కరోనావైరస్: కరడుగట్టిన క్రిమినల్స్ ఆహార పొట్లాలు పంచుతుంటే ఆ దేశ అధ్యక్షుడు ఎందుకు వద్దంటున్నారు?

ఫొటో సోర్స్, Reuters
మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రాడర్ సోమవారం ఒక అసాధారణ డిమాండ్ చేశారు.
కోవిడ్-19 సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ నేర ముఠాలన్నీ ఆహార పొట్లాలను పంచడాన్ని పక్కనపెట్టి అంతకుముందు రోజు 100 మంది మృతికి కారణమైన హింసను అంతం చెయ్యడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
లాటిన్ అమెరికాలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారిలో కేవలం మెక్సికన్ ముఠాలు మాత్రమే కాదు కొలంబియన్ గ్యాంగుల నుంచి బ్రెజిల్‌కు చెందిన అర్బన్ మిలీషియా వరకు అందరూ ఉన్నారు.
బీబీసీ మోనిటరింగ్‌కు చెందిన లాటిన్ అమెరికా స్పెషలిస్ట్ లూయిస్ ఫెజర్డో రిపోర్ట్ ప్రకారం వీళ్లంతా కోవిడ్-19 మహమ్మారి మొదలైనప్పటి నుంచి తమ ప్రతాపాన్ని చూపిస్తునే ఉన్నారు.
ఏప్రిల్ 7 .. మధ్యాహ్నం. అప్పటికే కరోనావైరస్ వ్యాప్తిని తగ్గించడంలో భాగంగా కొలంబియాలో దేశ వ్యాప్తంగా 14 రోజుల లాక్ డౌన్ కొనసాగుతోంది. కానీ అదే సమయంలో నిబంధలన్నింటినీ పక్కన పెట్టేసి మెడిలిన్ నగరంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.
సామాజిక దూరాన్ని పాటించాలన్న నియమాలను తుంగలో తొక్కి ఈద్గర్ పెరెజ్ హెర్నాండెజ్‌కు నివాళులర్పించేందుకు వందలాది మంది వచ్చారు.
ఈద్గర్‌ను “ఎల్ ఒసో” అని కూడా పిలుస్తారు. ఆయన స్థానిక “నకియ-కమకొల్ అనే క్రిమినల్ గ్యాంగ్‌కు లీడర్. అంతకు ముందు రోజే ఆయన జైల్లో గుండె పోటుతో మరణించారు.
స్థానిక పత్రిక కథనం ప్రకారం“ ఎల్ ఒసో గౌరవార్ధం ఆయన అనుచరులు గాల్లో తుపాకులు కాల్చారు.”

ఫొటో సోర్స్, REUTERS
వ్యాపారాలు మామూలుగానే సాగుతున్నాయా ?
ఈ కోవిడ్-19 మహమ్మారి కారణంగా అన్ని వ్యాపారాలు దెబ్బ తిన్నట్టే లాటిన్ అమెరికాలోని నేర ముఠాలు కూడా సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి.
ముఖ్యంగా వారి అంతర్జాతీయ గొలుసు కట్టు వ్యాపారాలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసే గ్యాంగులు ఎదుర్కొంటున్న కష్టాలను మెక్సికోకు చెందిన ప్రముఖ కాలమిస్ట్ హెక్టర్ డె మౌలీన్ ఇలా చెప్పుకొచ్చారు.
“అమెరికాలో మాదక ద్రవ్యాల అక్రమ అమ్మకాలు పడిపోవడమే కాదు డ్రగ్స్‌లో కలపాల్సిన ముఖ్యమైన రసాయనాల దిగుమతి కూడా చైనా నుంచి ఆగిపోయింది. ఫలితంగా మెక్సికన్ డ్రగ్స్ మార్కెట్లు పీకల్లోతు కష్టాల్లో పడ్డాయి.” అని మౌలన్ వివరించారు.
అదే సమయంలో అమెరికా-మెక్సికో సరిహద్దులు కూడా పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరింత కష్టంగామారింది.
“ఈ పరిస్థితులు మెక్సికోలోని గ్యాంగుల మధ్య హింసకు కారణమవుతున్నాయి. ఉన్న కాస్త అవకాశాలను చేజిక్కించుకునేందుకు డ్రగ్స్ ముఠాలు కొట్టుకుంటున్నాయి.” అని మౌలీన్ చెప్పుకొచ్చారు.
స్థానిక పత్రిక మెలినియో ప్రచురించిన వివరాలు మౌలీన్ వ్యాఖ్యలను మరింత బలపరుస్తున్నాయి. మెలినియో కథనం ప్రకారం గడిచిన 13 ఏళ్లలో ఎప్పుడు లేని స్థాయిలో గత మార్చి నెలలో ఘోర నరమేధం జరిగింది. మరణించిన వారిలో మెజార్టీ వ్యక్తులకు ఏదో ఒక విధంగా స్థానిక వ్యవస్థీకృత నేర ముఠాలతో సంబంధాలున్నాయి.
సరిహద్దు నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. సియుడాడ్ జ్వాయెజ్‌లో ఒక్క మార్చి నెలలోనే 153 మంది మరణించారు. 2018 ఆగస్టు తర్వాత అక్కడ ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి అని ఎల్ డయారియో పత్రిక పేర్కొంది.
ఆగని డ్రగ్స్ర్ రవాణా
ఓ వైపు తమ వ్యాపారానికి ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ లాటిన్ అమెరికాకు చెందిన నేర ముఠాలు మాత్రం ఇప్పటికీ చట్ట విరుద్ధంగా భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను సరిహద్దుల నుంచి పంపేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి.
కొలంబియాకు చెందిన ఎల్ టైంపో పత్రిక కథనం ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటికే 112 టన్నుల కొకైన్‌ను ఆ దేశ భద్రతా దళాలు సీజ్ చేశాయి.
మార్చి 31 పసిఫిక్ తీరంలో సుమారు టన్ను కొకైన్‌ను అమెరికాకు అక్రమంగా మోసుకెళ్తున్న ఓ నార్కో సబ్ మెరైన్‌ను కొలంబియా నేవీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఏడాదిలో అధికారులు సీజ్ చేసిన 12వ సబ్ మెరైన్ అది.
అయితే చాలా నగరాలకు ఈ ముఠాల ప్రాబల్యం విస్తరించిందని బ్రెజిల్ అధికారవర్గాలు చెబుతున్నాయి.

స్థానికుల్నిఆకట్టుకునేప్రయత్నాలు
ప్రస్తుతం ఈ కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో స్థానికుల మనస్సు గెల్చుకునేందుకు ఇప్పుడు ఈ నేర ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వాలనుంచి ఏ మాత్రం సాయం అందని వారికి, అలాగే అంతంత మాత్రంగానే సాయం అందుతున్న వారి సంక్షేమాన్ని చూస్తూ ఈ కష్టకాలంలో వారికి అవసరమైన సాయం చేస్తున్నాయి.
మెక్సికోకు చెందిన నేర ముఠాల్లో ముఖ్యంగా జలిస్కో న్యూ జనరేషన్ ముఠా, ద గల్ఫ్ ముఠా, లాస్ వయాగ్రా ముఠాకు చెందిన వ్యక్తులు తమ అధినేతల పేరిట ఆహార పొట్లాలను పంచుతున్నారు.
ఈ పరిస్థితి ఎంత వరకు వెళ్లిదంటే...బ్రెజిల్లోని నిరుపేద ప్రాంతాల్లో కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆ నేర ముఠాల నాయకులతో వెళ్లి మాట్లాడాలని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి స్థానిక అధికారులను ఆదేశించారు.
మురికివాడల్లో వారు ఎంత బలంగా ఉన్నారన్న వాస్తవాన్ని అధికారులు గ్రహించాలని, అలాగే వారి అధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి ప్రభుత్వం వెళ్లడంలో విఫలమయ్యిందన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
నేర ముఠాలు నేరముఠాలే
ఈ ముఠాల సేవల్ని పక్కనపెడితే... వారు నేరగాళ్లు అన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు కొందరు విశ్లేషకులు.
“వచ్చే కొద్ది వారాలు లేదా నెలల్లో ఈ వ్యవస్థీకృత నేరాలు బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు కొనసాగుతున్న ఈ సమయంలో ప్రభుత్వం ప్రజలకు విస్తృత స్థాయిలో సౌకర్యాలను కల్పించాలి. అయితే దేశంలో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మళ్లీ ఎప్పటిలాగే ఈ నేర ముఠాలు తమ అక్రమ వ్యాపారాల్ని మొదలుపెడతాయి.” అని మెక్సికో రక్షణ వ్యవహారాల నిపుణుడు అల్జెండ్రో హోప్ మెక్సికన్ డెయిలీ ఎల్ యూనివర్శల్ పత్రికలో పేర్కొన్నారు.
“అయితే ఇదే సమయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం అడుగుపెట్టని ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకుని, ప్రధాన ముఠాలను, వ్యవస్థీకృత నేరాలను నాశనం చేయడానికి అవకాశం ఉంది. అలా అక్కడ వారికి ఉన్న అధికారాన్ని మట్టుబెట్టవచ్చు.
ఆపై స్థానిక ప్రజలతో సంబంధాలను మెరగుపరుచుకొని వారికి భద్రతను, న్యాయాన్ని అందించే అవకాశం కూడా ఉంది.” అని హోప్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే కరోనావైరస్ కారణంగా లాటిన్ అమెరికా అంతటా ఆరోగ్య అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మున్ముందు ఆ ముఠాలపై పడే ప్రభావాన్ని పక్కనబెడితే, ప్రస్తుతం కోవిడ్-19 విషయంలో వారు చేస్తున్న పనుల వల్ల మాత్రం హింస కొనసాగుతునే ఉంటుంది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- అధికారం పదిలం చేసుకోవడానికి కరోనాను వాడుకుంటున్నారా
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- హోక్కైడో: లాక్ డౌన్ ఎత్తేశాక మళ్లీ మొదలైన కరోనా కేసులు.. జపాన్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?
- "నా హౌస్‌మేట్ సామాజిక దూరం పాటించడంలేదు, అర్ధరాత్రి వేరేవాళ్లను తీసుకొస్తున్నాడు"
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








