కరోనావైరస్ లాక్ డౌన్: సర్కస్‌లు ఇక అంతరించినట్లేనా?

ఫొటో సోర్స్, RAMBO CIRCUS
భారతదేశంలో సర్కస్ ఇప్పటికే అంతరించిపోతున్న ఓ కళారూపం. ఇప్పుడు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా.. సర్కస్‌ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బీబీసీ ప్రతినిధి చింకీ సిన్హా అందిస్తున్న కథనం.
అది ఏప్రిల్ 16వ తేదీ రాత్రి. ముంబయి శివార్లలోని ఐరోలీ ప్రాంతం.
బిజు పుష్కరన్ (50) తన పోల్కా డాట్ గౌను తొడుక్కుని ఉన్నాడు. అతడి ముఖమంతా తెల్లటి పౌడర్ అద్ది ఉంది. బుగ్గల మీద కుంకుమ, లిప్‌స్టిక్‌లతో అవి ఎర్రగా ఉన్నాయి. అలా సిద్ధమై ఒక ఖాళీ టెంటులోకి వెళ్లాడు.
రాంబో సర్కస్ మార్చి 6వ తేదీ నుంచి ఒక్క షో కూడా చేయలేదు. అందులో బిజూ పనిచేస్తాడు. కానీ ఆ రోజు ‘ప్రపంచ సర్కస్ దినోత్సవం’. అందుకే ఆయన సర్కస్ కోసం తయారై ఒక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లాడు.
‘‘మేం మీ ఇంటికొస్తాం. మీ ఇళ్లలోకి వస్తాం. మిమ్మల్ని నవ్విస్తాం’’ అని ప్రకటించాడు.
చప్పట్లు కొట్టి ప్రోత్సహించే ప్రేక్షకులు ఎవరూ లేరు. అయినా సర్కస్ కళాకారులందరూ తమ ప్రదర్శన ఇచ్చారు. ఒకవైపు షో కొనసాగుతోంది. కానీ తమ తెర త్వరలోనే దిగిపోతుందనే వాస్తవం వారికి బాగా తెలుసు.

ఫొటో సోర్స్, RAMBO CIRCUS
దేశంలో మార్చి 24న లాక్‌డౌన్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ కళాకారుల దగ్గర డబ్బులు అయిపోయాయి. ఆహారమూ నిండుకుంది. సహాయం కోసం ప్రజలను అర్ధించాల్సి వచ్చింది.
చంద్రనాథ్ బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో ఒలింపిక్ సర్కస్ యజమాని. ఆయన వయసు 61 సంవత్సరాలు. ఆ సర్కస్‌లో 75 మంది సిబ్బంది ఉన్నారు. లాక్‌డౌన్ ప్రకటించటంతో ఆయన సర్కస్ మూసేశారు. అందరినీ ఇళ్లకు వెళ్లిపొమ్మన్నారు. ‘‘ఈ అంధకారం నుంచి బయటపడటం అంటూ జరిగితే మళ్లీ పిలుస్తా’’ అని మాటిచ్చారు.
అది విని ‘‘వాళ్లు ఏడ్చారు’’ అని చెప్పారాయన. ‘‘సర్కస్ నడవాలంటే జనం వచ్చి చూడాలి. ఇప్పుడు అందరూ ఎవరి ఇంట్లో వారే ఉండే పరిస్థితి. మేం మూసేయక తప్పలేదు’’ అని పేర్కొన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కానీ గ్రేట్ బాంబే సర్కస్ మేనేజర్ జయప్రకాసన్ పి.వి. (52) ఆశలు వదులుకోవటానికి సిద్ధంగా లేరు.
తమిళనాడులోని మన్నార్‌గుడి అనే పట్టణంలో ఆయన సర్కస్ టెంట్లు అలాగే ఉన్నాయి.
‘‘లాక్‌డౌన్ ఎత్తేశాక ఏం జరుగుతుందో మాకు తెలీదు. ఇప్పటికైతే మేం నిరీక్షిస్తున్నాం’’ అంటారాయన.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారతదేశంలో క్రియాశీలంగా ఉన్న 23 సర్కస్‌లు ఒక జాతీయ సమాఖ్యగా ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 300 చిన్న సర్కస్‌లను అందులో కలుపుకున్నాయి.
సర్కస్ ప్రదర్శనల్లో వన్యమృగాలు, చిన్నపిల్లల ప్రదర్శనలను భారత ప్రభుత్వం 2013లో నిషేధించింది. దీంతో ఆ సర్కస్‌లు చాలా వరకూ దివాలా తీశాయి.

ఫొటో సోర్స్, RAMBO CIRCUS
ఇప్పుడు దేశంలో రిజస్టర్ చేసుకున్న సర్కస్‌ల సంఖ్య పది కూడా లేదు. చిన్న సర్కస్‌లు ఓ పాతిక ఉన్నాయి. వాటిలో 1,500 మంది కళాకారులు పనిచేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు చెందిన బృందాలు శరీరాలతో విన్యాసాలు చేస్తుంటాయి. వీరు మనుగడ సాగించటానికి చాలా కాలంగా కష్టపడుతున్నారు.
వీరిలో చాలా మంది నగదు లావాదేవీల మీదే ప్రధానంగా ఆధారపడి ఉన్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయటం వీరిని గట్టిగా దెబ్బతీసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే వరకూ తాము మనుగడ సాగించటానికి రుణం ఇప్పించాలని కోరుతూ వీరు ప్రధానమంత్రికి లేఖ రాశారు. జవాబు కోసం ఎదురు చూస్తున్నారు.

ఫొటో సోర్స్, RAMBO CIRCUS
ప్రపంచ వ్యాప్తంగా కూడా పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రిక్ డ్యు సోలీల్ సర్కస్.. గత నెలలో తమ సిబ్బందిలో 95 శాతం మందిని తొలగించి పతాక శీర్షికలకెక్కింది.
‘‘ఈ మహమ్మారి చరిత్ర గతిని మార్చింది. ఆదాయం లేని కారణంగా సర్కస్‌లు తమ కుటుంబాలు, కళాకారులు, జంతువుల జీవనోపాధికి భరోసా ఇవ్వలేకపోతున్నాయి’’ అని వరల్డ్ సర్కస్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుసానా మాతా ఈ-మెయిల్ ద్వారా చెప్పారు.
మనకు తెలిసన సర్కస్‌లు శాశ్వతంగా అంతరించిపోయినట్లే భావించాలేమో.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ఈక్వెడార్ గ్వాయాక్విల్‌లో వేలల్లో మృతులు... మార్చురీలు మూసేయడంతో రోడ్ల మీద మృతదేహాలు
- కరోనావైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలి... లాక్‌డౌన్ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?
- కరోనావైరస్ లాక్ డౌన్: ఆంధ్రప్రదేశ్‌లో పడిపోయిన పాలు, పాల ఉత్పత్తుల విక్రయం... కష్టాల్లో పాడి రైతులు
- "పేదల చేతుల్లో డబ్బులు ఉండేలా చూడాలి.. అందుకోసం భారత్ డబ్బులు ముద్రించొచ్చు" - నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ
- కరోనావైరస్: కోవిడ్ రాకుండా తొలిసారిగా బ్రిటన్‌లో వ్యాక్సీన్ ట్రయల్స్
- పేద ప్రజల "రెండు రూపాయల డాక్టర్" ఇస్మాయిల్ హుస్సేన్
- ‘చైనాలో అధికార సంఘర్షణ రావొచ్చు... కొత్త ప్రపంచ వ్యవస్థలో భారత్‌ది ముఖ్య పాత్ర’-రామ్ మాధవ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








