కరోనావైరస్; హెలికాప్టర్ మనీ అంటే ఏంటి... అది ఆర్థికవ్యవస్థకు ప్రమాదకరమా?

హెలికాప్టర్ మనీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఒక ప్రెస్‌మీట్లో హెలికాప్టర్ మనీ గురించి ప్రస్తావించారు. ఇంతకీ హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి?

కరోనావైరస్ కారణంగా మీరు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇంతలో మీకు బాల్కనీ లోంచి ఓ హెలికాప్టర్ కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్న దృశ్యం కనిపిస్తుంది.

ఈ ఊహాత్మక దృశ్యాన్నే ఆర్థిక వేత్తలు హెలికాప్టర్ మనీ అని వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజల ఖర్చును, వినియోగాన్ని పెంచడం కోసం, తద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగవుతుందనే ఆశతో వారికి ఉచితంగా డబ్బు పంపిణీ చేయడాన్ని హెలికాప్టర్ మనీ అంటారు.

ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్మాన్ 1969లో, "రిజర్వు బ్యాంకు నోట్లు ముద్రిస్తుంది. ప్రభుత్వం వాటిని ఖర్చు చేస్తుంది" అని హెలికాప్టర్ మనీ గురించి వివరించారు.

ఇది ప్రభుత్వం రుణాలు తీసుకోవడం వంటిది కాదు. అలా ఏ ప్రయత్నం లేకుండా ఆకాశం నుంచి నోట్ల వర్షం కురవడం లాంటిదని అనుకోవచ్చు.

ఆర్థిక సంక్షోభంలో ఆఖరి పరిష్కారం

ఆర్థిక సంక్షోభం తార స్థాయికి చేరుకున్నప్పుడు దీన్ని ఒక తుది పరిష్కారంగా ఎంచుకోవాలని ఆర్థిక సూత్రాలు చెబుతున్నాయి.

కానీ, గతంలో హెలికాప్టర్ మనీ విధానాన్ని అమలు చేసిన ప్రతిసారీ చెడు ఫలితాలు ఎదురయ్యాయి.

హెలికాప్టర్ మనీ అనగానే జింబాబ్వే, వెనెజ్వెలా దేశాలు గుర్తుకు వస్తాయి. ఈ దేశాల్లో హేతుబద్ధత లేకుండా నోట్లను ఎక్కువ సంఖ్యలో ముద్రించడంతో, వాటి విలువ చిల్ల పెంకులకు కూడా కొరగాకుండా పోయింది.

డాలర్, యూరోలు చలామణీలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా రిజర్వు బ్యాంకు నిర్హేతుకంగా నోట్లు ముద్రించడాన్ని పీడకలలాంటి పిచ్చి పనిగానే చూస్తారు.

అయితే, ప్రస్తుతం కరోనా మహమ్మారి మన ఎదుట ఒక సవాలుగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో హెలికాప్టర్ మనీ అన్న ఆలోచన తెర ముందుకు వచ్చింది.

ఇలాంటి పరిస్థితులు లేకుంటే బహుశా ఎవరూ దీని గురించి మాట్లాడి ఉండేవారు కాదు.

హెలికాప్టర్ మనీ

ఫొటో సోర్స్, Getty Images

నిప్పుతో చెలగాటం

హెలికాప్టర్ మనీ ఒక ప్రమాదకరమైన ఆలోచన. దీన్ని అమలు చేయడమంటే నిప్పుతో చెలగాటమే.

"హెలికాప్టర్ మనీ ఆలోచన ఎన్నడూ చేయలేదు. ఎందుకంటే, ఇది చాలా ప్రమాదకరం. కేంద్ర బ్యాంకులు ఈ పని చేయడానికి భయపడతాయి" అని స్పెయిన్‌లోని ఒక బిజినెస్ స్కూలులో ఫైనాన్షియల్ స్టడీస్ విభాగం డైరెక్టర్ మాన్యువల్ రొమేరా అన్నారు.

"ఆర్థిక వ్యవస్థలోకి డబ్బును అధికంగా గుమ్మరించినప్పుడు, ఆ డబ్బు మీద ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు. ఫలితంగా ద్రవ్యోల్పణం పెరుగుతుంది" అని ఆయన వివరించారు.

మరి కరోనావైరస్ మహమ్మారి సృష్టిస్తున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఇది సరైన సమయం అనుకోకూడదా?

దీనికి రోమెరా బదులిస్తూ, "నెల రోజుల్లో కరోనా అదుపులోకి వచ్చే పరిస్థితి ఉంటే అది తప్పుడు నిర్ణయం అవుతుంది. అలా చేస్తే మే నెల చివరినాటికి మనం రోడ్డున పడతాం. ఈ సంక్షోభం కొన్ని నెలలపాటు ఇలాగే కొనసాగితే అప్పుడు ఆలోచించవచ్చ" అని అన్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

హెలికాప్టర్ మనీ పాలసీ అంటే...

ఇప్పుడున్న పరిస్థితుల్లో హెలికాప్టర్ మనీ గురించి ఆలోచించడం మరీ అర్థం లేని పనేమీ కాదు. మిల్టన్ ఫ్రీడ్మాన్ అభిప్రాయం ప్రకారం సెంట్రల్ బ్యాంకు నోట్లు అచ్చేస్తుంది, ప్రభుత్వం వాటిని ఖర్చు చేస్తుంది.

కొంతమంది ఆర్థికవేత్తలు 'హెలికాప్టర్ మనీ' విధానాన్ని మరింత సరళంగా మార్చవచ్చని నమ్ముతారు.

ఆపత్కాలంలో ఖర్చులకు డబ్బును అందించడం కేంద్ర బ్యాంకుల బాధ్యత అయినప్పటికీ, వ్యవస్థలో ద్రవ్య ప్రవాహాన్ని పెంచడానికి (డబ్బు కొరతను అధిగమించడానికి) ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. కానీ, అవి మరింత సంక్లిష్టమైనవి.

ఐరోపా మరియు అమెరికాలో ఆర్థిక మందగమనం ప్రభావాలను తగ్గించడానికి ఇటీవల తీసుకున్న పన్ను రాయితీల వంటి చర్యలను 'హెలికాప్టర్ మనీ'కి ఉదాహరణగా చెబుతారు. దీని లక్ష్యం ప్రజలనుఎక్కువ ఖర్చు చేసేలా చేయడం.

ఇదంతా కూడా హెలికాప్టర్ డబ్బు విధానం ద్వారా ఎంత ఖర్చును పెంచగలరు, ఆర్థిక వ్యవస్థకు ఎంత ఉపశమనం లభించే అవకాసం ఉందనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఇది అందుకు తగిన సమయమేనా?

ఇప్పుడు అమెరికా కరోనావైరస్ దెబ్బకు విలవిల్లాడుతోంది. అక్కడ హెలికాప్టర్ మనీ అనే మాటలు వినిపించడం మొదలైంది. దేశంలో నిరుద్యోగం 20 నుంచి 40 శాతం దాకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొలంబియా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రొఫెసర్ విల్లెం బ్యూటర్, "అందుకు ఇది తగిన సమయమే" అంటున్నారు. "కరోనావైరస్ వల్ల కలిగే భారీ ఆర్థిక నష్టాన్ని హెలికాప్టర్ మనీ వంటి అసాధారణ నిర్ణయాలతో పూడ్చవచ్చ" అని ఆయన అన్నారు.

సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఆర్థికవేత్త జోర్డీ గలీ కూడా, ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడానికి విప్లవాత్మక చర్యలు తీసుకోవాలని నమ్ముతున్న వారిలో ఉన్నారు.

"హెలికాప్టర్ మనీని ప్రయోగించే సమయం ఆసన్నమైంది" అని జోర్డీ గలీ అన్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితిని ఆయన అత్యవసర పరిస్థితిగా చూస్తున్నారు. అయితే, ఇలా చేయడం ద్వారా సెంట్రల్ బ్యాంకులకు ప్రతిఫలంగా వచ్చేది ఏమీ ఉండదని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్త ఆర్థిక మందగమనం తీవ్రతరం అవుతోందని, నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంటోందనే విషయంలో ఆర్థిక నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేదరికం, పెరుగుతున్న నిరుద్యోగంతో పోరాడుతున్న ప్రభుత్వాలకు అన్ని ప్రత్యామ్నాయలనూ పరిశీలించక తప్పదేమో.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)