హోక్కైడో: లాక్ డౌన్ ఎత్తేశాక మళ్లీ మొదలైన కరోనా కేసులు.. జపాన్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రూపెర్ట్ హింగ్ ఫీల్డ్ - హేస్
- హోదా, బీబీసీ న్యూస్ , టోక్యో
కరోనావైరస్ వ్యాప్తిని కనిపెట్టి, పరీక్షలు నిర్వహించి నియంత్రణలోకి తెచ్చిన నగరంగా నిలిచిన జపాన్ లోని హోక్కైడో నగరం ఇప్పుడు రెండవ దశలో ప్రబలుతున్న కరోనావైరస్ ఇన్ఫెక్షన్ లతో సతమతమవుతోంది.
ఫిబ్రవరి చివరి వారంలో జపాన్ లోని హోక్కైడో కోవిడ్-19 కారణంగా అత్యవసర పరిస్థితిని విధించిన తొలి నగరం.
స్కూల్స్ మూసేసి, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలను రద్దు చేసి, ప్రజలను ఇంటి వద్దనే ఉండమని కోరారు.
స్థానిక ప్రభుత్వాలు వైరస్ ని నియంత్రించడానికి సత్వర చర్యలు చేపట్టి, వైరస్ సోకిన వారిని గుర్తించి, వారిని కలిసిన వ్యక్తులను వెంటనే నిర్బంధంలో పెట్టారు.
ఈ విధానం సత్ఫలితాలను ఇచ్చి మార్చి మధ్యకల్లా వైరస్ కేసులు నమోదవ్వడం రోజుకి ఒకటి, రెండుకి పడిపోయింది.
దీంతో మార్చి 19 వ తేదీన అత్యవసర పరిస్థితిని సడలించారు.
ఏప్రిల్ మొదటి వారంలో స్కూళ్లను కూడా తెరిచారు.
అత్యవసర పరిస్థితిని సడలించిన 26 రోజుల్లోనే తిరిగి విధించాల్సిన అవసరం ఏర్పడింది.
గత వారంలో హోక్కైడోలో 135 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గతంలో వలె ఈ కేసులు జపాన్ బయట నుంచి వచ్చినట్లు ఆధారాలు లేవు.
కొత్తగా వైరస్ సోకిన వారిలో విదేశీయులు ఎవరూ లేరు. వైరస్ సోకిన వారు కూడా గత నెలలో జపాన్ నుంచి బయటకి వెళ్ళలేదు.

హోక్కైడోలో వైరస్ నియంత్రణలో ఏమి జరిగింది?
వైరస్ మొదలైన వెంటనే చర్యలు తీసుకుంటే దానిని నియంత్రణలోకి తేవచ్చు.
మొదట వైరస్ సోకిన సమూహాలను గుర్తిస్తే, పరీక్షలు నిర్వహించి వైరస్ ని అదుపులోకి తేవడం సులభం అవుతుందని, లండన్ కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ కెంజి షిబుయ చెప్పారు.
సమూహాలలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో అధికారులు విజయం సాధించారు. అప్పుడు జపాన్ వైరస్ ప్రబలడంలో తొలి దశలో ఉంది. దాంతో అదొక విజయంగా భావించారు.
దక్షిణ కొరియా లోని డేగు నగరంలో వైరస్ నియంత్రణకి అవలంబించిన విధానం హోక్కైడోని పోలి ఉంది. ఒక మత సమూహంలో ఉన్న వైరస్ ని సత్వరమే గుర్తించి, వైరస్ సోకిన వారిని వెంటనే నిర్బంధించారు. దీంతో, వైరస్ ని నియంత్రించగలిగారు.
కానీ, హోక్కైడోలో వెలుగు చూస్తున్న రెండవ దశ ఇన్ఫెక్షన్ లు ఆశాజనకంగా లేవు.
డేగులో ఇన్ఫెక్షన్లు మొదలవ్వగానే దక్షిణ కొరియా ప్రభుత్వం అధిక సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహించింది. జపాన్ అలా చేయలేదు.
జపాన్‌లో తొలి కేసు నమోదు అయిన మూడు నెలల తర్వాత కూడా పరీక్షలు తగినంత స్థాయిలో నిర్వహించటం లేదు.
అధిక స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వలన వనరులు వ్యర్థం అవుతాయని జపాన్ ప్రభుత్వం భావించింది.
అయితే, పరీక్షలు చేయడం పెంచుతామని ఇప్పుడిప్పుడే అంటోంది.
జపాన్ లో తక్కువ స్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధరణ అయితే తేలికపాటి లక్షణాలు ఉన్న రోగులతో కూడా జపాన్ లోని హాస్పిటళ్లు నిండిపోతాయని జపాన్ వైద్య శాఖ భావించింది. పరీక్షలు నిర్వహించే బాధ్యత స్థానిక ఆరోగ్య కేంద్రాలకు మాత్రమే ఉంది. జపాన్ జాతీయ ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి బాధ్యత తీసుకోలేదు.
స్థానిక ఆరోగ్య కేంద్రాలలో భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి తగినంత సిబ్బంది, వైద్య పరికరాలు లేవు. స్థానిక హాట్ లైన్లు రోగుల నుంచి వచ్చే కాల్స్ తో ఉక్కిరిబిక్కిరై , డాక్టర్ నుంచి వచ్చిన కేసులను తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారిపోయింది.
ఇవన్నీ పరిశీలిస్తే, వైరస్ జనాభా ద్వారా ఎలా వ్యాప్తి చెందుతుందనే అవగాహన జపాన్ లోని అధికారులకి అర్ధం కాలేదని షిబుయ చెప్పారు.
వైరస్ వ్యాప్తి తీవ్రంగా బయట పడే దశలో ఇప్పుడు మేమున్నామని ఆయన అన్నారు
మొదటి సారి వ్యాపించిన వైరస్ ని అరికట్టడంలో విజయం సాధించినప్పటికీ ఆ స్థితిని దీర్ఘ కాలం స్థిరంగా ఉంచడం సాధ్యం కాలేదని హోక్కైడో పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది.
పరీక్షల సంఖ్య పెంచితే గాని వైరస్ సామాజిక వ్యాప్తిని , హాస్పిటల్ వ్యాప్తి ని అర్ధం చేసుకోలేమని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుదీర్ఘ ప్రయాణం
ఈ పరిస్థితి చాలా మంది ఊహిస్తున్న దాని కంటే ఎక్కువ రోజులే ఉంటుంది.
హోక్కైడో తిరిగి నిర్బంధాన్ని అమలు చేసింది. కాకపోతే మిగిలిన చోట్ల అమలు చేసినట్లు కఠిన నిర్బంధనలు కావు.
చాలా మంది పనులకి వెళుతున్నారు. స్కూల్స్ మాత్రం మూసే ఉంచారు. షాపులు, బార్లు తెరిచే ఉంచారు.
కఠినమైన చర్యలు అవలంబించకపోతే జపాన్ లో రెండవ దశలో తలెత్తుతున్న ఇన్ఫెక్షన్ లను నియంత్రించడం కష్టమవుతుందని ప్రొఫెసర్ షిబుయ చెప్పారు.
స్థానికంగా వైరస్ ని నియంత్రించగల్గినప్పటికీ , ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదలుతున్నప్పుడు వైరస్ ని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని అన్నారు
పర్యటక రంగం పై ఆధార పడి నడుస్తున్న హోక్కైడో ఆర్ధిక వ్యవస్థ కూడా దీంతో బాగా ప్రభావితమవుతోంది. జపాన్ ఇప్పటికే యు ఎస్, యూరప్, కొన్ని ఆసియా దేశాల నుంచి వచ్చే యాత్రికుల పై నిషేధం విధించింది.
చిటోస్ నగరంలో బార్ నడుపుతున్న ఒక వ్యక్తి బార్ ని మూసేసి ఉద్యోగులను పని లోంచి తీసేయాల్సి వచ్చింది. ఇంకొక చోట బార్ ని తెరిచి ఉంచినప్పటికీ బార్ కి వచ్చే కస్టమర్లు తగ్గిపోయారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా నుంచి, తూర్పు ఆసియా దేశాల నుంచి వచ్చే యాత్రికులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఒక్క విదేశీ కూడా వీధుల్లో కనిపించటం లేదని అసహికావా నగరానికి చెందిన నవ్కి తమురా చెప్పారు.
ఇక్కడ విధించిన లాక్ డౌన్ మే 6 వ తేదీతో ముగుస్తుంది. జపాన్ లో గోల్డెన్ వారం సెలవులు అప్పుడే ప్రారంభం అవుతాయి.
ఈ నిర్బంధనలు ఎక్కువ కాలం అమలు చేయవలసి రావచ్చని హోక్కైడోలో ఒక స్థానిక ప్రభుత్వ అధికారి చెప్పారు.
ఇది కొన్ని రోజుల పాటు చేస్తూనే ఉండాలి అనిపిస్తోందని అన్నారు.
"ప్రజల మధ్య సామాజిక దూరం పాటించేలా చేయడమే లక్ష్యమని” అన్నారు.
ఇలా ఎంత కాలం?
“వాక్సిన్ కనిపెట్టేవరకు వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తూనే ఉండాలని” ఆ అధికారి అన్నారు.
అదనపు సమాచారం - మిహో టనాక.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కేరళ ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎలా విజయం సాధించింది?
- కరోనావైరస్: లాక్ డౌన్లో కొత్త నిబంధనలతో ఎవరికి ప్రయోజనం?
- జూన్ అల్మీడా: మొదటి కరోనావైరస్ను కనిపెట్టిన మహిళ
- కరోనావైరస్ లాక్డౌన్: క్వారంటైన్ కేంద్రాల నుంచి పారిపోతున్న వలస కార్మికులు
- కరోనావైరస్; హెలికాప్టర్ మనీ అంటే ఏంటి... అది ఆర్థికవ్యవస్థకు ప్రమాదకరమా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









