లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ పాఠాలు.. జుగాడ్ ట్రైపాడ్‌తో అందరి ప్రశంసలు అందుకున్న టీచర్

- రచయిత, జన్హవీ మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆన్‌లైన్‌లో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు తయారు చేసుకున్న ఒక తాత్కాలిక ట్రైపాడ్ వీడియో వైరల్ అవుతుందని మౌమిత భట్టాచార్జీ ఊహించలేదు.
మహారాష్ట్రలోని పంచగనికి చెందిన 41 సంవత్సరాల మౌమిత ఈ వీడియోతో ఇంటర్నెట్‌లో సెన్సషన్‌గా మారిపోయారు. లాక్ డౌన్‌లో కూడా పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఆమె అంకిత భావానికి చాలా ప్రశంసలు లభించాయి.
"చాలా మంది నేను చేసిన ప్రయోగాన్ని ఇష్టపడతారని అనుకోలేదు. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు, సహోద్యోగులు నేను ఆన్‌లైన్‌లో ఎలా పాఠాలు నేర్పిస్తున్నానని అడిగారు. నేను వాడుతున్న విధానం అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశాను.
ఆ ట్రైపాడ్‌ను పరిశీలిస్తే.. కొన్ని బట్టలతో చేసిన తాళ్లు, సీలింగ్‌కి కుర్చీకి వేలాడదీసిన బట్టలు ఆరేసుకునే హ్యాంగర్ కలిపి ఒక తాత్కాలిక ఏర్పాటులా అనిపించింది. మొబైల్ ఫోన్‌ని నిలకడగా ఉంచడానికి రెండు రబ్బర్ బాండ్లు. కుర్చీలో పెట్టిన ఆ మొబైల్ ఫోన్‌లో ఆమె బ్లాక్ బోర్డు మొత్తాన్ని కనిపించేలా ఏర్పాటు చేశారు.
ఆధునిక సాఫ్ట్‌వేర్‌ని వాడటం కన్నా సాంప్రదాయ పద్దతుల్లో పిల్లలకు పాఠాలు చెప్పడమే ఆమెకి బాగా సౌకర్యంగా ఉంటుంది.
"నేను కంప్యూటర్‌ని వాడి పాఠాలు చెబితే పిల్లలకి తరగతి గదిలో కూర్చున్న అనుభూతి రాదు" అని ఆమె అన్నారు.

ఈ ఉపాయం కనిపెట్టడానికి లాక్‌డౌన్ ఎలా దారి తీసిందంటే..
నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు తాత్కాలికంగా కనిపెట్టే ఉపాయాలను స్థానిక భాషలో జుగాడ్ అని అంటారు.
మహారాష్ట్రలో మార్చి 20వ తేదీన లాక్ డౌన్ ప్రకటించారు. మౌమిత పని చేస్తున్న సెయింట్ జేవియర్ స్కూల్ అప్పటికప్పుడు సెలవులు ప్రకటించేసింది. పంచగనిలో ఉన్న ఈ స్కూల్‌లో ఐసిఎస్ఇ విధానంలో విద్యా బోధన చేస్తారు. ఇది ముంబయి నగరానికి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్కూల్ మూసే సమయానికి పిల్లలకి పరీక్షలు అవుతున్నాయి. అప్పటికే కెమిస్ట్రీ పరీక్ష ముగిసింది.
లాక్ డౌన్ అనగానే "సంవత్సరం అంతా పాఠాలు చెప్పి అప్పుడే కాస్త తీరిక చేసుకుందాం అనుకున్నాను. కానీ, కొన్ని రోజులకే లాక్ డౌన్ కొన్ని వారాలు,నెలల పాటు కొనసాగేలా ఉందని అర్ధం అయింది.’’
"నాకు 10, 12 వ తరగతి చదువుతున్న విద్యార్థుల గురించి విచారం మొదలైంది. సిలబస్ అంతా ఎలా పూర్తి చెయ్యాలో అర్ధం కాలేదు. పిల్లలు కూడా ఎలా చదువుకోవాలని అడగటం మొదలు పెట్టారు. నాకు వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపించింది.’’
మౌమిత 17 ఏళ్ల వృత్తి జీవితంలో పిల్లల్ని కలవకుండా పాఠం చెప్పాల్సిన సందర్భం ఎప్పుడూ రాలేదు. దాంతో, ఆమె పాఠాలను వీడియో తీయాలని అనుకున్నారు.
మౌమిత వెంటనే తన సహోద్యోగి, ఇంగ్లీష్ టీచర్ మేరీని, స్కూల్ డైరెక్టర్ ఫాదర్ టోమిని సంప్రదించి తన ఆలోచనను వివరించారు.
ఆమె వీడియోలు చేయడానికి స్కూల్ బ్లాక్ బోర్డు అవసరమవుతుంది. వారిద్దరూ మౌమిత ఆలోచనని ఒప్పుకోవడంతో ఆమె వెంటనే తన ఆలోచనకు కార్య రూపం ఇవ్వడం మొదలు పెట్టారు. మొదట్లో ఆమె స్మార్ట్ ఫోన్ లో 2 నిమిషాల నిడివితో వీడియోలు చేయడం మొదలు పెట్టారు.
"నా ఫోన్‌లో ఎక్కువ కన్ఫిగరేషన్ లేదు. అందుకు రెండు నిమిషాల పాటు వీడియో రికార్డు చేసేదానిని. కొన్ని సార్లు మా అమ్మాయిలు ఫోన్ తో వీడియో తీయడానికి సహాయపడే వారు. ఒక్కొక్క సారి నా భర్త సహాయం చేసేవారు. వారి సహకారం లేకుండా నేనిలా చేయగలిగి ఉండేదానిని కాదు.’’
కొన్ని రోజుల తర్వాత స్కూల్ లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. టీచర్లకు షెడ్యూల్ ఇచ్చి ఒక గంట పాటు ఆన్‌లైన్ తరగతులు చెప్పమని పాఠశాల యాజమాన్యం అడిగింది. కానీ, అంత సేపు ఫోన్ పట్టుకుని వీడియో తీయాలంటే చాలా కష్టం.
ఒక్కొక్కసారి చేతులతో పట్టుకున్న వీడియో కదలడం, వీడియో బఫర్ అవ్వడం వలన పిల్లలకు సరిగ్గా కనిపించేది కాదని చెప్పారు.
తనకి ట్రై పాడ్ ఉంటే బాగుంటుందని అనిపించింది. కానీ, లాక్ డౌన్ వలన ఎక్కడ కొనుక్కోవాలో అర్ధం కాలేదు.
"నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా మా ఊరు చేరేసరికి చాలా రోజులు పట్టేస్తుంది. దీనికి ఏదో పరిష్కారం కనిపెట్టాలని అనుకున్నాను”.
అలా అనుకున్నాక ఆమెకి ఉపాయం తట్టింది.

విద్యార్థుల ప్రతిస్పందన
విద్యార్థులంతా ఆమె కనిపెట్టిన ఉపాయాన్ని ఇష్టపడ్డారు. "ఇది కేవలం సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం వలన పిల్లలు దీనిని ప్రశంసించలేదు. నాకు మంచి ప్రతిస్పందన రావడం పట్ల పిల్లలు కూడా ఆనందించారు”.
ఈ ఉపాయంతో మౌమితకి పిల్లలతో ఆన్‌లైన్’లో కలవగలిగే అవకాశం దొరికింది. లాక్ డౌన్ లో ఇది తన బాధ్యతగా ఆమె భావించారు.
"విద్యార్థులు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా బోర్డు పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఇంకా సమస్యలు ఎక్కువ”.
"నాకు పిల్లలకి చదువు చెప్పడం ఇష్టం. అందుకే ఈ ఉద్యోగంలో ఉన్నాను. మనకి ఇష్టమైన రంగంలో ఉంటే పనిని ఆనందంతో చేస్తాం”.
సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ అయిన తర్వాత ఆమెకి టీచింగ్ పట్ల ఉన్న అంకిత భావం, ఆరాధన చూసి చాలా మంది ఆనందించారు.

మరిన్ని సవాళ్లు
పంచగని సహ్యాద్రి పర్వతాల్లో నెలకొని ఉన్న ఒక చిన్న పర్యటక స్థలం. ఈ ప్రాంతం మారుమూల ఉండటం వలన కూడా లాక్ డౌన్ లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి సవాళ్లు ఎదురయ్యాయి.
వాళ్ళ స్కూల్ లో చదువుతున్న చాలా మంది పిల్లలకు ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఉన్నాయి. కానీ, మౌమితకి కొన్ని సార్లు ఇంటర్నెట్ కనెక్షన్ తో ఇబ్బందులు ఎదురయ్యేవి.
చాలా సార్లు, ఫోన్ లో వీడియోలు రికార్డు చేసి, వాట్సాప్ లో పిల్లలకు పంపిస్తూ ఉంటారు.
‘‘నేను పాఠాలు చెబుతున్నప్పుడు వీడియో సరిగ్గా కనిపించని వారందరికీ నేను వీడియోని వాట్సాప్ లో పంపిస్తూ ఉంటాను.’’
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం, డేటా వినియోగం పెరిగినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలలో ఆన్‌లైన్ లో పాఠాలు బోధించే అవకాశం లేదని మౌమితకి తెలుసు.
మహారాష్ట్రలో కేవలం 20 శాతం మంది విద్యార్థులకే స్మార్ట్ ఫోన్ వాడే సౌలభ్యం ఉందని ,విద్యారంగ నిపుణుడు భావుసాహెబ్ ఛస్కర్ అన్నారు.
“కొన్ని సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అన్ని సమస్యలను మనం పరిష్కరించలేము. మన చేతుల్లో ఏముందో అదే మనం చెయ్యాలి. అన్నిటికీ స్కూల్ మాత్రమే కల్పించాలని, కల్పిస్తేనే చేస్తామనే పట్టుదల ఎందుకు? మనసుంటే మార్గముంటుంది."

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- "నీది ఎంత ధనిక కుటుంబం అయినా కావొచ్చు.. కానీ, సమాజం లేకుండా నువ్వు బ్రతకలేవు" - దలైలామా
- కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- మగాళ్ల ఆత్మహత్యకు ఈ ఐదు విషయాలే కారణమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









