తెలంగాణ: గ్రూప్ 1 ఉద్యోగాలను అర్హత పరీక్షలు, ఎంపిక లేకుండా ప్రభుత్వాలు నేరుగా ఇవ్వవచ్చా?

కేసీఆర్

ఫొటో సోర్స్, @TelanganaCMO

ఫొటో క్యాప్షన్, కల్నల్ సంతోష్ భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్‌గా నియామక ఉత్తర్వులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందించారు
    • రచయిత, బళ్ల సతీష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గ్రూప్ 1 స్థాయిలోని అనేక ఉద్యోగాల్లో కీలకమైనవి డిప్యూటి కలెక్టర్, డీఎస్పీలు. దేశవ్యాప్తంగా ఐఎఎస్, ఐపిఎస్‌లకు క్రేజ్ ఉన్నట్టుగా రాష్ట్రాలలో ఈ పోస్టులకు ఆదరణ ఉంటుంది.

అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం నియమించదగ్గ అతి పెద్ద ఉద్యోగాలు కూడా డిప్యూటి కలెక్టర్, డీఎస్పీ పోస్టులే. ఈ ఉద్యోగాల్లో కనీసం 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని, మరికొన్ని పరీక్షల్లో అర్హత సాధిస్తే వారికి ఐఎఎస్, ఐపిఎస్ హోదా వస్తుంది.

ఆర్డీవో, డిప్యూటి కలెక్టర్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎస్పీ, ఏఎస్పీ వంటి పోస్టుల్లో ఉండే వీరే ప్రభుత్వ నిర్వహణలో కీలకంగా ఉంటారు. ఆ పోస్టులు కూడా చాలా అరుదుగా తక్కువ సంఖ్యలో ఉంటాయి.

పరీక్షల్లేకుండా ప్రభుత్వం నేరుగా ఉద్యోగం ఇవ్వవచ్చా?

ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా పక్కాగా నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి. కానీ అరుదైన సందర్భాల్లో నేరుగా ఉద్యోగాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇదే పాయింట్ ఆధారంగా క్రీడాకారులకు, సైనికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తుంటారు. వీటినే కారుణ్య నియామకాలు (కంపాషనేట్ అప్పాయింట్మెంట్స్) అంటారు.

ఇటీవల సైన్యంలో చనిపోయిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా అందజేశారు. హైదరాబాద్‌లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్నీ అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లిదండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, @Telangana CMO

కల్నల్ సంతోష్ భార్య సంతోషికే కాదు, గతంలో నక్సలైట్ దాడుల్లో మరణించిన పలువురు పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకు కూడా ఈ తరహా ఉద్యోగాలు వచ్చాయి.

‘‘ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర కుటుంబ సభ్యులకు అప్పట్లో డిప్యూటి కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ఇక ప్రస్తుత బీజేపీ నేత డికె అరుణ మరదలు (తమ్ముడి భార్య) కూడా ఆ ఉద్యోగం వచ్చింది. (డికె అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా నక్సలైట్ కాల్పుల్లో మరణించడంతో ఆయన కోడలుకు ఉద్యోగం ఇచ్చారు). ప్రభుత్వం తన విచక్షణ ఉపయోగించి అరుదైన సందర్భాల్లో ఇలాంటి నియామకాలు చేపడుతుంది’’ అని వివరించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు సిహెచ్ విఠల్.

సాధారణంగా సర్వీసులో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు, ఆరోగ్య కారణాలతో రిటైర్ అయిన వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు నిబంధనలు ఉంటాయి. సిబ్బంది తరచూ అనారోగ్యానికి గురయ్యే ఆర్టీసీ, సింగరేణి వంటి సంస్థల్లో ఈ కారుణ్య నియామక అంశాలు చర్చకు వస్తుంటాయి. ప్రభుత్వం ఆ నియామకాలను నిలిపేసినప్పుడు వివాదాలూ కూడా తలెత్తుతుంటాయి. ఇదే పద్ధతి కేంద్రంలో కూడా ఉంది.

వీరే కాకుండా, ఏదైనా పెద్ద ఆపదలో చిక్కుకున్న వారి కుటుంబాలకు నియామకాలు ఇవ్వడం కూడా ఉంది. వారి చదువును బట్టి క్లరికల్ కేడర్ ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తారు. కానీ అరుదైన సందర్భాల్లో మాత్రం వారికి ఆఫీసర్ కేడర్ ఉద్యోగాలు ఇస్తుంటారు.

గతంలో 2015లో నల్లగొండలో దుండగుల కాల్పుల్లో మరణించిన ఎస్సై సిద్ధయ్య భార్యకు తెలంగాణ ప్రభుత్వం క్లరికల్ కేడర్ ఉద్యోగం హామీ ఇవ్వగా, ఆవిడ తనకు గెజిటెడ్ హోదా ఉద్యోగం కావాలని కోరారు.

వీరంతా తమకు వచ్చిన ఉద్యోగంలోని నిబంధనల ప్రకారం యదావిధిగా విధులకు హాజరవ్వాలి. జీతాలు, సీనియారిటీ, ప్రమోషన్, పోస్టింగులు అన్నీ మిగతా వారిలాగానే ఉంటాయి. కాకపోతే మొదటిసారి మాత్రం పరీక్షలు రాయకుండా, వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగం ఇస్తారు. అప్పటి వారి వయసు, సర్వీసు నిబంధనలు, ఇతరత్రా అంశాల ఆధారంగా సీనియారిటీ నిర్ణయించి కొనసాగిస్తారు.

కిదాంబి శ్రీకాంత్‌ను టూరిజం శాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా నియమించిన ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, @srikidambi

ఫొటో క్యాప్షన్, కిదాంబి శ్రీకాంత్‌ను టూరిజం శాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా నియమించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రాలో క్రీడాకారులకు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లకు కూడా డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగాలు ఇచ్చింది.

సానుభూతి ఉద్యోగాలు పొందిన వారు రోజూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. కానీ క్రీడాకారుల విషయంలో మాత్రం టోర్నమెంట్లు ఉన్నప్పుడు మినహాయింపు ఉంటుంది.

సింధుకు ఉద్యోగం ఇచ్చే సందర్భంలో మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1994 నాటి ఏపీ సివిల్ సర్వీసెస్, ఎంప్లాయిమెంట్ చట్టాన్ని సవరించాల్సి వచ్చింది. నేరుగా డిప్యూటి కలెక్టర్ ఉద్యోగం ఇవ్వడం కోసం ఆ చట్టాన్ని సవరించి, కేబినెట్ నిర్ణయం చేసిన వారికి ఉద్యోగం ఇవ్వవచ్చని కొత్త నిబంధనలు తెచ్చి, అప్పుడు సింధుకు ఉద్యోగం ఇచ్చారు.. అదే నిబంధన కింద శ్రీకాంత్‌కి కూడా ఉద్యోగం ఇచ్చారు.

2017 జనవరిలో పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత 1994 నాటి అప్పాయింట్ మెంట్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ నిబంధనలు సెక్షన్ 4 సవరించారు. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న ఎవరికైనా అప్పాయింట్మెంట్ ఇచ్చేలా మార్చారు. ఆ తరవాత, 2017 జూలైలో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. అయితే 2017 ఆగస్టు 9 నుంచి 2020 టోక్యో ఒలంపిక్స్ పూర్తయ్యే వరకూ తన సెలవు కాలాన్ని డ్యూటీగా పరిగణించాలంటూ సింధు కోరారు. దీంతో సింధు ఇంకా శిక్షణ పూర్తి చేసుకోలేదు. శిక్షణ సమయంలో ఆమెకు జీతం ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఒక పోస్టు సృష్టించింది ప్రభుత్వం.

ఇక కిదాంబి శ్రీకాంత్‌ను కూడా ఇదే తరహాలో డిప్యూటి కలెక్టర్ పోస్టులో నియమించారు. 2018 మార్చి 29న సర్వీసులో చేరారు. ఆయన కూడా శిక్షణ నుంచి మినహాయింపు కోరారు. తరువాత శిక్షణ పూర్తి చేశారు. ఆయన్ను ఇటీవలే 2020 జూన్ 18న టూరిజం అథారిటీలో డిప్యూటి డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. వచ్చే ఒలంపిక్స్ పూర్తయ్యే వరకూ ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించారు.

‘‘ఇలాంటి ఉద్యోగాల్లో కూడా మిగిలిన వారిలానే సర్టిఫికేట్ వెరిఫెకేషన్, ప్రొబేషన్ పీరియడ్, శిక్షణ వంటివన్నీ ఉంటయి. కాకపోతే క్రీడాకారులు కాబట్టి దీర్ఘకాలం సెలవు ఇచ్చి, ఆ సమయాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో పూర్తి జీతం, కొన్ని సందర్భాల్లో బేసిక్ జీతం ఇస్తారు. ఆంధ్రా, తెలంగాణ.. ఎక్కడైనా ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చిన తరువాత వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పీఎస్సీ వాళ్లు అభ్యంతర పెట్టరు.’’ అని వివరించారు విఠల్.

పీవీ సింధు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పీవీ సింధు

సైన్యంలో..

సైన్యంలో ఖాళీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఉద్యోగం కోరుకునే సైనికుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కోటాలో వెంటనే ఉద్యోగాలు దొరుకుతాయి.

అలాగే పాపులారిటీ ఉన్న వారికి గౌరవప్రద హోదాలో ఆఫీసర్ ఉద్యోగాలు ఇవ్వడం కూడా సైన్యంలో కనిపిస్తుంది. ముఖ్యంగా సైన్యం పట్ల క్రేజ్ పెంచడం, సైన్యంలో ఉద్యోగాల్లో చేరేల్లా యువతను ప్రోత్సహించే క్రమంలో ఇలాంటివి చేస్తారు.

ధోనీ, అభినవ్ బింద్రా, సచిన్ తెందూల్కర్, కపిల్ దేవ్, మలయాళ నటుడు మోహన్ లాల్, కేంద్ర మంత్రి సచిన్ పైలెట్, అథ్లెట్ మిల్కా సింగ్, రాజ్వర్థన్ సింగ్ రాథోడ్ వంటి వారు ఈ ర్యాంకుల పొందిన వారిలో ఉన్నారు. సచిన్ తెందూల్కర్ 2010లో భారత వాయుసేనలో గౌరవ గ్రూప్ కెప్టెన్ హోదా పొందారు. అప్పట్నుంచీ నీలి రంగు యూనిఫాంలో రకరకాల కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు సచిన్.

ధోనీ అయితే ఆర్మీలో కొంత కాలం శిక్షణ పొంది డ్యూటీ కూడా చేశారు. ధోనికి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చింది భారత సేన. అందులో భాగంగా ఆయన 2019 ఆగష్టులో రెండు వారాల పాటూ కశ్మీర్ లో డ్యూటీ చేశారు. 2011లో ఆర్మీలో చేరిన ధోనీ, పారాట్రూపర్‌గా అర్హత సాధించారు. ఆగ్రాలో శిక్షణలో భాగంగా ఆర్మీ విమానాల్లోంచి పారాచూట్ల ద్వారా దూకడం వంటివి చేశారు.

ధోనీ, సచిన్ వంటి వారికి మాత్రం జీతాలు ఉండవు. కాకపోతే వారి పేరు ముందు తమ ర్యాంకులను చేర్చుకోవచ్చు. వాటిని ఆనరరీ ర్యాంకులుగా పిలవాలి. అంటే ధోని పేరు ముందు శాశ్వతంగా లెఫ్టినెంట్ కల్నల్ అని రాసి బ్రాకెట్లో ఆనరరీ అని పెట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)