కరోనావైరస్: భారత ప్రభుత్వానికి కోవిడ్-19 విసురుతున్న సవాల్.. వైద్యులను కాపాడుకోవడం ఎలా

కరోనావైరస్:వైద్యులకు పీపీఈ కిట్ల కరవు
    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

భారతదేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 13, 2020 వరకు సుమారు 8వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

308 మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి వంద కేసుల్లో దాదాపు అన్నీ నగరాల్లోనే నమోదయ్యాయి.

కానీ తరువాత మాత్రం నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో ప్రజలు కూడా కరోనావైరస్ బారిన పడుతున్నారు.

దీంతో దేశ వ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్సను అందిస్తున్న వైద్యులకు, ఆరోగ్య కార్యకర్తలకు అందించే వ్యక్తిగత రక్షణ సామగ్రికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

కరోనావైరస్:అత్యవసర సేవలు అందిస్తున్న తమకు కూడా రక్షణ సామాగ్రి కావాలంటున్న పోలీసులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:అత్యవసర సేవలు అందిస్తున్న తమకు కూడా రక్షణ సామాగ్రి కావాలంటున్న పోలీసులు

రెయిన్‌ కోట్లు, హెల్మెట్లు వేసుకొని రోగులకు చికిత్స

వాటిని సమకూర్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని చోట్ల మరో దారి లేక వైద్యులు రెయిన్ కోట్లు, హెల్మెట్లను కూడా ఉపయోగించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

తమకు అవసరమైన మేరకు పీపీఈ కిట్లు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని లక్నో నగరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఓ వైద్యురాలు బీబీసీతో చెప్పారు.

“నిజంగా ఇది యుద్ధ సమయమే. మమ్మల్ని సైనికులతో పోల్చుతున్నారు బాగానే ఉంది. కానీ ఆయుధాలు లేకుండా యుద్ధం చెయ్యమని సైనికుల్ని పంపడం ఎంత వరకు సమంజం ?” అని ఆమె ప్రశ్నించారు.

దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో కొందరు వైద్యులకు, నర్సులకు కూడా కోవిడ్-19 సోకింది. దీంతో వారు పనిచేస్తున్న ఆస్పత్రులను మూసివేశారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఈ కరోనా యుద్ధంలో పోరాడుతున్న మన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు తాజా పరిస్థితులు అద్దం పడుతున్నాయి.

కేవలం వైద్య సిబ్బందికి మాత్రమే కాదు... వైరస్‌తో బాధ పడే రోగుల ఆచూకీ తెలుసుకోవడంలోనూ, క్వారంటైన్ సౌకర్యాలు కల్పించే పోలీసు సహా ఇతర సిబ్బందికీ ఈ పీపీఈ కిట్లు అవసరం ఉంది.

ఈ ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న పోలీసులకు కూడా కరోనావైరస్ సోకే ప్రమాదం ఉందని ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఆందోళన వ్యక్తం చేశారు.

“ఇటీవల వైరస్ సోకిన వ్యక్తి క్వారంటైన్‌ నుంచి పారిపోయారు. దీంతో పోలీసులు ఆయన్ను వెతికి పట్టుకొచ్చి తిరిగి క్వారంటైన్‌కు పంపించారు. ఇటు వంటి సందర్భాల్లో మమ్మల్ని మేం రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి పీపీఈ కిట్లు మా దగ్గర ఉన్నాయి. కానీ భవిష్యత్తులో మరిన్ని అవసరం అవుతాయి.” అని ఆయన బీబీసీతో చెప్పారు.

కరోనావైరస్:పదే పదే ముఖం తాకకుండా రక్షణ కల్పించే ఫేస్ షీల్డ్స్
ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:పదే పదే ముఖం తాకకుండా రక్షణ కల్పించే ఫేస్ షీల్డ్స్

సీఎంలు అడుగుతున్నారు

అత్యవసర పరిస్థితుల్లో పని చేసే సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి అవసరం చాలా ఉందని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే చెబుతూ వస్తున్నారు.

“మాకు ఇప్పటికిప్పుడు పీపీఈ కిట్ల అవసరం ఉంది. ఈ విషయమై కేంద్రానికి కూడా లేఖ రాశాం. రక్షణ సామగ్రి లేకుండా వైద్యులు, నర్సులతో నేను పని చేయించాలనుకోవడం లేదు.” అని ఇటీవలే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

ప్రస్తుతం భారత్‌కు కనీసం 10లక్షల పీపీఈ కిట్లు, 4కోట్ల N95 మాస్కులు, 2కోట్ల సర్జికల్ మాస్కులు, 10లక్షల లీటర్ల శానిటైజర్ అవసరం ఉందని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న HLL లైఫ్ కేర్ లిమిటెడ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ సంస్థ వాటిని సేకరించే పనిలోనే ఉంది.

అయితే తాము ఇప్పటికే కోటి 70లక్షల పీపీఈ కిట్లకు ఆర్డరిచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ ఏప్రిల్ 9న తెలిపింది. ఈ సంఖ్య HLL లైఫ్ కేర్ లిమిటెడ్ అంచనాల కన్నా చాలా ఎక్కువ.

దేశంలో ఉన్న 20 తయారీ సంస్థలకు పీపీఈ కిట్లను తయారు చేసేందుకు అనుమతి ఇచ్చామని కూడా కేంద్రం తెలిపింది.

అయితే ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ మేరకు తయారీ సంస్థలు సిద్ధం చేయగలవా అన్న విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. అయితే రోజుకు 15వేల కిట్లను తయారు చేయగలవని మార్చి 30న కేంద్రం చెప్పింది.

ఒక వేళ ఈ మహమ్మారి జిల్లాలకు, చిన్న చిన్నపట్టణాలకు కూడా విస్తరిస్తే అప్పుడు ఈ స్థాయిలో వ్యక్తిగత రక్షణ సామగ్రి సరఫరా చేసినా సరిపోవేమో అన్న ఆందోళన నెలకొంది.

పీపీఈ

ముఖానికి ఫేస్ షీల్డ్

అయితే ఇప్పటికే ఆ లోటును భర్తీ చేసేందుకు కుటీర పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు ముందుకొస్తున్నాయి. కానీ అవి కేవలం మాస్కులు, ముఖానికి రక్షణ కల్పించే సామాగ్రిని మాత్రమే తయారు చేయగలవు.

ఈ విషయంలో “మేకర్స్ అసైలమ్” అనే సంస్థ వైరస్‌ సోకిన వారితో పని చేసే వారి కోసం ఫేస్ షీల్డ్(ముఖానికి రక్షణ కల్పించే పరికరం) అనే ఓ వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చింది.

“మేం సాధారణంగా వివిధ రంగాలకు చెందిన డిజైనర్ల కోసం అవసరమయ్యే పరికరాలను, స్థలాన్ని అందిస్తుంటాం. కానీ ఇప్పుడు తయారీ రంగంలో కూడా అడుగు పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు దేశానికి ఆ అవసరం ఉంది.

మనిషి పదే పదే తన ముఖాన్ని తాకడాన్ని ఈ ఫేస్ షీల్డ్ అడ్డుకుంటుంది. ఇప్పటికే మేం దేశ వ్యాప్తంగా ఉన్న మా 12 తయారీ కేంద్రాల్లో లక్ష ఫేస్ షీల్డ్ లను సిద్ధం చేశాం” అని మేకర్స్ అసైలమ్ మేనేజర్ రిచా శ్రీవాస్తవ బీబీసీకి తెలిపారు.

మాస్కుల తయారీ

ఫొటో సోర్స్, Getty Images

మరింత వేగం అవసరం

కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో మహిళా సంఘాలు కూడా క్లాత్ మాస్కులను తయారు చేస్తున్నాయి.

కానీ ఇప్పుడు వైద్యులకు అవసరమయ్యే పీపీఈల కిట్ల తయారీని వేగవంతం చేయాలి.

ఈ విషయంలో ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రముఖ ప్రజా ఆరోగ్య నిపుణులు అనంత్ భాన్ బీబీసీతో అన్నారు.

“ఈ మహమ్మారి ముంచుకొస్తోందన్న విషయం మనకు జనవరిలోనే తెలుసు. ఈ పాటికే అవసరమయ్యే సామాగ్రిని సిద్ధం చేసుకొని ఉండాల్సింది.” అని ఆయన అభిప్రాయపడ్డారు.

పీపీటీ కిట్ల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కేంద్రం మార్చి 23 నాటికి విడుదల చేసింది. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశామని భాన్ వ్యాఖ్యానించారు.

“తయారీ సంస్థలు కూడా అవసరమైన ముడి సరుకును సేకరించుకోవాలి. నిర్ధేశిత ప్రమాణాలు అందుకునే విధంగా ఉత్పత్తిని తయారు చేయాలి. అందుకు సమయం పడుతుంది.” అని భాన్ అన్నారు.

ప్రస్తుతం ఉన్న కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం మరిన్ని ఇతర మార్గాలను కూడా అన్వేషించాలని నిపుణులు అంటున్నారు.

విదేశాల నుంచి ముడి సరుకును వీలైనంత వేగంగా తెప్పించుకొని మరిన్ని తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ అసోసియేషన్‌కు చెందిన రాజీవ్ నాథ్ అభిప్రాయపడ్డారు.

“నిర్దేశిత ప్రమాణాలను ప్రభుత్వం ఇప్పటికే సూచించింది కనుక వస్త్రాల ఎగుమతి దారులకు, ఆర్మీ యూనిఫాంలను తయారు చేసే వాళ్లకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాలి.” రాజీవ్ నాథ్ బీబీసీకి తెలిపారు.

అయితే అది అనుకున్నంత సులభం కాదన్నది అనంత్ భాన్ అభిప్రాయం.

“వస్త్ర పరిశ్రమలు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ పీపీఈ కిట్ల తయారీకి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు, అనుభవం అవసరమవుతాయి.

ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ చాలా అవసరం. నాణ్యత లేని పీపీఈ కిట్లు తయారు చేసినా ప్రయోజనం లేదు. వైరస్ చాలా వేగంగా అంటుకుంటుంది.

కేవలం రక్షణ విభాగానికి చెందిన వైద్య బృందాల వద్ద మాత్రమే నాణ్యమైన పీపీఈలు ఉన్నాయి.” అని భాన్ బీబీసీతో అన్నారు.

అయితే కేవలం నాణ్యతా ప్రమాణాలు మాత్రమే సమస్య కాదు. ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్‌లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశ్రమల వద్దకు ముడి సరుకును తెప్పించుకోవడం, కార్మికుల్ని రప్పించుకోవడం చాలా కష్టమైన విషయమని ఎగుమతిదారులు చెబుతున్నారు.

అయితే సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని కానీ పీపీఈ కిట్ల తయారీని అత్యవసర సేవల కింద చేర్చి, రాష్ట్ర యంత్రాంగమంతా ఒక్కతాటిపై నడిచి కర్మాగారాలకు, కార్మికులకు అవసరమైన పాస్‌లు అందజేస్తే వారికి అనుకూలంగా ఉంటుందని అనంత్‌ భాన్ సూచించారు.

అయితే వాటిని తయారు చేయడం ఒక సమస్య అయితే... తయారు చేసిన వాటిని దేశంలోని మారు మూల ప్రాంతాలకు పంపిణీ చేయడం మరో సమస్య.

ఇప్పుడున్న స్థితిలో పీపీఈ కిట్లను సిద్ధం చేయడం పక్కనబెడితే వాటిని అవసరమైన వారికి చేర్చడం చాలా ముఖ్యమని భాన్ అభిప్రాయపడ్డారు.

వైద్యుల్ని సైన్యంతో పోల్చడం వరకు బాగానే ఉందని... కానీ వారు యుద్ధం చేసేందుకు తగిన రక్షణ సామాగ్రిని మాత్రం అడగవద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)