భారత్‌, చైనాల మధ్య ఘర్షణ వస్తే రష్యా ఎవరి వైపు ఉంటుంది?

పుతిన్, జిన్‌పింగ్, మోదీ

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, ప్రశాంత్‌ చాహల్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు రష్యా ఉన్నతాధికారులు, నేతలతో ఆయన చర్చలు జరుపుతారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ విజయం సాధించి 75ఏళ్లయిన సందర్భంగా జరగబోయే సైనిక కవాతులో ఆయన పాల్గొంటారు.

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో నాలుగు నెలల ప్రయాణ నిషేధం తర్వాత ఒక కేంద్ర మంత్రికి ఇది మొదటి విదేశీ పర్యటన. లద్దాక్‌లో భారత చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన తరుణంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటన జరుగుతోంది. మాస్కో బయలుదేరే ముందు రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్ చేశారు. "నేను మూడు రోజుల పర్యటన కోసం మాస్కోకు బయలుదేరుతున్నాను. ఈ పర్యటన భారతదేశం-రష్యా రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి సంభాషణలకు అవకాశం ఇస్తుంది" అని రాశారు.

'చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, రష్యా పర్యటనను భారత మంత్రి వాయిదా వేయలేదు. ఎందుకంటే భారతదేశానికి రష్యాతో దశాబ్దాల నాటి సైనిక సంబంధాలు ఉన్నాయి. రక్షణ మంత్రి రష్యా ఉన్నతాధికారులతో మాట్లాడతారు. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంచడానికి అనేక సమావేశాలు జరగబోతున్నాయి'' భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు అన్నారు.

రక్షణ మంత్రి ఈ పర్యటన భారత సైనిక సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంగా భారత మీడియా కథనాలు రాసింది. లద్దాక్‌, ఎల్‌ఏసీపై చైనాతో కొనసాగుతున్న వివాదాల మధ్య 'ఆయుధాలను పూర్తిగా బలోపేతం చేయడానికి, ఫైర్‌ పవర్‌ను పెంచడానికి భారత రక్షణ మంత్రి రష్యాకు వెళ్లారు' అని చాలా వార్తాపత్రికలు రాశాయి.

కానీ విశ్లేషకులు మాత్రం దీనిపై విభేదించారు. ‘‘భారత ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, రష్యా నుండి భారతదేశానికి ఆయుధాలు, రక్షణ వ్యవస్థలను తెచ్చుకోడానికి ఇప్పుడు అదనపు సమయం పడుతుంది. వీలైనంత త్వరగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాతో డెలివరీ కోసం ప్రయత్నించాల్సి ఉంది’’ అని వ్యాఖ్యానిస్తున్నారు.

రాజ్‌నాథ్‌సింగ్

ఫొటో సోర్స్, Ani

రష్యాతో రక్షణ ఒప్పందాలు ఆలస్యం

భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ రష్యా పర్యటనపై మాస్కోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ వినయ్ శుక్లా బీబీసీతో మాట్లాడారు.

"భారతదేశం చాలాకాలం నుంచి కీలకమైన రక్షణ ఒప్పందాలకు దూరంగా ఉంటోంది. నిధులులేవని కొన్నిసార్లు, ఇతర కారణాలలతో మరొకొన్నిసార్లు వాయిదా వేస్తూ వస్తోంది. 60 మల్టీ-యుటిలిటీ హెలీకాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని, 140 హెలికాప్టర్లను భారతదేశంలో నిర్మించనున్నట్లు రష్యా తెలిపింది. కానీ 2014 నుంచి వాటి మీద భారత్‌ నిర్ణయం తీసుకోలేదు. భారతదేశానికి ఈ అంబులెన్స్ హెలికాప్టర్లు ఉంటే, గల్వాన్‌లో వైద్యసహాయం లేక మరణించిన సైనికులను సులభంగా రక్షించగలిగే అవకాశం ఉంది" అని వినయ్ శుక్లా అన్నారు.

"ఇది కేవలం హెలికాప్టర్ల ఒప్పందం మాత్రమే కాదు, రష్యాతో కలిసి రైఫిల్స్ తయారు చేయడానికి కూడా ఒక ఒప్పందం ఉంది. అప్పుడు రష్యా ఫతాఫ్ జాయింట్ వెంచర్‌ను పూర్తి చేస్తుంది. అమేథి సమీపంలో ఒక కర్మాగారాన్ని కూడా నిర్మించింది. కానీ ఇప్పుడు దాని పురోగతి అధికారుల చేతిలో ఉంది. సుఖోయ్, మిగ్ విమానాలు భారత వైమానిక దళానికి వెన్నెముక. కానీ వాటి కొనుగోలు ప్రక్రియ కూడా ఆగిపోయింది. ఏదో ఒక ఇబ్బంది వచ్చేవరకు అవి అలాగే ఆగిపోతాయి. మేథస్సుకు గుర్తింపు ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని రష్యాతోపాటు, అక్కడి పెట్టుబడిదారులు ఇక్కడి ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ నిబద్ధతను కూడా ప్రశ్నించారు. అంటే ఇక్కడ భారత్‌దే ఆలస్యం అన్నమాట'' అన్నారు వినయ్‌ శుక్లా.

రష్యా ఎస్ -400 రక్షణ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

రష్యా ఎస్ -400 రక్షణ వ్యవస్థ

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాకు బయలుదేరినప్పటి నుంచి ఎస్ -400 రక్షణ వ్యవస్థపై కూడా చర్చ జరుగుతోంది. 'భారతదేశానికి కీలకమైన ఈ రక్షణ వ్యవస్థ డెలివరీ తేదీని రష్యా ముందుకు జరిపింది' అని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

రష్యాలో నిర్మించబోయే 'ఎస్ -400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్' ను భారత ప్రభుత్వం కొనుగోలు చేయాలనుకుంటోంది. ఎస్‌-400కు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వాయు రక్షణ వ్యవస్థగా పేరుంది. అందులో చాలా సాంకేతిక, ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎస్-400 ఒకేసారి 36 స్థానాలను తాకగలదు.

చైనా ఇప్పటికే రష్యా నుండి ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. అయితే దీన్ని తెచ్చుకోడానికి భారత్‌ ఎందుకు ఆలస్యం చేస్తోంది?

"ఈ వ్యవస్థను రష్యా నుండి భారతదేశం కొనుగోలు చేస్తే, భారత్‌ను బ్యాన్‌ చేస్తామని అమెరికా బెదిరించింది. ఇది భారత బ్యాంకులను భయపెట్టింది. ముఖ్యంగా అమెరికాతో వాణిజ్యంలో బ్యాంకులు ఆందోళన చెందాయి. ఇలా ఎస్-400 ముందస్తు చెల్లింపు ఆలస్యం అయింది. అయితే వీలైనంత త్వరగా భారతదేశానికి ఈ క్షిపణి వ్యవస్థను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని రష్యా చెబుతోంది. ఇస్తుంది కూడా'' అని వినయ్ శుక్లా అన్నారు.

"రష్యా ముందుగా చైనాకు లాంగ్‌ సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ ఎయిర్ మిసైల్‌ వ్యవస్థ ఎస్ -400ను ఇచ్చింది. అయితే చైనా కొనుగోలు చేస్తేనే తామూ చేస్తామని భారత్ షరతు పెట్టింది. ఆయుధపరంగా చైనా రష్యాపై చాలా ఆధారపడుతోంది. రష్యాలో తయారైన ఫైటర్ జెట్ల ఇంజిన్‌ను కాపీ చేయడానికి చైనా చాలా ప్రయత్నించింది, కాని వాటిని రష్యన్ల మాదిరిగా చేయలేకపోయింది. అలా చేయాలంటే చైనా వారి లైసెన్స్ పొందాలి. రష్యా దాన్ని ఇవ్వదు. అంటే అది ఎప్పుడూ రష్యా చేతుల్లోనే ఉంటుంది'' అని వివరించారు వినయ్‌ శుక్లా.

"ఉదాహరణకు, రష్యా చైనాకు ఎస్-400 ఇచ్చింది. కానీ భారతదేశానికి ఇవ్వబోయే వ్యవస్థ అది కాదు. అమెరికా నుండి తనను తాను రక్షించుకోవడానికి చైనా ఎస్ -400ను తీసుకుందని రష్యా పేర్కొంది. వాటి పరిధి చిన్నది. అయితే భారతదేశానికి ఎస్-400 లాంగ్‌ రేంజ్‌ మిసైల్స్‌ ఇవ్వబోతోంది " అని శుక్లా వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటన ముగింపులో ఎస్-400 రక్షణ వ్యవస్థను పొందడంపై అధికారిక సమాచారం రావచ్చు.

మోదీ, పుతిన్

ఫొటో సోర్స్, EPA

భారత్‌-రష్యా సంబంధాలు

"రక్షణ మంత్రి ఈ పర్యటన భారతదేశం-రష్యా రక్షణ భాగస్వామ్యంతోపాటు ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇది ఒక అవకాశం" అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. భారతదేశం రష్యాల మధ్య సంబంధాల గురించి ఒక సాధారణ అవగాహన ఏమిటంటే ''రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. భారతదేశానికి ఏదైనా దేశంతో వివాదం ఉంటే రష్యా భారత్‌కు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది.

కానీ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లోని స్ట్రాటజిక్ స్టడీ ప్రోగ్రామ్ హెడ్ ప్రొఫెసర్ హర్ష్ పంత్ మాటల ప్రకారం ''పరిస్థితులు ఇప్పుడు అంత సులభంగా లేవు''.

''భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని రష్యాకు మంచి అవగాహన ఉంది. చైనా నిరంకుశత్వం, నియంతృత్వ పోకడలు ఉన్న దేశం. అందుకే రష్యా భారత్‌తో స్నేహానికే మొగ్గు చూపుతుంది. భారత్‌తో సత్సంబంధాలను రష్యా మరింత కోరుకుంటుంది. ఇది ఇండో-రష్యా మధ్య పాత సంబంధాలకు కారణం. కానీ పరిస్థితులు ఇప్పుడు ఇంతకు ముందులా లేవు. చైనాతో రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి'' అని ప్రొఫెసర్‌ పంత్‌ వ్యాఖ్యానించారు.

"రష్యాకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. పాకిస్తాన్‌కంటే తక్కువ జనాభా ఉన్నా, ఎక్కువ ప్రాంతంతో ఆసియా నుంచి యూరప్ వరకు విస్తరించి ఉంది. అప్పుడు అమెరికా ప్రపంచవ్యాప్తంగా స్థావరాలను నిర్మిస్తోంది. ఈ సవాళ్లను రష్యా ఎదుర్కోవాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రక్షించాల్సిన అంత పెద్ద ప్రాంతం ఉంది కాబట్టి తన సరిహద్దుల చుట్టూ శత్రుత్వం ఉన్న వాతావరణాన్ని రష్యా ఇష్టపడదు. చైనాతో కలిసే తూర్పు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రష్యా కోరుకోవడం లేదు. మరోవైపు అమెరికా యూరప్‌లోని కొన్ని దేశాలను తనవైపు తిప్పుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో రష్యాకు కూడా పరిమితులు ఉన్నాయి'' అని ప్రొఫెసర్‌ పంత్‌ చెబుతున్నారు.

"ఇక్కడ రష్యాతో సంబంధాలలో కొత్త కోణాలను తీసుకురావడానికి భారతదేశం ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఇరు దేశాల సంబంధాలు రక్షణకు మాత్రమే సంబంధించినవి. ఇండో-పసిఫిక్ స్ట్రాటజీలో ఇరుదేశాల మధ్య విభేదాలు పెరిగాయి. చైనా, రష్యా దగ్గరవుతున్నాయి. అందుకే భారత్, రష్యా మధ్య చర్చలు చాలా ముఖ్యమైనవి. లద్దాక్‌లో చైనాను ప్రశాంతంగా ఉంచడానికి, ఆ దేశంపై రష్యా కొంత ఒత్తిడి తీసుకురావాలని భారత్ కూడా కోరుకుంటుంది'' అని పంత్‌ చెప్పారు.

మాస్కోలోని భారత రాయబారి కొంతకాలం క్రితం భారతదేశం సమస్యను రష్యా ముందు ఉంచారు. చైనాతో భారతదేశానికి వివాదం ఇలాగే పెరిగితే, దానిని శాంతియుతంగా పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని రష్యా పూర్తి హామీ ఇచ్చింది.

పుతిన్, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

చైనా రష్యా సంబంధాలు ఎలా ఉన్నాయి?

''బహుళ ధ్రువ ప్రపంచాన్ని సృష్టించాలన్నది రష్యా అభిప్రాయం. అయితే ఈ విషయంలో చైనాకు రష్యాతో చాలాకాలంగా సైద్ధాంతిక విభేదాలున్నాయి. చైనా మొదటి నుంచి రష్యా భారత్‌కు దగ్గరని భావిస్తుంది. అదే సమయంలో, చైనా, భారతదేశం మధ్య వివాదాలు వస్తే రష్యా అంతర్జాతీయ పరిస్థితి కూడా ప్రభావితమవుతుంది. రష్యా దీనిని అర్థం చేసుకుంది. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌గా మధ్య ఆసియాలో ఆధిపత్యం ప్రదర్శించింది. భారతదేశంతో సంబంధాలు క్షీణిస్తే రష్యాకు చైనా నుంచి ఇబ్బంది పెరుగుతుందని ఆ దేశస్థులు భావిస్తున్నారు'' అని సీనియర్ జర్నలిస్ట్ వినయ్ శుక్లా అభిప్రాయపడ్డారు.

''ఇవాళ చైనా,రష్యా పక్కపక్కన నిలబడ్డప్పుడు రష్యా చాలా చిన్నదిగా కనిపిస్తుంది'' అని ప్రొఫెసర్‌ పంత్ అన్నారు. "ఇరుదేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలున్నాయి. కానీ ఇప్పుడు చైనా పక్కన నిలబడటానికి, ఆసియాలో నెంబర్‌ టుగా ఉండటానికి కూడా రష్యా సిద్దంగా ఉంది. అమెరికా తనకు పెను సమస్య కాబట్టి చైనాతో కలిసి ఉండటానికి రష్యాకు పెద్ద అభ్యంతరం లేదు. అసరమైతే చైనా సహాయాన్ని తీసుకోవడానికి కూడా రష్యా సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ భారతదేశపు సమస్య కాస్త భిన్నంగా ఉంది. మూడు దేశాల మధ్య అధికార సమతుల్యతను సృష్టించాలని భారత్ కోరుకుంటుంది'' అని పంత్‌ పేర్కొన్నారు.

భారత, రష్యాల మధ్య ఒప్పందాలలో ఇరుదేశాల భద్రతకు సవాలు ఉంటే, అవి రెండూ ఒకదాన్నొకటి సహకరించుకుంటాయి. రక్షణ మంత్రి రష్యా పర్యటనను ఈ కోణం నుంచి కూడా చూడొచ్చు'' అంటారు వినయ్‌ శుక్లా.

భారత్‌ కోసం చైనాపై రష్యా ఒత్తిడి తెస్తుందా?

చైనాను రష్యా 'బెదిరించగలదు, భారతదేశ ఆదేశాల మేరకు దానిని నియంత్రించగలదు' అని సోషల్ మీడియాలో ఒక వర్గం నమ్ముతోంది.

అయితే ప్రొఫెసర్‌ పంత్‌ దీన్ని అంగీకరించడం లేదు. ''రష్యా బలహీనమైన శక్తి. ఇది నిలబడటానికి చైనా సహాయం చాలా అవసరం. రష్యా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. దీనికి కూడా చైనా సహాయం కావాలి. అటువంటి పరిస్థితిలో రష్యాకు భారతదేశం ఒక ముఖ్యమైన భాగస్వామి అవుతుందా అన్నది భారత్‌ జాగ్రత్తగా గమనించాలి. రష్యా భారత్‌కు ఏకపక్షంగా మద్దతు ఇచ్చే స్థితిలో లేదు'' అంటున్నారు పంత్‌.

''రష్యా కూడా ఇతర దేశాల్లాగానే ఉంది. అది దౌత్య భాషలో మాత్రమే మాట్లాడుతుంది'' అన్నారాయన. ''భారతదేశం, చైనాలా మధ్య ఉద్రిక్తత పెరగడం, లేదా చిన్నపాటి యుద్ధం వస్తే రష్యాతో భారత్‌కు అపారమైన అవసరం ఉంటుంది. భారత్‌కు పెద్దసంఖ్యలో రష్యా ఆయుధాలను అమ్మింది. వాటి మెయింటెనెన్స్‌, రిపేర్‌లో రష్యా అవసరం చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు రష్యాను దూరం చేసుకునే అవకాశం భారత్‌కు లేదు ''అంటున్నారు ప్రొఫెసర్‌ హర్ష్‌పంత్‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)