సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు

ఫొటో సోర్స్, Seetu Tewari/BBC
- రచయిత, సీటూ తివారీ
- హోదా, బీబీసీ కోసం
"మరుగుదొడ్డి కోసం ఇప్పటివరకు బయటకే వెళ్లేవాళ్లం. ఈ రోజు మా ఇంట్లో ఉండే మరుగుదొడ్డికి తలుపు బిగిస్తారు. దీంతో రేపటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు".
జ్యోతి తల్లి ఫూలో దేవి ఈ విషయాన్ని ఫోన్‌లో చెప్పినప్పుడు నాకు 2010 నాటి సినిమా పీప్లీ లైవ్ గుర్తుకు వచ్చింది.
పేదరికంతో నిరాశలో కూరుకుపోయిన రైతు "నథా" ఆ సినిమాలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో మీడియా, నాయకుల దృష్టి అతడిపై పడుతుంది. సినిమా చివర్లో అతడు గురుగ్రామ్‌లో పనిలో తల మునకలై కనిపిస్తాడు.
జ్యోతి తండ్రి మోహన్ పాసవాన్ కూడా కొన్ని నెలల ముందువరకు గురుగ్రామ్‌లో బ్యాటరీ రిక్షా నడిపేవారు. అంతేకాదు జ్యోతి ఇప్పుడుంటున్న ఇల్లు కూడా ఓ చిన్న గది, వరండాతో అచ్చంగా పీప్లీ లైవ్ సినిమాలో వేసిన సెట్‌లానే ఉంటుంది. ఈ చిన్న ఇంట్లో ఇప్పుడు 40 నుంచి 50 మంది గుమిగూడుతున్నారు.
కొందరు నాయకులు, మరికొందరు మీడియా ప్రతినిధులు, ఇంకొందరు సామాజిక కార్యకర్తలు, ఇంకా ప్రభుత్వ అధికారులు.. ఇలా అందరూ జ్యోతి జీవితం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC
కరోనావైరస్ భయంతో గజగజ వణుకుతున్న ఈ రోజుల్లో ఇక్కడకు వచ్చేవారు కొంచెం సంతోషంగానూ కనిపిస్తున్నారు.
"మా ఇల్లు చాలా చిన్నది. అందుకే పక్కనే చిన్న టెంట్ వేస్తున్నాం. కరోనావైరస్ సోకుతుందేమోననే భయం కూడా ఉంది. అయితే ఎవరినైనా రావొద్దని అంటే.. గర్వం బాగా పెరిగిపోయిందని అనుకుంటారు. అందుకే పక్కనే ఓ టెంట్ వేస్తున్నాం. అక్కడకు అందరూ వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించొచ్చు"అని జ్యోతి తండ్రి మోహన్ పాసవాన్ బీబీసీకి వివరించారు.
నిజానికి బిహార్ దర్భంగ జిల్లాలోని సిర్హుల్లీ గ్రామంలో కరోనావైరస్‌పై కంటే జ్యోతిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇక్కడ సామాజిక దూరం, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి మాటలు అందుకే వినపడట్లేదు.
జ్యోతికి లడ్డూలు తినిపించేందుకు, శాలువాలు కప్పేందుకు, బట్టలు ఇచ్చేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు నాయకులు, మంత్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులు వస్తున్నారు. వారెవరూ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ గురించి అసలు పట్టించుకోవడమే లేదు.
ప్రస్తుతం జ్యోతి మాస్క్ వేసుకొని హోమ్ క్వారంటైన్‌లో ఉంది. అయితే ఆమెను చూడటానికి వచ్చేవారు మాత్రం ఎలాంటి సామాజిక దూరం నిబంధనలూ పాటిస్తున్నట్లు కనిపించట్లేదు. ఈ విషయంపై జ్యోతితో మాట్లాడితే.. "మేం ఎవరితోనూ ఏమీ మాట్లాడట్లేదు. ఏం చేయగలం?" అని ఆమె అలసిన స్వరంతో సమాధానం ఇచ్చింది.

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC
నిద్ర, తిండి.. ఏమీ లేవు
ఉదయం ఏడు నుంచే జ్యోతి ఇంటికి జనాలు వస్తున్నారు. రాత్రి ఎనిమిది వరకు ఇలా అతిథులతోనే ఆమె ఇల్లు నిండిపోతోంది.
భగభగ మంటున్న ఎండ వేడికి తట్టుకోలేక పాసవాన్ ఓ కొత్త ఫ్యాన్ కూడా కొన్నారు.
"మా అమ్మాయి నిద్ర సరిగా పోవట్లేదు. తిండి కూడా సమయానికి తినలేకపోతోంది. అయినా కూడా విసుక్కోవడం లేదు. అందరినీ సంతోషంగానే పలకరిస్తోంది" అని జ్యోతి తల్లి ఫూలో వివరించారు.
చాలా సంతోషంగా ఉందని, అయితే నిద్రే సరిపోవట్లేదని జ్యోతి కూడా బీబీసీకి తెలిపింది. అందరి ఫోన్‌కాల్స్ మాట్లాడాలని, ఎవరిపైనా విసుక్కోవద్దని నాన్న చెప్పినట్లు ఆమె వివరించింది.
జ్యోతి ఏం కావాలని అనుకుంటోంది?
15ఏళ్ల జ్యోతి.. చదువులో ఒక సగటు విద్యార్థిని. 2017లో ఆమె సిర్హుల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి పాస్ అయ్యింది.
ఆమె పాఠశాల ప్రిన్సిపల్ రత్నేశ్వర్ ఝా.. బీబీసీతో మాట్లాడారు. "చదువులో జ్యోతి ఒక సగటు విద్యార్థిని. ఆమెకు స్కూల్లోని ఇతర అంశాలపై అంత ఆసక్తి ఉండేది కాదు. అయితే నేడు ఆమె మా స్కూల్‌కే గర్వ కారణం".
తొమ్మిదో తరగతికి వెళ్లాక జ్యోతి చదువు మానేసినట్లు అంగన్‌వాడీలో పనిచేస్తున్న ఆమె తల్లి వివరించారు. "ఇక్కడుండే పిల్లలంతా ప్రత్యేక ట్యూషన్లలో చదువుకుంటారు. కానీ మాకు అంత స్తోమత లేదు".
ప్రస్తుతం బిహార్ ప్రభుత్వం ఆమెను తొమ్మిదో తరగతిలో చేర్చుకుంది. అయితే జ్యోతిని ఇంజినీర్, డాక్టర్ లేదా అధికారిని చేస్తామంటూ చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి.
మరోవైపు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా జ్యోతిని దిల్లీ ఆహ్వానించింది. దీంతో ఆమె ఓ సైక్లిస్ట్‌గా మారే అవకాశాలూ లేకపోలేదు.
జ్యోతి సైక్లింగ్ ఫెడరేషన్‌లో భిన్న సైకిళ్లపై ట్రయల్ వేసిన అనంతరం నివేదిక సమర్పించాలని క్రీడా ప్రాధికార సంస్థకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సూచించారు.

ఫొటో సోర్స్, SEETU TEWARI/BBC
సైకిల్ నడుపుతూ ఇంటికి వచ్చిన జ్యోతిని ఏం కావాలని అనుకుంటున్నావు? అని బీబీసీ ప్రశ్నించింది. దీంతో "చదువుకున్నాక చెబుతా. ఎందుకంటే చదువుతో అద్భుతాలు చేయొచ్చు"అని ఆమె వివరించింది.
చాలా దూరం సైకిల్ తొక్కడంతో జ్యోతి వెన్నుకు గాయమైంది. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటోంది. దీంతో ఓ నెల రోజులు గడువు ఇవ్వాలని సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఆమె కోరింది.
ఇంటికి జనాలు విపరీతంగా పోటెత్తుతుండటంతో.. టీవీలో తమపై వస్తున్న వార్తలను చూసే సమయం జ్యోతి కుటుంబానికి దొరకడం లేదు.
ఇక్కడకు వచ్చేవారు ఇస్తున్న ఆఫర్లతో జ్యోతి తండ్రి అయోమయంలో పడుతున్నారు. "అందరూ ఉద్యోగాలు ఇస్తాం. బాగా చదివిస్తాం అంటున్నారు. నా కూతుర్ని ఎన్ని చోట్లకు పంపగలను?"అని ఆయన అన్నారు.
సైకిళ్లతో కిక్కిరిసిన ఇల్లు
జ్యోతి ఇంట్లో నేడు శరవేగంగా మరుగుదొడ్డిని నిర్మిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాలపై హర్ ఘర్ నల్ జల్ యోజన కింద మూడు మంచినీళ్ల గొట్టాలనూ ఏర్పాటు చేస్తున్నారు.
ఒకటి మరుగు దొడ్డిలో, మరో రెండు వరండాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిలో గ్యాస్ సిలెండర్ ఉంది. అయితే దాన్ని నింపుకొనేందుకు డబ్బులు ఎక్కువ ఖర్చు కావడంతో.. చాలా వరకు వంట కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు.
ప్రస్తుతానికి జ్యోతికి నాలుగు కొత్త సైకిళ్లు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ సరావగీ అయితే.. ఓ స్పోర్ట్స్ సైకిల్‌ను కొనిచ్చారు.
గురుగ్రామ్ నుంచి దర్భంగ వరకూ తండ్రిని ఎక్కించుకొని సైకిల్‌పై వచ్చిన జ్యోతి ఇంట్లో నేడు ఐదు సైకిళ్లు ఉన్నాయి. చిన్న ఇంట్లో ఇవే ఎక్కువ స్థలం ఆక్రమిస్తున్నాయి.
ఈ సైకిళ్లతో ఏం చేస్తారు? అని జ్యోతి తల్లిని ప్రశ్నించగా.. "గురుగ్రామ్ నుంచి తీసుకొచ్చిన సైకిల్‌ను ఉంచుకుంటాం. ఎందుకంటే అది మాకు చాలా ముఖ్యం. మిగతావి పిల్లలు నడుపుకొనేందుకు ఇచ్చేస్తాం"అని ఆమె వివరించారు.
జ్యోతి చెల్లి మానసి ఐదో క్లాస్ చుదువుతోంది. తమ్ముడు దీపక్ మూడో తరగతి. చిన్న తమ్ముడు ప్రియాన్షు.. అంగన్‌వాడీకి వెళ్తున్నాడు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
"ఇంటికి వచ్చేవారు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎంత వచ్చిందో లెక్క పెట్టుకోలేదు. ఈ డబ్బులతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తా"అని 12వ తరగతి వరకు చదువుకున్న జ్యోతి తండ్రి మోహన్ పాసవాన్ తెలిపారు.
జ్యోతిని చూసి కొందరు గర్వపడుతుంటే.. మరికొందరు ప్రభుత్వం సిగ్గుపడాలని అంటున్నారు.
జ్యోతి విజయం... సమాజంలో లోటుపాట్లను కళ్లకు కడుతోంది. ఒక జ్యోతిని సన్మానించేందుకు వందల మంది ఆమె ఇంటికి వస్తుంటే.. జ్యోతి లాంటి కొన్ని వేల మంది రోడ్లపై ఉన్నారు. ఎండిపోతున్న గొంతుతో కిక్కిరిసిన వాహనాల్లో ఇంటికి చేరుకునేందుకు ఎన్నో తంటాలు పడుతున్నారు.
జ్యోతికి రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని ఎల్‌జేపీ నాయకుడు చిరాగ్ పాసవాన్ సిఫార్సు చేశారు. మరోవైపు ఆమె చదువుతోపాటు పెళ్లికి అయ్యే ఖర్చును తాము భరిస్తామని ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ వివరించారు. జ్యోతి కుటుంబానికి అన్ని ప్రభుత్వ పథకాలూ అందేలా చూస్తామని బిహార్ ప్రభుత్వం వెల్లడించింది.
గత ఎనిమిది రోజుల్లో జ్యోతి జీవితం చాలా మారింది. కానీ బిహార్‌లో చాలా మంది మహిళలది ఇప్పటికీ అదే పరిస్థితి. రాష్ట్రంలో 60 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మహిళలు, బాలికలు ఇలా అందరూ సమాజంలో ఒకేలా జీవించే అవకాశం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే కదా?
ఇవి కూడా చదవండి:
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- ‘వీడియో కాల్లో చూస్తుండగానే అమ్మ తుదిశ్వాస విడిచింది.. కోవిడ్-19 మా అమ్మ ప్రాణాలు తీసింది’
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








