్ గ్రామాలు 1960 నుంచే చైనా ఆక్రమణలో ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. అయితే నేపాల్-చైనా సరిహద్దు విషయంలో కేపీ ఓలీ ప్రభుత్వం తమ అధికారిక వైఖరిని ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఈ విషయంపై నేపాల్ ల్యాండ్ మేనేజ్మెంట్ మంత్రి పద్మ కుమారి ఆర్యల్ బీబీసీతో మాట్లాడారు. వివిధ దేశాలతో ఉన్న సరిహద్దు సమస్యలన్నీ సాంకేతికంగా ఆమె నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తాయి. నేపాల్-చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే కొత్తగా ఎటువంటి సమస్యలు తలెత్తినా దౌత్య చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటామని పద్మ కుమారి అన్నారు.
“కేవలం ఉత్తర డొల్ఖాలోని ఒక సరిహద్దు ప్రాంతం, అలాగే ఎవరెస్ట్ పర్వతం సమీపంలోని రెండు సరిహద్దు ప్రాంతాల విషయంలో మాత్రమే ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. అవి తప్ప నేపాల్-చైనా సరిహద్దు సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి” అని పద్మ కుమారి బీబీసీకి చెప్పారు.
అలాగే సరిహద్దుల విషయంలో మీడియాలో వచ్చిన కథనాలపై నేపాల్ విదేశాంగశాఖ స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎన్నో ప్రశ్నలు
ఇటీవల కాలంలో దక్షిణాసియాలో చైనా-భారత్ సరిహద్దుల్లోని గల్వాన్, అలాగే భారత్-నేపాల్ దేశాల మధ్య లిపులేఖ్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, తక్షణం నేపాల్ ప్రభుత్వం తగిన వివరణ ఇవ్వాలంటూ ఆ దేశ మాజీ ఉప ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ నేత బిమలేంద్ర నిధి డిమాండ్ చేశారు.
“నేపాల్ సరిహద్దుల్లోని గ్రామాలు క్రమంగా చైనా, టిబెట్ ఆక్రమణలోకి జారుకుంటున్నాయని ఇటీవల మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరెస్ట్ శిఖరానికి ఉత్తరాన హువావేకి చెందిన 5జీ టవర్ ఏర్పాటు చేశారు. ఇటీవల చైనా భాషను బోధించే అధ్యాపకులు నేపాల్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అలాగే కొద్ది కాలంగా నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు తరచుగా చైనీస్ కమ్యూనిజంపై శిక్షణ ఇస్తున్నారు. అసలు మన దేశ కమ్యూనిస్ట్ నేతలు చైనా నేతల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా శిక్షణ పొందాల్సిన అవసరం ఏముంది?” అని బిమలేంద్ర నిధి బీబీసీతో అన్నారు.
తాజాగా గత వారాంతంలో జరిగిన శిక్షణ శిబిరానికి సీనియర్ నేత ప్రచండ సహా చాలా మంది నేతలు హాజరయ్యారు. అయితే అదే సమయంలో తనకు మాత్రం ఈ శిక్షణ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదంటూ మరో సీనియర్ నేత జహ్లా నాథ్ ఖానల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీబీసీ నేపాలీతో మాట్లాడిన ఆయన ఆ శిక్షణ విషయం తనకు షాక్‌నకు గురి చేసిందని చెప్పారు.
ఇటీవల కాలంలో చైనా సాయం ఎక్కువవుతోందన్న బిమలేంద్ర నిధి కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు సాయం చెయ్యడంలో భాగంగా చైనా నుంచి నేపాల్‌కు 2 వేల మంది వస్తున్నట్లు తనకు సమాచారం ఉందని తెలిపారు.
“వాళ్లంతా ఎందుకొస్తున్నారు? ప్రతి విషయంలో చైనా జోక్యం ఎందుకు ఎక్కువవుతోంది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఈ విషయాలన్నింటిపైనా సర్కారు స్పష్టమైన వివరణ ఇవ్వాలి” అని బిమలేంద్ర నిధి డిమాండ్ చేశారు.

చైనా-నేపాల్ సరిహద్దు సమస్యలు
నేపాల్- చైనాకు చెందిన టిబెట్ ప్రాంతాలు సుమారు 1439కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. హిమాలయాలతో పాటు భూమ్మీద అత్యంత కఠినమైన భౌగోళిక ప్రాంతాలలో సుమారు రెండేళ్ల పాటు సర్వే నిర్వహించిన తర్వాత 1963లో సరిహద్దుల విషయంలో రెండు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని సరిహద్దుగా నిర్ణయించారు. దక్షిణ భాగంలోని భూభాగం నేపాల్, ఉత్తర భాగంలోని భూభాగం చైనా పంచుకున్నాయి.
అయితే సరిహద్దుల్ని ఇప్పటికే 1979లో ఒక సారి,1988లో మరోసారి ఇలా రెండు సార్లు సమీక్షించారని నేపాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే మాజీ డైరక్టర్ బుద్ధి నారాయణ శ్రేష్ఠ తెలిపారు.
“60లలో చైనా-నేపాల్ సరిహద్దుల్ని నిర్ణయించినప్పుడు చైనా సరిహద్దుల్లోని కొంత భూభాగాన్ని, ఉత్తర నేపాల్‌లో 15 జిల్లాలలో కొంత భూభాగాన్ని, గ్రామాలను రెండు దేశాలు పరస్పరం మార్చుకున్నాయి. అందులో భాగంగా 1836 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని మేం చైనాకు ఇచ్చాం. అదే సమయంలో చైనా 2140చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని నేపాల్‌కి ఇచ్చింది. అలా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా అదనంగా 372 చదరపు కిలోమీటర్ల భూభాగాం నేపాల్‌కు దక్కింది” అని బుద్ధి నారాయణ శ్రేష్ఠ బీబీసీతో అన్నారు.
చైనాలో నేపాల్ గ్రామాలు
అయితే ఈ ఒప్పందంలో భాగంగా అనుకోకుండా నేపాల్ కొన్ని మానవ స్థావరాలను చైనాకు అప్పగించిందని, అందుకు ప్రతిగా పర్వతాలు, లోయలు వంటి ఎటూ తేలని భూభాగాల్ని తీసుకుందని బుద్ధి నారాయణ శ్రేష్ఠ భావిస్తున్నారు.
“బహుశా చారిత్రక పరిజ్ఞానం లేకపోవడం, అత్యంత కఠినమైన,మారుమూల భూభాగాలకు సంబంధించిన ఆధారాలు లేకపోవడం వల్లే ఇలా జరిగింది ఉండవచ్చు” అని ఆయన అన్నారు.
“చైనాలోని నేపాల్ గ్రామాలు” అంటూ మీడియాలో వస్తున్న కథనాల ప్రస్తావిస్తూ ఇటీవల ఈ విషయం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా వెళ్లిందని అన్నారు.
“1963లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే నదులు, వాటి పరీవాహక ప్రాంతాలకు సంబంధించిన సరిహద్దులు ఉన్నాయని చైనా చెబుతోంది” అని శ్రేష్ఠ తెలిపారు.
గత 60 ఏళ్లలో హిమాలయాల్లో ఉన్న నదులు, పరీవాహక ప్రాంతాల సరిహద్దులు మారి ఉండచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బహుశా రెండు దేశాల మధ్య తలెత్తిన గందరగోళ పరిస్థితికి అది కూడా కారణం కావచ్చని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారమేంటి?
నేపాల్ నుంచి వస్తున్న తాజా నివేదికల ప్రకారం గోరఖాలోని రుయి గ్రామం, అలాగే శంఖువాసవ ప్రాంతంలోని ఛయంగ, లుంగ్డెక్ గ్రామాల్లో నేపాల్ జాతీయులే నివసిస్తున్నారు. అలాగే వాళ్ల దగ్గరు నేపాల్ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు, రసీదులు కూడా ఉన్నాయి.
వీలైనంత త్వరగా రెండు దేశాలకు చెందిన ముఖ్య నేతలు పరస్పరం చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని మాజీ సర్వేయర్ చీఫ్ బుద్ధి నారాయణ శ్రేష్ఠ సూచిస్తున్నారు.
“ఒక వేళ మన ప్రాంతాలు చైనా ఆక్రమణల్లోకి వెళ్లిపోతుంటే తక్షణం రెండు దేశాలు చర్చలను ప్రారంభించాలి. అది కూడా చైనా-నేపాల్ సరిహద్దు ఒడంబడికను దృష్టిలో పెట్టుకొని చర్చలు జరగాలి. వివాదస్పద హిమాలయ ప్రాంతాలను రెండు దేశాలకు చెందిన సర్వేయర్లు సంయుక్తంగా పరిశీలించి ఇరువురికి ఆమోదయోగ్యమై పరిష్కారాన్ని కనుగొనాలి. అప్పుడే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి” అని శ్రేష్ఠ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
- భారత్-నేపాల్ సరిహద్దు వివాదం: మానస సరోవర యాత్రకు సమస్యలు ఎదురవుతాయా?
- లిపులేఖ్, లింపాధురియాలపై నేపాల్ ఎందుకు పంతం పడుతోంది? భారత్‌పై కాలుదువ్విందా?
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- LGBT: బైసెక్సువల్ అని చెప్పుకోగానే అమ్మాయిల కష్టాలు ఎందుకు పెరుగుతాయి?
- పాకిస్తాన్లో 97 మంది మృతికి కారణమైన విమాన ప్రమాదానికి కారణాలేంటో తెలిశాయి..
- రాందేవ్ బాబా ‘కరోనా మందు’కు లైసెన్స్ ఇవ్వలేదన్న ఉత్తరాఖండ్ ఆయుర్వేద శాఖ
- హెచ్1 బి వీసాలు: ట్రంప్ ఆదేశాలతో భారతీయులకే పెద్ద దెబ్బ... ఎందుకు?
- చైనా నుంచి 70 శాతం బల్క్ డ్రగ్స్ దిగుమతి చేసుకోకుండా భారత్ ఉండగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








