జాక్ మా: కరోనావైరస్‌ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో అత్యంత ధనవంతుడైన అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు ‘జాక్ మా’ గత నెలలో తన ట్విటర్ అకౌంట్ ప్రారంభించారు. అంటే, సరిగ్గా కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే. ఆయన అకౌంట్ ప్రారంభించినప్పటి నుంచి పెట్టిన ప్రతి పోస్టులోనూ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు తాను అందిస్తున్న వైద్య పరికరాల సాయం గురించే ప్రస్తావిస్తూ వస్తున్నారు.
“వన్ వరల్డ్-వన్ ఫైట్” ఇది ఆయన పోస్ట్ చేసిన మొదటి మేసెజ్‌లలో ఒకటి. “కలిసికట్టుగా మనం సాధించగలం.” ఇది ఆయన ఉత్సాహంగా పెట్టిన మరో మెసేజ్.
కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు సుమారు 150కి పైగా దేశాలకు వైద్య పరికారాలను అందించే సహాయ కార్యక్రమాన్ని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. ప్రపంచమంతా వైద్య పరికరాల కరవుతో అల్లాడిపోతుంటే ఆయన లక్షలాది మాస్కులు, వెంటిలేటర్లు, ఇతర సహాయ సామాగ్రిని అవసరమైన దేశాలకు పంపుతున్నారు.
అయితే, దీని వల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటన్నది ఆయన విమర్శకులు కానీ ఆయన మద్దతుదారులు కానీ చెప్పలేకపోతున్నారు. తన సేవా కార్యక్రమాల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలమైన వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకోవాలనుకుంటున్నారా? లేదా పార్టీ తన ప్రయోజనాల కోసం ఆయన్ను ఉపయోగించుకుంటోందా?
ముఖ్యంగా ఆయన తన దాతృత్వానికి ఎంచుకున్న దేశాలను చూసినప్పుడు చైనా దౌత్య నియమాలకు లోబడే ఆయన వ్యవహారశైలి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ రోజు రోజుకీ పెరుగుతున్న ఆయన పలుకుబడి చైనాలోని కొందరు ఉన్నత స్థాయి నేతలకు కంటగింపుగా మారుతున్నట్టు కనిపిస్తోంది.
ప్రపంచంలోని ఇతర కోటీశ్వరులు అతని కన్నా ఎక్కువగానే విరాళాలు ఇచ్చారు. ప్రైవేటు చారిటబుల్ డొనషన్లను ఎప్పటికప్పుడు పరిశీలించే అమెరికాకు చెందిన ఓ సంస్థ అందించిన వివరాల ప్రకారం కోవిడ్-19పై పోరాటానికి తమ పెద్ద మనసు చాటుకున్న వ్యక్తుల్లో ‘జాక్ మా’12వ స్థానంలో ఉన్నారు.
అయితే, ఆ జాబితాలో ఆయన పంపుతున్న వైద్య సామాగ్రి ప్రస్తావన లేదు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దేశాలకు ధన సాయం కన్నా వైద్య సామాగ్రి అవసరమే ఎక్కువగా ఉంది.
అవసరార్థులకు నేరుగా అవసరమైన సామాగ్రి చేరవేయడంలో జాక్ మా ను మించిన వారెవ్వరూ లేరు. అలీబాబా ఫౌండేషన్‌లో భాగమైన ‘జాక్ మా’ ఫౌండేషన్ మార్చి నెలలో తన సేవల్ని ప్రారంభించింది.
ఆఫ్రికా, ఆసియా, యూరోప్, లాటిన్ అమెరికా సహా రాజకీయంగా అత్యంత సున్నిత దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా దేశాలకు కూడా ఆయన విమానాల ద్వారా అవసరమైన సామాగ్రిని పంపించారు.
కరోనావైరస్‌కు టీకాను తయారు చేసేందుకు కూడా ‘మా’ లక్షలాది డాలర్లను అందించారు. అలాగే వైద్య నిపుణుల సూచనలతో కూడిన హ్యాండ్ బుక్‌ను మొత్తం 16 భాషల్లో ముద్రించి ప్రజలకు అందించారు. ఆయన ప్రపంచ దేశాలకు అందించిన వైద్య సామగ్రి విషయం మాత్రమే వార్తల్లో నిలిచింది

ఫొటో సోర్స్, Getty Images
ప్రజాకర్షణ కలిగిన స్నేహశీలి
ప్రజాకర్షణ కలిగిన ఇంగ్లిష్ టీచర్ నుంచి చైనాలోనే అతి పెద్ద టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకునిగా ఆయన చైనా ప్రజలకు సుపరిచితులు. ‘అలీబాబా’ ఇప్పుడు తూర్పు ఆసియా దేశాలకు అమెజాన్‌తో సమానం.
1999లో చైనాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకటైన హాంగ్జూ నగరంలోని ఓ చిన్న అపార్ట్మెంట్‌లో అలిబాబా ప్రస్థానం మొదలయ్యింది. ఇప్పుడు చైనాలో అలిబాబా సంస్థది తిరుగులేని స్థానం. చైనా ఆన్ లైన్ బ్యాంకింగ్ , ఎంటర్‌టైన్మెంట్ రంగాలలో ఆ సంస్థదే ఆధిపత్యం. జాక్ మా సొంత ఆస్తులే 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయి.
పార్టీ సూచనలకు అనుగుణంగానేనా?
ప్రస్తుతం ‘మా’ ఇచ్చిన విరాళాలను గమనిస్తే అన్నీ పార్టీ సూచనలమేరకే జరిగినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం జాక్ మా, అలీబాబా ఫౌండేషన్ విరాళాలు అందించిన దేశాల జాబితాను గమనిస్తే చైనా పొరుగు దేశం, దౌత్య పరంగా ప్రత్యర్థి అయిన తైవాన్‌తో అధికారిక సంబంధాలున్న దేశాల పేర్లు కనిపించవు.
లాటిన్ అమెరికాకు చెందిన 22 దేశాలకు విరాళాలను అందిస్తున్నట్లు ట్విట్టర్లో ‘మా’ ప్రకటించారు. అయితే తైవాన్ పక్షం వహిస్తున్న హోండురస్, హయితీ వంటి డజన్ల కొద్దీ చిన్న చిన్న దేశాలు వైద్య సామాగ్రి అందించాలని అర్థిస్తున్నప్పటికీ జాక్ మా సాయం చేస్తున్న దేశాల జాబితాలో వాటి పేర్లు లేవు.
జాక్ మా ఫౌండేషన్ సాయం అందిస్తున్న దేశాల జాబితా కావాలని ఎన్ని సార్లు అడిగినా సంస్థ సిబ్బంది వివరాలను అందించేందు సుముఖంగా లేరు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి వివరాలను ఇవ్వలేమని చెబుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ జాక్ మా దాతృత్వం కచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతల్ని తీసుకొస్తుంది. క్యూబా, ఎరిత్రియా వంటి దేశాలకు తప్ప చైనా నుంచి జాక్ మా ఫౌండేషన్ అందించిన సాయాన్ని అన్ని దేశాలు సంతోషంగా స్వీకరించాయి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

ఈ విజయంతో జాక్ మా ప్రతిష్ట మరింత పెరిగిందనే చెప్పాలి. మరోవైపు చైనా జాతీయ మీడియా అయితే దాదాపు చైనా అధినేత షీ జింపింగ్‌కు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని ఇస్తోంది.
కరోనావైరస్ ప్రారంభంలో అధ్యక్షుడు తీసుకున్న చర్యలపై అనేక ప్రశ్నలు తలెత్తిన సమయంలో ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపించిన “జాక్ మా”కు ఈ పోలిక కాస్త ఇబ్బందిని కల్గించేదే.
కోవిడ్-19 బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూరోప్, దక్షిణాసియా దేశాలకు చైనా పెద్ద సంఖ్యలో వైద్య బృందాలను, వైద్య సామాగ్రిని సాయంగా అందించింది. అయితే కొన్ని సార్లు అవి విమర్శలకు కూడా తావిస్తాయి.
చైనా చవకబారు, పనికిమాలిన సామాగ్రిని పంపిందని కొన్ని దేశాలు ఆరోపించాయి. కొన్ని సార్లు పరీక్షలు తప్పుడు ఫలితాలు వచ్చాయంటూ తిరిగి వెనక్కి పంపాయి కూడా.
అందుకు విరుద్ధంగా జాక్ మా అందించిన సాయం ఆయన ప్రతిష్టను మరింత పెంచింది.
“జాక్ మా అందించిన సాయం పట్ల ఆఫ్రికా అంతటా సంతోషం వ్యక్తం చేశారు” అని చైనా ఆఫ్రికా ప్రాజెక్ట్ వెబ్ సైట్ అండ్ పాడ్‌కాస్ట్ సంస్థ మేనేజింగ్ ఎడిటర్ ఎరిక్ ఒలెండర్ తెలిపారు. ఆఫ్రికాలోని అన్ని దేశాలను సందర్శిస్తానని గతంలో హామీ ఇచ్చినట్టే రిటైర్ అయిన తర్వాత జాక్ మా తరచుగా ఆయా దేశాలకు వెళ్లి వస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్లిష్ట పరిస్థితుల మధ్య ప్రయాణం!
అయితే, ‘జాక్ మా’కు ఇప్పుడు బీజింగ్ నుంచి ఎదురు దెబ్బ తగలనుందా? నిజానికి ఎవరైనా తనతో, తన ప్రభుత్వంతో సమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంటే చూస్తూ ఊరుకునే నైజం కాదు షీ జింపిగ్‌ది.
చాలా మంది ప్రముఖుల్ని గతంలో ఆయన ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది కూడా. ఇటీవల కాలంలో చూస్తే దేశంలోనే ప్రముఖ నటి, ప్రముఖ న్యూస్ యాంకర్, మరి కొంత మంది కోటీశ్వరులైన పారిశ్రామిక వేత్తలు చాలా రోజులుగా తెరమరుగైపోయారు.
న్యూస్ యాంకర్ వంటి వాళ్లయితే జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. నిర్బంధం నుంచి బయటకు వచ్చిన కొంత మంది పార్టీకి విధేయంగా ఉంటామని ప్రతిన చేశారు కూడా.
“దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఆయనకు వస్తున్న ప్రజాదరణ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిష్టకు అడ్డుగా మారుతోందన్న కారణంతోనే 2018లో అలీబాబా గ్రూప్ ఛైర్మన్ పదవికి జాక్ మా రాజీనామా చేశారన్న వదంతులు కూడా వచ్చాయి” అని వాషింగ్టన్ డీసీలోని సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీలో రిసెర్చ్ అసోసియేట్‌గా పని చేస్తున్నఅష్లే ఫెంగ్ అన్నారు.
నిజానికి 2018లో ఆయన ఊహించని రాజీనామా చాలా మందిని ఆశ్చర్యపరచింది. అయితే తనతో బీజింగ్ బలవంతంగా రాజీనామా చేయించిందన్న వదంతులను జాక్ మా కొట్టి పారేశారు.
2017లో జరిగిన ఓ కీలక సంఘటన తర్వాత అలీబాబా చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారన్న వార్తల సంగతి జాక్ మా జీవిత చరిత్ర రాసిన డంకన్ క్లార్క్ దృష్టికి కూడా వచ్చింది.
చైనా, అమెరికా వాణిజ్య సంబంధాలపై చర్చించేందుకు ట్రంప్ టవర్స్ లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో జాక్ మా భేటి అయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల వరకు చైనా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కాలేదు.“ఆ సమయంలో జాక్ మా వేగంగా పావులు కదుపుతున్నారంటూ చాలా ఊహాగానాలు వచ్చాయి” అని క్లార్క్ అన్నారు.
“బహుశా వీలైనంత వరకు సమన్వయంతో వ్యవహరించాలన్న పాఠాలు ఇరు వర్గాలు నేర్చుకున్నాయని నేను భావిస్తున్నా. జాక్ మా ఓ పారిశ్రామిక శక్తి. బహుశా అందువల్ల కూడా సవాళ్లు ఎదురై ఉండవచ్చు. ఎందుకంటే పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని అలాంటి పాత్ర పోషించడం ప్రభుత్వానికి చికాకు కల్గిస్తుంది” అని క్లార్క్ చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
బయట వ్యక్తి ఏమీ కాదు
నిజానికి జాక్ మా కమ్యూనిస్ట్ పార్టీకి బయట వ్యక్తేం కాదు. 1980లో అంటే యూనివర్శిటీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆయన పార్టీ సభ్యుడు.
అయితే పార్టీతో ఆయన సంబంధాలు ఎప్పుడు అంటీ ముట్టనట్టే ఉంటాయి. అంటే ‘ప్రేమించడం వరకు ఓకే... పెళ్లికి మాత్రం నో’ అన్నట్టు.
అయితే బీజీంగ్ ముందస్తు ఆశీస్సులు లేకుండా ‘మా’ గానీ అతని సేవా సంస్థలు కానీ ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటే , ‘మా’ ఛారిటీ విషయంలో చైనా ప్రభుత్వం ఇప్పటికే తాను ఏం చెయ్యాలో అది చేసి ఉండేది.
కానీ సియిరా లోన్ నుంచి కంబోడియా వరకు ప్రతి దేశంలోనూ చైనా రాయబారులు దగ్గరుండీ విమానాశ్రయాలకు మా ఫౌండేషన్ నుంచి వైద్య సామాగ్రితో వస్తున్న సరుకు విమానాలకు స్వాగతం పలుకుతున్నారు.
తనను విమర్శించే అమెరికా వంటి దేశాల విషయంలో కూడా జాక్ మా ఉదారతను కూడా చైనా ఉపయోగించుకుంటోంది. “20 లక్షల మాస్కులు అందించిన తైవాన్ మా నిజమైన స్నేహితుడు అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చెప్పింది. మరి 10 లక్షల మాస్కులు, 5లక్షల టెస్టింగ్ కిట్లు అందించిన జాక్ మా ఫౌండేషన్, ఇతర చైనా కంపెనీల సాయం గురించి ఎందుకు ప్రస్తావించనట్టు?” అంటూ ఏప్రిల్ మొదటి వారంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాక్ మా చేస్తున్న సేవల వల్ల కావచ్చు లేదా చైనాకు చెందిన ఇతర ధనవంతులైన వాణిజ్యవేత్తలు చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల కావచ్చు చైనా కచ్చితంగా లాభపడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.

అమెరికా పాత్రలోకి చైనా?
కోవిడ్-19ను ఎదుర్కొనే విషయంలో చైనాకు చెందిన ప్రైవేటు వ్యక్తులు అందిస్తున్న విరాళాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అలక్ష్యం చేయలేమని క్యాండిడ్ సంస్థకు చెందిన ఆండ్రూ గ్రబోయిస్ అన్నారు. ఆయన పని చేస్తున్న సంస్థ సేవా కార్యక్రమాల పేరిట ప్రపంచ వ్యాప్తంగా విరాళాలను అందించే వివరాలను సేకరిస్తూ విశ్లేషిస్తూ ఉంటుంది.
“వాళ్లిప్పుడు నాయకత్వ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. సాధారణంగా గతంలో ఈ పని అమెరికా చేస్తూ ఉండేది. అందుకు 2014లో తలెత్తిన ఎబోలా సంక్షోభమే చెప్పుకోదగ్గ ఉదాహరణ. ఆ సమయంలో పశ్చిమాఫ్రికాలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమెరికా స్వయంగా వైద్యుల్ని పంపండంతో పాటు అన్ని రకాల సాయాన్ని అందించింది” అని ఆండ్రూ అన్నారు.
ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని నిరోధించే బాధ్యతను చైనాకు చెందిన దాతలు తీసుకున్నారు. “దేశ సరిహద్దుల్ని దాటి వైద్యపరంగా, ఆర్థికంగా సాయమందిస్తూ, తమ అనుభవాన్ని వారికి అందించడం ద్వారా ఆయా దేశాల్లో ఓ సానుకూల శక్తిగా రూపొందుతున్నారు” అని ఆండ్రూ చెప్పారు.
మొత్తం మీద జాక్ మా నడుస్తున్న మార్గానికి అడ్డు తగలడానికి చైనాకు ఇది అనువైన సమయం కాదు.
యావత్ ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోది. అదే సమయంలో ఇదే కోవిడ్-19 సంక్షోభం కారణంగా మిగిలిన ప్రపంచంతో చైనా సంబంధాలు కూడా చిక్కుల్లో పడ్డాయి. కనుక తమ దేశంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే సత్తా ఉన్న ఏ ఒక్కరి సాయమైనా ఇప్పుడు ఆ దేశానికి అవసరం అన్నది ఆయన బయోగ్రఫీని రాసిన డంకన్ క్లర్క్ అభిప్రాయం.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లాక్ డౌన్: ఎండిపోతున్న డార్జిలింగ్ తేయాకు తోటలు
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో సర్కస్‌లు ఇక అంతరించిపోయినట్లేనా?
- సామాజిక దూరం పాటించమంటే దేశంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
- కరోనావైరస్: భారత్‌లో టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో లాభాల వెనుక నిజం ఏంటి?
- కరోనావైరస్: అమెరికా వర్సెస్ చైనా... పోటాపోటీగా కుట్ర సిద్ధాంతాలు
- కిమ్ జోంగ్ ఉన్ ఎవరు? ఉత్తర కొరియా పాలకుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








