హెచ్‌1 బి వీసాలు: ట్రంప్ ఆదేశాలతో భారతీయులకే పెద్ద దెబ్బ.. ఎందుకు?

అమెరికా వీసా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్‌ బిశ్వాస్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అక్రమ చొరబాట్లు అమెరికాలో చాలాకాలంగా నలుగుతున్న సమస్య. ''కానీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సక్రమంగా వస్తున్న వారిని కూడా ట్రంప్‌ బలిపశువులను చేస్తున్నారు'' అని ఇండియాలో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెన్సీ లా-క్వెస్ట్ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ పూర్వి చోతాని అన్నారు.

''అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా 1.7 కోట్ల ఉద్యోగాలు పోయాయి. అందులో విదేశాల నుంచి వచ్చిన 50 లక్షల మందిని పక్కనబెడితే అమెరికా ఈ సమస్య నుంచి ఎలా బైటపడుతుంది?'' అని ఆమె నాతో అన్నారు.

చోతాని ప్రధానంగా హెచ్‌1-బి వీసాల వ్యవహారాలను చూస్తుంటారు. ప్రస్తుతం ఏటా 85,000 వేల మంది భారతీయులు ఈ అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. అందులో ఐటీ రంగానికి చెందిన నిపుణులే ఎక్కువ.

మంగళవారం నాడు ట్రంప్‌ హెచ్‌1-బితో పాటు ఇతర వర్క్‌ వీసాల జారీని ఈ యేడాది చివరి వరకు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు అమెరికా ఇస్తున్న హెచ్‌1-బి వీసాలలో మూడొంతుల వీసాలు భారతీయ నిపుణులకే దక్కుతున్నాయి. అయితే.. ఇండియా నుంచి పని చేసే ఏడు అగ్రస్థాయి టెక్‌ కంపెనీలు మొత్తం వీసాల్లో కేవలం 6 శాతం మాత్రమే పొందగలుగుతున్నాయి.

హెచ్‌1-బి వీసాలు పొందుతున్నవారిలో 75% భారతీయులే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెచ్‌1-బి వీసాలు పొందుతున్నవారిలో 75% భారతీయులే

అమెరికాలో భారతీయుల ప్రాభవం

''ఇది భారతీయుల నైపుణ్యానికి నిదర్శనం. దీనికి ఇమ్మిగ్రేషన్‌తో పెద్దగా సంబంధం లేదు. హెచ్‌1-బి అనేది ఎక్కువ నైపుణ్యంగల వారికి ఇచ్చే తాత్కాలిక వీసా. ఇది అమెరికాకు వచ్చే వారి సంఖ్యను పెద్దగా మార్చదు'' అని నాస్కామ్‌లో గ్లోబల్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న శివేంద్ర సింగ్‌ అన్నారు.

అమెరికాలో భారతీయుల ఉన్నతికి దోహదపడిన అంశాలలో హెచ్‌1-బి వీసా ఒకటి. ''భారతీయులు ఎక్కువ మంది స్థానిక అమెరికన్ల కన్నా, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇమ్మిగ్రెంట్స్‌కన్నా విద్యాధికులు, సంపన్నులు కావడానికి ఇదే కారణం'' అని 'ది అదర్‌ వన్‌ పర్సెంట్ - ఇండియన్స్‌ ఇన్‌ అమెరికా' పుస్తక రచయితలు అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకం అమెరికాలో భారతీయులపై రాసిన పరిశోధనా గ్రంథం.

2010 నాటికి అమెరికాకు వచ్చే ప్రతి లక్ష మందిలో 60 శాతం మంది భారతీయులే. వీరంతా హెచ్‌1-బి వీసా ప్రోగ్రామ్‌ కిందనే అమెరికాకు తరలివస్తున్నారు. వీళ్లంతా కంప్యూటర్‌ రంగంలోనే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారని అమెరికాలో నివాసముంటున్న భారతీయ సంతతికి చెందిన పరిశోధకులు సంజయ్‌ చక్రవర్తి, దివేశ్‌ కపూర్‌, నిర్వికార్‌సింగ్‌ అంటున్నారు.

2004 నుంచి 2012 మధ్యంలో ఇచ్చిన హెచ్‌1-బి వీసాలలో దాదాపు 5 లక్షల వీసాలు భారతీయులే సంపాదించారు. వాళ్లతో పాటు వచ్చిన కుటుంబ భాగస్వాములతో కలిపితే వీరు అమెరికాలో ఇప్పటికే నివాసముంటున్న భారతీయులలో నాలుగోవంతుమంది అవుతారు. ప్రస్తుతం అమెరికాలో 3 మిలియన్ల భారతీయులు నివాసముంటున్నారు.

ట్రంప్‌ తన ప్రచారంలో భాగంగా ఇమ్మిగ్రేషన్‌ విధానంపై కఠినమైన నిబంధనలు విధిస్తున్నట్లు ప్రకటించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్‌ తన ప్రచారంలో భాగంగా ఇమ్మిగ్రేషన్‌ విధానంపై కఠినమైన నిబంధనలు విధిస్తున్నట్లు ప్రకటించారు

కొత్తగా వస్తున్న భారతీయులు ఇంతకు ముందుకన్నా భిన్నంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు. వారిలో వివిధ భారతీయ భాషలు మాట్లాడేవారున్నారని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. జనాభా పరంగా హిందీ, తమిళం, తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

ఇంతకు ముందు న్యూయార్క్‌, మిషిగన్‌ ప్రాంతాలలో ఎక్కువగా భారతీయులు ఉండేవారు. ఇప్పుడు కాలిఫోర్నియా, న్యూజెర్సీలలో కూడా వీరి జనాభా పెరుగుతోంది. ఈ వీసా ప్రోగ్రామ్‌ ఇండియన్‌-అమెరికన్‌ భౌగోళిక చిత్రాన్ని సరికొత్తగా మారుస్తోంది. కానీ ఇప్పుడు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

సిలికాన్‌ వ్యాలీలో పని చేయడానికి తక్కువ జీతాలిచ్చి విదేశాల నుంచి ఉద్యోగులను తెస్తున్నారన్న విమర్శ ఉంది. అయితే వీసాలు పొందుతున్న టాప్‌ టెన్‌ కంపెనీలలో భారతీయ కంపెనీల వాటా క్రమంగా తగ్గుతోంది. ''స్థానికంగా ఉండేవారిని ఉద్యోగాలలోకి తీసుకోవడంతో ఇండియన్‌ కంపెనీల వాటా తగ్గిపోయింది. గ్లోబల్‌ డెలివరీ మోడల్స్‌లో మార్పులు రావడం, డొమైన్‌ నైపుణ్యాల స్వభావంలో మార్పే దీనికి కారణం'' అని సింగ్‌ అన్నారు.

నైపుణ్యాల కొరతకు పరిష్కారం

ట్రంప్‌ నిర్ణయానికి వెనక ఉద్దేశమే భారతీయులను విస్మయానికి గురి చేసింది. గతంలో గూగుల్‌ కూడా ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టింది. కోవిడ్‌-19 కారణంగా దెబ్బతిని ఉన్న అమెరికన్లకు ఈ నిర్ణయం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ట్రంప్‌ అంటున్నారు.

''సమస్య ఉందని తెలుసు. సమాన నైపుణ్యాలు ఉన్నవారి మధ్య పోటీ అంటే ఒప్పుకోవచ్చు. ఐటీ రంగంలాగే ఆతిథ్య రంగం కూడా దెబ్బతిన్నది. అలాంటప్పుడు ఒక ఫారిన్‌ టెక్కీని అమెరికాలోకి రాకుండా అడ్డుకుంటే, రెస్టారెంట్‌లో ఒకరికి అదనంగా పని దొరుకుతుందా?'' అని టెంపుల్ యూనివర్సిటీలో భౌగోళికశాస్త్రం బోధిస్తున్న ప్రొఫెసర్ సంజోయ్‌ చక్రవర్తి ప్రశ్నించారు.

అమెరికన్లకు సరిపడా ఉద్యోగాలు ఉన్నా కూడా ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగా లీగల్‌ ఇమ్మిగ్రేషన్‌ను అడ్డుకుంటున్నారని భారతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో కోవిడ్‌-19 కారణంగా లక్షలమంది ఉపాధి కోల్పోతే, కంప్యూటర్‌ నిపుణులు జనవరిలో 3శాతం, మేలో అది 2.3 శాతం మాత్రమే ఉపాధి కోల్పోయారు. అమెరికాలో ఇంకా 6,25,000 కంప్యూటర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

''గణాంకాలను చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. హెచ్‌1-బి వీసాదారులు నిపుణుల కొరతను తీరుస్తున్నారు. కోవిడ్‌-19 అనంతరకాలంలో కంప్యూటర్‌ రంగంలో వారు ప్రతి రంగంలోని కీలకపాత్ర పోషిస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌, వ్యాక్సిన్‌ రీసెర్చ్‌ తదితర విభాగాలలో వారిదే ముఖ్యపాత్ర'' అన్నారు సింగ్‌.

విదేశీ నిపుణులను రానీయకుండా వీసా విధానంలో శాశ్వత మార్పులు తెచ్చే ఆలోచనలో భాగంగానే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని చాలా మంది భారతీయులు భావిస్తున్నారు.

ప్రతియేటా హెచ్‌1-బి వీసా విధానం ద్వారా 85,000 మంది అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతియేటా హెచ్‌1-బి వీసా విధానం ద్వారా 85,000 మంది అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు

''ఇక ముందు హెచ్‌1-బి వీసా పొందడం భారతీయ కంపెనీలకు పెద్ద భారంగా మారనుంది. ప్రతి హెచ్‌1-బి పిటిషన్‌కు సుమారు 6,460 డాలర్లను విదేశీ కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా, అమెరికా కంపెనీలు ఈ వీసాలను ఎక్కువగా పొందగలుగుతాయి. స్థానిక యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లను, స్థానిక సంస్థల నుంచి, విదేశాల నుంచి నేరుగా నియామకాలు చేసుకుంటారు'' అని చోతాని అన్నారు.

భవిష్యత్తులో ఈ వీసాలను ఎక్కువ జీతాలు పొందే విదేశీ నిపుణులకే పరిమితం చేసే అవకాశం ఉంది. మధ్య, దిగువ తరగతి నిపుణులకు, తక్కువ జీతాలకు లభించే ఆఫీసు ఉద్యోగులకు ఈ వీసాలు ఇవ్వకపోవచ్చు.

‘‘అయినా కూడా పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఎందుకంటే నిపుణులైన విదేశీ టీమ్‌ సూపర్‌వైజర్స్‌ లేకుండా స్థానికంగా తీసుకున్న ఉద్యోగులతో పని చేయించుకోవడం కష్టం'' అన్నారు చోతాని.

హెచ్‌1-బి వీసాల భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయటం ఎప్పుడూ కష్టంగానే ఉంది. వలసలకు వ్యతిరేకంగా వచ్చే ఒత్తిళ్లు దీని మీద ప్రభావం చూపుతాయి. ‘‘నా 35 ఏళ్ల సర్వీసులో వర్క్‌ వీసాలకు సంబంధించి నేను చూసిన అతి పెద్ద ఆంక్షలు ఇవి’’ అని కార్నెల్‌ లా ప్రొఫెసర్‌ యేల్‌ లోహెర్‌ ‘న్యూయార్క్‌ టైమ్స్’తో అన్నారు.

తర్వాత ఏం జరగబోతుందనేది తెలియటం లేదు. కరోనా మహమ్మారి కారణంగా చాలామందికి ఇంటి నుంచి ఎలా పని చేసుకోవచ్చో అర్దమైంది. మరి దీనికారణంగా వీసాల మీద ఆధారపడకుండా ఎక్కువ మంది ఇంటి దగ్గర నుంచే పని చేసేందుకు మొగ్గు చూపుతారా? దీర్ఘకాలిక హెచ్‌1-బి వీసాలకన్నా, అంతకన్నా తక్కువ కాలానికి లభించే ‘టెక్నాలజీ వీసాల’కు ప్రాధాన్యత పెరగుతుందా?

''ఇమ్మిగ్రేషన్‌ విధానాలను పూర్తిగా మార్చే కార్యక్రమం చాలా కాలంగా కొనసాగుతోంది. అమెరికాలో ఎన్నికల కారణంగా పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఇదంతా ప్రజాకర్షక విధానం. కరోనా మహమ్మారి, పెరిగిన నిరుద్యోగం దీనికి మరింత దోహదం చేసింది'' అన్నారు చోతాని.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)